29, నవంబర్ 2009, ఆదివారం

తెలంగాణా పాలస్తీనా కానున్నదా ?

ఈ రోజు కె.సీ.ఆర్. ఆమరణ దీక్షకు కూచున్నట్లుగా ఈ దేశ రాష్ట్రపతిని, ప్రధాన మంత్రిని, ఈ రాష్ట్ర గవర్నర్ ను, ముఖ్యమంత్రిని కలిసి నెల రోజులు ముందుగానే శాంతియుతంగా నిరసన తెలియజేసే అవకాశం కల్పించమని కోరి పూనుకున్నా ఆయనకు ఆ అవకాశం కల్పించకపోవడం అప్రజాస్వామికం. ఆయన కెరీర్ లో తప్పులు చేసి వుండవచ్చు. కానీ తెలంగాణా ఉద్యమాన్ని సజీవంగా ముందుకు తీసుకుపోతున్న వ్యక్తిగా గౌరవించాల్సిందే. ఈ మద్య కాలంలో ఏర్పరిచిన ప్రత్యేక రాష్ట్రాలేవీ ఎన్నికల ద్వారా ఏర్పాటుకాలేదు. ఆయా ప్రధాన పార్టీల బలాలను ప్రధాన ప్రాతిపదికగా చేసుకుని ఏర్పాటు చేసారు. వాటివలన ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా జరిగిన నష్టం లేదు. మరి తెలంగాణా విషయంలో గత అరవై సం.లుగా వారి ప్రజాస్వామిక డిమాండ్ ను గౌరవించకుండా ఈ రాష్ట్రం ఒక రెండు కులాల వ్యాపార అడ్డాగా మార్చుకొని ప్రాంతాల మద్య సమతుల్యాన్ని దెబ్బతీస్తూ తమ స్వంత ఆస్తులు కూడబెట్టుకోవడం తప్ప రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరగబెట్టింది లేదు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను విదేశాలకు తరలించి లక్షల కోట్ల రూపాయల దొంగ సొత్తు కూడబెట్టుకున్న వారిని ఇన్నాళ్ళు వెనకేసుకొచ్చి ఈ రోజు తాము అధికారానికి దూరమై సహజ వనరుల గురించి మాటాడుతున్నారు. అవకాశమున్నప్పుడు దోపిడీకి వెనకాడని ఈ రాజకీయ రాబందులు పీక్కుతిని కళేబరాన్ని మిగిల్చిన క్రమంలో అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి.

ఉస్మానియా యూనివర్శిటీలో పడి విద్యార్థులను దొంగలను కొట్టినట్లు కొట్టి కసి తీర్చుకున్న పోలీసులకు అధికారం ఎవరిచ్చారు. వారిని ఉసిగొలిపి యూనివర్శిటీలో భయోత్పాతాన్ని సృష్టించి తద్వారా యువకుల నోరుమూయించాలని, ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించ జూస్తున్న రాజకీయ దళారీల బండారాన్ని బయటపెట్టాలి.

ప్రజాస్వామ్యంగా పేర్కొంటున్న వ్యవస్థలో శాంతియుతంగా చేయతలపెట్టిన సత్యాగ్రహాన్ని ఆపాలనుకోవడం వారి నిజ స్వరూపాన్ని బయటపెడుతోంది.
యూనివర్శిటీ నుండి పోలీసులను తరిమికొట్టిన విద్యార్థుల చైతన్యం చూస్తుంటే తెలంగాణా మరో పాలస్తీనా కానున్నదా అనిపిస్తోంది. ఈ రెండింటి మద్య సారూప్యం కనిపిస్తోంది. అమెరికా అండతో ఇజ్రాయిల్ అనే దేశం ఏర్పడి తమ ప్రాంతంనుండి తరిమివేయబడిన పాలస్తీనా ప్రజలకు జరిగిన అన్యాయమే కళ్ళముందు కదలాడుతోంది.

న్యాయంగా విడిపోయే హక్కును గౌరవించి వారి ప్రజాస్వామిక డిమాండును అంగీకరించడమే అందరి కోరిక కావాలని ఆశిస్తూ..

