నివాళి - పోరాట వారసత్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నివాళి - పోరాట వారసత్వం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, జూన్ 2011, మంగళవారం

దీపధారి..



నింగికెగసిన ఉద్యమ తార
నిక్కచ్చైన ధిక్కార స్వరం
దగాపడ్డ తెలంగాణా ఆలపించిన విముక్తి గేయం

నాలుగు కోట్ల ప్రజల గుండెల్లో వెలిగిన దీపధారి
జయహో తెలంగాణా నినాదమైన జయశంకర్ మాస్టారూ
మీకివే మా జోహార్లు...

6, జూన్ 2011, సోమవారం

ఇప్పవనాల గాలి సూరీడు చేరింది..

మనందరికీ అజ్నాత సూరీడుగా పరిచయమైన నెమలూరి భాస్కరరావు గారు మొన్న జూన్ 1 విజయవాడ క్రిష్ణ లంకలో తన కుమారుని ఇంట గుండెపోటు కారణంగా మరణించారు. ఆయన విప్లవోద్యమంలో పనిచేసిన కాలంలో మల్లిక్ గా రాష్ట్ర నాయకుడిగా అందరికీ పరిచయం. ఉద్యమంలో కొనసాగుతున్నప్పుడు వెన్నెల పాట, ఇప్పవనాల గాలి కవితా సంకలనాలు, పాటలు, చైనా కథలు అనువాదాలు వెలువరించారు. ఉద్యమం వీడి వచ్చాక కథలు రాసారు. ఇండియాటుడే, ఆంధ్రజ్యోతి మొ. పత్రికలలో వచ్చాయి. కథలలో జీవన సంఘర్షణను కొత్తకోణంలో చూపే ప్రయత్నం చేసారు.
ఉద్యమంలో వున్న కాలంలో చివర్లో తన ఒంటెత్తు పోకడ, సైద్ధాంతిక విభేదాలు విమర్శలకు గురయ్యాయి.

అయినా ఉద్యమ జీవితానికి, బయట తను బతికినన్నాళ్ళు అదే నిబద్ధతతో జీవించి చూపిన ఆచరణకు జోహార్లర్పిస్తూ...
ఆయన కవితా పాదాలు కొన్నిః
ఉద్యమం ఇప్పుడింకెంత మాత్రం
నెలబాలుడు కాదు-
అది మైదానాన్ని - అడవినీ
ఆక్రమించి -
ఆకాశం కోసం
రెండో పాదం
దాచి వుంచిన
వామన పాదం అది!
2.
భయం నీటి పాములాంటిది
కాటేస్తే ప్రతీక్షణం చస్తాం!


బరువు తగ్గిస్తుందేడుపు కానీ-

బాధ్యత మిగిలే వుంటుంది!


ఉత్సాహం ఉప్పెనలా ఉండరాదు

ప్రవహించే ఏర్లాగుండాలి!
(ఇప్పవనాల గాలి నుంచి)

