25, జులై 2009, శనివారం

ఆర్టిస్ట్ అన్వర్ బ్లాగు చూడండి

ఒక కళాకారుని అంతరంగాన్ని తరచి చుస్తే నాటి సామాజిక స్థితి గతులు అవగాహనౌతాయని నానమ్మకం. ఈ బ్లాగులో ఆయన తన గీతలకావల వున్న అంతర్మధనాన్ని ఆవిష్కరిస్తున్నారు. కళ పట్ల ప్రేమగల వారంతా ఒక మారు దీనిని వీక్షించగలరు. ANWAR THE ARTIST / అనగనగా ఒక చిత్రకారుడు.

17, జులై 2009, శుక్రవారం

కారంచేడు - దళిత ఉద్యమంనకు దిక్సూచి


కారంచేడులో జూలై పదిహేడు, పందొమ్మిది వందల ఎనభై ఐదు నాడు ప్రారంభమైన ఉద్యమం ఆంధ్ర ప్రదేశ్ సామాజిక చరిత్రలో మెయిలు రాయిగా నిలిచింది. తోలకిరివానకు ఏరువాక సాగి పంట మొలకేత్తల్సిన వేళ గ్రామ దళిత రైతు డొక్కలో బరిసె పోట్లతో నెత్తుటి ఏరులు పారించిన భూస్వాముల దాష్టీకానికి తగిన గుణపాఠ౦ నేర్పే౦దుకు దళిత చైతన్యం ముందుకు కదిలింది. ఎన్నో యుగాలుగా తమ కాలి కింద చెప్పుగా పడివున్న మనిషి చైతన్యంతో ముందుకు వచ్చి ప్రధాన జీవన స్రవంతిలో కలిసేందుకు వేసిన ముందడుగు ఫ్యూడల్ ప్రభువుల కళ్ళల్లో కారం చల్లినట్లయ్యింది. దాంతో ఏదో ఒక సాకుతో వారిని బలిగోనాలని వేచి చూసి తమ రక్త దాహాన్ని తీర్చుకొన్నారు. వారికి మద్దతుగా నాటి వారి కుల ప్రభుత్వం అండగా నిలవడంతో మరింత చెలరేగిపోయారు. నాడు హతులైన తేళ్ళ మోషే, తేళ్ళ ముత్తయ్య, తేళ్ళ యెహోషువా, దుడ్డు వందనం, దుడ్డు రమేష్, దుడ్డు అబ్రహాం మొదలైన వారు దళిత జాతికి స్పూర్తినిచ్చి అమరులైనారు. దళితుల ఆత్మా గౌరవ ఉద్యమం కారంచేడు నెత్తుటి నుంచే పుట్టింది. ఇది తరువాతి ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. భారత సామాజిక ఉద్యమాలలో కులం యొక్క ప్రాధాన్యతను చాటిచెప్పింది. మన న్యాయస్థానాల తాత్సార న్యాయాన్ని బయట పెట్టింది. దళితుల అణచివేతలో అన్ని వర్గాల వారిది ఒకే మార్గమని తేట తెల్లం చేసింది. నాటి ప్రజా యుద్ధ పంద తన తీర్పుతో బాధిత తల్లుల కడుపు కోతను కొంతైనా తీర్చగలిగింది. కానీ, నేటికీ ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు నిత్యము జరుగుతూనే వున్నాయి. నిన్నను కర్నూలు జిల్లాలో రుద్రవరం మండలం, ఎల్లావత్తుల గ్రామ దళిత రైతులపై అటవి శాఖాధికారులు చేసిన దాష్టీకం శిక్షించ దగ్గది. వారికి విచారణ పేరుతొ తీసుకుపోయి మీసాలు పీకి బూతులు తిట్టి గ్లాసుల్లో మూత్రం పోసి తాగమన్నారు. ఇవి నేటి ఆధునిక సమాజంలో జరుగుతున్న ప్రభుత్వ గూండా చర్యలు కావా? ఇలా చెప్పుకుంటూ పొతే రోజు మన కళ్ళ ముందే ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. నేటికి కులహంకారుల దాష్టికం చలామణి కావడం మన సమాజ దౌర్భాగ్యం. వీటిని కారంచేడు, చుండూరు, వేంపెంట ఉద్యమాల స్ఫూర్తితో తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం వుంది.