28, నవంబర్ 2009, శనివారం

జేన్యాబ్ జలలియన్ ఉరిని వ్యతిరేకి౦చ౦డి
కుర్దిష్ ఉద్యమ కార్యకర్త జెన్యాబ్ జలలియన్ ను ఇరాన్ నరహంతక ప్రభుత్వం ఉరితీయాలని చూస్తోంది. అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తలంతా దీనిని వ్యతిరేకిస్తున్నారు. జలలియన్ కుర్దిష్ ప్రజల స్వేచ్చను కోరుతూ ఉద్యమిస్తున్న కార్యకర్త. ఇటీవలే ఎహ్సాన్ ఫతెహియాన్ అనే కార్యకర్తకు మరణ శిక్ష విధించారు.

జలలియన్ కు సంఘీభావంగా GO PETITION అనే సైట్ వారు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి పిటిషన్ పత్రాన్ని ఆన్ లైన్ ద్వారా పంపిస్తూ ఆమె విడుదలను డిమాండ్ చేస్తున్నారు. మానవతా వాదులు తమ సంఘీభావాన్ని తెలుపవలసినదిగా కోరుతూ.http://www.gopetition.com/petitions/save-zeynab-jalalian.html

23, నవంబర్ 2009, సోమవారం

పౌరహక్కుల పురుషోత్తంనకు జోహార్లు

సరిగా తొమ్మిది సం. క్రితం ఇదే రోజు శ్రీకాకుళం ప్రాంతంలో అరెస్టయిన కామ్రేడ్ల గురించి పది గంటల ప్రాంతంలోకా.పురుషోత్తంకు ఫోన్ చేసి చెప్పాను. తరువాత కా.వరవరరావు గారికి అదే విషయమై చెప్పాను. వెంటనే ఎలక్ట్రానిక్ మీడియావారికి ఇద్దరు ఫోన్ చేసి చెప్పారు. గంట తరువాత ఇంట్లో అవసరమైన వస్తువుల కోసం తమ ఇంటి ముందరికిరాణా షాపులో కొనుక్కుందామని బయటకు వచ్చిన కామ్రేడ్ని పోలీసు మాఫియా ముఠా తల్వార్లతో దాడిచేసి నరికిచంపారు. ఇదంతా ప్రజలంతా చూస్తుండగానే హత్యచేసిన వాళ్లు తాము వచ్చిన తెల్ల టాటా సుమోలో తాపీగాపరారయ్యారు. హత్య జరిగి పదిహేను నిముషాలైనా జరగకుండానే పోలీసు జాగిలాలతో రంగారెడ్డి జిల్లా ఎస్.పి. సురే౦ద్రబాబు హాజరు. అంత తొ౦దరగా సార్లకు ఎలా తెలిసి౦దో ఎవరికీ అర్ధం కాలేదు. హడావిడిగా శవాన్ని మార్చురీకి తరలించే వాళ్ళను తన సహచరి జ్యోతి అడ్డుకొంది. తన భర్త శవం దగ్గర ఏడ్వనివ్వండి అని వేడుకొంది. వినని పోలీసులపై చెప్పుతో కొట్టింది. దుమ్మెత్తిపోసింది. కొంతమంది పోలీసులు జ్యోతిని కదలకుండా పట్టుకుంటే కనీసం శవపంచనామా జరపకుండానే పోస్టుమార్టంకు తరలించారు. రక్తం మరకలను పోలీసులు కడిగివేయబోగా అడ్డుకుంది. కోడిపిల్లను గద్ద తన్నుకుపోయినట్లు హత్య జరిగిన పావుగంటలో వాలిన పోలీసులను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. హత్య జరుగుతుందని ముందుగా తెలియకపోతే వారు ఆ స్థలానికి అంత తొందరగా ఎవరూ చెప్పకుండానే ఎలా చేరుకోగలిగారు?

