4, డిసెంబర్ 2016, ఆదివారం

తెలవారని ఆకాశం!

తెలవారని ఆకాశం!

కొన్ని మంచు బిందువులేవో రాతిరి కురిసిన
వాన చివుళ్ళ నుండి రాలుతూ

రెక్కల చాటున ముఖం దాచుకున్న పక్షి
టపటప రెక్కలల్లారుస్తూ ఎగరబోతూ

తొలి పొద్దు కిరణాలు తాకి విచ్చుకుంటూన్న
అడవి పువ్వు పరిమళమవుతూ

ఆ క్షణాన వన్ టూ త్రీ రోల్ కాల్ విజిల్ తో
టక టకమని వరుసలోకి వస్తూ

జ్వరంతో మాగన్నుగా రెప్పలను తెరవలేని
అలసిన ఎర్ర మందారాలు

ఒక్కసారిగా విరుచుకుపడిన తూటాలతో
అచేతనమయి నెత్తురోడి చెదరిన రేపటి కల

దేహం నుండి వేరుపడిన తల తెరచిన
కనులింక మూతబడవు

ఒక్కొక్కరుగా ఒరిగి పోయిన వారిని
హత్తుకుంటూ తెలవారని ఆకాశం

విరిగిపడిన కలలను ఏరుకుంటూ
ఆమె పొత్తిళిలో ఎర్ర వస్త్రం తడిగా!!

27, అక్టోబర్ 2016, గురువారం

బెజ్జంగీ = యురీ దాడి


ఒక అసహజ మరణం పొందిన దేహానికి పోస్ట్ మార్టం చేయించడానికి ఎన్ని తిప్పలు పడితే బతిమాలుకుంటే రోజంతా రోదిస్తూ కాళ్ళా వేళ్ళా పడితే గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టరుకు  గంటా రెండు గంటలు పడుతుంది. అలాగే సాయంత్రం 5 తరువాత రూల్స్‌ ఒప్పుకోవని రేపటికి వాయిదా వేస్తారు. అలాంటిది కనీసం శవపంచనామాలు కానీ వీళ్ళు చెప్పే ఏ చట్టపరమైన రూల్స పాటించకుండా అర్థరాత్రి పాతికపైగా శవాలకు గిన్నీస్ రికార్డ్ టైంలో  పోస్ట్ మార్టం చేసేసి ఒక కంటైనర్లో అట్టపెట్టెలలో పడేసి కుళ్ళబెట్టన డీజీపీ ఎంత సౌమ్యంగా మీడియా ముందు ఎన్నెన్ని చిలుకపలుకులు వల్లిస్తున్నాడో. నిన్నొక నాలుగు శవాలు పోగేసి హెలికాప్టర్ లో చక్కెర్లు కొడుతుంటే కాల్పులు జరిపారు ఎదురు కాల్పులలో చనిపోయారు గుర్తు తెలియని వారంటారు. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ద యూనిఫాం ఉద్యోగి ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్నీ ఆడుతన్నాడు. 

నువ్ నిజంగా ఎదురుకాల్పులలో చంపితే హైకోర్టు ఇచ్విన ఉత్తర్వులు పాటించి కెజీహెచ్ కు తీసుకు రావడానికి ఎందుకు భయపడ్డావు దొరా? పోస్ట్ మార్టం వీడియో తీయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేకపోయావొ చెప్పగలవా? వాళ్ల మొఖాలపై కత్తి గాట్లు నోటిలోంచి వచ్చిన పచ్చి నెత్తురు ఏ సాక్ష్యం చెప్తున్నాయి? ఇరవై ఏళ్లు నిండని ఆ లేలేత ముఖాలు కళ్ళు పీకిన నీ చేతులను ధైర్యంగా చూపగలవా?  కనీసం అక్కడ కాల్పులు జరిగిన ప్రదేశం ఫోటోలు ఎందుకు చూపలేక గుట్టలు వాగులు ఫోటోలు చూపుతున్నావు దొరా? రాజకీయ నాయకుల అరికాళ్ళు నాకే ఈ అధికారులు ఎన్నెన్ని అసత్యాలు ప్రచారం చేయాలో చేస్తున్నారు.

ఇంతమంది ఆదివాసీలను చంపి కనీసం శవాలపట్ల కూడా మానవత్వం చూపని వారు ఢిల్లీలో గిరిజన కార్నివాల్ జరిపి ఆదివాసీల హక్కులను భూములను హరిస్తే సహించననీ నీతులు వల్లిస్తాడు మన ప్రధాని రూపంలొని అసలు పోలీస్ బాస్. కనీసం అక్కడ చనిపోయిన వాళ్ళలో మూడు వంతులమంది ఆదివాసీ మహిళలు యువకులే కదా? వారి మాట కూడా ఎత్తకుండా చేతులూపి మాటాడే ఇండియన్ ట్రంప్ ఎవరిని బుజ్జగించగలడు.

