15, జూన్ 2012, శుక్రవారం
భూమి - దళితులు-ఆత్మగౌరవం..
భూమి - దళితులు-ఆత్మగౌరవం
శ్రీకాకుళం మళ్ళీ నెత్తుటి గుడ్డు అయ్యింది. కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, వేంపెంట సంఘటనల తరువాత నేడు లక్ష్మిపేటలో దళితులపై జరిగిన అమానుష దాడి నాలుగు నిండు ప్రాణాలును బలిగొంటూ మనముందు అనేక ప్రశ్నలను వుంచింది. ఈ హత్యల వెనక కులం, రాజకీయ, ఆర్థిక కారణాలతో పాటుగా ప్రధానంగా ఈ దేశ అస్తిత్వ సమస్య అయిన భూమి వుంది.
సెంటు భూమిలేని దళితుల అస్తిత్వ పోరాటానికి సాక్ష్యం ఇది.
ఈ ప్రాంతంలోని సువర్ణముఖి, వేగావతి నదీ సంగమ ప్రాంతం మడ్డువలస దగ్గర నిర్మించిన ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల పంట భూములు, గ్రామాలు నష్టపోయి అప్పటి అర కొర ప్యాకేజీలతో పొట్ట చేత పట్టుకొని చెట్టుకొకరు పుట్టకొకరైన వారే ఎక్కువగా వున్న ఈ ప్రాంతంలో ప్రభుత్వం యిచ్చిన నిర్వాసిత స్థలంలో ఇల్లు నిర్మించుకొని వున్న వాళ్ళలో కొట్టిశ, లక్ష్మిపేట గ్రామాల ప్రజలు వున్నారు. ఈ రెండు గ్రామాలు వంగర మండల పరిథిలో వున్నాయి. ఇందులో లక్ష్మిపేట గ్రామంలో 60 ఇల్లు దళితులలోని మాల వర్గానికి చెందినవి. మిగిలిన 80 ఇల్లు బి.సి. కాపు కులానికి చెందినవి. వీరంతా తమ పాత గ్రామం విడిచిపెట్టి వచ్చి ఇక్కడ కొత్తగా చేరినవారే. ఈ గ్రామం చుట్టు పరచుకొని వున్న 240ఎకరాల వ్యవసాయ భూమి బి.సి.వాళ్ళది. దీనికి ప్రభుత్వం కాంపన్సేషన్ చెల్లించి వేసింది. అయినా ఇది ముంపు పరిథి దాటి వుండడంతో ఇందులో 180 ఎకరాలు బి.సి.లు 60 ఎకరాలు మాలకులస్తులు సాగు చేసుకుంటూ వస్తున్నారు. ఈ భూమి తమదే కాబట్టి ఆ అరవై ఎకరాలు కూడా తమకే చెందాలని కాపువర్గం దళితులపై వత్తిడి తేవడంతో వారంతా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. ఈ మొత్తం భూమికి గవర్నమెంటు నష్టపరిహారం చెల్లించివున్నందున అది ప్రభుత్వ స్వాధీనంలో వున్నట్టే. దీనిపై ఎవరికీ హక్కులుండవు కాబట్టి దీనిని సరిఅయిన రీతిలో ఇరు వర్గాలను కూచోబెట్టి పంపిణీ చేసి వుంటే అసలు ఈరోజు ఇంత దారుణం జరిగి వుండేది కాదు.
న్యాయస్థానాన్ని ఇరువర్గాలు ఆశ్రయించడంతో ఈ మొత్తం భూమిపై స్టే ఆర్డరిస్తూ ఎవరూ సాగు చేయకుండా ఆదేశాలిచ్చింది. ఇది బి.సి.లకు పుండు మీద కారంలా మారింది. గతంలో తమ సాగులో వున్న భూమిపై హక్కు తాము దళితులు అడగడం కారణంగా కోల్పోయామని వారు భావించడం, అందుకు బి.సి వర్గానికి చెందిన మాజీ ఎం.పి.పి. బొత్స వాసుదేవ నాయుడు తమ అధికార పార్టీ అండతో ప్రభుత్వాధికారుల అవినీతి అలసత్వాలను సొమ్ము చేసుకొంటూ సమస్యను తెగనీయకుండా చేస్తూ ఇరువర్గాలను రెచ్చగొట్టి తన రాజకీయ పలుకుబడిని పెంచుకునే ఎత్తుగడలో భాగంగా సమస్యను జఠిలం చేయడంలో ప్రధాన పాత్ర వహించాడు. దీనికి వత్తాసుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, కోండ్రు మురళిలు కొమ్ము కాయడంతో ఎన్నాళ్ళుగానో రగులుతున్న తమ కక్షను, పగను తీర్చుకునేందుకు ఉప ఎన్నికల సందర్భాన్ని (12-6-12) వాడుకున్నారు బి.సి.లు. గ్రామంలో గత ఆర్నెళ్ళుగా కొనసాగుతున్న పోలీసు పికెట్లోని వారు ఎన్నికల డ్యూటీకి వెళ్ళిన వేళ దళితులంతా ఉదయం చద్దన్నం తినడానికి ఇంట్లో వున్న సమయంలో కత్తులు, బాంబులు, రాళ్ళతో కాపు వర్గానికి చెందిన ఆడా మగా పిల్లలతో సహా వారిపై దాడి చేసి ఇంట్లోంచి ముంగిటకు లాక్కొని వచ్చి వారిని అతి దారుణంగా కొట్టి చంపారు. వారి వృషణాలపై రాళ్ళతో కొట్టి చంపడం ఇక్కడ వారి పట్ల వున్న కసి పగను తెలియజేస్తోంది. ఈ దాడిలో దళితులైన బూరాడ సుందరరావు, చిట్టి అప్పడు, తండ్రీ కొడుకులైన నెవర్తి వెంకటి, నెవర్తి సంగమేసులు చనిపోయారు.