ఎనబై ఐదులో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.రామనాధంను, ఎనబై ఆరులో కరీంనగర్ జిల్ల అధ్యక్షులు జాపా లక్ష్మారెడ్డిని, తొంభై ఒకటిలో వరంగల్ జిల్లా కార్యదర్శి న్యాయవాది నఱా ప్రభాకర రెడ్డిని పోలీసులు తామే ప్రత్యక్షంగా కాల్చి హత్య చేసి హంతకులుగా ప్రజల అసహ్యానికి గురయ్యారు. దీని నుండి తప్పించుకోవడానికి లొంగిపోయిన మాజీ నక్సలైట్లను చేరదీసి, వారికి ఆయుధాలు, వాహనాలు సమకూర్చి, విచ్చలవిడిగా డబ్బులిచ్చి హంతక ముఠాలుగా ఏర్పరిచి ప్రజా సంఘాల నాయకులను హత్య చేసేందుకుపయోగిస్తున్నారు. కాశ్మీరులో, అస్సాంలో ప్రభుత్వాలు ప్రైవేటు హంతకముఠాల ద్వారా పౌరహక్కుల నాయకులను హత్యచేయించడాన్ని గమనించి అదే విధంగా మన రాష్ట్రంలో కూడా పురుషోత్తంను, ప్రజా గాయకురాలు బెల్లి లలితను, ఉపాధ్యాయ సంఘ బాధ్యుడు కనకాచారిని మరకొంతమంది ప్రజా సంఘ నాయకులను గ్రీన్ టైగర్స్, బ్లూటైగర్స్ పేరుతో హత్యచేయించారు. ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి వారిళ్ళపై దాడులు చేయడానికి, ఫోన్లలో బెదిరించడానికి, కిడ్నాప్ లు చేయడానికి వీరిని వినియోగించారు. ఇందులో కత్తుల సమ్మయ్య అనే వాడిని శ్రీలంకలో దాచేందుకు విమానంలో తరలిస్తుండగా ప్రమాదవశాత్తు చనిపోవడంతో రాజ్యం నైజం బయటపడి ప్రజల అసహ్యానికి గురయ్యారు.

పురుషోత్తం తన చివరి శ్వాస వరకు రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడారు. బాలగోపాల్ ఏ.పి.సి.ఎల్.సి.ని వీడిన తరువాత తానే రాష్ట్ర మంతా పర్యటించి హక్కుల ఉద్యమాన్ని ముందుకు నడిపారు. న్యాయవాదిగా కోర్టులలో ప్రజల పక్షాన నిరంతర పోరాటం చేసారు. పాలమూరుజిల్లా ఐజ మండలం చినతాండ్రపాడు గ్రామంలో ఒక మామూలు మద్యతరగతి కరణం కుటుంబంలో అరవై ఒకటో సంలో జన్మించాడు. స్వాతంత్ర్య సమరయోధులు సీతారామారావు, రామ సుబ్బమ్మలకు నాల్గవ సంతానం. సాంప్రదాయ బ్రాహ్మణాచారలను తండ్రి నేర్పజూసినా తన దగ్గర అలానే వుండి పూజలు చేసేవాడు. కానీ తన చిన్న నాటి ఇతర కులాల పిల్లలతో కలిసి భోంచేసేవాడు. వారి ఎంగిలి ప్లేట్లను తానే కడిగేవాడు.

ఆయనకు తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ. బాగా చదువుకొని ఉద్యోగంచేసి వారిని సుఖపెట్టాలనుకునేవాడు. గద్వాలలో ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో స్నేహితులంతా విప్లవరాజకీయాలు మాట్లాడుతుంటే దూరంగా వుండి తన చదువు తాను చదువుకునేవాడు. ఎనభైలో బి.ఎస్సీ.లో చేరేనాటికి డిగ్రీ కాలేజీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. అదే సం. డిసెంబరు నాలుగున ఆర్.టి.సి. బస్సు చార్జీల పెంపునకు నిరసనగా ఆందోళన చేసిన విద్యార్దులపై పోలీసుల కాల్పుల కారణంగా పది సం.ల బాలుడు చనిపోయాడు. అనేకమంది గాయపడ్డడంతో చలించిపోయిన పురుషోత్తం ఇతర విద్యార్ధులతో కలిసి పోలీసు స్టేషన్ తగలబెట్టె కార్యక్రమంలో పాల్గొన్నాడు. అప్పటినుండి రాడికల్ విద్యార్ధి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. పాలమూరు ప్రజల పోరులో భాగంగా ఆయుధం పట్టాడు. తరువాత ఎనబై ఏడులో తిరిగి డిగ్రీ చదువు మొదలుపెట్టి పూర్తుచేసాడు. తరువాత పేదవిద్యార్దులకు తన గ్రామంలో ఉచితంగా విద్య నేర్పే స్కూలు నడిపాడు. బి.ఇడి.పూర్తిచేసాడు. గ్రామీణ ప్రాంత విలేకరిగా పనిచేసాడు. తరువాత న్యాయవాద విద్య పూర్తిచేసి న్యాయవాదిగా పేదల పక్షాన పోరాటం మొదలుపెట్టి పౌరహక్కుల సంఘంలో చేరాడు. అణచివేత దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడే ఉద్యమకారులను బూటకపు ఎన్ కౌంటర్ల పేరుతో హత్య చేస్తూ వారి శవాలను కూడా కుటుంబ సభ్యులకివ్వని రాజ్యహింసకు వ్యతిరేకంగా శవాల స్వాధీన కమిటీ పేరుతో గద్దర్ తోను, ఇతర ప్రజా సంఘాల వారితో ఉద్యమాన్ని నడిపాడు. రాజ్య హింసకు వ్యతిరేకంగానే కాకుండా సమాజంలో ప్రజలను అణచివేస్తున్న ఆధిపత్య వ్యవస్థలన్నిటికీ వ్యతిరేకంగా ఒక పౌరహక్కుల నాయకుడుగా ఉద్యమాలు నడపడంలో కృషిచేశాడు.