ఇలా విషప్రయోగము జరిపి మత్తులో వున్నవారిని చంపి వారి పట్ల మాకు వ్యతిరేకత లేదు వారి చర్యలపైనే అని సన్నాయి నొక్కులు నొక్కి రక్తపుటేరులు పారించే వీళ్ళు యురీలో దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రతిరూపాలు కాదా? దీనిని సర్జికల్ స్ట్రైక్స్ తో పోల్చి గొప్పలు చెప్పడం కాదు. ఇది రాజ్యం ఉగ్రవాద దాడి. కనుకనే ఇంత మంది తెలుగు వారు చనిపోతే ఇరు రాష్ట్రాల అమావాస్య చంద్రులు నోరు మెదపరు. ప్రతిపక్ష నాయకులు ఖండించరు. వీళ్ళంతా ఒకే అతుకుల బొంతలోని చినుగులు కనుక. 

ప్రజాస్వామ్య వాదులారా విదార్థీ యువజన మేధావుల్లారా ఆలోచించండి. ప్రశ్నించండి.

Condemn the State Terrorism on its own people. 

14, ఆగస్టు 2016, ఆదివారం

ఈ గేం ఆఫ్ డెత్ ఎవరి కళ్ళకు గంతలు కట్టడానికి?

Nayeem dead body

నయీంను ఎన్కౌంటర్ చేసి చంపాక ఇంక సాక్ష్యాలెన్ని కూడబెట్టినా ఎవరిని శిక్షిస్తారు? ప్రధాన నిందితున్ని పట్టుకుని కాల్చి చంపి అనుచరులను అరెస్టులు చూపి భార్యా పిల్లలను నిర్బంధించి కూడబెట్టిన ఆస్తులను విపరీత లెక్కలు వేస్తు చూపుతూ తాను చేసిన నేరాలకు ఎవర్ని బాధ్యులను చేయడానికి ఈ సిట్ డ్రామా? ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులను, తమకెదురు తిరిగే వారిని ఇందులో ఇరికించి చచ్చాక కూడా నయీం భయపెడుతున్నట్టు ప్రచారం చేస్తు తమ మీడియా అనుచరగణాన్ని ఉసిగొలుపుతూన్న ప్రభుత్వం ఎవరి మీద చర్య తీసుకుంటుంది? ఇవన్నీ కోర్టులలో నిలిచేవేనా? అసలు చంపాల్సి వచ్చిందెందుకో ఇప్పటికీ నోరు మెదపని హోం మంత్రి ఏం జవాబిస్తారు. ఇన్నేళ్ళు ఈ భేతాళున్ని మోసుకు తిరిగి తమ కుర్చీల కాళ్ళను విరిచేయ చూసినప్పుడు ప్రజల గోడు గుర్తొచ్చిందా? పదేళ్ళ క్రితం ఇదే నాయకులంతా మానవ అక్రమ రవాణా కేసుల్లో వున్నవారే కదా? వాటికీ ఏ చర్యాలేదు ఇప్పటికి. అప్పట్నుండి అంటకాగి ప్రజా సంఘాలను ఎదగనీయకుండా రకరకాల పేర్లతో భయపెట్టి, భయపడని వారిని తుదముట్టించేందుకు వాడుకుని ఇప్పుడు ఈ ఐ.పి.ఎస్.లు శ్రీరంగ నీతులు చెప్తారు. ఇదో తురుపు ముక్కగా దొరికింది అధికార పార్టీకి. అధికార గణాన్ని తమ కాలికింద చెప్పులా అణచి వుంచడానికి. ఈ గేం ఆఫ్ డెత్ ఎవరి కళ్ళకు గంతలు కట్టడానికి?

8, ఆగస్టు 2016, సోమవారం

రాజ్యం మరో వికృత రూపం

నయీం ఎన్ కౌంటర్ రాజ్యం వికృత రూపానికి మరో ఉదాహరణ మాత్రమే. వాడుకున్నన్నాళ్ళు వాడుకొని ప్రజా సంఘాల నేతలను దారుణంగా హత్య చేయించి ప్రజలలో భయాందోళనలను సృష్టించిన రాజ్యం తన పెంపుడు పిచ్చి కుక్కను ఇన్నాళ్ళు చంకలో ఎత్తుకు తిరిగి ఈరోజు చంపి తామేదో ఘనకార్యం సాధించినట్లు చెప్తున్నారు. నయీంను మఫ్టీలో తామే కాపలా కాస్తూ ఇన్నాళ్ళు పోషించి వారి ద్వారా తమ రియలెస్టేట్ దందా నడిపి కోట్లు కూడబెట్టుకున్న రాజకీయ నాయకులు పోలీసులు ఇంక అక్కరలేదు అనుకున్న సమయాన ఇలా హత్య చేయడం తామేదో నిజాయితీపరులమన్న ముసుగు వేసుకునేందుకు చేసిన హత్య తప్ప మరేం కాదు. ఇది మీడియాలో ఓ మూడు రోజుల వార్త తప్ప ఇంకేం కాదు. మరల మరో పిచ్చివాడితో మొదలు పెట్టొచ్చు.

