29, జూన్ 2011, బుధవారం

ఒడ్డు చేరాక తెప్ప తగలేసిన దీదీ..



ఇటీవల జరిగిన ప.బెంగాల్ ఎన్నికల్లో కార్పొరేట్ సెక్టార్ పెట్టుబడులతో ఎన్నికల్లో నెగ్గిన మమత ఆ ఋణాన్ని తీర్చుకోవడానికి అధికారాన్ని వినియోగించడానికి ముందుకు వస్తున్నారు. టాటా కంపెనీకి రైతులనుండి సేకరించి అప్పనంగా ఇచ్చిన భూమిని తిరిగి అదే రైతులకు పంపిణీ చేయాలని ఇన్నాళ్ళు కొంగు నడుముకు చుట్టినట్లు నటించిన దీదీ తన అసలు సిసలు కాంగ్రెస్ కలర్ & కల్చర్ ను బయటకు తీస్తున్నారు. సుప్రీం కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్న టాటా కంపెనీ వారికనుకూలంగా వచ్చిన తీర్పును స్వాగతిస్తూన్నట్లు ప్రకటించడం దీనికి నిదర్శనం.. మరల ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది...
వార్త ఆధారం

24, జూన్ 2011, శుక్రవారం

అభివృద్ధి - వెలుగు నీడలు - ప్రొ.ఆర్.ఎస్. రావు గారి వ్యాసం..


ఇటీవల అమరులైన ప్రొఫెసర్ ఆర్.ఎస్.రావు గారి ఈ వ్యాసం తొంభైల ప్రాంతంలో రాసినది. కానీ అది నేటి అభివృద్ధి వెనక దాగిన నీడలను అర్థం చేసుకొని మన ప్రాపంచిక దృక్పథాన్ని సరిచేసుకునేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ఈ వ్యాసం రాసే సమయానికి ఆయన సంబల్ పూర్ యూనివర్శిటీలో పనిచేస్తున్నారు. నాటి ఒరిస్సాలోను, ఇటు ఆంధ్రలోని ఆనకట్టల వలన జరిగిన అభివృద్ధి తీరుతెన్నులను అర్థం చేసుకోవడానికి నేడు ఆంధ్రలో నిర్మితమవుతున్న పోలవరంవంటి భారీ ప్రాజెక్టులు, అలాగే ఒరిస్సాలో నేడు నిర్మితమవుతున్న పోస్కో, వేదాంత పరిశ్రమల అభివృద్ధి నమూనాల వెనక దాగివున్న వెలుగునీడల పర్యవసానాన్ని గ్రహించడానికి ఈ వ్యాసం ఎంతో దోహదం చేస్తుందన్నది నిర్వివాదాంశం అనొచ్చు. ఇటీవల తెలుగు వారిలో వేళ్ళపై లెక్కపెట్టగలిగిన అతి కొద్ది మంది పీడిత జన పక్షపాత మేధావులను వరుసగా కోల్పోవడం తీరని లోటు.


అబివృద్ధి - వెలుగు నీడలు - ప్రొ.ఆర్.ఎస్.రావు

మా యూనివర్శిటీ పక్కనే హీరాకుడ్ డాము వుంది. మహానది మీద కట్టిన ఈ ఆనకట్ట స్వాతంత్ర్యానంతర భారత దేశంలో మొట్టమొదటి బహుళార్థ సాధక ప్రాజెక్టు. కొన్ని వేల ఎకరాలకి నీటి సరఫరా నుండి అనేక ప్రాంతాలకు విద్యుత్ శక్తి సరఫరా దాకా వివిధ ప్రయోజనాలు నిర్వర్తించే ఈ ప్రాజెక్టు మన అభివృద్ధికి ఒక ప్రతీక. అయితే దీని చుట్టు పక్కల గ్రామాలకు ఇంకా కరెంటు రాలేదు. ఈ గ్రామాలలోని ఓ గ్రామంలో ఒక గిరిజనుణ్ణి ఈ ఆనకట్ట మీద అభిప్రాయం అడిగితే "దీపపు సమ్మె చుట్టు వెలుతురు ఉన్నా దాని క్రింద కొంత భాగం అది సృష్టించే నీడ కింద ఉండాల్సిందే కదా" అని ఎంతో తాత్వికంగా చెప్పాడు. అతని వ్యాఖ్య మన దేశంలో ’అభివృద్ధి’ పై ఒక ఎక్స్-రే రిపోర్టులా అనిపించింది..