ఇంతలా తమ పక్కలో బల్లెంలా తయారయిన పౌరహక్కుల నాయకుడిని హత్య చేయడానికి కుట్ర చేసిన పోలీసులు, ప్రభుత్వమే పురుషోత్తం హత్యకు బాధ్యత వహించాలి. కా.పురుషోత్తం ఆచరణ, ఆశయాలు ప్రజల పక్షాన పోరాడే వారికి మార్గదర్శకాలు. అమర్ రహే కా. పురుషోత్తం.


20, నవంబర్ 2009, శుక్రవారం

జోహార్లు కెన్ సారోవివా జోహార్లు


నైజీరియా సైనిక నియంత అబాచా ప్రభుత్వంచే నవంబరు పది పందొమ్మిదివందల తొ౦బై ఐదున ఉరితీయబడ్డ కెన్ సారోవివా మరి ఎనిమిదిమంది ఉద్యమకారులు తమ ప్రాణత్యాగంతో ఒక మహత్తర సత్యాన్ని తెలియజేసారు. సామ్రాజ్య వాదుల అడుగులకు మడుగులొత్తే విధానాన్ని అనుసరిస్తూ తమ తల్లి స్తన్యాన్నే పణంగా పెట్టే పాలకవర్గ కుట్రలకు దేశప్రజానీకం బలవుతున్ననిజాన్ని వెల్లడించారు.

షెల్ దాని అనుబంధ చమురుకంపెనీలు నైజీరియాలోని పాలక సైనిక ముఠా అ౦డద౦డలతో, చమురును ఆబగా పైక౦గా మార్చుకుని కుబేరులయ్యరుగాని, ఆ చమురు క్షేత్రాల వద్ద, పరిసరాలలో పర్యావరణం ఎంతగా నాశనమవుతోందో, ఒగోనీ తెగ ప్రజల సంప్రదాయక పంటలు ఎలా నాశనమయ్యాయో, వారు జీవన భృతి క్రమ౦గా ఎలా కోల్పోయారో, ఇటువంటి విషయాలు పట్టించుకోలేదు. వారు తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఎలుగెత్తి నినది౦చారు. స్వయం పాలనకు డిమా౦డ్ చేశారు.

ఈ ప్రజా౦దోళనను సహజంగానే సైనిక ముతా ప్రభుత్వం అత్య౦త పాశవికంగా అణచివేసింది. మొబైల్ పోలీస్ ఫోర్స్ ఒగోనీ ప్రజల ఆ౦దోళననలనణచివేయడానికి మొదటిసారి తొంభైలో ఏనాభి మందిని ఊచకోత కోసి౦ది. నాలుగువ౦దల తొ౦బైఐదు ఇళ్ళను ధ్వస౦ చేసి౦ది. మరల తొ౦బై రె౦డు వేసవిలో ఘరాన్ చమురు క్షేత్రం వద్ద వున్నా గ్రామాలపై ఈ ఎం.బి.ఎఫ్ దాడి చేసి ముప్పై మ౦దిని చ౦పిది. నూటా ఏభై మ౦దిపై లాఠీ చార్జీ చేసింది.