హతమైన వారికి వారి కుటుంబాలకు ఇది కాస్తా ఊరట కావచ్చు కానీ రాజ్యం ఇలా చేసే పగటి హత్యలను ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్సును సమర్ధించలేను.

18, ఏప్రిల్ 2016, సోమవారం

కానుగపూల పరిమళం...


కొన్ని సాయంత్రాలు దేహం కోల్పోయిన
ఆత్మను మోసుకొస్తుంది


అడుగుల పరిధి కుంచించుకొని
ఒక మాత్ర అందని దూరంలో విసిరేయబడతావు


పహరా చుట్టూ కంచె పెరుగుతూ
నడకను నియంత్రిస్తుంది


నీలోని ప్రతి అణువును మలేరియా తిని
మెదడుకు పాకి కళ్ళను పైకెగదోస్తుంది


నిట్ట నిలువుగా వెన్నును విరిచి
కాళ్ళను చేతులను హరిస్తుంది


నీ నుదుటి మీద వెన్నెల ఓ
దు:ఖపు ముద్దుగా మెరిసి కుంగిపోతుంది


నువ్వంటావు చివరిగా ఈ ఝెండా 
భుజం మార్చుకుంటుందా అని


రవీ నువ్ నడిచినంత మేరా పరచుకున్న
ఈ కానుగ పూల పరిమళం అద్దుకుని


అటు చివర ఆ బాలుడు విల్లునలా
గురిచూస్తూ విసురుగా వస్తున్నాడు...


(మలేరియా కబళించిన  కామ్రేడ్ సి.సి.కమాండర్ రవి స్మృతిలో)

16, జనవరి 2016, శనివారం

ఆయనొక్కడే...


ఆయనలా 
తన దేహాన్నే నిరసన చిత్రంగా
ఈ దేశ కాన్వాసుపై వేసి
ఖళ్ళున ఇంత నెత్తురు ఉమ్మి పోయాడు


నువ్వూ నేను నిర్లజ్జగా ఇలా
బతుకును ఓ విరిగిన బండి చక్రంగా 
ఈడ్చుకుంటూ పోతున్నాం



తనలా విసురుగా కొన్ని పదాలు
నినాదాలుగా మార్చి అనాధ గొంతులో
స్వరాలుగా యిచ్చి పోయాడు



ఆయనొక్కడే 
అలిసెట్టి ప్రభాకరుడు
కోటి వెతల క్రోధాగ్ని జ్వాల అతడు
బతుకునొక నిప్పుల గుండంగా వెలిగించి చూపినవాడు



నొ
క్క
డే
నెత్తురు చిమ్మిన కుంచె చివరంటా జ్చలించిన వాడు


(అలిసెట్టి ప్రభాకర్ స్మృతిలో)
(12-01-2016)

10, ఏప్రిల్ 2015, శుక్రవారం

దగ్గర్లోనే...


ఇప్పుడంతా సముద్రం
ఇంకిపోయిందని సంబరాలు 
చేసుకుంటున్నారు!


వెటకారపు నవ్వులతో చూపులతో
వెకిలి చేష్టలతో అంతా అయిపోయిందని
గెంతులేస్తున్నారు!


అడిగేవారే లేరని
అడవితో పాటుగా నగరంలోనూ
విరుచుకుపడుతున్నారు!


కన్నాభిరాన్ లేడూ బాలగోపాల్ లేడూ
హెబియస్ కార్పస్ పిటిషన్ లేదూ
లాకప్లో చంపినా దిక్కులేదు వీళ్ళకని!


కానీ నీ నేల కింద 
సముద్రం కుతకుతలాడుతూ 
జనం సునామీలా ఎగసిపడే రోజు దగ్గర్లోనే!!

14, జనవరి 2015, బుధవారం

మరో గొంతు మూగదయిన వేళ..

Perumal Murugan

They killed another writer when we all are in silence...
అవును ఇప్పుడు వాడొక్కొక్క గొంతునూ నులిమేసి
కళ్ళకు గంతలతో ఉరికంబమెక్కిస్తున్నాడు
తన చుట్టూ భజనపరులను పేర్చుకుంటూ
మన చుట్టూ గోరీ కడుతున్నాడు
మేధావులంతా మేతలకు అలవాటు పడ్డ
ఈ కాలంలో
పిడికిలెత్తాల్సిన చేతులలో
మేకులు దిగేస్తూ...
పెరుమాళ్ మురుగన్
మరో సోక్రటీస్ కాకూడదంటే
మనమంతా గొంతుకడ్డంపడ్డ
వెళక్కాయని ఉమ్మి
బిగ్గరగా నినదించాల్సిన
సమయమిదే
మరో హత్య జరుగకముందే...
(తమిళ రచయిత ప్రొ. పెరుమాళ్ మురుగన్ తన నవల మధోరుభగన్ పై హిందూ మతోన్మాదుల దాడికి వ్యతిరేకంగా రచనా వ్యాసంగం నుండే విరమిస్తున్నా అని ప్రకటించిన నేపధ్యంలో)

26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

అలిపిరి తీర్పు బాబుకు దసరా కానుకా?