’అభివృద్ధి’ అనే భావన ఏకకాలంలో క్లిష్టమయినదీ, సులభంగా అర్థమయ్యేదీ కూడా. సులభంగా ఎందుకు అర్థమవుతుందంటే ’అభివృద్ధి’ కున్న స్పష్టమైన దర్శనీయత (visibility) వల్ల క్లిష్టమయింది. ఎందుకంటే దాని వెలుతురుని అనుభవించి అర్థం చేసుకోగలిగినంత సులభంగా, అది సృష్టించే నీడల్ని అర్థం చేసుకోలేం కాబట్టి. ఆ వెలుగులో నీడల గురించే ఈ వ్యాసం.

మన దైనందిన జీవితానుభవాలను, మన మెరిగిన ప్రాజెక్టుకు, ఫ్యాక్టరీలు, సంస్థలు (institutions), విద్యాలయాలు మొ.న వాటి కార్యకలాపాలను, మన చుట్టూ జరిగే సంఘటనల నేపథ్యాన్ని -వీటన్నిటి సారాన్ని పోగుచేసి పరిశీలిస్తే ఈ ’అభివృద్ధి’ విశ్వరూపం, దాని ఫలితాలు చాలా వరకు అవగాహన అవుతాయి. ఇవన్నీ మనకు ’అభివృద్ధి’ లోని వేర్వేరు అంశాల్ని విడమర్చి చెప్తాయి. ఈ వివిధాంశాల మధ్య వైరుద్యాలు నీడల్ని వెలుగులోకి తీసుకొచ్చి మన మధ్య ’అభివృద్ధి’ అనే భావనని చర్చనీయాంశం చేస్తున్నాయి. హీరాకుడ్ చుట్టుపక్కల కరెంటు లేని గ్రామాలలొ గిరిజనుల జీవితం కానివ్వండి, కారంచేడు ఘర్షణ కానివ్వండి, విజయవాడ అల్లర్లు కానివ్వండి - అన్నీ ఈ ’అభివృద్ధి’ వెలుగునీడల్ని విశదరిచేవే. మన రాష్ట్రంలో కాటన్ దొర చలువవల్ల వందేళ్ళకు పైగానే చరిత్రను నిర్మించుకున్న ఈ ’అభివృద్ధి’ పర్యవసానాలు ఇప్పుడు ఒక రూపధారణ చేసుకుంటున్నాయి.

ఆనకట్ట కానివ్వండి, ఫ్యాక్టరీ కానివ్వండి, ఆ మాటకొస్తే యూనివర్శిటీ కానివ్వండి, సాధారణంగా చూస్తే ఓ పెద్ద శక్తిగా కనిపిస్తుంది. దాని వెనుక తప్పనిసరిగా ఎంతో జ్నానం దాగి వుంటుంది. ఈ ఘనీభవించిన మానవ
జ్ఞానం మానవుడి ఉత్పత్తి శక్తుల పెరుగుదలకి ఒక సూచిక.

హీరాకుడ్ ప్రాజెక్టుకాని, కాటన్ దొర కట్టిన ఆనకట్టలు కాని తీసుకుందాం. ఒకానొక నదీజలాల ప్రవాహాన్ని ఆపి, లేదా కుదించి, ఆ నీటిని ఇతర అవసరాలకు మళ్ళించేందుకు కావలసిన పరిజ్ఞానం సంపాదించి, సిమెంటు, ఇనుము, ఇతర పదార్థాలను సృష్టించి, వాటిని అవసరమైన స్థలానికి అవసరమైనంత మేరకు మళ్ళించి, ఆ నీటి వేగాన్ని అడ్డుకోవడానికి అవసరమైనంత శక్తిగల ఓ అడ్డుగోడను లేపటం వెనక ఎంతో శాస్త్ర సాంకేతిక
పరిజ్ఞానం వుంది. ప్రకృతి చలన సూత్రాలను ఉపయోగించి ఒక విశాల మానవ హస్తం అనంత జల ప్రవాహాన్ని అడ్డుకుని మానవ ప్రయోజనాలకు మళ్ళించడం మనల్ని అప్రతిభుల్ని చేస్తుంది. అందుకే ఎంతో మానవ జ్ఞానం ప్రోగుపడిన ఫలితంగా పెరిగిన మానవుడి ఉత్పత్తి శక్తులకు ఈ ఆనకట్ట ఒక సూచిక అవుతుంది.

