31, డిసెంబర్ 2010, శుక్రవారం

మరపు రాని మనకాలం వీరుడు సద్దాం

నవ్వుతూ
తలవంచక
గుండెల్నిండా ఊపిరితో
ఎత్తిపట్టిన చాతీతో
నిటారుగా నిలిచిన వెన్నెముకతో
కాలు తన నేలపై గట్టిగా అదిమి పట్టి
శతృవు గుండెల్లో బెదురుపుట్టిస్తూ
తన జాతి పరువుకోసం,
పంతం కోసం ఒక్కడై,
తను ఒక్కడే వీరుడై,
కోల్పోయిన దానిని చివరి నిమిషంలో
అంతటా జేజేలు ద్వారా పొందిన
ఒకే ఒక్క వీరుని మరణం
ది గ్రేట్ సద్దాం హుస్సేన్ అబ్ద్ అలి మజ్ది తిక్రితి
మన కాలం వీరుడు...
అందుకో మా జోహార్లు సద్దాం

అగ్ర రాజ్యపు దురహంకారానికి నిలువెత్తు సాక్ష్యం
నీ నేలపై ఒలికిన లక్షలాది మంది క్రొన్నెత్తురు
దాని పాపం ఊరికే పోదులే..
ఈ కుహనా ప్రజాస్వామ్యవాదులు,
స్వేచ్చావాదులు
నీ నవ్వు ముందు బలాదూర్ కాకపోరు
నువ్వెత్తి పట్టిన మొండి ధైర్యమే మాకు ఆదర్శం
అబ్బురపరిచిన నీ మొక్కవోని ధీరత్వం
ఎప్పటికీ ఈ నేలపై స్వాతంత్ర్య కాంక్ష
కలిగిన వారి చేతిలో
ఝెండాగా ఎగురుతూనే వుంటుంది..
బాగ్ధాద్ నెలవంక సాక్షిగా
ఇది శాశ్వతం, సత్యం..
(సరిగ్గా నాలుగేళ్ళ క్రితం నిన్నటి రోజున సద్దాం పాశ్చాత్య దురహంకారుల చేతిలో ఉరితీయబడ్డాడు)

27, డిసెంబర్ 2010, సోమవారం

బలగాలు తరలింపు తెలంగాణాకే ఎందుకు?పారామిలటరీ బలగాల మోహరింపు తెలంగాణా ప్రాంతానికే పరిమితం చేస్తూ తెలంగాణా ప్రజల గుండెలపై తుపాకులెక్కుపెట్టడాన్ని చూస్తుంటే డిసెంబర్ ఆఖరు తరువాత వారి ఆశలపై నీళ్ళు జల్లేందుకు సిద్ధమైన కార్యాచరణతో పాలకవర్గం వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి తద్వారా వారిని తీవ్ర నిర్బంధంతో అణచబట్టడానికి ఉద్యుక్తులవుతున్నారని అర్థమవ్వని వారెవ్వరైనా వున్నారా?

ఉద్యమ క్రెడిట్ ను ఏ ఒక్కరో కొల్లగొట్టుకుపోకుండా వుండటానికి ఈ రోజు ఎన్నడూ గొంతెత్తి ఎరుగని కాంగేయులు దీక్ష చేపట్టడం హాస్యాస్పదం కాదా?

జైళ్ళలో మగ్గుతున్న విద్యార్థులను పరామర్శించని ఈ నాయకులంత నేడు వారిపై వున్న కేసులను ఎత్తివేయమని గోలచేయడం వెనక కుట్ర కానరాదా? కేసుల సంఖ్య ప్రకటిస్తూ ఎత్తివేసినవన్నీ సాధారణ కేసులే తప్ప వారిపై పెట్టిన తీవ్రమైన కుట్రకేసులగురించి మాటాడని ప్రభుత్వం ఇంతకుముందెన్నడూ లేనివిధంగా న్యాయపరమైన చిక్కులు గురించి మాటాడుతూ తప్పుదోవపట్టిస్తోంది. ప్రజలకు, వారి ఆస్తులకు కోట్ల రూపాయలలో నష్టాన్ని సాగించి, హత్యలు, లూఠీలతో తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన రంగా హత్యానంతరం, రాజీవ్ హత్యానంతరం అధికార పార్టీ గూండాలందరిపై ఎత్తివేసినప్పుడు కానరాని ఈ న్యాయ, నైతిక అంశాలు తెలంగాణా విద్యార్థి, యువజనులపై పెట్టిన తప్పుడు కేసులప్పుడే గుర్తుకు రావడం వీళ్ళ వివక్షకు తార్కాణం కాదా?