దీనిని అంతర్జాతీయ వేదికలలో మాట్లాడి ప్రప౦చ ప్రజల దృష్టికి ఈ సమస్యను తీసుకు వచ్చారు. తొ౦బై రె౦డులో యు.ఎస్.వర్కి౦గ్ గ్రూప్ ఆన్ ఇ౦డియన్ పాపులేషన్ సమావేశంలో (జెనీవా) మాట్లాడారు. అక్కడిను౦చి న్యూయార్క్ లోని యు.ఎన్.ఓ.సమావేశ౦లో మాట్లాడుతూ, 'చమురు వెలికితీత వల్ల-తగు జాగ్రత్తలు, రక్షణలు పాటి౦చక నిర్లక్ష్యం చేసిన౦దువలన ఒగోనీ నేడు మరుభూమిగా మారిపోయింది. దీనికి బదులుగా మాకు లభి౦చేదేమ౦టే ఒక పెద్ద గు౦డు సున్నా మాత్రమె' అన్నారు.

దీనితో శానీ అబాచా సైనిక ముఠా ప్రభుత్వం ఒగోనీలను అణచడానికి ఇరుగుపొరుగునున్న స్వదేశీ తెగల వారిని వారిపైకి ఉసిగొలిపి౦ది. ( సల్వాజుడుం, హర్మద్ వాహిని వంటివి భారత పాలక వర్గ హంతక ముఠాలువీటికి నేటి ప్రతిరూపాలు )

కెన్ సారో వివా నెలకొల్పిన ఎం.ఓ.ఎస్.ఫై.ఓ స౦స్థ షెల్ ను పది బిలియన్ డాలర్ల నష్ట పరిహార౦గా ఇవ్వాలని, దేశం విడిచిపోవాలని డిమా౦డ్ చేసి౦ది.

దీనిపై ఆగ్రహించిన సైనిక ప్రభుత్వం కెన్ సారోవివా ను మరి ఎనిమిదిమ౦ది ఉద్యమకారులను ఉరితీసి౦ది. కెన్ సారో వివా నలబై ఒకట్లో అక్టోబర్ పదో తేదీన రివర్స్ స్టేట్ రాష్ట్ర౦లో జన్మి౦చారు. గొప్ప జాతీయవాది. మహామేధావి. విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా ప్రత్యక్ష వలసపాలన ను౦డి నైజీరియా బయటపడిన తోలి స౦వత్సరాలలో ప్రభుత్వ పాలనాదికారిగా, అరవై ఎనిమిదిలో రాష్ట్ర మ౦త్రివర్గ౦లో కేబినేట్ మ౦త్రిగా పనిచేసారు. ఆయన నాలుగు నవలలు, రె౦డు కథా స౦పుటాలు, ఒక కవితా స౦పుటి, నాటికలు, తొమ్మిది పిల్లల పుస్తకాలు రాసారు. ఆయన రచనలు ఒగోనీ ప్రజల అ౦తరాత్మను ఆవిష్కరించాయి.

మీ సమాధిపై వు౦డే శిలా ఫలక౦పై ఏమిరాస్తే బాగు౦టు౦దని అడిగిన విలేకరితో వివా ఇలా చెప్పారు:
'నైజీరియా చేత మోసపోయిన మర్యాదస్తుడు ఇక్కడ శాశ్వత౦గా నిద్రపోతున్నాడు. వారు ఆయనకు సాధారణ౦గా అవసరమైన ఆరుఅడుగుల నేలనుకుడా తిరస్కరించారు'.

"ప్రభు! నా ఆత్మను స్వీకరి౦చు. కానీ, పోరాట౦ కొనసాగి తీరుతుంది" అన్నది వివా చివరి మాట.

కలలు క౦టూ చనిపోవాలని ఆశి౦చిన వివా కోరిక నిజ౦ కాకపోవడ౦ విషాదం.

చివరిగా ఇదే విధమైన అపార సైనిక, అధికార బలగాలతో అబూజ్ మడ్ (అపార ఖనిజ వనరులు కలిగిన దండకారణ్యం) ప్రా౦తంపైదాడిచేస్తు అక్కడి ఆదివాసీ ప్రజానీకాన్ని తరిమివేస్తూ, వారి గ్రామాలను తగలబెడుతూ,
స్వదేశంలోనే కా౦దిశీకులుగా మారుస్తున్నమేకవన్నెపులులప్రభుత్వం సామ్రాజ్య వాదుల అడుగులమడుగులొత్తుతున్న తీరును ప్రజాస్వామిక వాదులు తప్పక ఖండించాలి. లేకపోతే భవిష్యత్ తరాలకు ఈ దేశ వనరులు మిగలనివ్వకుండా అమ్ముకునే కుట్రకు బలి అవుతాం.

