28, అక్టోబర్ 2010, గురువారం

నలభై ఏళ్ళ తరువాత వర్ఘీస్ బూటకపు ఎన్ కౌంటర్ పై తీర్పు..
కేరళ లోని సి.బి.ఐ.కోర్టు నేడు వర్ఘీస్ బూటకపు ఎన్ కౌంటర్ పై తీర్పునిస్తూ నాటి డిఎస్పీగా పనిచేసి ఐ.జీ.గా రిటైరైన లక్ష్మణన్ కు యావజ్జీవ కారాగార వాస శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానాను విధిస్తూ తీర్పునిచ్చింది.

నలభైఏళ్ళ క్రితం వర్ఘీస్ అనే కుఱవాడిని వాయనాడ్ అడవుల్లో చేతులు వెనక్కి కట్టి కాల్చివేసిన కేసుపై న్యాయస్థానం ఈ తీర్పునిచ్చింది. ఇదే కేసులో ముద్దాయియైన విజయన్ అనే డిజీపిని benefit of doubt కింద విడిచిపెట్టింది. వీళ్ళిద్దరూ నాడు అనేక బూటకపు ఎదురుకాల్పులకు పాల్పడ్డారని, నక్సలైట్ ముద్రవేసి ఇంజనీరింగ్ విద్యార్థి రాజన్ నుకూడా మాయం చేసారన్న ఆరోపణలున్నాయి. నేటికి రాజన్ కేసు మిస్టరీగానే మిగిలింది. విజయన్ ను వదిలేయడాన్ని వర్ఘీస్ కుటుంబ సబ్యులు తప్పుబట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐ.జీ.కి మరణదండనకు సిఫారసు చేసారంటే ఈయన గారి అధికార దుర్వినియోగం, కృరత్వం ఎంతో తెలుస్తోంది.

మన రాష్ట్రంలోనూ ఇలాంటి హత్యలకు పాల్పడిన వాళ్ళు అనేక వందలమంది వున్నారు. వాళ్ళకు ఆక్సిలరీ ప్రమోషన్ లిచ్చిన పాలక వర్గాన్ని కూడా తప్పక న్యాయస్థానం ముందు నిలబెట్టాలి. న్యాయస్థానాలు ఇలాంటి కేసులను ఇన్ని సం.లు నాన్చడం వలన దోషులు కొంతమంది శిక్షనుండి తప్పించుకునే అవకాశం మెండు. ఈయన ఆదేశాలను పాటించిన CRPF constable చనిపోయాడు. అలాగే విజయన్ సరైన సాక్ష్యాలు లేవంటూ బయటపడగలిగాడు. వీళ్ళ గురించి రాజన్ తండ్రి రాసిన నాన్న అనే పుస్తకంలో చదవొచ్చు. వీళ్ళు ఎంతలా ఆనాడు బరితెగించారో ఆయన మాటలద్వారా తెలుస్తుంది. నాటి కేరళ ముఖ్యమంత్రి అచ్యుతరామన్ గురించికూడా.

ఇలాంటి కౄర పోలీసు అధికారులకు ఈ తీర్పు ఓ గుణపాఠం కావాలి.

ఎదురుకాల్పులపై హత్యాకేసు నమోదు చేసి న్యాయస్థానం విచారణ చేపట్టాల్సిన అవసరముంది.

ఆమరణ దీక్షకు అర్థం చెప్పిన జతిన్ దాస్ స్మృతిలో..తొలినాటి స్వాతంత్ర్య వీరులలో చెప్పుకోదగిన వారు జతిన్ దాస్. జైలులోని అసౌకర్యాలపై, అసమానతలపై పోరాడుతూ ఆమరణ దీక్ష చేస్తూ 63వ రోజు నాడు అమరుడైన ఏకైక ఖైదీ జతిన్ దాస్.

జతిన్ దాస్ కోల్ కతాలో అక్టోబర్ 27, 1904లో జన్మించారు. అనుశీలన్ సమితి అనే బెంగాలీ విప్లవ సంస్థలో పని చేసారు. గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో కూడా పాలుపంచుకున్నారు. 1925 లో తను బి.ఏ.చదువుతున్నప్పుడు తన రాజకీయ అభిప్రాయాలపై బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి మెమెన్సింగ్ జైలులో ఉంచగా నాటి జైలు పరిస్థితులపై ఆమరణ దీక్ష చేయగా జైలు సూపరింటేండెంట్ క్షమాపణ చెప్పడంతో ఇరవై రోజుల తరువాత దీక్ష విరమించారు. ఆ తరువాత షహీద్ భగత్ సింగ్ నకు బాంబు తయారు చేసిచ్చిన కారణం చూపి లాహోర్ కుట్రకేసులో జూన్ 14, 1929న అరెస్ట్ చేసారు.