10, జులై 2009, శుక్రవారం

'ఈ లైఫ్ నాకు నచ్చలేదు '


హైదరాబాద్ లో బి.టెక్ విద్యార్ధిని తనకు జీవితం నచ్చలేదని లేఖ రాసి, భవనం పై నుంచి దూకింది. చెప్పులు కొనివ్వలేదని తల్లి మీద అలిగి ఇంటర్ విద్యార్ధిని రైలు కింద పడింది. కృష్ణా జిల్లా విజయవాడలో బి.టెక్ చదువుతున్న కడప విద్యార్ధి హాస్టల్ లో ఉరి వేసుకొని చనిపోయాడు. కులాలు వేరని పెద్దలు పెళ్ళికి ఒప్పుకోలేదని ప్రేమ జంట మహబూబ్ నగర్ జిల్లాలో పురుగుల మందు తాగింది. అప్పులవాళ్ళ ఒత్తిడితో పాటు భర్తా కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో కొడుకు, కూతురులకు టీలో ఎలుకల మందు కలిపి తానూ తాగింది కరీంనగర్ జిల్లాలో తల్లి. నాకు లైఫ్ నచ్చలేదని సూసైడ్ నాట్ రాసిన తెజస్వని తనకు నచ్చిన యునివర్సిటిలో చేరేందుకు తల్లి దండ్రులు ఒప్పుకోలేదని ఇలా రాసి చనిపోయింది. టి వి లలో నాట్ రాత ప్రతిని చూపించారు. ఒకే ఒక్క వాక్యం రాసి ఉంది. ఇలా ఆత్మా హత్యల ద్వారా తమ నిరసన తెలియజేయడం వలన తామూ అనుకున్నది సాధి౦చగలరా అని మనమంతా ప్రశ్నిస్తాం. కాని వాళ్లు బ్రతికే అవకాశాన్ని మనమే లేకుండా చేస్తున్నామని ఎన్నడు ఎవరూ గ్రహించరు. అసలు ఆత్మహత్యను పిరికివాళ్ళ చర్యగా పరిగణిస్తాం. నిజమేనా అది. రోజు కుళ్ళి కృశించి నశించే నమ్మక ద్రోహపు బ్రతుకు కంటే అదే న్యాయమినదేమో అనిపిస్తుంటుంది. నిజానికి మన సమాజంలో తలెత్తుకు జీవించే పరిస్థితులు కోల్పోతున్న కారణంగానే ఇంతమంది ఇలా తమ నిరసనను తెలియజేస్తున్నట్లుగా గుర్తించే ధైర్యం మనకు౦దా? ఆత్మహత్యను తన చిట్టచివరి ఆయుధంగా మాత్రమే మనిషి ఎ౦చుకు౦టున్నాడు. ఎవరికి మాత్రం వుండదు జీవించాలని. కానీ పర్తితులను సమాజం కల్పించ లేకపోవడంతో మరో గత్యంతరం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లలను బందెల దొడ్ల లాంటి కార్పోరేట్ కళాశాలల్లో విసిరేసి ర్యాంకుల జూదం ఆడుతున్న తల్లిదండ్రులది పాపం కాదా? యౌవ్వన ప్రాయంలో మనసు పరిపూర్ణ వికాసం చె౦దాల్సిన సమయంలో వాళ్లకు సరైన దృక్పధాన్ని అందించాల్సిన బాధ్యతనుండి పేరెంట్స్ తప్పుకోవడంతో తీవ్రమైన మానసిక వత్తిడికి లోనయి దానినుండి బయటపడే మార్గం తెలియక పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుని వలే ఎటూ పాలుపోక చివరికి మార్గాన్ని ఎంచుకునే యువతీ యువకుల ఉసురు తీసిన వాళ్ళం మనం కాదా? జీవన ప్రమాణాలు కోల్పోయి ఆర్ధిక ఇబ్బందులతో కుహనా విలువలకు లోబడి మనసు చంపుకోలేక తన్ను తాను చ౦పుకు౦టున్నారు. సమాజ చట్రంలో ఇరుక్కొని ఊపిరాడక ఉసురు తేసుకు౦టున్న అభాగ్యులె౦దరో. నేరం సమాజ౦లోని మన అ౦దరిదీనూ కాదా? మౌనాన్ని వీడాల్సిన సమయం ఇదే. లేనిచో అందరం ఆప్తులను కోల్పోయి ఒ౦టరి వాళ్ళం అవడం ఖాయం...

