29, జూన్ 2013, శనివారం

నల్ల సూరీడు..




















 నువ్వలానే గుర్తు నాకు
చూపులలో విస్ఫులింగాలను ప్రతిఫలిస్తూ
పిడికిలెత్తి పోరాట పతాకాన్నెత్తి పట్టినట్టు...

చీకటి ఖండంలో వెలుగులు నింపే
నీ యుద్ధ దరహాసం మెరుస్తున్నట్టు...

ఎందుకో
మరల మరల
అదే మాట మండే సూరీడు మండేలా
అంటూ గుండెల్లో పోటెత్తావు...

కానీ

పాతికేళ్ళు చీకటి కొట్లో దాచిన
వాడి జాత్యహంకారం నీకో శాంతి బహుమతినిచ్చినప్పుడు
చాచిన నీ చేతులు అంటే కోపమొచ్చింది...

నిన్నో స్టాంపును జేసి ఉమ్మినంటించే
వాడి కుట్రను నవ్వుతూ స్వీకరించావని
కోపమొచ్చింది...

అయినా
ఎప్పటికీ నల్ల సూరీడంటే
గుర్తుకొచ్చేది నువ్వే నువ్వే...

(మండేలాకు ప్రేమతో)


9, జూన్ 2013, ఆదివారం

బాకీ...

చప్పుడు కాని అడుగులో అడుగుతో
కాలాన్ని బంధించి ఊపిరాగిన
నిశ్శబ్ధంలోంచి రెప్పవేయని సమయాన్ని
ట్రిగ్గర్ పై చూపుడు వేలు బిగిస్తూ...

ఎండ పట్టిన ఆకాశపు బూడిద వర్ణంలోంచి
మట్టిని పూస్తూ ఆకు తొడిమలన్నీ
ఊదారంగులోకి మారుతూ నిప్పు కణికలోకి
ఊపిరిని ఎగదోస్తూ...

బిగిసిన వేలి లోంచి దూసుకు పోయిన
గురి పొలో పొలో నెత్తుటి పొలో మని
బిగ్గరగా సమూహమౌతూ నిన్నటి
బాకీని తీరుస్తూ....

రాతిరింత
నెత్తుటి వాన కురుస్తూ
పసరిక వాసనేస్తూ నెలవంక అంచునంటిన
ఎరుపు జీర జెండా అంచున మెరుస్తూ...

హొళీ హోళీ హొళొలి రంగా హోళీ
సమ్మకేళీల హోళీ అంటూ
ధింసా ఆడుతూ పాదాలన్నీ
కలసి ఒకే అడుగు వేస్తూ...


(తే 6-6-2013 దీ)