25, నవంబర్ 2013, సోమవారం

తల తెగిపడినా ఈ నేల నాదే...



మధ్య తరగతి బుద్ధిజీవులకు ఈ దేశ ప్రజాస్వామ్యంపై ఈ పింజారీ వ్యవస్థపై నమ్మకాన్ని సడలకుండా పోరాడే తత్వాన్ని దూరం చేసేందుకు విదేశీ స్వదేశీ పెట్టుబడిదారుల తొత్తులు అయిన NGO's, కొన్ని మీడియా సంస్థలు (తెహెల్కా వంటివి) చాలా కృషి చేస్తున్నాయి అని అర్థమవుతోంది కదా! వీళ్ళ వెనక దోపిడీదారుల సొమ్ము పెట్టుబడిగా థింక్ వెస్టివల్స్, మరికొన్ని సాహిత్య సేవలు (రాంకీ వంటివి) పేరిట ఆలోచనలను కుళ్ళబెట్టే పండగలు జరిపి దేశానికి ఉద్దరించేస్తున్నామని డబ్బాలు కొడుతుంటాయి. వీళ్ళ అసలు రంగు ఇలా బయటపడుతుంది అప్పుడప్పుడు. ఈ గ్రీకు వీరుల రంకు చేష్టలు, మహిళలపై దాడులు హీరోలుగా ప్రచారానికీ ఉపయోగపడుతుంటాయి.
మధ్య భారతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యాపారానికి తీవ్ర స్థాయిలో ఎదురవుతున్న స్థానిక గిరిజన ప్రజానీకంపై జరుగుతున్న అమానుష అత్యాచార దాడులను ఒక్క మీడియా కూడా ప్రచారంలోకి తేవడంలేదు. అటు సైన్యం చేతిలో, ప్రైవేటు సైన్యం చేతులలో హత్యలకు, మానభంగాలకు గురవుతున్న నియాంగిరీ ప్రాంత ఆదివాసీ ప్రజానీకం తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతిఘటన ర్యాలీలు చిన్న స్థానిక నియోజక వర్గం కాలంలలో ప్రచురించే మీడియా సో కాల్డ్ ఫేజ్ త్రీ షోకిల్లా రాయులకు ఇంత పబ్లిసిటీ ఇస్తుంది. 

ఆదివాసీలను మనుషులుగా గుర్తించని వీరు మనుషులేనా??
ఈ దేశ ఖనిజ సంపదను, నేలపై హక్కును కాపాడి తద్వారా ఈ దేశ సార్వభౌమత్వాన్ని సమున్నతంగా నిలిపే ఆ మూలవాసులు చేసే పోరాటానికి కాసింత బాసటగా నిలుద్దాం. తద్వారా మన కాళ్ళ కింది నేలను కాపాడుకుందాం.

29, అక్టోబర్ 2013, మంగళవారం

'వామపక్షం - నూతన ప్రపంచం' - మార్త హర్నేకర్ ( Marta Harnecker)


మార్త హర్నెకర్ ఒక సామాజికవేత్త, రాజకీయ శాస్త్రవేత్త. పత్రికా రచయిత్రి, ఉద్యమకారిణి. 1960వ దశకం చివరిలో ఆమె రచించిన ' The Basic Concept of Historical Materialism ' అనే పుస్తకం ప్రచురించిన తర్వాత లాటిన్ అమెరికాలోని మార్క్సిస్టు వామపక్షం ఆమె రచనలను అత్యంత విస్తృతంగా చదవటం మొదలయింది. బొలివేరియన్ విప్లవాన్ని (సైమన్ బొలివర్ అనే వెనిజులా తత్వవేత్త ఆలోచనలతో, ఉత్తేజంతో ముందుకు వచ్చిన విప్లవ సిద్దాంతం) బలంగా సమర్థించుతూ మార్తా హర్నేకర్ అనేక రచనలు చేసారు. ఈ పుస్తకం 'Re building of the Left' అనే పుస్తకానికి అనువాదం తెలుగులో ఆశాలత గారు చేసారు. సంగం మీడియా గ్రూపు వారి ప్రచురణ. మిత్రులు Rajendra Prasad Yalavarthy గారు నాకు ఈ పుస్తకాన్ని పరిచయం చేసారు. వారికి ధన్యవాదాలు. మార్క్సిజం పై ఓ కొత్త ఆలోచనా ధారను మనకందించే ఈ పుస్తకం పూర్తయ్యాక మళ్ళీ మాటాడుకుందాం. మీరూ చదవండి. విశాలాంధ్ర, ప్రజాశక్తిలలో దొరుకుతుంది.