అలిపిరి దాడి కేసులో నిందితులపై సాక్ష్యాధారాలు లేవని సిట్ అధికారి చెప్పినా తిరుపతి సెషన్స్ జడ్జి వాటిని పట్టించుకోకుండా నిందితుల వాంగ్మూలాలను నామమాత్రంగా విని శిక్ష వేయడం ఈ తీర్పు రాజకీయ తీర్పుగానే పరిగణించాల్సి వస్తుంది. దర్యాప్తు అధికారి యిచ్చిన సాక్ష్యాన్ని కూడా వినని కోర్టులుగా రాజకీయ నాయకుల మాటే తీర్పుగా వెలువరించడం ఇటీవల సాధారణమవుతోంది. ఈ దేశంలో కాసింత మిగిలిన ఆశ కూడా ఇలా డబ్బు పాలు కావడం అధికారానికి దాసోహమవడం దారుణ పరిణామం. ఈ తీర్పు వెలువరించిన సమయం కూడా నాటి బాబు పర్యటనకు దగ్గరైన కాలం ఒకటే కావడం యాధృచ్చికం కాదని తెలుస్తోంది. రిటైరయ్యాక అధికార పార్టీలు ఇచ్చే పదవులు ఇటీవల కేరళ గవర్నర్ గా నియమితుడైన న్యాయాధీశులుంగారిని చూస్తే మనకు వీరి పట్ల గౌరవముండాల్సిన పనిలేదని అవగతమవుతోంది. 'న్యాయదేవత'??? కళ్ళే కాదు చెవి ముక్కూ నోరు కూడా కుట్టేస్తున్నారా? ప్రజాస్వామిక వాదులంతా మాటాడాల్సిన సమయమిది.

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

సెప్టెంబర్ 21

సెప్టెంబర్ 21 భారత విప్లవోద్యమ చరిత్రలో ఓ ముఖ్య ఘట్టానికి నాంది పలికిన రోజు. కమ్యూనిస్ట్ పార్టీల ఐక్య సంఘటన కోసం పరితపించే విప్లవాభిమానులకు మరపు రాని రోజు. ఎర్రజెండా పార్టీలన్నీ ఒకే గాటన కట్టి వాటి మధ్య ఐక్యత కావాలని కోరుకోవడం అనవసరమైనది. ఎందుకంటే నాటి తెలంగాణా సాయుధ పోరాట విరమణ తరువాత భా.క.పా. పార్లమెంటరీ రొంపిలో కూరుకుపోగ చాలా మంది కార్యకర్తలు గోదావరి జిల్లాల వారు సినిమాలోకంలో మునిగిపోయారు. ఆ తరువాత 1964 ప్రాంతంలో భా.క.పా.ను రివిజనిస్ట్ పార్టీగా పేర్కొంటూ మార్క్సిస్ట్ పార్టీగా అవతరించి అంతే తొందరగా కరడు కట్టిన ఎన్నికల పార్టీగా మారిపోయింది. దీనికి ప్రత్యామ్నాయంగా నక్సల్బరీ పోరు హోరున ముందుకు వచ్చింది. ఇదే మార్క్సిస్ట్ పార్టీ తీవ్రమైన రాజ్యహింసకు పాల్పడుతూ ఆ పోరాటాన్ని అణచడంలో కీలక పాత్ర వహించింది. ఆ పంథాలో మరల తెలుగుదేశంలో శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటం ఉవ్వెత్తున లేచింది. తీవ్రమైన సైనిక అణచివేతకు గురైనా దేశంలో విప్లవాగ్ని చల్లారలేదని పోరాటాలకు తూరుపు ఎరుపు సాక్షిగా నిలిచింది. అదే స్ఫూర్తితో జగిత్యాల పోరుతో మొదలై భా.క.పా. (పీపుల్స్ వార్) అవతరించింది. రెండు దశాబ్ధాల పోరాటంతో దేశంలో అతిపెద్ద విప్లవ పార్టీగా జనం మదిలో నిలిచి పోరాట బావుటాను ఎత్తి పట్టింది. ఇదే క్రమంలో పార్టీ యూనిటీతో ఐక్య సంఘటనను ఏర్పరచుకోని మరింత ముందుకు పోయింది. ఆ తరువాత 2004 సెప్టెంబర్ 21న ఉత్తర భారతదేశంలో MCC తో పొత్తు కుదిరి విశాల ఐక్య సంఘటనకు నాందిగా భా.క.పా. (మావోయిస్ట్) గా మారి దేశంలోని ప్రధాన దళారీ పార్లమెంటరీ పార్టీలకన్నింటికీ ఏకైక ప్రతిపక్షంగా నిలిచి పోరాడుతూ దేశంలోనే ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగానే కాక జనతన సర్కార్ ను ఏర్పాటు చేస్తూ ప్రజా ప్రత్యామ్నాయ పాలనను స్థాపిస్తూ ఎర్రజెండా రెపరెపలను ఆకాశానికెత్తిపడుతూ వుంది.
ఇదే సమయంలో ఎర్రజెండా పార్టీలుగా చెప్పుకునే చాలా పార్టీలు ప్రజలు ఇంకా విప్లవానికి సంసిద్ధం కాలేదు దేశంలో విప్లవకర పరిస్థితులున్నాయి కానీ పోరాటాలను ఆర్థిక పోరాటాలకే సరిపెడుతూ తమ పిరికి నాయకత్వాన్ని సిద్ధాంతాలను వల్లిస్తూ ప్రజలను ఎరుపు దనంతో వంచిస్తూ వీధి పోరాటాలకు కూడా దూరంగా జరిగి పేపర్ స్టేట్ మెంట్లకే పరిమితమయి పోయి చంద దందాలతో నెట్టుకొస్తున్న విప్లవ పార్టీలు చాలా వున్నాయి. ఇవి ఏనాటికీ ప్రజాపంధాలో కలిసేవి కావు. వీరి పంధా మారకుండా వీరితో ఐక్య సంఘటన ఏనాటికీ కుదరదు. ఇంకా సిపిఐ, సిపిఎం పార్టీలు ఏనాడో ప్రజలకు దూరంగా జరిగి దళారీ పార్టీలకంటే ఘోరంగా నీచ పొత్తులకు పాల్పడుతూ అసెంబ్లీ పార్లమెంట్లలో సీట్లకు కక్కుర్తి రాజకీయాలకు పాల్పడే లోఫర్ పార్టీలు ఈ పేరును మార్చుకుంటే సంతోషిద్దాం.
ఈ రోజు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్వహించదలచిన సభను తెలంగాణా ఆంధ్ర ప్రభుత్వ పాలక వర్గాలు ఏకమై అక్రమ అరెస్టులతో అడ్డుకొని తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాయి. పేరుకు మాత్రమే తాము వేరు వేరు పార్టీలుగా ప్రాంతాలుగా చెప్పుకుంటూ ప్రజల ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని అడ్డుకోవడంలో బలప్రయోగం చేయడంలో దొందూ దొందేనని నిరూపించుకొన్నాయి.
ప్రజా పోరాటాలను ఎత్తిపడుతూ ఈ దేశ ప్రత్యామ్నాయ రాజకీయ పంధాను ఎలుగెత్తి చాటుదాం.

