కవిత-స్మరణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కవిత-స్మరణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, ఏప్రిల్ 2016, సోమవారం

కానుగపూల పరిమళం...


కొన్ని సాయంత్రాలు దేహం కోల్పోయిన
ఆత్మను మోసుకొస్తుంది


అడుగుల పరిధి కుంచించుకొని
ఒక మాత్ర అందని దూరంలో విసిరేయబడతావు


పహరా చుట్టూ కంచె పెరుగుతూ
నడకను నియంత్రిస్తుంది


నీలోని ప్రతి అణువును మలేరియా తిని
మెదడుకు పాకి కళ్ళను పైకెగదోస్తుంది


నిట్ట నిలువుగా వెన్నును విరిచి
కాళ్ళను చేతులను హరిస్తుంది


నీ నుదుటి మీద వెన్నెల ఓ
దు:ఖపు ముద్దుగా మెరిసి కుంగిపోతుంది


నువ్వంటావు చివరిగా ఈ ఝెండా 
భుజం మార్చుకుంటుందా అని


రవీ నువ్ నడిచినంత మేరా పరచుకున్న
ఈ కానుగ పూల పరిమళం అద్దుకుని


అటు చివర ఆ బాలుడు విల్లునలా
గురిచూస్తూ విసురుగా వస్తున్నాడు...


(మలేరియా కబళించిన  కామ్రేడ్ సి.సి.కమాండర్ రవి స్మృతిలో)

16, జనవరి 2016, శనివారం

ఆయనొక్కడే...


ఆయనలా 
తన దేహాన్నే నిరసన చిత్రంగా
ఈ దేశ కాన్వాసుపై వేసి
ఖళ్ళున ఇంత నెత్తురు ఉమ్మి పోయాడు


నువ్వూ నేను నిర్లజ్జగా ఇలా
బతుకును ఓ విరిగిన బండి చక్రంగా 
ఈడ్చుకుంటూ పోతున్నాం



తనలా విసురుగా కొన్ని పదాలు
నినాదాలుగా మార్చి అనాధ గొంతులో
స్వరాలుగా యిచ్చి పోయాడు



ఆయనొక్కడే 
అలిసెట్టి ప్రభాకరుడు
కోటి వెతల క్రోధాగ్ని జ్వాల అతడు
బతుకునొక నిప్పుల గుండంగా వెలిగించి చూపినవాడు



నొ
క్క
డే
నెత్తురు చిమ్మిన కుంచె చివరంటా జ్చలించిన వాడు


(అలిసెట్టి ప్రభాకర్ స్మృతిలో)
(12-01-2016)

27, ఫిబ్రవరి 2012, సోమవారం

యుద్ధనేత్రం కొల్విన్ కు అశృనీరాజనాలు..



తన కెమెరా కన్నుతో

యుద్ధ నేరస్తులను ప్రపంచ పీఠంపై నగ్నంగా నిలబెట్టింది..
శరణార్థ శిబిరాల గొంతు వినిపించి
నిరంకుశ పాలకుల దాష్ఠీకాన్ని బట్టబయలు చేసింది..

వార్తా సేకరణకు తన కన్ను బలిపెట్టి
కెమెరానే తన మూడో నేత్రంగా తెరిచి
యుద్ధభూమిలో సంచరిస్తూ
గాయాల గేయాలను వినిపించింది...

తన పని తాను చేసుకుపోతూ
జీవితాన్ని ఇంత నిర్లక్ష్యంగా
యుద్ధమేఘాల ధూళిలో
కలగలసి పోతూ
బాధితుల దుఃఖాన్ని బాధను
యుద్ధ భయానక దృశ్యాల్ని
సజీవంగా చిత్రీకరిస్తూ తాను
నిర్జీవంగా మారుతూ
యుద్ధ నేత్రాన్ని సజీవంగా
మనముందుంచిన కొల్విన్...

నీకు మా అశృనీరాజనాలు తెలిపే
అర్హత లేకున్నా
నీతో పాటున్నామన్న నిజం
సజీవం...

(సిరియాలో జరుగుతున్న యుద్ధంలో యదార్థ దృశ్యాలను చిత్రీకరిస్తూ అగ్రరాజ్య తొత్తులైన సేనల బాంబుదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేరీ కొల్విన్ కు జోహార్లు)

15, మే 2011, ఆదివారం

జోహార్ రాములు సార్..



కోల్పోయాం ఓ హక్కుల నేతను..

నిర్బంధ జ్వాలల నడుమ
మాటాడే అగ్నిపునీతను...

పదుగురికోసం
బడుగుల హక్కుల కోసం
పీడితుల జీవిక కోసం
బతుకంతా పోరాడిన
ఓ స్వేచ్చా విహంగాన్ని
ప్రజాస్వామిక సూత్రాన్ని...

ఇది విషాద సమయం!

తిరిగి గుండె నిబ్బరాన్ని
కూడగట్టుకోవాల్సిన
అవసర సమయం...

జోహార్ రాములు సార్..
జోహార్...