('కెన్ సారోవివా కోసం' పేరుతో జనసాహితి ప్రచురణలనుండి సమాచారం)


14, నవంబర్ 2009, శనివారం

ఏ బాలల దినోత్సవం?


ఈరోజు బాలల దినోత్సవంగా దేశవ్యాప్తంగా నెహ్రూ గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఆయనకు బాలల పట్ల వున్న ప్రేమను ఇలా మనం జరుపుకోవడంలొ అభ్యంతరం వుండదెవరికీ. ఆయన జేబులో తురుముకున్న ఎర్ర గులాబీ, ఆయన చుట్టూ చేరిన బాలల ఫోటోలతో మనకు ఒక స్వచ్చమైన రూపం కనులముందు కదలాడి ఆయనకు పిల్లల పట్ల వున్న ప్రేమను గుర్తింప చేస్తాయి. కానీ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళు గడిచినా నేటికీ మనం బాలల హక్కులపట్ల, వారి భవిష్యత్ పట్ల సరైన ప్రణాళికలు రూపొది౦చుకోలేకపోయా౦.

లక్షల మంది శిశువులు లింగ వివక్షకారణంగా పిండం రూపంలోనో, లేక పుట్టిన తరువాతనో హత్యకావించబడుతున్నారు. దీనికి పరోక్షంగా మన సమాజంలోని వరకట్న దురాచారం, ఆడవారిపట్ల వున్న చిన్న చూపే కారణం.

అలాగే ప్రాథమిక విద్యను హక్కుగా ప్రకటించినప్పటికీ ఎంతో మంది బాలలు బడిమొహం చూడకుండానే వుండిపోతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే వీరి సంఖ్య డబ్భై లక్షల వరకు వుంది. వీరిలో వికలాంగులు, వలస కార్మికుల పిల్లలు, వీధి బాలలు, బాల కార్మికులు వంటి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన బాలలే అధికం.

కోటీ ముప్ఫై లక్షలమంది బాల కార్మికులుగా జీవనం సాగిస్తున్నట్లు ప్రభుత్వమే లెక్కలు చెబుతోంది. ఈ సంఖ్య ఆరు కోట్లవరకు వుంటుందని ఎన్.జీ.వో సంస్థలు అంటున్నాయి. ప్రతి పది మందిలో ఇద్దరు బాల కార్మికులుంటున్నారని సేవ్ ద చిల్డ్రన్ అనే స్వచ్చంద సంస్థ పేర్కొంటోంది. ఇంకా మూడేళ్ళ లోపు వయసు వారిలో నలబై ఆరు శాతం మంది బరువు తక్కువుగా వుంటున్నారు. మొత్తం పిల్లలలో డబ్బై శాతం మంది రక్త హీనతతో బాధపడుతున్నారు. ఐదేళ్ళలోపు పిల్లలలో ఏటా ఇరవై లక్షలమంది నివారించదగ్గ, చికిత్సకు లొంగే చిన్న, చిన్న జబ్బులతో మరణిస్తున్నారు. ఏటా నాలుగు లక్షలమంది శిశువులు పుట్టిన ఇరవై నాలుగు గంటలలోనే కన్నుమూస్తున్నారు. శిశుమరణాల రేట్లో భారతదేశ పరిస్థితి బంగ్లాదేశ్ కంటే ఘోరంగా వుంది. ప్రతి వెయ్యి జననాలకు డబ్బై రెండు మంది మరణిస్తున్నారు. శిశు మరణాలలొ భారతదేశం నూటడబ్బై ఒకటో స్థానంలో వుంది.

ఇవి మన సర్కారు గణాంకాలాధారంగా తెలియజేస్తున్నవే, ఇంకా ఎవరూ నమోదుచేయని గిరిజన ప్రాంతాల పరిస్థితి కలుపుకుంటే ఇంకా ఘోర పరిస్తితి తెలియవస్తుంది. ఎంతోమంది గిరిజన ప్రాంత శిశువులు సరైన రహదారి సౌకర్యం లేక, ప్రాంతాల పట్ల సర్కారు నిర్లక్ష్య వైఖరి కారణంగా రక్త హీనత, పౌష్టికాహార లోపంతో మూడేళ్ళలోపునే మరణిస్తున్నారు.

