ఉద్యమం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఉద్యమం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, నవంబర్ 2009, ఆదివారం

తెలంగాణా పాలస్తీనా కానున్నదా ?

ఈ రోజు కె.సీ.ఆర్. ఆమరణ దీక్షకు కూచున్నట్లుగా ఈ దేశ రాష్ట్రపతిని, ప్రధాన మంత్రిని, ఈ రాష్ట్ర గవర్నర్ ను, ముఖ్యమంత్రిని కలిసి నెల రోజులు ముందుగానే శాంతియుతంగా నిరసన తెలియజేసే అవకాశం కల్పించమని కోరి పూనుకున్నా ఆయనకు ఆ అవకాశం కల్పించకపోవడం అప్రజాస్వామికం. ఆయన కెరీర్ లో తప్పులు చేసి వుండవచ్చు. కానీ తెలంగాణా ఉద్యమాన్ని సజీవంగా ముందుకు తీసుకుపోతున్న వ్యక్తిగా గౌరవించాల్సిందే. ఈ మద్య కాలంలో ఏర్పరిచిన ప్రత్యేక రాష్ట్రాలేవీ ఎన్నికల ద్వారా ఏర్పాటుకాలేదు. ఆయా ప్రధాన పార్టీల బలాలను ప్రధాన ప్రాతిపదికగా చేసుకుని ఏర్పాటు చేసారు. వాటివలన ఆయా రాష్ట్రాలకు ప్రత్యేకంగా జరిగిన నష్టం లేదు. మరి తెలంగాణా విషయంలో గత అరవై సం.లుగా వారి ప్రజాస్వామిక డిమాండ్ ను గౌరవించకుండా ఈ రాష్ట్రం ఒక రెండు కులాల వ్యాపార అడ్డాగా మార్చుకొని ప్రాంతాల మద్య సమతుల్యాన్ని దెబ్బతీస్తూ తమ స్వంత ఆస్తులు కూడబెట్టుకోవడం తప్ప రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒరగబెట్టింది లేదు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను విదేశాలకు తరలించి లక్షల కోట్ల రూపాయల దొంగ సొత్తు కూడబెట్టుకున్న వారిని ఇన్నాళ్ళు వెనకేసుకొచ్చి ఈ రోజు తాము అధికారానికి దూరమై సహజ వనరుల గురించి మాటాడుతున్నారు. అవకాశమున్నప్పుడు దోపిడీకి వెనకాడని ఈ రాజకీయ రాబందులు పీక్కుతిని కళేబరాన్ని మిగిల్చిన క్రమంలో అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి.

ఉస్మానియా యూనివర్శిటీలో పడి విద్యార్థులను దొంగలను కొట్టినట్లు కొట్టి కసి తీర్చుకున్న పోలీసులకు అధికారం ఎవరిచ్చారు. వారిని ఉసిగొలిపి యూనివర్శిటీలో భయోత్పాతాన్ని సృష్టించి తద్వారా యువకుల నోరుమూయించాలని, ఉద్యమాన్ని హింసాయుతంగా మార్చి రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించ జూస్తున్న రాజకీయ దళారీల బండారాన్ని బయటపెట్టాలి.

ప్రజాస్వామ్యంగా పేర్కొంటున్న వ్యవస్థలో శాంతియుతంగా చేయతలపెట్టిన సత్యాగ్రహాన్ని ఆపాలనుకోవడం వారి నిజ స్వరూపాన్ని బయటపెడుతోంది.
యూనివర్శిటీ నుండి పోలీసులను తరిమికొట్టిన విద్యార్థుల చైతన్యం చూస్తుంటే తెలంగాణా మరో పాలస్తీనా కానున్నదా అనిపిస్తోంది. ఈ రెండింటి మద్య సారూప్యం కనిపిస్తోంది. అమెరికా అండతో ఇజ్రాయిల్ అనే దేశం ఏర్పడి తమ ప్రాంతంనుండి తరిమివేయబడిన పాలస్తీనా ప్రజలకు జరిగిన అన్యాయమే కళ్ళముందు కదలాడుతోంది.

న్యాయంగా విడిపోయే హక్కును గౌరవించి వారి ప్రజాస్వామిక డిమాండును అంగీకరించడమే అందరి కోరిక కావాలని ఆశిస్తూ..