ఇలా ఏ అభివృద్ధి పథకం తీసుకున్న దానివెనుక అనంతమైన
జ్ఞానం కనిపిస్తుంది. ఈ జ్ఞానం మానవ మేధస్సు నుండి క్రమానుగతంగా పెరుగుతుంటుంది. ఈ పెరుగుదల ఫలితంగా ఉత్పత్తి శక్తులు వికసిస్తాయి. వాటి వికాసపు ఫలితంగా ’అభివృద్ధి’ జరుగుతుంది. ఈ ’అభివృద్ధి’ కారణంగా ’అభివృద్ధి’ పథకాలు వివిధ రూపాలలో ముందుకు వచ్చాయి. మున్ముందు వస్తుంటాయి. ఆనకట్టలు, గనులు, కార్ఖానాలు, ఎత్తైన మేడలు, ఆ మేడల మీద ఎగురుతు వెళ్ళిపోయే విమానాలు, కంప్యూటర్లు, ఆ కంప్యూటర్లు చేయగల ఎన్నొ విచిత్రమైన పనులు - ఈ ’అభివృద్ధి’కి గల అనేకానేక రూపాలు (forms) మనకు సుపరిచితాలే. ఐతే వాటి సారం (essence) ఏమిటి?

ఏ ఉత్పత్తి శక్తుల పెరుగుదలైనా దాని వెనక నిబిఢమైన మానవ శ్రమ విజ్ఞానాల ఫలితమే. ఆ విజ్ఞానం ఒకానొక ప్రాపంచిక దృక్పధం కారణంగా పెంపొందుతుంది. అంటే అంతిమ పరిశీలనలో ఏ రూపంలో కనిపించే ’అభివృద్ధి’ పథకమైనా ఒకానొక ప్రాపంచిక దృక్పథం నుండి జనిస్తుందని తేల్చి చెప్పవచ్చు, ఆ రకంగా ఆయా ’అభివృద్ధి’ పథకాల సారం వాటికి కారణమైన ప్రాపంచిక దృక్పధమే. అందుచేత ఏదైనా పథకాన్ని తీసుకొని ఇది ప్రాపంచిక దృక్పధం "అభివృద్ధి’ అవునా కాదా అన్నది తేల్చుకోవాలన్నప్పుడు ఆ ’అభివృద్ధి’ పధకం ప్రాపంచిక దృక్పధంలో ఏమైనా మార్పులు తీసుకు వచ్చిందా లేదా అప్పటికే బలంగా వున్న వేరొక ప్రాపంచిక దృక్పధంలో తానే ఒక భాగమైపోతుందా అనే అంశాన్ని జాగ్రత్తగా గమనించాలి.