నాటి లాహోర్ జైలులోని ఘోర పరిస్థితులపై మిగతా విప్లవకారులతోపాటు తాను జూలై 13, 1929 నాడు మొదలుపెట్టిన ఆమరణ దీక్షను పట్టుసడలకుండా చివరివరకు కొనసాగించి, తీవ్రనిర్బంధ పరిస్థితులనెదుర్కొని సెప్టెంబర్ 13, 1929 న అమరుడైనాడు. ఆయన పార్ఠివ దేహాన్ని లాహోర్ నుండి కలకత్తాకు రైలులో తరలించగా వేలాది జనం నీరాజనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. జతిన్ దాస్ అంధించిన పోరాట స్ఫూర్తిని నేటి యువతరం అందిపుచ్చుకొని దేశం కోసం నేడు మరో స్వాతంత్ర్య పోరాటాన్నే జరపాల్సి వుంది. ఆయన జన్మదినం నిన్న జరుపుకొని నివాళులర్పించిన అనేక మంది యువతరానికి కృతజ్నతా పూర్వకంగా ఈ సంస్మరణ..

ఆమరణ దీక్షకు, పోరాట స్ఫూర్తికి నిర్వచనమైన కా.జతిన్ దాస్ అమర్ రహే..

10, అక్టోబర్ 2010, ఆదివారం

తెలంగాణా దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ఫ్రంట్ ను ఆహ్వానిద్దాం..డిసెంబరు 9 ప్రకటనతో తెలంగాణా వచ్చేసిందన్న భావం ఏర్పడి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్న ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఆంధ్రా లాబీయింగ్ కు తలొగ్గి శ్రీక్రిష్ణ కమిటీ పేరుతో చిదంబరంగారు సృష్టించిన మాయలో పడి ఉమ్ములో చిక్కుకున్న ఈగలా మారిన తెరాస వైఖరితో అనేకమంది విద్యార్థి యువజనుల ఆత్మ బలిదానాలను బలిపెట్టే విధంగా మార్చిన అన్ని రాజకీయ పక్షాల దొరతనాలకు వ్యతిరేకంగా ప్రజా యుద్ధ నౌక, తెలంగాణా పోరుబిడ్డ గద్దర్ నేతృత్వంలో ముందుకు వచ్చిన తెలంగాణా ప్రజా ఫ్రంట్ నాలుగు కోట్ల మంది ఆశలకు అణగారిన ప్రజల ఆశలకు కొత్త వూపిరిలూదగలదన్న నమ్మకాన్ని కలిగిస్తోంది.

డిసెంబరు తరువాత భూకంపాల్ని సృష్టించేస్తాం, అంతవరకు కడుపుబ్బరాన్ని అట్టిపెట్టుకోండని మాయ మాటలు చెపుతున్న కె.సి.ఆర్.నమ్మకద్రోహాన్ని ఉతికి ఆరేయాల్సిన సమయంలోనే ఫ్రంట్ ముందుకు రావడం హర్షణీయం. దీక్షను మధ్యలో వదిలేసి మోసం చేయబోతే విద్యార్థిలోకం తెగించి పోరాడడంతో వెలువడిన డిసెంబరు 9 ప్రకటనను అమలు చేయించాల్సిన తరుణంలో కాంగ్రెస్ కు ముఖ్యంగా కేంద్రంలోని నాయకత్వంనకు అడుగులకు మడుగులొత్తే విధంగా తయారై, పచ్చి సమైక్య వాది జగడపాటికి ఐ లవ్ యూ చెప్పడంవంటి వ్యాపార భాగస్వామ్య జిత్తులమారితనంతో, తన దొర దర్పం ప్రదర్శించాలనుకుంటున్న కె.సి.ఆర్.కు చెక్ పెట్టడానికి ఈ ఫ్రంట్ ఉద్యమించాలని కోరుకుందాం.

నాకు ఆంధ్రా, తెలంగాణా రెండు కళ్ళు, వ్యాపారాలకు సమైక్యాంధ్ర మూడో కన్నులాంటి ప్రకటనలతో ముందుకుపోతున్న బాబు కూటమి కుయుక్తులను అడ్డుకోవాల్సిన అవసరముంది. తెలంగాణా కోసం అమరులవుతున్న విద్యార్థి, యువజనుల పట్ల కనీస సానుభూతి లేని కాంగ్రెస్ లీడర్లు, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయించనని మొండిగా వున్న హోం మంత్రిని నిలదీయాల్సిన వారు ఇప్పుడు అమరులకు సాయమందించే పేరుతో దొంగ ఏడుపులేడుస్తున్న మూడు రంగుల పంచెగాళ్ళను మెడలు వంచాల్సిన అవసరముంది.