మన కనులముందే కుటుంబ ఆర్థిక పరిస్తితులు, సామాజిక వివక్ష కారణంగా ఎంతో మంది బాలలు వీధి బాలలుగా, బాల కార్మికులుగా అత్యంత దయనీయ పరిస్తితులలో జీవనం సాగిస్తున్నారు. ప్రతియేటా బాలల దినోత్సవం నాడు ఉపన్యాసాలతో ఊదరగొట్టి వారి పట్ల ప్రేమను ఒలకబోసే పాలక వర్గాలు ఏనాడూ సరైన కార్యాచరణ ప్రణాళికను చిత్తశుద్ధితో అమలు చేసిన పాపాన పోలేదు. మన రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల వర్యులకు పుష్పగుచ్చాలు అందించి ఫోటోలకు ఫోజులిచ్చి, నవ్వులు చిందించే బాలలలో ఎవరైనా అనాధ బాలలుంటారా? పుట్టుకతోనే బంగారుచెంచాతో వచ్చిన వారు తప్ప. వారి పండగనే దేశంలోని అందరు బాలల పండగగా ప్రచారం చేసి పబ్బం గడుపుతున్నారు.

మన విద్యారంగంలో నేడు అమలౌతున్న సంస్కరణలు కూడా బాలల హక్కులను హరించేవిగానే వుంటున్నాయి.

అలాగే ఎంతోమంది ఆడపిల్లలు బాల్యంలోనే వేశ్యావాటికలకు అమ్మివేయబడి నరక కూపాలలో మగ్గిపోతున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ పట్ల వున్న కౄర వ్యామోహం దీనికి కారణం. ఇది మన పాలక, రక్షకభటులకు తెలిసే జరుగుతోంది. కలకత్తాలోని సోనాపురీ, బొంబాయి, ఢిల్లీ వంటి మహా నగరాలలోని రెడ్ లైట్ ఏరియాలలో ఇది ఒక మాఫియాగా నడుపబడుతోంది. (నొయిడాలో ఒక పెద్దమనిషి ఎంతో మంది పిల్లలను లైంగికంగా హింసించి, చంపి పాతరేస్తే సరైన సాక్ష్యాలు లేవనీ మన గుడ్డి న్యాయస్థానం వదిలిపెట్టింది).

వీటన్నింటిపట్ల ఒక సమగ్రమైన ప్రణాళికను రూపొందించి, చిత్తశుధ్ధితో అమలు చేసిన నాడే మనం బాలల దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కును పొందుతాం.

9, నవంబర్ 2009, సోమవారం

మార్క్సిస్టు పార్టీగా పిలవబడడానికి అర్హత వుందా?


రెండు రోజుల క్రితం ప్రకాశ్ కారత్ మార్క్సిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో ఒక నిజాన్ని మాటాడారు. చైనా మావో ఆలోచనా విధానాన్ని వదిలేసి చాలా రోజులయిందని, దానిని అనుసరిస్తున్న మావోయిస్టు పార్టీ సిధ్ధాంతం అవుట్ డేటెడ్ అని. ఈ మాటలు ఇంతకు ముందు విన్నట్టుంది కదూ? అదేనండి తనకు తాను ప్రపంచ బాంకు సి.ఇ.ఓగా ప్రకటించుకున్న చంద్రబాబునాయుడూ అదే అన్నాడు. ఈనాడు మరల తమ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారిన బెంగాల్ లో తమకు కొరుకుడుపడకుండా వున్న బలీయమైన ప్రజా మద్దతుతో ముందుకు వస్తున్న మావోయిస్టులను చూసి ఓర్వలేక ఈ నిజాన్ని మాటాడాడు. చైనా కేపిటలిస్టు పంథాలో, డెంగ్ ఆలోచనా విధానంలో పూర్తిగా కూరుకుపోయిన వైనాన్ని ఒప్పుకున్నాడు. తామూ అదే విధానంలో కొనసాగుతూ బెంగాల్ లో ప్రజలకు దూరమై పెట్టుబడిదారీ వర్గాన్ని భుజాన మోయడానికి రెడీ అయి ఇంకా మార్క్సిస్టు పార్టీ పేరుతో చెలామణీ కావడం ఎంతవరకు సమంజసం? ఇందిరమ్మ కొంగు పట్టుకు వేలాడి కొన్నాళ్ళు, సోనియా చెంగు పట్టుకు తిరిగి కొన్నాళ్ళు ప్రజలను పార్లమెంటరీ మురికి కూపంలో ముంచడానికి తమ వంతు సహకారాన్నిస్తూ ఎర్ర ఝెందా నీడలో మోసపు బతుకు బతికే వీళ్ళు ఏమాత్రం క్షమార్హులు కారు. పాలు తాగే తల్లి రొమ్మునే గుద్దే నీచులుగా అధికారంకోసం దేనికైనావెనుకాడని వీళ్ళని ప్రజలు ఇంకెంతో కాలం అంగీకరించరు. వీళ్ళ ఝెండా, ఎజెండా అధికార భాగస్వామ్యం తప్ప వేరుకాదు. కా.లెనిం తీవ్రంగా హెచ్చరించిన ట్రేడ్ యూనియం పోరాటాల ఊబిలో జనాన్ని కూరి పబ్బం గడుపుకోజూస్తున్నారు.