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కా. చాయారాజ్ అమర్ రహే


విప్లవ కవి సిక్కోలు గొంతు జనసాహితీ వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ చాయారాజ్ ఈ రోజు ఉదయం 8.30 గం.ల ప్రాంతంలో శ్రీకాకుళంలో తుదిశ్వాస విడిచారు. ఆయన రచనలు శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం), గుమ్మ (కొండ కావ్యం), దర్శని (కావ్యం), నిరీక్షణ (దీర్ఘ కవిత), మట్టి నన్ను మవునంగా ఉండనీయదు (కవితా సంపుటి) బుదడు (కావ్యం). మొన్న 18న ఆయన రచన 'కారువాకి' (నవల) శ్రీకాకుళంలో ఆవిష్కరించారు. ఇవన్నీ ఆయన ఉద్యమాలలో తనను తాను ఆవిష్కరించుకునే క్రమంలో రాసిన కవిత్వం.

బుదడు కావ్యంలో చివరిగా చాయారాజ్ గారన్నట్టు " కవీ! మృత్యువు నీకు బంధువు, నీ కోర్కె ప్రకారం నిన్ను విశ్వ సౌందర్యంలోనికి ఒంపేస్తుంది. ఉషస్సులలో, సంజలలో, ఎండ్లల్లో వెన్నెల్లో ఇంకిపోతావు. అనంతమైపోతావు. ఎందుకూ మిగలవు. ఎవరికీ తగలవు. " మృత్యువు అతనికి ప్రియురాలు. అతడ్ని ధ్వంసం చేస్తుంది. మళ్ళీ మళ్ళీ పునర్ నిర్మిస్తుంది. ఒక అసంతూప్రి స్థితిని సంతృప్తపరిచేందుకు - ప్రేరణ ప్రతీకార చర్యలే జనన మరణ నిజాలు".

నిజమే. చాయారాజ్ మాస్టారుని మృత్యువు కేన్సర్ రూపంలో తనను కబళించినా మనందరిలో తన స్ఫూర్తిని మిగిల్చిన కావ్యాలాపన ద్వారా మనల్ని పునర్నిర్మించే మరో కార్యసంబంధమైన పనిలోకి ఈ మట్టిలోలోపలికి ఇంకిపోతూ ఇగిరిపోతూ అమరులయ్యారు.

జోహార్ కా.చాయారాజ్ జోహార్
మీ ఆశయాలను కొనసాగిస్తాం..

9, ఆగస్టు 2013, శుక్రవారం

ఆగస్ట్ - 9...


ఆగస్ట్ 9.. గత పదిహేనేళ్ళుగా అంటే 1998 నుండి నన్ను వెంటాడే రోజు.. గుండెనంతా దు:ఖం పట్టి జ్ఞాపకాలన్నీ తెరలు తెరలుగా కనుల ముందు కదలాడే రోజు. ఒడిసా రాష్ట్రంలోని కోపర్ డంగ్ అటవీ ప్రాంతంలోకి ఆంధ్రా గ్రే హౌండ్స్ ప్రవేశించి తెల్లవారుఝామున గ్రామాన్నంతా చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆదివాసీ చిన్నారులను, వారి పశు సంపదను కూడా గురి చూసి కాల్చి బీభత్సంగా ఆధునిక ఆయుధాలతోను గ్రైనేడ్స్ తోను దాడి చేసి 13 మంది అప్పటి పీపుల్స్ వార్ పార్టీ కళీంగాంధ్ర నాయకత్వాన్ని హత్య చేసారు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా హెలికాప్టర్లనుండి వెతికి కాల్పులు జరిపిన సంఘటన ఇదే. ఒక పోలీసు స్టేషన్ పరిధి దాటి కేసు నమోదు చేయని శాఖ ఇలా వేరొక రాష్ట్ర భూభాగంలోకి చొరబడి కాల్పులు జరిపి హత్య చేయడం న్యాయస్థానంలో ప్రశ్నించినా జవాబు రాలేదు. ఇదీ ఈ రాజ్యంలోని నాలుగు కాళ్ళ న్యాయం. సరిహద్దులు చెరిపేసిన ఎదురుకాల్పులుగా కోపర్ డంగ్ మొదలయింది. 

ఏ ఆదివాసీ ప్రజల స్వేచ్చా స్వాతంత్ర్యాలతో ఈ దేశ విముక్తి ముడిపడి వుందో వారిని ప్రలోభ పెట్టే ఆదివాసీ మేళాలను వ్యతిరేకిద్దాం. 

ఆదివాసీ పోరాటాలకు సంఘీభావం తెలియజేద్దాం. 