3, జులై 2009, శుక్రవారం

వానా వానా వందనం

మన ప్రయాణం ఎటు వైపు సాగుతుందో, మన ఆలోచనలు ఎటు వైపు మల్లి౦చబడుతున్నాయో చూస్తూ౦టే మనం ఇరవయ్యొకటో శతాబ్దంలోనే వున్నామా అనిపిస్తోంది. ప్రకృతిలో జరుగుతున్న వాతావరణ మార్పుల వలన, మనం చేస్తున్న ఆత్మహత్యా సద్రుస్యమైన ప్రక్రుతి విరుద్ధ కార్యాల వలన వర్షాలు పడక ప్రకృతి అల్లాడుతుంటే ప్రజలను శాస్త్రీయ ఆలోచనలవైపు మల్లి౦చకు౦డా వరుణ యాగాలు చేయమని పురమాయించడం సమస్యల నుండి దృష్టిని మల్లి౦చే ప్రయత్నం చేస్తూ తాము ప్రజల పట్ల ఎంతో ప్రేమగా వున్నామని నటిస్తూ తమ సొంత వ్యాపారాలను నిరాటక౦గా చేసుకునే నాయకమ్మన్యుల బ౦డారాన్ని బయటపెట్టే విపక్షం కూడా లేకపోవడం ఆ౦ధ్రుల దురదృష్టం. ప్రజల పట్ల నిబద్ధత కల పాలకులైతే వారిని శాస్త్రీయ ఆలోచనలవైపు ప్రోత్సహించి తద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడేట్లు చేయాలి. నిజానికి వరుణ యాగాలు పేరుతొ ఒక వర్గం ప్రజలను ప్రోత్సహి౦చి భక్తిని కూడా సరుకును చేసి కోట్లను కొల్లగొట్టే ప్రయత్నం కాదా? జనాలను ఇలా ఎ౦తకాల౦ మభ్యపెడతారు. ప్రతిపక్షాలు కూడా మతపరమైన భావాలు దెబ్బతింటే తమ ఓటు బ్యాంకు కోల్పోతామని కిమ్మనకు౦డా ఉంటున్నాయి. మన అంతరిక్ష పరిశోధనా శాస్త్ర వేత్తలైనా వీటి పట్ల ప్రజలకు వివరణ ఇస్తారని ఆశిద్దామంటే తాము కాపీ చేసి రూపొందించిన రాకెట్ల నమూనాలు సైతం తీసుకుపోయి తిరుపతి వెంకన్న పాదాల దగ్గర పెట్టె వారిను౦డి ఇది ఆశించగలమా? మన విశ్వవిద్యాలయాల ఆచార్యులున్నారంటే వారు ఎంతసేపూ తమ కులపోల్లకు పనికిరాని అంశాలనిప్పుంచుకొని డాక్టరేట్లు ఇప్పి౦చుకునే౦దుకు నిర౦తర౦ పోటీపడితేనే సరిపోతో౦ది. మరి మనవైపు ఎవరున్నారు? ఒకమారు అ౦దర౦ ఆలోచిద్దా౦. శాస్త్రీయ దృక్పధం వైపు సమాజాన్ని మళ్ళించేందుకు శాయశక్తులా కృషిచేసేందుకు కాస్తా ప్రయత్నిద్దామా?