తెలంగాణా ప్రజలేమైనా ఉగ్రవాదులా? ఇన్నిన్ని కేసులు, మిలటరీ బలగాల మోహరింపుతో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేయడం ఎంతవరకు సమంజసం?

ఈ పాలకవర్గ నాయకులంతా ముందుగా బలగాల అక్రమ తరలింపును అడ్డుకొని, వాటి ఉపసంహరణకు డిమాండ్ చేస్తూ వారి పదవులనుండి వైదొలగి కేంద్ర, రాష్ట్ర పభుత్వాలపై తీవ్రమైన వత్తిడి తేగలిగితే వీరిని నమ్మొచ్చు. అంతే కానీ దీక్షలతో మభ్య పెట్టజూడడం తెలంగాణా ప్రజలను మోసం జేయజూడడమే...

ఒకపక్క కేసీఆర్ జార్ఖండ్ ఉద్యమం పద్దెనిమిదేళ్ళు సాగింది కాబట్టి అప్పుడే తొందరొద్దు, ఉద్యమాన్ని కొనసాగిస్తూ, చందాల దందాలతో, పదవులతో బేరసారాలతో హీరోగా కొనసాగ జూస్తున్నాడు కాబట్టి ఈయనగారి బండారాన్ని తప్పక బయటపెట్టి ప్రజా ఉద్యామాన్ని నిర్మాణం చేసుకొని పాలక, ప్రతిపక్ష నాయకులను బహిష్కరించి, పూర్తిగా సహాయ నిరాకరణను కొనసాగించి, అమరుల ఆశయాన్ని ఎత్తిపట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరముంది....

25, డిసెంబర్ 2010, శనివారం

ప్రశ్నించే గొంతుపై ఉక్కుపాదం..నిన్నటి రాయపూర్ కోర్ట్ తీర్పు హక్కుల ఉద్యమాన్ని అణచివేసేందుకు ఈ దేశ కార్పొరేట్ రాజ్యాంగం వెలిబుచ్చినదిగా వుంది తప్ప ఒక చంటిపిల్లల డాక్టరుగా పనిచేస్తూ, తన చుట్టూ వున్న పేద గిరిజనులపై జరుగుతున్న అమానుష దాడిని ఖండిస్తూ, వారికి వత్తాసుగా వుంటూ న్యాయస్థానాలలో వారి తరపున పోరాటం చేసే డా.క్టర్ బినాయక్ సేన్ ను గత రెండు సం.లుగా అక్రమ నిర్బంధంలో వుంచి, సుప్రీం ఉత్తర్వులతో బైయిల్ పై విడుదలైన ఓ వృద్ధ డాక్టర్ పై దేశ ద్రోహ నేరం కింద యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా వుండాల్సిన పౌర స్వేచ్చను హరించడమే. రాజ్యాన్ని ప్రశ్నించే హక్కును హరించే కౄర చట్టాల ద్వారా నియంత పాలన సాగించ జూడడం వ్యవస్థ వైఫల్యాన్ని ఒప్పుకోవడమే..

ఆంధ్రప్రదేశ్ లో ఎనభైల ప్రాంతంలో జరిగిన చంటిపిల్లల డాక్టరు, పౌరహక్కుల ఉద్యమ నేత డా.రామనాధం హత్య కేసు ముద్దాయిలు ఇంతవరకు గుర్తింప బడలేదు. అలాగే ఎందరో న్యాయవాదులు, ఉపాధ్యాయులను తమ ప్రైవేటు హంతక ముఠాలచే నిర్దాక్షిణ్యంగా హత్యచేసిన స్థానిక ప్రభుత్వం హక్కుల ఉద్యమాన్ని అణచివేయడంలో ముందుంది. డా.రామనాథం వద్ద అనేకమంది పోలీసు కుటుంబాల చిన్నారులు కూడా వైద్యం పొందేవారు. ఆయన వైద్యం కోసం ఎవరు వచ్చినా తన వృత్తి ధర్మాన్ని నిర్వహించేవారు. అది పౌరుల ప్రాధమిక హక్కుగా పేర్కొనేవారు. ఇలా ఎంతోమంది అణగారిన వర్గాల వైపు నిలబడి మాటాడే వారిని హత్య చేయడమో, జైళ్ళపాల్జేయడమో చేయడం ద్వారా తమ నిరంకుశ, నిర్లజ్జ పాలన కొనసాగించబూనడం ఘోరమైన నేరం. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మనందరం.

ప్రజాస్వామ్య వాదులు, మేధావులు ఈ ఆన్లైన్ పిటిషన్ లో సంతకం చేయగలరు

15, డిసెంబర్ 2010, బుధవారం

నిజంగా రాడియాకు ఇదంతా సాధ్యమా?
కెన్యాలో పుట్టి , లండన్ లో విద్యాభ్యాసం చేసి తన చాతుర్యంతో ఒక దేశ పాలనా వ్యవస్థనే శాసించే స్థాయికి ఎదిగిన నీరా రాడియాను అభినందించకుండా ఉండగలమా?