23, నవంబర్ 2009, సోమవారం

పౌరహక్కుల పురుషోత్తంనకు జోహార్లు

సరిగా తొమ్మిది సం. క్రితం ఇదే రోజు శ్రీకాకుళం ప్రాంతంలో అరెస్టయిన కామ్రేడ్ల గురించి పది గంటల ప్రాంతంలోకా.పురుషోత్తంకు ఫోన్ చేసి చెప్పాను. తరువాత కా.వరవరరావు గారికి అదే విషయమై చెప్పాను. వెంటనే ఎలక్ట్రానిక్ మీడియావారికి ఇద్దరు ఫోన్ చేసి చెప్పారు. గంట తరువాత ఇంట్లో అవసరమైన వస్తువుల కోసం తమ ఇంటి ముందరికిరాణా షాపులో కొనుక్కుందామని బయటకు వచ్చిన కామ్రేడ్ని పోలీసు మాఫియా ముఠా తల్వార్లతో దాడిచేసి నరికిచంపారు. ఇదంతా ప్రజలంతా చూస్తుండగానే హత్యచేసిన వాళ్లు తాము వచ్చిన తెల్ల టాటా సుమోలో తాపీగాపరారయ్యారు. హత్య జరిగి పదిహేను నిముషాలైనా జరగకుండానే పోలీసు జాగిలాలతో రంగారెడ్డి జిల్లా ఎస్.పి. సురే౦ద్రబాబు హాజరు. అంత తొ౦దరగా సార్లకు ఎలా తెలిసి౦దో ఎవరికీ అర్ధం కాలేదు. హడావిడిగా శవాన్ని మార్చురీకి తరలించే వాళ్ళను తన సహచరి జ్యోతి అడ్డుకొంది. తన భర్త శవం దగ్గర ఏడ్వనివ్వండి అని వేడుకొంది. వినని పోలీసులపై చెప్పుతో కొట్టింది. దుమ్మెత్తిపోసింది. కొంతమంది పోలీసులు జ్యోతిని కదలకుండా పట్టుకుంటే కనీసం శవపంచనామా జరపకుండానే పోస్టుమార్టంకు తరలించారు. రక్తం మరకలను పోలీసులు కడిగివేయబోగా అడ్డుకుంది. కోడిపిల్లను గద్ద తన్నుకుపోయినట్లు హత్య జరిగిన పావుగంటలో వాలిన పోలీసులను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. హత్య జరుగుతుందని ముందుగా తెలియకపోతే వారు ఆ స్థలానికి అంత తొందరగా ఎవరూ చెప్పకుండానే ఎలా చేరుకోగలిగారు?

ఎనబై ఐదులో పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.రామనాధంను, ఎనబై ఆరులో కరీంనగర్ జిల్ల అధ్యక్షులు జాపా లక్ష్మారెడ్డిని, తొంభై ఒకటిలో వరంగల్ జిల్లా కార్యదర్శి న్యాయవాది నఱా ప్రభాకర రెడ్డిని పోలీసులు తామే ప్రత్యక్షంగా కాల్చి హత్య చేసి హంతకులుగా ప్రజల అసహ్యానికి గురయ్యారు. దీని నుండి తప్పించుకోవడానికి లొంగిపోయిన మాజీ నక్సలైట్లను చేరదీసి, వారికి ఆయుధాలు, వాహనాలు సమకూర్చి, విచ్చలవిడిగా డబ్బులిచ్చి హంతక ముఠాలుగా ఏర్పరిచి ప్రజా సంఘాల నాయకులను హత్య చేసేందుకుపయోగిస్తున్నారు. కాశ్మీరులో, అస్సాంలో ప్రభుత్వాలు ప్రైవేటు హంతకముఠాల ద్వారా పౌరహక్కుల నాయకులను హత్యచేయించడాన్ని గమనించి అదే విధంగా మన రాష్ట్రంలో కూడా పురుషోత్తంను, ప్రజా గాయకురాలు బెల్లి లలితను, ఉపాధ్యాయ సంఘ బాధ్యుడు కనకాచారిని మరకొంతమంది ప్రజా సంఘ నాయకులను గ్రీన్ టైగర్స్, బ్లూటైగర్స్ పేరుతో హత్యచేయించారు. ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి వారిళ్ళపై దాడులు చేయడానికి, ఫోన్లలో బెదిరించడానికి, కిడ్నాప్ లు చేయడానికి వీరిని వినియోగించారు. ఇందులో కత్తుల సమ్మయ్య అనే వాడిని శ్రీలంకలో దాచేందుకు విమానంలో తరలిస్తుండగా ప్రమాదవశాత్తు చనిపోవడంతో రాజ్యం నైజం బయటపడి ప్రజల అసహ్యానికి గురయ్యారు.