1, జులై 2009, బుధవారం

హిరణ్యాక్షుడి పాలన

సహకార వ్యవసాయం పేరుతొ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో కంపెనీ పాలన మొదలవబోతోంది. రైతన్నకు వెన్నుదన్నుగా వుంటామని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన పాలకులు ప్రపంచ బ్యాంకు వారి ఆదేశాలకు లోబడి వ్యవసాయ రంగం నడ్డి విరిచే పనులు ఇంత తొందరగా మొదలు పెట్టి ఇన్నాళ్ళు తాము వేసుకున్న ముసుగును తొలగించుకున్నారు. సోషలిస్టు రాజ్యాలలోనే విఫలమైన సహకార వ్యవసాయం ఇంతవరకు ఫ్యూడల్ రూపంలోంచి పూర్తిగా బయటపడని మన ఆర్ధిక, సామాజిక వ్యవస్తలో ఇది సాద్యమా. చిన్న చిన్న కమతాలుగా కొనసాగుతున్న మన వ్యవసాయం నేడు ఎదుర్కొంటున్న ప్రధాన సంక్షోభం పెరిగిపోయిన పెట్టుబడి, గిట్టుబాటు ధర లేకపోవడం, మార్కెట్ సదుపాయాలు కొరవడడం, ఎగుమతి అవకాశాలు మృగ్యమైపోవడం వలన రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి వ్య్వవసాయం ప్రాణాపాయ౦గా మారిన పరిస్థితుల్లో రైతాంగం దాని నుండి దూరమై కూలి బతుకులవైపు నేట్టివేయబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఉపాధి హామీ పధకం వలన గ్రామీణ ప్రాంతంలో పెరిగిన కూలి రేట్లు సామాన్య రైతు నడ్డివిరిచాయి. ఈ పధకం అమలు వెనుక వున్న కుట్ర ఇప్పుడు ఈ రకంగా బయటపడుతోంది. అపరిమితంగా పెరిగిపోయిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ధరలను అదుపుచేయలేని ప్రభుత్వం (బడా విదేశి కంపెనీలకు బాసటగా వుంటూ) నేడు వుత్పత్తి తగ్గిందన్న సాకుతో రైతాంగాన్ని తమ రంగం నుండి దూరం చేసి వారి వద్దనున్న ఆస్తిని లాక్కుని బడా కంపెనీలకు ఇప్పటికే కొన్ని లక్షల ఎకరాల భూమిని ప్రాజెక్టుల పేరుతొ సెజ్ ల పేరుతొ కట్టబెట్టి౦దికాక ఈ రూపంలో కూడా వారినుండి వున్న ఆ కొద్ది మొత్తం భూమిని కూడా లాక్కునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. భారత రైతాంగం యొక్క మనఃస్థితిని సరిగా గుర్తించని పాలక వర్గం చేస్తున్న రాక్షస కృత్యం ఇది. ఎందుకంటే భూమిని తన సొంత ఆస్తిలా భావించే రైతు దాని నుండి వేరు చేయబడితే దాని పర్యవసానం ఎంత తీవ్రంగావుంటుందో? ఇప్పటికే నలుగురికీ కూడుపెట్టే రైతన్న అప్పుల వూబిలో కూరుకుపోయి ఆత్మహత్యల పాలయ్యాడు. చెంచాడు ఇచ్చి గంగాళం దొ౦గిలి౦చుకుపోయే పాలక వర్గం ఎన్నికల ముందు బ్యాంకు అప్పులు మాఫీ పధకంతో అధికారంలోకి వచ్చి వారి కాలికింద నేలనే హరించే హిరణ్యాక్షుడి రూపాన్ని నిస్సిగ్గుగా బయట పెట్టుకుంటోంది. నేడు రైతాంగం ఎదుర్కొంటున్న మరో సమస్య తమ వైపు మాటాడె వారు లేకపోవడం. వున్న రాజకీయ పక్షాలన్ని గతంలో ప్రపంచ బ్యాంకు పాలెగాల్ల దగ్గర వూడిగం చేసినవే. గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తగా ముసుగేసుకున్న స్వామినాధన్ తన సామ్రాజ్య వాద ముసుగును ఇలా తొలగించాడు. తెగించి రోడ్డెక్కలేని రైతాంగానికి అత్మహత్యలే శరణ్యం. ఖచ్చితంగా మరో స్వతంత్ర పోరాటం భూమి, భుక్తి కొరకు సాగించాల్సిన అవసరం ప్రజలందరికీ వుంది. లేకపోతే మన వునికిని కోల్పేయే ప్రమాదం మరెంతో దూరంలో లేదు. హిరణ్యాక్షుల వధ మరల జరగక పోతే భూమాతను చాపలా చుట్టిన వైనం నేడు మరలా మన తరంలోనే చూసే దుస్థితి పునరావృతమవుతోంది.