అసలు ఒక కార్పొరేట్ లాబీయిస్టుగుప్పెట్లోకి మొత్తం దేశ పరిపాలనతోపాటు, ఆర్థిక వ్యవహారాలనే తాకట్టుపెట్టబడ్డాయంటే మనమెంత భద్రంగా వున్నామో తేటతెల్లమైంది..

నిజంగా ఈరోజు దేశ ఇంటలిజెన్స్ వ్యవస్థ ప్రధాని తమిళనాడు పర్యటనకు వెళితే టైగర్స్ వలన ముప్పుందని చెప్పారంట. ముప్పు పూర్తిగా అణగదొక్కబడిన వాళ్ళ వలన లేక కరుణ వలనన్నారో.. ఇలా మన మీడియా ద్వారా చీదించారా?

ప్రైవేటు ఆర్థిక దిగ్గజాలైన అంబానీ, టాటాలు తమ వ్యాపారాల కోసం ఎంత దిగజారి పావులు కదుపుతారో ప్రజలకు అర్థమైంది. మరల ఇందులో తమ పరువు పోతుందని కోర్టులకెక్కడమొకటి.

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కూడా ఈ తీగల ముళ్ళు చుట్టుముట్టాయన్నది మాజీ ప్రధాన న్యాయమూర్తిగారిపై వచ్చిన ఆరోపణలతో అసలు కార్పొరేట్ రంగం ఈ దేశ చతురంగ వ్యవస్థను ఎంతలా దిగజార్చిందో మనకర్థమౌతోంది.

ఈ దేశానికి అంతర్గత భద్రతకు మావోయిస్టుల వలన ముప్పని ఎక్కడ మైకు దొరికితే అక్కడ ఊదర గొట్టే ప్రధానికి ఈ లక్షా డెబ్బై వేలకోట్ల కుంభకోణం ఈ దేశ జవసత్వాలను పీల్చి పిప్పిచేస్తుంటే నోట్లో ఏమడ్డమొచ్చి ఊరకున్నారో?

ఓ పెద్ద రెండు రాష్ట్రాల సం.బడ్జెట్ అంత మొత్తం ఒకరి గుప్పెట్లోకి పోతే అంతర్జాతీయ స్థాయి ఆర్థిక మేధావుల పాలన ఇలా ఏడ్వడానికి వున్న చిదంబర రహస్యమేమిటో?

పార్లమెంటు మొత్తం స్థంభించిపోయి సమస్యలన్నీ గాలికొదిలేయబడి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ సిగ్గుతో తలదించుకొనేట్లుంటే ఇక్కడ మౌనం దాల్చి ఎక్కడో యూరోపియన్ దేశంలో నా పార్లమెంటో అని ఏడ్చిన వాణ్ణి ఇతగాన్నే చూసాం..

అటు ప్రతిపక్షం అధికారంలో వున్నప్పటి నుంచి ఇప్పటి అధికార పక్షం వరకు రాడియా నీడ చాటుకు పోవడాన్ని ఇంత మౌనంగా ఈ దేశ ప్రజలు భరిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో వున్నామో కదా?

ఒట్టిపోయిన ఆవుకు మేపు దండగన్నట్లు, చెవిటోడి ముందు శంఖమూదినట్లు ఎన్నని ఏం లాభం..

నిద్రపోయే వారిని లేపగలం కానీ, నిద్ర నటించే వాళ్ళని లేపడం ఎవరి తరం?

మేధావి వర్గం కార్పొరేట్ మాయలో పడింది.
యువత కెరీరిజం మోజులో కూరుకుపోయింది.
సామాన్యజనం ఏ పూట బత్తెం ఆ పూట దేవులాటలో కొట్టుమిట్టాడుతోంది.
కోట్లు దొబ్బుకుపోయేవాడు చల్లగా జారుకుపోతున్నాడు.

ఏ రోజుకారోజు ధరలు ఆకాశం దాటి దూసుకుపోయినా మన సెల్ మోగితే చాలు.. ఓ వంద ఫ్రీ మెసేజ్ లతో ఆడుకుందాం రా!!