ఖచ్చితంగా తెలంగాణా ఎం.పీలందరిచే రాజీనామా చేయిస్తే కేంద్రం దిగివచ్చి పార్లమెంటులో బిల్లు పెట్టే అవకాశముందన్న దానిని పక్కకు పెట్టి, మొన్నటి ఉపఎన్నికలలో ప్రజల తీర్పును గుర్తించే విధంగా పాలకులపై వొత్తిడి తెచ్చే ఉద్యమాన్ని చేపట్టక నిద్దరోతున్న రాజకీయ బేరగాళ్ళను ప్రజాకోర్టుల ముందుంచాల్సిన విధంగా ఉద్యమించి తెలంగాణా ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి సమైక్యంగా ఉద్యమించి, తమలో వున్న భేదాభిప్రాయాలను చిన్నవిగా గుర్తించి ముందుకు పోవాలని ఆశిద్దాం. బహిరంగ వేదికలపై తమ అభిప్రాయ భేదాలను ప్రదర్శించకుండా కట్టడి చేయాల్సిన అవసరముందని విజ్నప్తి చేస్తున్నాం.

రండి కలసి పోరాడాడాండి..

4, అక్టోబర్ 2010, సోమవారం

కుష్టు దేహంపై తెల్ల వస్త్రం ఎంతకాలం కప్పగలవు???

కామన్ వెల్త్ క్రీడల నిర్వహణలో భాగంగా ఢిల్లీ నగరంలోని సుమారు అరవై వేలమంది బిచ్చగాళ్ళను, ఫుట్ పాత్ వ్యాపారులను దూరప్రాంతాలకు తరలించారన్న వార్త పట్ల వివిధ స్వచ్చంద సంస్థలు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాలలో కేవలం 2,2oo మందికి మాత్రమే వుండేందుకు వీలుంది. మిగిలిన వారిని బలవంతంగా రైళ్ళు ఎక్కించి పక్క పట్టణాలకు తరలించారు. దీనిపై మానవహక్కుల కార్యకర్తలు ఇలా స్పందించారు "నగర సుందరీకరణ, పట్టణ పునరుద్దఱణ కార్యక్రమాల్లో భాగంగా బిచ్చగాళ్ళను తరలించే పధకాన్ని అమలు చేశారు. అధికారులు తొలుత పేదవారిని నేరస్తులుగా చేశారు. తరువాత వారిని కనపడకుండా చేశారు.'' అని ఐజిఎస్‌ఎస్‌ఎస్‌కు చెందిన సింగ్‌ తెలిపారు. ''ఇది చాలా విచారించదగ్గ పరిణామం. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక పౌరుడు నివసిస్తున్న ప్రాంతాన్ని వదిలిపొమ్మని నీవు ఎలా వత్తిడి తెస్తావు? ఇది నగర పౌరుని ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమే.'' అని ఆయ అన్నారు".

ఈ దేశంలో ఇది కొత్త కాదు. చంద్రబాబు పాలనా కాలంలో బిల్ క్లింటన్ పర్యటన సమయంలో కూడా రోడ్లపక్కనున్న కాలువలపై కూడా తెల్లని వస్త్రాలు కప్పి తమ కుళ్ళును దాచే ప్రయత్నం చేసారు.

పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించే పనిలో విఫలమై ఇలా పై పూతల ద్వారా ఇతర దేశాలవారి ముందు గొప్పలకోసం తంటాలు పడుతున్న మన అంతర్జాతీయ స్థాయి ఆర్థిక నిపుణులైన పాలకుల వారు తమ తెల్లబారిన గెడ్డాలకు రంగువెసినంత మాత్రాన ముడుతలు పడ్డ చర్మాన్ని కప్పుకోగలరా? ఈ కుష్టు రోగాన్ని తెల్ల బట్ట మాటున ఎన్నాళ్ళు దాయగలరు? అసలు ఈ దేశ ఆర్థిక పరిస్థితి గురించిగాని, నగరాల కంపు బతుకుల గురించి విదేశీయులకు తెలియదా? ఇంత సిగ్గుపడుతూ వీటిని నిర్వహించాల్సిన అవస్రమేమొచ్చింది?

క్రీడల నిర్వహణకు తగలేసిని డబ్బుతో వీరందరికీ పునరావాసం కల్పిస్తే ఎంత సంతోషించేవారు?


వార్త ఆధారంఃhttp://www.visalaandhra.com/national/article-25928