ఒక్కమాటలో చెప్పాలంటే ఒకానొక దేశ కాల పరిస్థితులలో మనిషికి ప్రకృతికి మధ్య గల సంబంధాన్ని లేక వైరుధ్యాన్ని గురించి తెలియజేసే ఒకానొక దృక్పధాన్ని ఒక నిర్థిష్టమైన ప్రాపంచిక దృక్పథంగా చెప్పుకోవచ్చు. మనిషికి ప్రకృతికి మధ్య వుండే సంబంధంలో ఐక్యత ప్రధానంగా ఉందా లేక ఘర్షణ ఎక్కువగా వుందా అనే అంశం అతడి ప్రాపంచిక దృక్పధాన్ని నిర్వచిస్తుంది. మనిషికి ప్రకృతితో ఐక్యత అనేది ఘర్షణ కంటే ప్రధానమైనదిగా వుంటే అప్పుడు అతని జ్నానం పెరగడానికి తద్వారా అతడి ఉత్పత్తి శక్తులు పెరుగుదలకి దాని మూలంగా సాధ్యమయ్యే అభివృద్ధికి అవకాశముండదు. ఇది ఫ్యూడల్ ప్రాపంచిక దృక్పధం. అంటే ప్రకృతి అందించే వనరులని యదాతథంగా వాడుకోవడం తప్ప. దాని చలన సూత్రాలని పరిశీలించి వాటిలో దాగిన రహస్యాలను ప్రశ్నించి, అంతకు ముందు సేకరించిన జ్నానాన్ని మెరుగుపరచడం, ఈ ఫ్యూడల్ ప్రాపంచిక దృక్పధం లో వుండదు. ప్రకృతితో మమేకమవ్వడం లేదా సర్దుకుపోవడం దీని ప్రధాన లక్షణం. ఈ ఫ్యూడల్ ప్రాపంచిక దృక్పధంలో వుండే జ్ఞానమంతా ప్రకృతి అందించే కానుకగా, వున్నదున్నట్టుగా ప్రకృతి వనరులని వినియోగించుకోవడంగా వుంటుంది. అంతిమ పరిశీలనలో అది నిరంతర పరిణామానికి గురయ్యే పరిశోధనా స్రవంతిగా కాకా, ఎల్లప్పుడూ యదాతథంగా కొనసాగుతు ముందు తరాలకు పవిత్రంగా అందించబడే నమ్మకాల ప్రవాహంగా వుంటుంది. చివరికి జ్నానమనేది కొంత అనుభవం ప్రాతిపదికగా ఏర్పడిన ఓ తిరుగులేని విశ్వాశంగా మారిపోతుంది.


ఐతే నిజమైన "అభివృద్ధి ఉత్పత్తి శక్తుల పెరుగుదలకు దోహదపడుతుందని మనకు తెలుసు. ఆ ఉత్పత్తి శక్తుల పెరుగుదల వివిధ రంగాలలో మానవ
జ్ఞానం వికసించడం మూలంగా జరుగుతుందని తెలుసు. ఈ జ్ఞానవికాశం ప్రకృతి కరుణ కోసం ఎదురుచూస్తూ కూచోదు. అది ప్రకృతి నియమాలను శోధించి, బేధించి అనేక అడ్డంకులను అధిగమించే నిరంతర సంఘర్శణల ఫలితం. ఇలా నిర్విరామంగా ప్రకితితో మనిషి సాగించిన ఘర్షణనుండే అనేక ఆవిష్కరణలు జనించాయి. ఊహకందని "అభివృద్ధి’ సాధ్యపడింది. ప్రకృతితో ఐక్యత కంటే ఘర్షణ ప్రధానమైన ఒకానొక ప్రాపంచిక దృక్పథం వున్నప్పుడే ఇలాంటి జ్నాన వికాసం సాధ్యమవుతుంది. దీనిని ప్రస్తుతానికి పెట్టుబడిదారీ ప్రాపంచిక దృక్పధమని చెప్పవచ్చును.

ఆనకట్టల విషయాన్నే తీసుకుందాం. సింధులోయ నాగరికతా కాలంనుండే మనిషి కాలువలు త్రవ్వడం, నీటిపారుదల సదుపాయాలు మెరుగుపరుచుకోవడంలాంటివి చేస్తూ వచ్చాడు. అయితే అది ప్రకృతి అనుగ్రహించిన మేరకు తప్ప, ప్రకృతిలో నిబిడమై వున్న సూత్రాల ఆధారంగా దానితో ఘర్షణపడి, మరింత మెరుగైన సౌకర్యాలను సృష్టించుకోవడం కాని, అది ఫ్యూడల్ ప్రాపంచిక దృక్పథంలో సాధ్యంకాదు. అలా జరగాలంటే ప్రకృతితో ఘర్షణలో భాగంగా, ప్రకృతి నియమాలను గ్రహించి ఆర్జించిన జ్నానంతోనే సాధ్యపడుతుంది. కోస్తా ఆంధ్రలో విజయవాడ లోని "అభివృద్ధి’ కూడా ఈ రకం
జ్ఞానం వల్లే సాధ్యమైంది. కాటన్ దొర కట్టిన ఆనకట్టలు, తద్వారా వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, ఆ రంగం నుండి అదనపు విలువ ఇతర రంగాలలోకి రావడం అనే క్రమం వల్లే ఈ "అభివృద్ధి’ సాధ్యమయింది. మన దేశంలో ఈ అభివృద్ధి ఏ ప్రాపంచిక దృక్పధాన్ని జనరేట్ చేస్తుందనేదే మనముందున్న ఏకైక ప్రశ్న. వంద సంవత్సరాల "అభివృద్ధి మిగిల్చిన శేష ప్రశ్న.