13, సెప్టెంబర్ 2014, శనివారం

కామ్రేడ్ జతీంద్ర నాద్ దాస్ అమర్ రహే..

Comrade Jatindra Nadh Das


కామ్రేడ్ జతీంద్రనాద్ దాస్ పట్టుదలకు త్యాగనిరతికి నిలువెత్తు నిదర్శనం. స్వాతంత్ర్య పోరాట కాలంలో తమను రాజకీయ ఖైదీలుగా గుర్తించాలని, జైలులో ఖైదీలకు సౌకర్యాలు మెరుగుపడాలని తమ పట్ల జైలు అధికారుల అనుచిత ప్రవర్తన, కౄర హింస పట్ల వ్యతిరేకతతో 63 రోజులు నిరాహార దీక్ష చేపట్టి ఇదే రోజున 1969లో జైలులోనే అమరుడయ్యాడు. 

ఆయన పోరాట స్ఫూర్తితో నేటికీ అనేక మంది రాజకీయ ఖైదీలు జైలులో పోరాటం చేస్తున్నారు. పదేళ్ళకు పైగా అండర్ ట్రైలు ఖైదీలుగా మగ్గుతూ నిత్యమూ అనేక మంది మానసికంగా ఒంటరితనంతో మగ్గి పోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు, అనారోగ్యం పాలవుతూ సరైన వైద్య సౌకర్యాలు లేక చనిపోతున్నారు. అక్రమ కేసులు బనాయించి మావోయిస్టు ముద్రతో వేలాది గిరిజన జనం రాజకీయ ఖైదీలుగా జైళ్ళలో మగ్గుతున్నారు. ప్రతిసారీ ఆగస్టు 15, అక్టోబర్ 2 తారీఖులలో రాజకీయ పలుకుబడిగల ఖైదీలు ప్రభుత్వ ప్రాపకంతో విడుదలవుతున్నారు. వామపక్ష భావజాల నెపంతో వేలాది మంది ఖైదీలు జైల్లలో వుండిపోతున్నారు. చేయని నేరాలకు శిక్ష అనుభవించేవారే ఖైదీలలో ఎక్కువమంది. 

కామ్రేడ్ జతిన్ దాస్ స్ఫూర్తితో రాజకీయ ఖైదీల విముక్తి కొరకు ప్రజాస్వామిక వాదులు తమ మద్దతు తెలుపుతూ వారిని బేషరతుగ విడుదల చేసేందుకు కృషి చేయాల్సిన సమయమిది.

కామ్రేడ్ జతీంద్ర నాద్ దాస్ అమర్ రహే.
రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేద్దాం. 
Demand to release all political prisoners..

15, ఆగస్టు 2014, శుక్రవారం

మేరా భారత్ మహాన్...



