5, జులై 2013, శుక్రవారం

ప్రసాదం గారూ...

ప్రసాదం గారూ...

మీరలా చేతులూపుతూ మాటాడుతూ
ఒక్కొక్కరినీ వేయి మందిని చేస్తూ
ఒక్కో అడుగూ వేల అడుగులుగా
రూపాంతరం చెందుతూ
ఒక్కో నినాదమూ మీ గొంతు నుండి తూటాగా మారి
వాడి గుండెల్లో దూసుకుపోతూంటే
వాడికొక్కటే దడ
వాడి పీఠానికున్నా నాలుగు కోళ్ళూ ఊడి
అధికార బెలూన్ పగిలి పోతుందేమోనని...

ప్రసాదం గారూ అని అంతా ఆత్మీయతతో కూడిన గౌరవంగా పిలుస్తూ
మీతో కలిసి నడిచి మీ పిడికిలిలో పిడికిలౌతున్నారని వాడికొకటే బెంగ
అందుకే వాడు మళ్ళీ అపరిచితంగా వాడి ముఖాన్ని జనానికి చూపలేక
మీ మెడపై కత్తై గుండెల్లో బుల్లెట్లు దించాడు...

అయినా వాడు చంపగలిగింది ప్రసాదాన్నే
కానీ ప్రసాదం గారి ఆశయాన్ని కాదు కదా..

నాకు దుఃఖంతో పాటూ నవ్వు వస్తోంది
వాడి పిరికితనాన్ని చూసి...

కోపమూ వస్తోంది
వాడి కౄరత్వాన్ని చూసి...

మరో మారు ఋజువయ్యింది
వాడు ఉత్తి కాగితపు పులేనని...

ప్రసాదం గారూ మీరు అమరులు
ప్రజలు అజేయులు...

(జోహార్ కా. గంటి ప్రసాదం)