ఈ ప్రశ్నకి సమాధానం మన రోజువారి జీవితంలో అంతర్లీనంగా మెసులుతూనే వుంటుంది. ఉదాహరణకి ఇంట్లో ఎవడైనా కుర్రవాడు టేబుల్ మీద వున్న పెన్నును తీసుకున్నాడనుకోండి. వాడిలో అనేక ప్రశ్నలుంటాయి. దానిని వాడు రకరకాలుగా పరీక్షిస్తాడు. అటూ, ఇటూ తిప్పుతాడు. దాని భాగాలను విడదీస్తాడు, వాటిని మళ్ళీ కలుపుతాడు. ఏదో ఒక కొత్త విషయం తెలుసుకున్న విచిత్రానుభవానికి గురి అవుతాడు. వాడిలో ఈ కుతూహలం ప్రకృతితో ఘర్షణ లాంటిది. కానీ ఈ లోగా పెద్దవాళ్ళెవరో వస్తారు. ఈ పెన్ను ఎందుకు ముట్టుకున్నావని కసిరి దానిని జాగ్రత్తగా వాడుకోవాలని హెచ్చరిస్తారు. వాళ్ళ హెచ్చరిక ప్రకృతితో ఐక్యతను ప్రతిపాదిస్తుంది. పెన్ను గురించి ఎన్నో ప్రశ్నలున్న పిల్లవాడు "పెన్నుని విప్పడం తప్పు దానిని పదిలంగా భద్రపరుచుకోవాలి " అనే భావజాలాన్ని ఒక నమ్మకంగా స్వీకరిస్తాడు. ప్రశ్నించే మానవుడి ప్రాపంచిక దృక్పధం వలన,
జ్ఞానం వలన తయారైన పెన్ను, సాంప్రదాయంగా వస్తున్న నమ్మకాలని మరింత బలోపేతం చేసే సాధనమవుతుంది.

హిరాకుడ్ ఆనకట్ట కట్టాక నిజంగా ఉత్పత్తి శక్తులు పెరిగి, అది ఆ రకం ఆనకట్టల్ని విదేశీ సహాయం లేకుండా కట్టగలిగే జ్నానాన్ని మనకిచ్చి అభివృద్ధి కారకమై ప్రాపంచిక దృక్పధంలో మార్పులు తీసుకుని వచ్చి ఉంటే ఈ ఆనకట్టల వలన, "అభివృద్ధి’ వలన పురోగమనం సాధ్యమవుతుందనే స్పృహ వచ్చి ఉండేది. అయితే ఈ ఆనకట్ట ప్రక్కనే కొత్తగా కడుతున్న రేంగాలి ఆనకట్టాకి వ్యతిరేకంగానూ, ఇదే జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన ఓ పెద్ద అల్యూమినియం ఫ్యాక్టరీ (BALCO) కి వ్యతిరేకంగానూ ప్రజలు పోరాడుతున్నారు. ఈ ప్రజాందోళన ఏమిటి సూచిస్తున్నట్లు? అలాగే వంద సంవత్సరాల కోస్తా ప్రాంత అభివృద్ధి క్రమం ప్రాపంచిక దృక్పథంలో మార్పు తెచ్చి వుంటే విజయవాడలో ఒక హత్య, అంత పెద్ద ఎత్తున కుల తగాదాలకు దారితీసి వుండేది కాదు. ఈ భీభత్సకాండ, ముదిరిపోతున్న కులతత్వం విధ్వంసక ప్రవృత్తి, విశృంఖలంగా పెరుగుతున్న రాజ్య హింస దేనిని సూచిస్తున్నట్లు?