ఒకసారి మన్నించేయ్ 
ఇప్పుడేదో సాధించలేదని 
ఇంకెప్పుడో సాధించి పెడతామని 
ఆశ పడుతూ ఆశ పెడుతూ 
నీకో చాక్లెట్ ఇచ్చి 
జై కొట్టించి 
ఎండలో నిలబెట్టినందుకు

ఎగిరినంత సేపు లేదాయె గాలి
మూడు రంగులూ మూడు రంగులే ఎప్పటికీ
అవేవీ కలవకుండా ధర్మ చక్రం గిర్రున తిరుగుతూనే వుంటుందిలే

నీ రంగు నీదే నా రంగు నాదే 
వాడక్కడే ఏడుస్తూ ఈడుస్తాడు 
నేనిక్కడే కదలకుండా వల్లెవేస్తుంటాను
నువ్వక్కడికక్కడే నీలో నీవు మరిగిపో

ఎవడి నీళ్ళు వాడివే ఎవడి కంపు వాడిదే
గొంతు తడవనీయడెవడు
బురదనూడ్చేస్తానంటాడొకడు 
కడిగి పారేస్తానంటాడొకడు
వీళ్ళిద్దరి నాలుక కింద తిరుగాడే స్క్రూ వేరొకడిది

హద్దులు చెరిగిపోవాలంటాడొకడు
ఏ హద్దులో చెప్పని టక్కరి వాడు
నువు వదులు చేసాక పెడతాడా బోర్డ్ 
ఇక్కడ అన్నీ అమ్మబడును అని

చివారఖరికి నీ గోచి పాతకు
పిన్నీసు గుచ్చి 
వేలాడదీస్తావు 
చిరిగిన మూడు రంగుల కాగితాన్ని

మేరా భారత్ మహాన్...

24, జులై 2014, గురువారం

ఈలం టు పాలస్తీనా...


ఒక్కోసారంతే 
నిస్సహాయత అసమర్థత్వం అసహనంగా మారి వెంటాడుతూ 
వేటాడుతూ నిలవనీయవు అలా అని పరుగెత్తనీయవు
నీరసంగా ఓ మూల కూలబడేట్టు చేసి

మొన్న ఈలం 
నిన్న ఎన్నికల ఫలితాలు
నేడు పోలవరం బిల్లు
ఎన్నాళ్ళుగానో పాలస్తీనా

ఒక్కోటీ ఒకదానికొకటి ముడిపడే వున్నట్టు 
నెత్తురంటిన దారపు కొసలు ముడివడీ పడనట్టు 
నీ కళ్ళపై ఓ కఫన్ అల్లిక చేరి నిద్రపొమ్మని 
గట్టిగా నీ మెడ నరం తెగేట్టు కొరికినట్టు

ఆవులింతల మధ్య ఆవిరయ్యేనా ఈ 
క్షణాల ప్రకంపనల తీవ్రత 
మరిగే రక్తం టీ కాచే పాత్రను వీడి బయటకు రాని డికాక్షన్ లా కుత కుతలాడుతూ

వాడొక్కా బాలూ తంతూ లాటిన్ అమెరికా యవ్వనపు శీర్షాన్ని విరగతన్ని
బంగారపు బంతిని ఎగరేసుకు పోయి
నాజీల మారాజూ విరగబడినవ్వుతున్నాడు...

ఇదంతా గొలుసుగా కొనసాగినా మనకు మన చర్మానికి
ముక్కుపుటాలకి కమురు కంపు తెలీనివ్వని చంకలనిండా పూసుకున్న
AXE మత్తులో జోగుతూ సెలవింక....

16, మే 2014, శుక్రవారం

యుద్ధమూ - భూమీ..


ఔను నువ్వెన్నయినా చెప్పు 
భూమ్మీదే భూమి కొరకే యుద్ధం జరుగుతుంది..


ఈ నేల మాళిగలలో ఇగిరిన నెత్తురంతా 
భూమికోసమే


ఒక రాణీ నవ్విందనో ఏడ్చిందనో అన్నది
 సాకు మాత్రమే 

నేల కొరకు నేలపై హక్కు కొరకు నేల 
సరిహద్దుల మార్పు కొరకే


భూమి పుత్రుల నెత్తుటి ధారతో 
ఈ నేల సరిహద్దు రేఖలు గీయబడ్డాయి


సరిహద్దులన్నీ చెరిపేసే నెత్తుటి 
ధారాపాతం


నియాంగిరీ సాక్షిగా నేల తల్లి పొత్తిళ్ళలో దాగిన సంపద 
బొక్కే దొంగలను నిలువరించే యుద్ధం


యిది ముమ్మాటికీ సత్యం వారసత్వంగా
 కొనసాగే యుద్ధం 

నువ్వు ఎన్ని ఆపరేషన్లతో పరేషాన్ అయినా 
ఆపలేని యుద్ధం..

21, ఏప్రిల్ 2014, సోమవారం

నవ్వూ యుద్ధ వ్యూహమే..