పురుషోత్తం తన చివరి శ్వాస వరకు రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడారు. బాలగోపాల్ ఏ.పి.సి.ఎల్.సి.ని వీడిన తరువాత తానే రాష్ట్ర మంతా పర్యటించి హక్కుల ఉద్యమాన్ని ముందుకు నడిపారు. న్యాయవాదిగా కోర్టులలో ప్రజల పక్షాన నిరంతర పోరాటం చేసారు. పాలమూరుజిల్లా ఐజ మండలం చినతాండ్రపాడు గ్రామంలో ఒక మామూలు మద్యతరగతి కరణం కుటుంబంలో అరవై ఒకటో సంలో జన్మించాడు. స్వాతంత్ర్య సమరయోధులు సీతారామారావు, రామ సుబ్బమ్మలకు నాల్గవ సంతానం. సాంప్రదాయ బ్రాహ్మణాచారలను తండ్రి నేర్పజూసినా తన దగ్గర అలానే వుండి పూజలు చేసేవాడు. కానీ తన చిన్న నాటి ఇతర కులాల పిల్లలతో కలిసి భోంచేసేవాడు. వారి ఎంగిలి ప్లేట్లను తానే కడిగేవాడు.

ఆయనకు తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ. బాగా చదువుకొని ఉద్యోగంచేసి వారిని సుఖపెట్టాలనుకునేవాడు. గద్వాలలో ఇంటర్మీడియేట్ చదివే రోజుల్లో స్నేహితులంతా విప్లవరాజకీయాలు మాట్లాడుతుంటే దూరంగా వుండి తన చదువు తాను చదువుకునేవాడు. ఎనభైలో బి.ఎస్సీ.లో చేరేనాటికి డిగ్రీ కాలేజీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. అదే సం. డిసెంబరు నాలుగున ఆర్.టి.సి. బస్సు చార్జీల పెంపునకు నిరసనగా ఆందోళన చేసిన విద్యార్దులపై పోలీసుల కాల్పుల కారణంగా పది సం.ల బాలుడు చనిపోయాడు. అనేకమంది గాయపడ్డడంతో చలించిపోయిన పురుషోత్తం ఇతర విద్యార్ధులతో కలిసి పోలీసు స్టేషన్ తగలబెట్టె కార్యక్రమంలో పాల్గొన్నాడు. అప్పటినుండి రాడికల్ విద్యార్ధి ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. పాలమూరు ప్రజల పోరులో భాగంగా ఆయుధం పట్టాడు. తరువాత ఎనబై ఏడులో తిరిగి డిగ్రీ చదువు మొదలుపెట్టి పూర్తుచేసాడు. తరువాత పేదవిద్యార్దులకు తన గ్రామంలో ఉచితంగా విద్య నేర్పే స్కూలు నడిపాడు. బి.ఇడి.పూర్తిచేసాడు. గ్రామీణ ప్రాంత విలేకరిగా పనిచేసాడు. తరువాత న్యాయవాద విద్య పూర్తిచేసి న్యాయవాదిగా పేదల పక్షాన పోరాటం మొదలుపెట్టి పౌరహక్కుల సంఘంలో చేరాడు. అణచివేత దోపిడీలకు వ్యతిరేకంగా పోరాడే ఉద్యమకారులను బూటకపు ఎన్ కౌంటర్ల పేరుతో హత్య చేస్తూ వారి శవాలను కూడా కుటుంబ సభ్యులకివ్వని రాజ్యహింసకు వ్యతిరేకంగా శవాల స్వాధీన కమిటీ పేరుతో గద్దర్ తోను, ఇతర ప్రజా సంఘాల వారితో ఉద్యమాన్ని నడిపాడు. రాజ్య హింసకు వ్యతిరేకంగానే కాకుండా సమాజంలో ప్రజలను అణచివేస్తున్న ఆధిపత్య వ్యవస్థలన్నిటికీ వ్యతిరేకంగా ఒక పౌరహక్కుల నాయకుడుగా ఉద్యమాలు నడపడంలో కృషిచేశాడు.