5, అక్టోబర్ 2009, సోమవారం

థర్మల్ తో దుర్భిక్షమే..?


కోనసీమ తరువాత కొబ్బరికి పేరుగాంచిన ఉద్దాన వనం అదృశ్యం కానుందా? ఇందుకు శ్రీకాకుళం జిల్లా, సోంపేటను ఆనుకొని వున్న బీల ప్రాంతంలో నిర్మాణం కానున్న థర్మల్ ప్లాంటు కారణం కానుందా? అవుననే అంటున్నారు అక్కడ పరిశోధనలు గావించిన మేధావులు, పర్యావరణ నిపుణులు. ఎందుచేతనంటే దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన రీసెర్చ్ కేంద్రం నేరీ (National Environment Engineering Institute) వారు 5 పవర్ ప్లాంటు ప్రాజెక్టులపై రీసెర్చి చేసి తెలిపిన వాటిలో మన రామగుండం ప్లాంటుకూడా వుంది. అక్కడ నిర్వాసితులలో సుమారు 5 కి.మీ.ల పరిధిలో ఉండే ప్రజలు అత్యధిక శాతం మంది శ్వాస కోశ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నారని నిర్ధారించారు. అది 1000 మె.వా.పవర్ ప్లాంటు. ఇక్కడ నిర్మించ తలపెట్టింది 2640 మె.వా.ది. మరి ఇక్కడి పరిస్థితి ఎంత భయానకంగావుండబోతుందో ఊహించుకొని ప్రజలు భయపడుతున్నారు.

అలాగే ప్రాజెక్టు నిర్మాణవలన వందలాదిగ్రామాలు నిర్వాశితులవుతారు. పంట పొలాలు నాశనం కాబడతాయి. ఇక్కడి సాగునీటి ప్రాజెక్టు, నదీజలాలు కలుషితం కాబడతాయి. థర్మల్ వ్యర్థ పదార్థాలతో సముద్ర జలాలు కలుషితం కాబడి అపార మత్స్యసంపద నాశనం అవుతుంది. వేలాదిమత్స్యకార కుటుంబాలు రోడ్ల పాలవుతాయి. సుమారు 10 కి.మీ.ల పరిధిలో భూగర్భజలాలు పూర్తిగా కాలుష్యమయిపోతాయి. వీటికి ఉదా.గాపరవాడలోని థర్మల్ ప్రాజెక్టు చుట్టూ ఉన్న ప్రాంతాలనే ఉదహరిస్తున్నారు.

ప్రాజెక్టు నిర్మాణంనకు ప్రభుత్వం ఇప్పటికే 11 వందల ఎకరాల బీల భూమిని కంపెనీకి అమ్మేసింది. సుమారు 12 వేల కోట్ల వ్యయంతో నిర్మాణమవుతున్న ఈప్రాజెక్టు పర్యావరణ అనుమతులు లేకుండానే్ జనవరిలోపనులు ప్రారంభిస్తామని నాగార్జున కంస్ట్రక్షంస్ ప్రకటించింది. ఇటువంటి పరిశ్రమలు స్థాపించాలంటే ముందుగా ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం నిధులతో greenbelt ఏర్పాటు చేయాలి అంటే సుమారు 3 లక్షల మొక్కలు నాటి వాటిలో బతికున్నవెన్ని అవి ఏదశలో వున్నాయో నివేదించాలి. కానీ నిబంధనలన్నీ గాలికొదిలి ప్రాజెక్టును చేపడుతున్న వైనం ప్రజలను ఉద్యమ బాట పట్టిస్తోంది.

ప్రజలను అన్ని విధాలుగా నిర్వాశితులను చేసే ఈ థర్మల్ ను వ్యతిరేకించే ఉద్యమాన్ని ప్రజాస్వామికవాదులు, మీధావులు, పర్యావరణ ఉద్యమకారులు మద్దతు తెలిపి వారి జీవన పోరాటానికి చేయూతనివ్వాలని కోరుకుంటున్నా.

(ఆంధ్రజ్యోతి దినపత్రిక 05-10-2009 లోని వార్త అధారంగా)