నీలా వెన్నెల కురిసేలా నవ్వగలగడం
కూడా యుద్ధ వ్యూహమే కామ్రేడ్

శతృవు గుండెల్లో గుబులు పుట్టించే
ఆ నవ్వు కూడా ఆయుధమే కామ్రేడ్

మా గుండెల్లో దిగులు పారదోలే
సాయుధరూపం నీ నవ్వు కామ్రేడ్

నీ నవ్వు మహా ప్రస్థానానికి
ఉద్యమ గేయం కామ్రేడ్

నీ నవ్వు అంబరాన
ఎగరేసిన ఎర్రజెండా కామ్రేడ్

నీ నవ్వునింకా బాలింతరపు పరిమళం
వీడక పునర్జన్మిస్తూనే వుంది కామ్రేడ్..

17, ఏప్రిల్ 2014, గురువారం

అసహ్యం నాకు...


అసహ్యం నాకు...

వాడెప్పుడూ తన ముఖాన్ని దాచుకోలేదు

నెత్తురంటి
కంపుకొడుతున్న చేతులని దాచుకోలేదు

మెడలో వేసుకున్న బాలింతరాలి పేగులను జంధ్యంలా పేనుతున్నాడు

కంకాళాలను కాలికింద నలుపుతూ సింహాసనమెక్క వస్తున్నాడు

దేశమంతా స్మశాన నిశ్శబ్దం వాగ్ధానం చేస్తూ రంకెలేస్తూ వస్తున్నాడు

వాడొక్కడే ఈ నేలకు వారసుడుగా త్రీడీలో పోజులిస్తున్నాడు

వాడిప్పుడు అధికారంతో చేతులు కడుక్కోజూస్తున్నాడు

వాడి చుట్టూ చేరుతున్న భజనపరులను చూస్తేనే అసహ్యం నాకు

12, ఫిబ్రవరి 2014, బుధవారం

దేవుడిపై యుద్ధం ప్రకటించావా?


దేవుడిపై యుద్ధం ప్రకటించావా?

సరే
....

నీ దగ్గర ఆయుధమేముంది?

కలం
...

యిది చాలా ప్రమాదకమైనది

ఉరితీయండి వీడ్ని
...

అత్యంత ప్రమాదకరమైన ఆయుధం
మనసులలోకి దూసుకు పోయే ఆయుధం
...

మతమా నువ్వు మరణిస్తే కానీ
మానవత్వం బతకదు
...

రాజ్యమా నువు సమాధి అయితే కానీ
ప్రపంచం వికసించదు
...

హాషిం షబానీ
నీ మెడ ఎముక విరిగినా
నీ పాళీ విరగలేదు

నీ మరణం చిరస్మరణీయం

(ఇరాన్ లో మైనారిటీ అరబ్ జాతీయుల హక్కుల కోసం పోరాడిన కవి హాషిం షబానీ నిజాద్ ని మూడేళ్ళు బంధించి చిత్రహింసలకు గురిచేసి జూలై 2013 లో ఉరితీసారని చదివి)

25, నవంబర్ 2013, సోమవారం

తల తెగిపడినా ఈ నేల నాదే...



మధ్య తరగతి బుద్ధిజీవులకు ఈ దేశ ప్రజాస్వామ్యంపై ఈ పింజారీ వ్యవస్థపై నమ్మకాన్ని సడలకుండా పోరాడే తత్వాన్ని దూరం చేసేందుకు విదేశీ స్వదేశీ పెట్టుబడిదారుల తొత్తులు అయిన NGO's, కొన్ని మీడియా సంస్థలు (తెహెల్కా వంటివి) చాలా కృషి చేస్తున్నాయి అని అర్థమవుతోంది కదా! వీళ్ళ వెనక దోపిడీదారుల సొమ్ము పెట్టుబడిగా థింక్ వెస్టివల్స్, మరికొన్ని సాహిత్య సేవలు (రాంకీ వంటివి) పేరిట ఆలోచనలను కుళ్ళబెట్టే పండగలు జరిపి దేశానికి ఉద్దరించేస్తున్నామని డబ్బాలు కొడుతుంటాయి. వీళ్ళ అసలు రంగు ఇలా బయటపడుతుంది అప్పుడప్పుడు. ఈ గ్రీకు వీరుల రంకు చేష్టలు, మహిళలపై దాడులు హీరోలుగా ప్రచారానికీ ఉపయోగపడుతుంటాయి.
మధ్య భారతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యాపారానికి తీవ్ర స్థాయిలో ఎదురవుతున్న స్థానిక గిరిజన ప్రజానీకంపై జరుగుతున్న అమానుష అత్యాచార దాడులను ఒక్క మీడియా కూడా ప్రచారంలోకి తేవడంలేదు. అటు సైన్యం చేతిలో, ప్రైవేటు సైన్యం చేతులలో హత్యలకు, మానభంగాలకు గురవుతున్న నియాంగిరీ ప్రాంత ఆదివాసీ ప్రజానీకం తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతిఘటన ర్యాలీలు చిన్న స్థానిక నియోజక వర్గం కాలంలలో ప్రచురించే మీడియా సో కాల్డ్ ఫేజ్ త్రీ షోకిల్లా రాయులకు ఇంత పబ్లిసిటీ ఇస్తుంది. 