ఇంతలా తమ పక్కలో బల్లెంలా తయారయిన పౌరహక్కుల నాయకుడిని హత్య చేయడానికి కుట్ర చేసిన పోలీసులు, ప్రభుత్వమే పురుషోత్తం హత్యకు బాధ్యత వహించాలి. కా.పురుషోత్తం ఆచరణ, ఆశయాలు ప్రజల పక్షాన పోరాడే వారికి మార్గదర్శకాలు. అమర్ రహే కా. పురుషోత్తం.


20, నవంబర్ 2009, శుక్రవారం

జోహార్లు కెన్ సారోవివా జోహార్లు


నైజీరియా సైనిక నియంత అబాచా ప్రభుత్వంచే నవంబరు పది పందొమ్మిదివందల తొ౦బై ఐదున ఉరితీయబడ్డ కెన్ సారోవివా మరి ఎనిమిదిమంది ఉద్యమకారులు తమ ప్రాణత్యాగంతో ఒక మహత్తర సత్యాన్ని తెలియజేసారు. సామ్రాజ్య వాదుల అడుగులకు మడుగులొత్తే విధానాన్ని అనుసరిస్తూ తమ తల్లి స్తన్యాన్నే పణంగా పెట్టే పాలకవర్గ కుట్రలకు దేశప్రజానీకం బలవుతున్ననిజాన్ని వెల్లడించారు.

షెల్ దాని అనుబంధ చమురుకంపెనీలు నైజీరియాలోని పాలక సైనిక ముఠా అ౦డద౦డలతో, చమురును ఆబగా పైక౦గా మార్చుకుని కుబేరులయ్యరుగాని, ఆ చమురు క్షేత్రాల వద్ద, పరిసరాలలో పర్యావరణం ఎంతగా నాశనమవుతోందో, ఒగోనీ తెగ ప్రజల సంప్రదాయక పంటలు ఎలా నాశనమయ్యాయో, వారు జీవన భృతి క్రమ౦గా ఎలా కోల్పోయారో, ఇటువంటి విషయాలు పట్టించుకోలేదు. వారు తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఎలుగెత్తి నినది౦చారు. స్వయం పాలనకు డిమా౦డ్ చేశారు.

ఈ ప్రజా౦దోళనను సహజంగానే సైనిక ముతా ప్రభుత్వం అత్య౦త పాశవికంగా అణచివేసింది. మొబైల్ పోలీస్ ఫోర్స్ ఒగోనీ ప్రజల ఆ౦దోళననలనణచివేయడానికి మొదటిసారి తొంభైలో ఏనాభి మందిని ఊచకోత కోసి౦ది. నాలుగువ౦దల తొ౦బైఐదు ఇళ్ళను ధ్వస౦ చేసి౦ది. మరల తొ౦బై రె౦డు వేసవిలో ఘరాన్ చమురు క్షేత్రం వద్ద వున్నా గ్రామాలపై ఈ ఎం.బి.ఎఫ్ దాడి చేసి ముప్పై మ౦దిని చ౦పిది. నూటా ఏభై మ౦దిపై లాఠీ చార్జీ చేసింది.

దీనిని అంతర్జాతీయ వేదికలలో మాట్లాడి ప్రప౦చ ప్రజల దృష్టికి ఈ సమస్యను తీసుకు వచ్చారు. తొ౦బై రె౦డులో యు.ఎస్.వర్కి౦గ్ గ్రూప్ ఆన్ ఇ౦డియన్ పాపులేషన్ సమావేశంలో (జెనీవా) మాట్లాడారు. అక్కడిను౦చి న్యూయార్క్ లోని యు.ఎన్.ఓ.సమావేశ౦లో మాట్లాడుతూ, 'చమురు వెలికితీత వల్ల-తగు జాగ్రత్తలు, రక్షణలు పాటి౦చక నిర్లక్ష్యం చేసిన౦దువలన ఒగోనీ నేడు మరుభూమిగా మారిపోయింది. దీనికి బదులుగా మాకు లభి౦చేదేమ౦టే ఒక పెద్ద గు౦డు సున్నా మాత్రమె' అన్నారు.