రాయలసీమ, పల్నాడు ప్రాంతంలోని బాంబుల సంస్కృతిని ఇక్కడ కూడా ప్రవేశ పెట్టిన ఘనత మంత్రి బొత్సకు దక్కిందని అంతా అంటున్నారు. ఇంత దారుణంగా దళితులపై దాడులు జరిగి హత్యచేయబడి, 20 మందికి పైగా గాయాలపాలై అందులో మరి కొంతమంది చావు బతుకుల మధ్య కొట్టుకుంటుంటే కనీసం ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించలేదు. అలాగే కంటి తుడుపు చర్యగా ముఖ్యమంత్రి ప్రకటించిన నష్టపరిహారం పై కూడా సరైన ఆదేశాలు రాకపోవడం దళితులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీంతో రాష్ట్ర ఎం.ఆర్.పి.ఎస్.అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మరికొంత మంది దళిత నాయకులు, రాజకీయ పార్టీల వారు చనిపోయిన మృతదేహాలను ఖననం చేయకుండా మూడురోజులుగా పోరాటం చేయడంతో కదలిన అధికార యంత్రాంగం ఆ భూమిలో దళితులకు ఎకరా చొప్పున ఇవ్వడానికి అలాగే దాడికి పాల్పడిన వారిపై చర్యలకు హామీలివ్వడంతో ఈరోజు (14-6-12) సాయంత్రం ఖననం చేసారు.
ఈ దళిత హత్యాకాండ, దాడి సంఘటనకు ప్రధానంగా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం బాధ్యత వహించాలి. అలాగే స్థానిక రాజకీయ నాయకులు తమ అగ్రకుల అధికార మదంతో దళితులను భయభ్రాంతులను చేసి వారిని ఆ ఊరినుండి తరిమి కొట్టడం ద్వారా మొత్తం ప్రభుత్వాధీనంలోకి పోయిన భూమిపై తామే హక్కును కైవసం చేసుకోవాలన్న పక్కా ప్రణాళిక వుంది. ఈ దేశంలోని కులం, వర్గం యొక్క స్వభావానికి మరో తార్కాణం లక్ష్మిపేట దళితులపై జరిగిన దాడి. దీని యొక్క సామాజిక, రాజకీయార్థిక మూలాలను అర్థం చేసుకోవాల్సి వుంది. బలహీన వర్గాలకు కులమొక్కటే ఆత్మగౌరవ సమస్యగా ఉద్యమాలు చేయడం కాకుండా వారికి ఆర్థిక పరమైన ఆసరా, హక్కును కల్పించే భూమి ప్రధాన సమస్యగా ముందుకు తీసుకు రావాల్సిన అవసరాన్ని లక్ష్మిపేట ఊచకోత తెలియజేస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
లక్ష్మీ పేట దాడి గురించి వివరం గా చెప్పినందుకు కృతఙతలు.
రిప్లయితొలగించండిస్థలం గురించి రెండు వర్గాల మధ్య జరిగిన గొడవలను దళితులపైన ఏక పక్ష దాడి గా ప్రచారం జరగడం శోచనీయం.
@అక్బర్ గారూ ఆ రోజు జరిగింది గొడవ కాదు ఏకపక్షంగా జరిగిన దాడి. దళితులు సిద్ధంగా వుంటే ఇటువైపు కూడా నష్టం తీవ్రస్థాయిలో వుండేది. నేను అక్కడ పరిశీలించాకే రాసాను. దొరికిన వారిని దొరికినట్టే కొట్టి చంపే ప్రయత్నం జరిగింది. మాజీ సర్పంచ్ భర్త తృటిలో తప్పించుకున్నాడు. ఇది పక్కా ప్రణాళికతో రాజకీయ అండతో దళితులపై జరిగిన దాడి.
రిప్లయితొలగించండి"మిగిలిన 80 ఇల్లు బి.సి. కాపు కులానికి చెందినవి"
రిప్లయితొలగించండివర్మ గారూ, శ్రీకాకుళం జిల్లా కాపులు బీసీలు కాదనుకుంటా, please check.
Jai Gottimukkala గారు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని కాపులు తూర్పు కాపు బి.సి.డి గ్రూపులో వున్నారు..
తొలగించండిThanks, I did not know this.
తొలగించండిTurpu kapu caste has been categorised as BC in Srikakulam and Vizianagaram districts. But there are some rich people in turpu kapu caste in these two districts in areas like Naguru, Veeraghattam and Palakonda where canals from Thotapalli regulator flow.
రిప్లయితొలగించండి