ప్రకృతితో మానవుడు జరిపే నిరంతర సంఘర్షణ ఫలితంగా వచ్చిన జ్నానం ఆ జ్నాన వికాస ఫలితంగా మనకు సాధ్యమయిన అభివృద్ధి, ఆ సంఘర్షణను నిరాకరించే (Tegate) ప్రాపంచిక దృక్పథానికి మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. మరో భాషలో చెప్పాలంటే మన దేశంలో ఎంతగా అభివృద్ధి జరిగితే అంతగా ఫ్యూడల్ ప్రాపంచిక దృక్పథం బలపడుతూ వస్తోంది. ఎంత పెద్ద వెలుగు వెనక అంత పెద్ద నీడలా, హిరాకుడ్ లో ఆనకట్టనీ, బీసెంటు రోడ్డులో భవనాన్ని, అభివృద్ధి భౌతిక రూపాలను "అభివృద్ధి’గా మనం పరిగణిస్తూ వస్తున్నాం. కాని అభివృద్ధి అంటే ప్రాపంచిక దృక్పథంలో మార్పు అని మనం గుర్తించగలిగిన నాడు "అభివృద్ధి’ మన జీవితాల్లో సృష్టిస్తున్న విధ్వంసకాండని, మన మనస్సులో సృష్టిస్తున్న గందరగోళాన్ని అర్థం చేసుకోగలిగిన వాళ్ళమవుతాం. అప్పుడు బహుళ హిరాకుడ్ ప్రక్కన కరెంటు లేని గ్రామంలో గిరిజనుడు చెప్పిన దీపపు సెమ్మ క్రింద చీకట్లలో పోరాడుతున్న ప్రజలను నడిపించే ప్రాపంచిక దృక్పథమే "అభివృద్ధి’గా ఆవిష్కరించుకుంటాం.


(ఈ వ్యాసం విశాఖపట్నం సాగరగ్రంథమాల వారి ప్రచురణ అయిన మనలో మనం (1990 సెప్టెంబరు ప్రచురణ) వ్యాస సంకలనం నుండి గ్రహించడమైనది)

జ్ఞానం

21, జూన్ 2011, మంగళవారం

దీపధారి..



నింగికెగసిన ఉద్యమ తార
నిక్కచ్చైన ధిక్కార స్వరం
దగాపడ్డ తెలంగాణా ఆలపించిన విముక్తి గేయం

నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో వెలిగిన దీపధారి
జయహో తెలంగాణా నినాదమైన జయశంకర్ మాస్టారూ
మీకివే మా జోహార్లు...

17, జూన్ 2011, శుక్రవారం

ప్రొ.ఆర్.ఎస్.రావు గారికి జోహార్లు



ప్రముఖ మార్క్సిస్టు అర్థ శాస్త్రవేత్త, గణాంక శాస్త్రవేత్త ప్రొ.R.S.రావు గారు ఇక లేరు.. ఆయన అరుదైన మార్క్సిస్ట్ మేధావులలో ఒకరు, పీడిత ప్రజల పక్షపాతి, మార్క్సిస్ట్ ఉపాధ్యాయుడు ఈ మధ్యాహ్నం ఢిల్లీలో 1.40 PM కు చనిపోయారు.. ఆయన గోథలే ఇన్ స్టిటూట్, పూణే, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిటూట్, కోల్ కతలలో పనిచేసి సంబల్ పూర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసారు. సామాజికార్థిక రాజకీయ పరిశీలకులుగా, ఉత్పత్తి శక్తుల నక్సల్బరీ పోరాట మార్గాలను విశ్లేషిస్తూ పుస్తకాలు రాసారు. ఉపన్యాసాలిచ్చారు. అభివృద్ధి-వెలుగు నీడలు (1990), Towards understanding Semi colonial Society (1995), కొత్త చూపు (2011) వెలువడ్డాయి..