దీనితో శానీ అబాచా సైనిక ముఠా ప్రభుత్వం ఒగోనీలను అణచడానికి ఇరుగుపొరుగునున్న స్వదేశీ తెగల వారిని వారిపైకి ఉసిగొలిపి౦ది. ( సల్వాజుడుం, హర్మద్ వాహిని వంటివి భారత పాలక వర్గ హంతక ముఠాలువీటికి నేటి ప్రతిరూపాలు )

కెన్ సారో వివా నెలకొల్పిన ఎం.ఓ.ఎస్.ఫై.ఓ స౦స్థ షెల్ ను పది బిలియన్ డాలర్ల నష్ట పరిహార౦గా ఇవ్వాలని, దేశం విడిచిపోవాలని డిమా౦డ్ చేసి౦ది.

దీనిపై ఆగ్రహించిన సైనిక ప్రభుత్వం కెన్ సారోవివా ను మరి ఎనిమిదిమ౦ది ఉద్యమకారులను ఉరితీసి౦ది. కెన్ సారో వివా నలబై ఒకట్లో అక్టోబర్ పదో తేదీన రివర్స్ స్టేట్ రాష్ట్ర౦లో జన్మి౦చారు. గొప్ప జాతీయవాది. మహామేధావి. విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా ప్రత్యక్ష వలసపాలన ను౦డి నైజీరియా బయటపడిన తోలి స౦వత్సరాలలో ప్రభుత్వ పాలనాదికారిగా, అరవై ఎనిమిదిలో రాష్ట్ర మ౦త్రివర్గ౦లో కేబినేట్ మ౦త్రిగా పనిచేసారు. ఆయన నాలుగు నవలలు, రె౦డు కథా స౦పుటాలు, ఒక కవితా స౦పుటి, నాటికలు, తొమ్మిది పిల్లల పుస్తకాలు రాసారు. ఆయన రచనలు ఒగోనీ ప్రజల అ౦తరాత్మను ఆవిష్కరించాయి.

మీ సమాధిపై వు౦డే శిలా ఫలక౦పై ఏమిరాస్తే బాగు౦టు౦దని అడిగిన విలేకరితో వివా ఇలా చెప్పారు:
'నైజీరియా చేత మోసపోయిన మర్యాదస్తుడు ఇక్కడ శాశ్వత౦గా నిద్రపోతున్నాడు. వారు ఆయనకు సాధారణ౦గా అవసరమైన ఆరుఅడుగుల నేలనుకుడా తిరస్కరించారు'.

"ప్రభు! నా ఆత్మను స్వీకరి౦చు. కానీ, పోరాట౦ కొనసాగి తీరుతుంది" అన్నది వివా చివరి మాట.

కలలు క౦టూ చనిపోవాలని ఆశి౦చిన వివా కోరిక నిజ౦ కాకపోవడ౦ విషాదం.

చివరిగా ఇదే విధమైన అపార సైనిక, అధికార బలగాలతో అబూజ్ మడ్ (అపార ఖనిజ వనరులు కలిగిన దండకారణ్యం) ప్రా౦తంపైదాడిచేస్తు అక్కడి ఆదివాసీ ప్రజానీకాన్ని తరిమివేస్తూ, వారి గ్రామాలను తగలబెడుతూ,
స్వదేశంలోనే కా౦దిశీకులుగా మారుస్తున్నమేకవన్నెపులులప్రభుత్వం సామ్రాజ్య వాదుల అడుగులమడుగులొత్తుతున్న తీరును ప్రజాస్వామిక వాదులు తప్పక ఖండించాలి. లేకపోతే భవిష్యత్ తరాలకు ఈ దేశ వనరులు మిగలనివ్వకుండా అమ్ముకునే కుట్రకు బలి అవుతాం.

('కెన్ సారోవివా కోసం' పేరుతో జనసాహితి ప్రచురణలనుండి సమాచారం)