9, డిసెంబర్ 2010, గురువారం

మోసపుచ్చిన అపరాత్రి ప్రకటన..తెలంగాణా ప్రజల ఆకాంక్షను గుర్తిస్తున్నట్లు సరిగ్గా ఏడాది క్రితం
అపరాత్రిప్రకటన చేసి, వారిలో ఆశలు రేకెత్తించిన కేంద్రం ఆ తరువాతి పరిణామాలకు, దళారీ పెట్టుబడిదారుల కుయుక్తులకు తలొగ్గి ఏభై నాలుగేళ్ళ సుదీర్ఘ స్వప్నాన్ని కన్న వారి ఆశలపై నీళ్ళు చల్లేట్టు కమిటీలు వేసి తెలంగాణా ఏర్పాటు ప్రక్రియను వాయిదా వేయడం ద్వారా అనేక మంది నవ యువతీ యువకుల ఆత్మార్పణకు దారితీసేట్టు చేసి, తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తూ వస్తూంది. రాష్ట్ర అధినాయకత్వ మార్పు ద్వారా మరింత కఠిన వైఖరి తీసుకునే విధంగా ప్రోత్సహిస్తూ తెలంగాణాను పోలీసు రాజ్యంగా మార్చివేయజూస్తోంది. ఉద్యమాలను వ్యతిరేకించే పోలీసు బాసును రాష్ట్రానికి గవర్నర్ గా పంపినప్పుడే కేంద్ర వైఖరి అవగతమైంది. వారి డిసెంబర్ తొమ్మిది ప్రకటన వట్టి మోసపూరితమైనదని, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి చేయాల్సిన దానికి అసెంబ్లీ తీర్మాణం కావాలన్న ప్రకటన వలన వారి దాటవేత ధోరణి వ్యక్తమైంది. అవకాశవాద రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకునేందుకు అందరి ముందు తెలంగాణాకు మద్ధతు ప్రకటించిన వారే ఈ ప్రకటన వెలువడ్డ తర్వాత వారి వారి ప్రాంతీయ ధోరణులు బయటపెట్టి మరింత వేదనకు గురిచేసారు. మీడియాకూడా రకరకాల వ్యాఖ్యానాలతో తమ పెట్టుబడుల మూలాలను కాపాడుకునే ప్రయత్నాలను చేస్తూ వస్తోంది. ముందుండి నడుపుతున్న నాయకత్వంలో కూడా వున్న అవకాశవాదం కారణంగా ఉద్యమం అటూ ఇటూ ఊగిసలాడుతూ యువతరాన్ని తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేస్తోంది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ముందుకు వచ్చి దళారీలను అడ్డుకొని ఉద్యమాన్ని నిలబెట్టి వుండకపోతే ఇప్పటికే ఉద్యమ నెలబాలుడిని ఈ రాజకీయ రాహువులు మింగిపారేసేవి. ఈ నాలుగు వందలమంది ఆత్మార్పణ బూడిద పాలయ్యేది.

తెలంగాణ ప్రజలను మరెంతో కాలం మోసం చేయలేరని, వారి సహనాన్ని పరీక్షించకుండా నాటి ప్రకటనకు కట్టుబడి వారి కలలను సాకారం చేయగలరని ఆశిద్ధాం. ఏమైనా ప్రజా ఉద్యమం ద్వారానే వత్తిడి పెంచగలమని గ్రహించి ఐక్య పోరాటాల ద్వారా తెలంగాణా సాధనకు కృషిచేయగలరని నాయకత్వాన్ని కోరుతూ..

2, డిసెంబర్ 2010, గురువారం

డిసెంబర్ రెండుడిసెంబర్ రెండు
భారత విప్లవోద్యమ చరిత్రలో ఈ రోజు

చరిత్రను అటూ ఇటూగా విడదీసిన రోజు

పీడిత ప్రజల విముక్తి కోసం,

సమసమాజ నిర్మాణంకోసం,
సామ్రాజ్యవాద కబంద హస్తాలనుండి భారత దేశ విముక్తి కోసం
తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడుతున్న విప్లవ నాయకులను
కుట్రతో
, కుతంత్రంతో

అత్యంత కిరాతకంగా హత్యచేసి ఉద్యమాన్ని
తుడిచి పెట్టేసామన్న సంబరం
పాలక హంతక ముఠాలకు మిగలనివ్వని రోజు
వారి చావుతో కోల్పోయింది ముగ్గురినే కానీ

వేలాదిగా మారిన విముక్తి సైన్యం ఏర్పాటుకు తోవతీసిన రోజు

వీరుడు మరణిస్తే వేలాదిగా పుట్టుకొస్తాడన్నదానికి కొండ గుర్తు...

అందుకే డిసెంబర్ రెండు
నెత్తుటితో ఎగరేసిన ఝెండా గుర్తు..
(కా.శ్యాం, మహేశ్, మురళి ల అమరత్వాన్ని గుర్తుచేసుకుంటూ)
వారి అమరత్వంపై వివరణ చూడగలరు