ఆదివాసీలను మనుషులుగా గుర్తించని వీరు మనుషులేనా??
ఈ దేశ ఖనిజ సంపదను, నేలపై హక్కును కాపాడి తద్వారా ఈ దేశ సార్వభౌమత్వాన్ని సమున్నతంగా నిలిపే ఆ మూలవాసులు చేసే పోరాటానికి కాసింత బాసటగా నిలుద్దాం. తద్వారా మన కాళ్ళ కింది నేలను కాపాడుకుందాం.

29, అక్టోబర్ 2013, మంగళవారం

'వామపక్షం - నూతన ప్రపంచం' - మార్త హర్నేకర్ ( Marta Harnecker)


మార్త హర్నెకర్ ఒక సామాజికవేత్త, రాజకీయ శాస్త్రవేత్త. పత్రికా రచయిత్రి, ఉద్యమకారిణి. 1960వ దశకం చివరిలో ఆమె రచించిన ' The Basic Concept of Historical Materialism ' అనే పుస్తకం ప్రచురించిన తర్వాత లాటిన్ అమెరికాలోని మార్క్సిస్టు వామపక్షం ఆమె రచనలను అత్యంత విస్తృతంగా చదవటం మొదలయింది. బొలివేరియన్ విప్లవాన్ని (సైమన్ బొలివర్ అనే వెనిజులా తత్వవేత్త ఆలోచనలతో, ఉత్తేజంతో ముందుకు వచ్చిన విప్లవ సిద్దాంతం) బలంగా సమర్థించుతూ మార్తా హర్నేకర్ అనేక రచనలు చేసారు. ఈ పుస్తకం 'Re building of the Left' అనే పుస్తకానికి అనువాదం తెలుగులో ఆశాలత గారు చేసారు. సంగం మీడియా గ్రూపు వారి ప్రచురణ. మిత్రులు Rajendra Prasad Yalavarthy గారు నాకు ఈ పుస్తకాన్ని పరిచయం చేసారు. వారికి ధన్యవాదాలు. మార్క్సిజం పై ఓ కొత్త ఆలోచనా ధారను మనకందించే ఈ పుస్తకం పూర్తయ్యాక మళ్ళీ మాటాడుకుందాం. మీరూ చదవండి. విశాలాంధ్ర, ప్రజాశక్తిలలో దొరుకుతుంది.

20, సెప్టెంబర్ 2013, శుక్రవారం

కా. చాయారాజ్ అమర్ రహే


విప్లవ కవి సిక్కోలు గొంతు జనసాహితీ వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ చాయారాజ్ ఈ రోజు ఉదయం 8.30 గం.ల ప్రాంతంలో శ్రీకాకుళంలో తుదిశ్వాస విడిచారు. ఆయన రచనలు శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం), గుమ్మ (కొండ కావ్యం), దర్శని (కావ్యం), నిరీక్షణ (దీర్ఘ కవిత), మట్టి నన్ను మవునంగా ఉండనీయదు (కవితా సంపుటి) బుదడు (కావ్యం). మొన్న 18న ఆయన రచన 'కారువాకి' (నవల) శ్రీకాకుళంలో ఆవిష్కరించారు. ఇవన్నీ ఆయన ఉద్యమాలలో తనను తాను ఆవిష్కరించుకునే క్రమంలో రాసిన కవిత్వం.

బుదడు కావ్యంలో చివరిగా చాయారాజ్ గారన్నట్టు " కవీ! మృత్యువు నీకు బంధువు, నీ కోర్కె ప్రకారం నిన్ను విశ్వ సౌందర్యంలోనికి ఒంపేస్తుంది. ఉషస్సులలో, సంజలలో, ఎండ్లల్లో వెన్నెల్లో ఇంకిపోతావు. అనంతమైపోతావు. ఎందుకూ మిగలవు. ఎవరికీ తగలవు. " మృత్యువు అతనికి ప్రియురాలు. అతడ్ని ధ్వంసం చేస్తుంది. మళ్ళీ మళ్ళీ పునర్ నిర్మిస్తుంది. ఒక అసంతూప్రి స్థితిని సంతృప్తపరిచేందుకు - ప్రేరణ ప్రతీకార చర్యలే జనన మరణ నిజాలు".

నిజమే. చాయారాజ్ మాస్టారుని మృత్యువు కేన్సర్ రూపంలో తనను కబళించినా మనందరిలో తన స్ఫూర్తిని మిగిల్చిన కావ్యాలాపన ద్వారా మనల్ని పునర్నిర్మించే మరో కార్యసంబంధమైన పనిలోకి ఈ మట్టిలోలోపలికి ఇంకిపోతూ ఇగిరిపోతూ అమరులయ్యారు.

జోహార్ కా.చాయారాజ్ జోహార్
మీ ఆశయాలను కొనసాగిస్తాం..