అమర వీరుల ఆశయాలను కొనసాగిద్దాం. 

5, జులై 2013, శుక్రవారం

ప్రసాదం గారూ...

ప్రసాదం గారూ...

మీరలా చేతులూపుతూ మాటాడుతూ
ఒక్కొక్కరినీ వేయి మందిని చేస్తూ
ఒక్కో అడుగూ వేల అడుగులుగా
రూపాంతరం చెందుతూ
ఒక్కో నినాదమూ మీ గొంతు నుండి తూటాగా మారి
వాడి గుండెల్లో దూసుకుపోతూంటే
వాడికొక్కటే దడ
వాడి పీఠానికున్నా నాలుగు కోళ్ళూ ఊడి
అధికార బెలూన్ పగిలి పోతుందేమోనని...

ప్రసాదం గారూ అని అంతా ఆత్మీయతతో కూడిన గౌరవంగా పిలుస్తూ
మీతో కలిసి నడిచి మీ పిడికిలిలో పిడికిలౌతున్నారని వాడికొకటే బెంగ
అందుకే వాడు మళ్ళీ అపరిచితంగా వాడి ముఖాన్ని జనానికి చూపలేక
మీ మెడపై కత్తై గుండెల్లో బుల్లెట్లు దించాడు...

అయినా వాడు చంపగలిగింది ప్రసాదాన్నే
కానీ ప్రసాదం గారి ఆశయాన్ని కాదు కదా..

నాకు దుఃఖంతో పాటూ నవ్వు వస్తోంది
వాడి పిరికితనాన్ని చూసి...

కోపమూ వస్తోంది
వాడి కౄరత్వాన్ని చూసి...

మరో మారు ఋజువయ్యింది
వాడు ఉత్తి కాగితపు పులేనని...

ప్రసాదం గారూ మీరు అమరులు
ప్రజలు అజేయులు...

(జోహార్ కా. గంటి ప్రసాదం)

29, జూన్ 2013, శనివారం

నల్ల సూరీడు..




















 నువ్వలానే గుర్తు నాకు
చూపులలో విస్ఫులింగాలను ప్రతిఫలిస్తూ
పిడికిలెత్తి పోరాట పతాకాన్నెత్తి పట్టినట్టు...

చీకటి ఖండంలో వెలుగులు నింపే
నీ యుద్ధ దరహాసం మెరుస్తున్నట్టు...

ఎందుకో
మరల మరల
అదే మాట మండే సూరీడు మండేలా
అంటూ గుండెల్లో పోటెత్తావు...

కానీ

పాతికేళ్ళు చీకటి కొట్లో దాచిన
వాడి జాత్యహంకారం నీకో శాంతి బహుమతినిచ్చినప్పుడు
చాచిన నీ చేతులు అంటే కోపమొచ్చింది...

నిన్నో స్టాంపును జేసి ఉమ్మినంటించే
వాడి కుట్రను నవ్వుతూ స్వీకరించావని
కోపమొచ్చింది...

అయినా
ఎప్పటికీ నల్ల సూరీడంటే
గుర్తుకొచ్చేది నువ్వే నువ్వే...

(మండేలాకు ప్రేమతో)


9, జూన్ 2013, ఆదివారం

బాకీ...

చప్పుడు కాని అడుగులో అడుగుతో
కాలాన్ని బంధించి ఊపిరాగిన
నిశ్శబ్ధంలోంచి రెప్పవేయని సమయాన్ని
ట్రిగ్గర్ పై చూపుడు వేలు బిగిస్తూ...

ఎండ పట్టిన ఆకాశపు బూడిద వర్ణంలోంచి
మట్టిని పూస్తూ ఆకు తొడిమలన్నీ
ఊదారంగులోకి మారుతూ నిప్పు కణికలోకి
ఊపిరిని ఎగదోస్తూ...

బిగిసిన వేలి లోంచి దూసుకు పోయిన
గురి పొలో పొలో నెత్తుటి పొలో మని
బిగ్గరగా సమూహమౌతూ నిన్నటి
బాకీని తీరుస్తూ....

రాతిరింత
నెత్తుటి వాన కురుస్తూ
పసరిక వాసనేస్తూ నెలవంక అంచునంటిన
ఎరుపు జీర జెండా అంచున మెరుస్తూ...

హొళీ హోళీ హొళొలి రంగా హోళీ
సమ్మకేళీల హోళీ అంటూ
ధింసా ఆడుతూ పాదాలన్నీ
కలసి ఒకే అడుగు వేస్తూ...


(తే 6-6-2013 దీ)