ప్రొ.సోమేశ్వరరావుగా ఇటీవల ఒరిస్సా మల్కన్ గిరి జిల్లా కలెక్టర్ కిడ్నాప్ సమయంలో మధ్యవర్తిగా అందరికీ సుపరిచుతులు..

ఆయన లేని లోటు పూడ్చుకోలేనిది.. వరుసగా ఆ తరం మేధావి వర్గాన్ని కోల్పోతుండడం బాధాకరం..
ఆయనకు జోహార్లర్పిద్దాం...
(పోటోలో ఈ చివరి వ్యక్తి)

10, జూన్ 2011, శుక్రవారం

ప్రొ.దేవేందర్ పాల్ సింగ్ భుల్లార్ ను విడుదల చేయాలి



టాడా చట్టం ఉక్కుపిడికిలిలో మరో ప్రొఫెసర్..

పంజాబ్ మారణ హోమంలో సమిధలైపోయిన ఎంతో మంది సిక్కు యువకులలాగే ప్రొ.భుల్లార్ కూడా తప్పుడు కేసులో ఇరికించబడి పోలీసు అధికారి ముందు ఇచ్చిన వాంగ్మూలం ద్వారా ఉరిశిక్షకు గురై నేడు తను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి తిరస్కారానికి గురై జైల్లో పదహారు సం.లుగా మగ్గుతూ శారీరకంగా, మానసికంగా తీవ్ర అనారోగ్యం పాలైనారు. ఇప్పటికే యావజ్జీవ కారాగార శిక్షాకాలాన్ని పూర్తి చేసిన ఆయనను వెంటనే విడుదల చేయాలని ప్రజాస్వామిక వాదులంతా డిమాండ్ చేయాల్సిన అవసరముంది...

పూర్తి వివరాలకు ఈ లింక్ చూడండి..

6, జూన్ 2011, సోమవారం

ఇప్పవనాల గాలి సూరీడు చేరింది..

మనందరికీ అజ్నాత సూరీడుగా పరిచయమైన నెమలూరి భాస్కరరావు గారు మొన్న జూన్ 1 విజయవాడ క్రిష్ణ లంకలో తన కుమారుని ఇంట గుండెపోటు కారణంగా మరణించారు. ఆయన విప్లవోద్యమంలో పనిచేసిన కాలంలో మల్లిక్ గా రాష్ట్ర నాయకుడిగా అందరికీ పరిచయం. ఉద్యమంలో కొనసాగుతున్నప్పుడు వెన్నెల పాట, ఇప్పవనాల గాలి కవితా సంకలనాలు, పాటలు, చైనా కథలు అనువాదాలు వెలువరించారు. ఉద్యమం వీడి వచ్చాక కథలు రాసారు. ఇండియాటుడే, ఆంధ్రజ్యోతి మొ. పత్రికలలో వచ్చాయి. కథలలో జీవన సంఘర్షణను కొత్తకోణంలో చూపే ప్రయత్నం చేసారు.
ఉద్యమంలో వున్న కాలంలో చివర్లో తన ఒంటెత్తు పోకడ, సైద్ధాంతిక విభేదాలు విమర్శలకు గురయ్యాయి.

అయినా ఉద్యమ జీవితానికి, బయట తను బతికినన్నాళ్ళు అదే నిబద్ధతతో జీవించి చూపిన ఆచరణకు జోహార్లర్పిస్తూ...
ఆయన కవితా పాదాలు కొన్నిః
ఉద్యమం ఇప్పుడింకెంత మాత్రం
నెలబాలుడు కాదు-
అది మైదానాన్ని - అడవినీ
ఆక్రమించి -
ఆకాశం కోసం
రెండో పాదం
దాచి వుంచిన
వామన పాదం అది!
2.
భయం నీటి పాములాంటిది
కాటేస్తే ప్రతీక్షణం చస్తాం!


బరువు తగ్గిస్తుందేడుపు కానీ-

బాధ్యత మిగిలే వుంటుంది!


ఉత్సాహం ఉప్పెనలా ఉండరాదు

ప్రవహించే ఏర్లాగుండాలి!
(ఇప్పవనాల గాలి నుంచి)