ఈ రెండు పార్టీలకు నాదొకటే విజ్ఞప్తి: మీ ఝెండాల రంగు, గుర్తులు, పార్టీల పేరులు మార్చుకొని మీ నిజస్వరూపాన్ని ప్రజలముందుంచండి. వాటిని వాడుకునే హక్కు ఇంకెంతమాత్రమూ మీకు లేదు.

5, నవంబర్ 2009, గురువారం

మన విశ్వవిద్యాలయాలను మూసేయాలి


మన విశ్వ విద్యాలయాలలో నేడు అలముకున్న ఒక నిస్పృహ వాతావరణం పోవాలంటే వాటిని కొద్దికాలం మూసేయడమే మంచిదని నా విన్నపం. ఎందుచేతనంటే అవి నేడు ఎందుకూ పనికిరాని మురికి కూపాలుగా తయారయ్యాయి. కులగజ్జి ఆచార్యుల కనుసన్నలలో పనికిమాలిన సబ్జెక్టులపై డాక్టరేట్లివ్వడానికి తప్ప నేడు వాటి వలన సమాజానికి నిజంగా ఏమీ ఉపయోగం జరగడం లేదు. వాటినుండి ఏ కొత్త ఆలోచన కానీ, సృజనగానీ కొన్నేళ్ళుగా రూపొందడంలేదు. అటు సాంఘిక శాస్త్ర అంశాలపట్లగానీ, సైన్సు అంశాల పట్లగానీ ఒక కొత్త అంశం కనుగొన్న పాపాన పోలేదు. ఎంతసేపూ స్నాతకోత్సవ జాతర నిర్వహించి తైతక్కల సినిమావాళ్ళకు, రౌడీ రాజకీయనాయకులకు డాక్టరేట్లు అమ్ముకుంటూ కోట్ల కొలది ప్రజా ధనాన్ని చాన్సలర్లు, పీఠాధిపతులు మింగేయడానికి పనికి వస్తున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు వేటలో పడ్డ పనికిమాలిన యువతకు భోజనాల బోర్డింగ్ లుగా మారిపోయాయి. కెరీరిజం మోజులో తన చుట్టూ జరుగుతున్న సామాజిక దోపిడీని పట్టించుకున్న తీరిక లేని వెధవలను తయారుచేస్తున్నాయి. గత ఇరవై యేళ్ళుగా యువత ఎందుకూ కొరగాకుండా జీతగాళ్ళుగా మార్చే సాధనాలుగా తయారయ్యాయి. సామాజిక రుగ్మతలకు కారణాలను అణ్వేషించి, వాటినుండి బయటపడే మార్గాన్ని ప్రజలకు నిర్దేశించే ఉపకరణంగా ఉండవలసిన విద్యా విధానాన్ని భ్రష్టుపట్టించిన ఈ కులగజ్జి కూపాలను కొంత కాలం మూసేస్తే కడుపుమండిన వాళ్ళైనా దానికి కారణాలను వెతికే పనిలో పడతారని నా ఆలోచన. లేకపోతే ఈ రాచకురుపు వలన సమాజానికి తీవ్రమైన నష్టమే తప్ప లాభం లేదు. నెత్తురు మండే శక్తులు నిండే యువత రావాలి. ఆనాడే ఈ దేశం, ఈ సమాజం బాగుపడుతుంది.