24, నవంబర్ 2011, గురువారం

చిదంబరం గ్రూపునకు మమత చెల్లించిన కప్పం..




రోజు సాయంత్రం వరకు ఫాసిస్ట్ పాలకవర్గం దాచిన వార్త కిషన్జీ హత్య. పశ్చిమ బెంగాల్ లోని పురూలియా వద్ద మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు, అరవై ఏళ్ళ వయసు ముప్పాఐదేళ్ళకు పైగా ప్రజా ఉద్యమ జీవితంలో వున్న నేతను కేంద్ర బలగాల సాయంతో హత్య గావించి తన ఎన్నికకు పరోక్షంగా సహకరించిన కార్పొరేట్ దొర చిదంబరం ఆండ్ కోకు మమత ఇచ్చిన బహుమానం ఇది.

పశ్చిమ బెంగాల్ లో గత ముప్పైఏళ్ళకు పైగా అధికారంలో పాతుకుపోయి ఫాసిస్ట్ గా మారిన మార్క్శిస్ట్ పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా జంగల్ మహల్ లో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి సింగూర్ మొదలుగా గల విధ్వంసకర పారిశ్రామికీకరణను ప్రజా ఉద్యమం ద్వార పోరాడి పెట్టుబడిదారుల గుండెల్లో బల్లెంలా మారిన కిషన్జీ @ మల్లోజుల కోటేశ్వర రావును హత్య చేసి కాంగ్రెస్ ఋణం తీర్చుకుంది మమత..

భారత దేశ ప్రజా ఉద్యమ చరిత్రలో సుదీర్ఘ కాలం తన పోరాట రూపాలతో ప్రజలలో మమేకమై అత్యంత ఆధునిక సాంకేతిక మిలటరీ పరిజ్ఞానానికి కూడా చిక్కకుండా జంగల్ మహల్గా పిలిచే లాల్ఘర్, సింగూర్, పురూలియా ప్రాంతాలలో బలమైన ప్రజా ఊద్యమాన్ని నిర్మించి పాశవిక ఫాసిస్ట్ రాజ్యానికి వ్యతిరేకంగా ఆదివాసీ అణగారిన ప్రజా సైన్యాన్ని నిర్మించి రాజ్య సైనిక బలగాలకు సవాల్ గా నిలిచిన మావోయిస్ట్ నాయకుడు కిషన్జీ..

ఒకవైపు శాంతి చర్చలకు ఆహ్వానిస్తూ మరోవైపు వేలాది కేంద్ర పారా మిలటరీ బలగాలతో ఉద్యమకారులను మట్టుబెట్టేందుకు ముందుకు వస్తున్న మమత చిదంబరంల వ్యూహాన్ని హత్య బయట పెడుతోంది.. ప్రజా ఉద్యమాల పట్ల రాజ్య ఫాసిస్ట్ నిర్బంధాన్ని ప్రజాస్వామిక వాదులు, మేధావులు ఖండించడాన్ని కూడా సహించలేనంత ఫాసిస్ట్ ముఖాన్ని ఇటీవల మమత బయటపెడుతోంది.. రాజ్యహింసను మేధావులు, రచయితలు, విద్యార్థి, హక్కుల సంఘాలు ఖండిస్తూ ప్రజా చైతన్యాన్ని బలోపేతం చేస్తూ ఉద్యమాలను కొనసాగించాల్సిన అవసరాన్ని హత్య మరో మారు గుర్తు చేస్తోంది...