28, మే 2013, మంగళవారం

తప్పనిసరైన ప్రతి హింస..

మొన్న చత్తీస్ ఘడ్ లో మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ అధినాయకత్వం ఈ దేశానికి తామే రక్షకులుగా బీరాలుపోతూ యువరాజునుండి గల్లీ లీడర్ల వరకు ప్రకటనలు జారీ చేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యం గురించి మాటాడే అర్హత వీరికుందా? 

అత్యంత కౄరంగా ఆదివాసీలపై బస్తర్ ప్రాంతంలో దాడులు కొనసాగించి తమ రాచరికానికి, భూస్వామ్య హక్కులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న అత్యంత వెనుకబడిన ఆదివాసీ తెగలపై ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రైవేటు సైన్యంగా సల్వాజుడుం పేరుతో గూండాలను కౄరులను తయారు చేసి ఆదివాసీ గూడేలను ఖాళీ చేయించి కాన్సంట్రేషన్ కాంపులలో వేసి వేయికి పైగా గ్రామాలను ఖాళీ చేసి మూడు లక్షలమందికి పైగా ఆదివాసీలను నిర్వాసితులను చేసి ఆదివాసీ మహిళలను దారుణంగా అత్యాచారం చేయించి, వృద్ధులను పిల్లలను వందలాదిమందిని హత్య చేయించి, తాము స్వయంగా నిర్మించుకున్న పాఠశాలలను వైద్యశాలలను కాల్పించి ఇళ్ళను తగులబెట్టించిన మహేంద్ర కర్మను అటు కేంద్రంలోని కాంగ్రెస్ , రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వాలు ప్రోత్సహించి సాయుధ మూకలతో భీభత్సాన్ని సృష్టిస్తే హక్కుల సంఘాలు, ప్రజాస్వామ్య మేధావి వర్గాలు అనేక విన్నపాలు, పోరాటాలు, చివరికి సుప్రీం కోర్టును ఆశ్రయించి ప్రైవేటు సైన్యం చేస్తున్న దారుణాలను న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్ళగా వారి ఆదేశాలకు తాత్సారం చేస్తూ చివరికి ఈ గూండా సైన్యాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి తిరిగి వారినందరిని SPO లుగా లైసెన్సులిచ్చింది ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజలకు వ్యతిరేకంగ ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయించిన మహేంద్రకర్మను చివరికి ఆదివాసీ ప్రజాసైన్యం హతమార్చింది. ఇలా ప్రజా పోరాటాలకు వ్యతిరేకంగా ప్రైవేటు లంపెన్ సైన్యాన్ని తయారు చేసి ఉసిగొల్పడం ఇజ్రాయిల్ నుండి నేర్చుకుందీ ప్రజాస్వామ్య ప్రభుత్వం. 

ఉన్నత న్యాయస్థానం సొంత రిపబ్లిక్ లోని ప్రజలపైకి సైన్యాన్ని తరలించడాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యానించినా ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో పారామిలటరీ బలగాలను కోబ్రాలుగా తయారు చేసి జనంపైకి లక్షల సైన్యాన్ని తరలిస్తూ అత్యంత విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు, MNC లకు అప్పనంగా దొబ్బబెట్టి తాము విలాసవంతమైన జీవితాలను మరో ఏడు తరాలుదాకా జీవించేందుకు లక్షల కోట్లరూపాయలు దాచిపెట్టుకునే  రాజకీయ రాబందులను కాపాడే ప్రభుత్వ నాయకత్వంది ప్రజాస్వామ్యమా? వీళ్ళ అల్లుళ్ళు, పిల్లలు, బందుగణమంతా అవినీతి అరాచకాలకు పాల్పడుతూంటే వారిని వెనకేసుకు వస్తూ నిస్సిగ్గుగా పాలన చేసే ఈ నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాటాడే అర్హతుందా??

మధ్య భారతదేశాన్ని దోచుకుపోవడమే ప్రధాన ఎజెండాగా పరిపాలన సాగిస్తూ తమ సైన్యాన్ని అత్యంత కౄరంగా వాడుకుంటూ తమ ఉనికి ప్రశ్నార్థకమౌతున్నందుకు పోరుబాటకు సమాయత్తమయ్యే ఆదివాసీ ప్రజలను ఊచ కోత కోస్తున్నప్పుడు వీళ్ళకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?? 

మధ్యతరగతి బుద్ధిజీవులకు హింసకు ప్రతిహింసకు తేడా తెలీకుండా చేస్తూ కార్పొరేట్ అగ్రకుల మీడియా వార్తా ప్రసారాలతో దోపిడీ పాలకవర్గాలకు వత్తాసు పలుకుతోంది. వీళ్ళకూ ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుంది..

ప్రజా పోరాటాలు వర్థిల్లాలి...