23, ఫిబ్రవరి 2011, బుధవారం

మరో కుట్రను కప్పిపుచ్చే తీర్పుగోధ్రా దుర్ఘటన వెనక కుట్రను అంగీకరిస్తూనే ప్రధాన నిందితున్ని నిర్దోషిగా, మరికొంతమందిని సాక్ష్యాల సాకుతో విడిచిపెట్టడం, అసలు ఈ దుర్ఘటన వెనక ప్రధాన కుట్రదారుడు హాయిగా సింహాసనంపై ఎంజాయ్ చేయడం చూస్తుంటే వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూచుంటే మనకేమి అన్న చందాన తయారైన న్యాయవ్యవస్థను చూస్తూ మన కళ్ళను మనమే పొడుచుకోవాలి..

గుజరాత్ లో నాటి పోటా చట్టం కింద నమోదైన కేసులోని నూటా ముప్పైనాలుగు మంది నిందితులలో చిన్నపిల్లలను కూడా కలిపి మొత్తమ్మీద ఈ దారుణాన్ని అంటగట్టే ప్రయత్నం చేసారు. అలాగే ఇంతమంది కలిసి చేసిన కుట్రగా అంగీకరిస్తున్న న్యాయస్థానం అసలు కుట్ర ఎలా జరిగిందో వివరించాల్సిన అవసరముంది. ఆ రైలు బోగీలో జరుగుతున్న అఘాయిత్యాన్ని అడ్డుకునే క్రమంలో జరిగిన సంఘటనగా చూసినా ఇది అప్పటికప్పుడు ఎలా రూపుదిద్దుకున్నదో బయటపేట్టాలి. వెంటనే సంఘటన జరిగిన భోగీని సందర్శించగలిగిన గుజరాత్ సి.ఎం. గారు బెస్ట్ బేకరీ దారుణ మారణ కాండ జరిగిన ప్రాంతాన్ని సందర్శించకపోవడం ఎలా ప్రజాస్వామ్యబద్ధం. అది ఆయన పరిపాలనా ప్రాంతం కాదా. లేక వాళ్ళు తమ పౌరులు కాదనుకున్నారా? అంటే మొత్తంగా గుజరాత్ దారుణ మారణకాండ వెనక వున్నది తనేనని ప్రస్ఫుటం చేయడం ద్వారా తాను హిందూ మతోద్ధారకుడిగా, నాయకుడిగా గుర్తింపబడడానికేనా?

ఈ దుర్ఘటన జరిగిన నేపథ్యం గురించి తెలుసుకోవాల్సిన జస్టిస్ నానావతి కమీషన్ అసలు దోషులను దాచిపెట్టేందుకే కృషి చేసినట్లుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా చేసిందేమీ లేదు. ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేందుకు తద్వారా తమ పైశాచిక కృత్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ దుర్ఘటనను సాకుగా చూపి సుమారు రెండువేల మంది ముస్లిం ప్రజల మాన ప్రాణాలు హరించి, వందల కోట్ల ఆస్తులను హరించి వేసి తమ ఫాసిస్ట్ పరిపాలనను సాగించడానికి వాడుకున్న అసలు నిందితులు తప్పించుకు తిరుగుతుండటం ఘోరం.. ఇది న్యాయ, పరిపాలనా వ్యవస్థల వైఫల్యమే.. మరణించిన కరసేవకుల కుటుంబాలకు జరిగిన అన్యాయం పూడ్చలేనిది. ఈ దారుణ రాక్షస యజ్న౦లో సమిధలైన వారి పట్ల సానుభూతి మాత్రమే వ్యక్తం చేయగల నిస్సహాయులమైపోయాం. మొత్తమ్మీద అధికార యంత్రాంగానికి ఊడిగం చేస్తూ తరిస్తున్న న్యాయవ్యవస్థనుండి ఇంతకంటే ఏం ఆశించగలం..

ఇక్కడ ఈ తీర్పుపై ఓ వ్యాసం.చదవండి

17, ఫిబ్రవరి 2011, గురువారం

ప్రజాస్వామ్యం అంటే ఏమిటో?ఈ రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యం ఖూనీ ఐపోవడమా?


అసలు ఈ గవర్నర్ ఎన్నడైనా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించారా? ఆయన వచ్చినప్పటినుండి ఇక్కడ వివాదాలను సృష్టిస్తూ వస్తున్నారు. ప్రజా సమస్యలపట్ల చాలా చులకన భావంతో వ్యాఖ్యానిస్తుంటారు. అసలు ఓ మాజీ ఐ.పి.ఎస్.అధికారిని ఇక్కడ గవర్నర్ గానియమించడంలో ఉద్దేశ్యం పాలనా పగ్గాలను పోలీసు వారికి అందజేయడానికే కదా? తెలంగాణా అంశం పట్ల వైరి భావంతో వున్న ఆయన తన ప్రసంగ పాఠం అంతా రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లుతోందన్న రాత కాపీని చదివి ఎవర్ని మోసపుచ్చడానికి. ఇన్నాళ్ళకు తెలుగు వాళ్ళకు పౌరుషముందనిపించారు. మాజీ తమిళపోళ్ళందరికీ పదవులు కట్టబెడుతున్న చిదంబరం అండ్ కో కు ఇది చెంపదెబ్బ.

ఇంక ఏకైక సత్తా MLA గారు జె.పి. మైకు దొరగ్గానే తన బాణీలో రెందు నాల్కల ధోరణిలో కఱ విరక్క పాము చావక లాంటి మాటలు మాటాడుతుంటే తగిన బుద్ధి చెప్పారు. ఈయనొక్కడే నీతిమంతుడు ప్రజాస్వామ్య పరిరక్షకుడులా ఫోజు కొడ్తుంటాడు. ఈయన IAS అయిన తరువాత ఆ ముందు ఆస్తులు గురించి మాటాడితే బాగుణ్ణు.

అసెంబ్లీ, పార్లమెంటు సభ్యులను ప్రశ్నించడం నేరమా? ఆ రెండూ నిజంగా ప్రజాస్వామ్య యుతంగా పనిచేస్తున్నాయా? అసలు వీళ్ళంతా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తున్నారా? ఓట్లేసిన పాపానికి జనం నెత్తినెక్కి వీళ్ళ వీళ్ళ కులాలు, వర్గాల వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడానికి తప్ప వేరే ధ్యాస వుందా? ఎవడికి నచ్చినట్లు వాడు జీవోలను రాసుకుంటూ స్వప్రయోజనాలను కాపాడుకోవడాఅనికి పాటుపడడమే. కోట్లాది రూపాయల కుంభకోణాలు చేస్తూ ప్రజల ఆస్తులను తెగనమ్మేస్తూ హిరణ్యాక్ష పాలనచేస్తున్న వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి కామెంటు చేయడం? ఎవడి స్వలాభపేక్ష కోసం వాడు ప్రజలకు ఏదో చేసేస్తామని హామీలు ఇచ్చి గద్దెనిక్కి వారి మందీ మార్బలాన్ని పెంచుకోవడానికి కాకపోతే నీతి కబుర్లెందుకు?

ఆరు వందలమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ప్రజ్సాస్వామ్యం ఖూనీ కావడం కాదా? వాళ్ళ ఆశను నెరవేరుస్తున్నామని చెప్పి మోసం చేయడం ప్రజాస్వామ్యం ఖూనీ కావడం కాదా?

11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

మధ్యతరగతి బుద్ధిజీవుల హీరో డా.బినాయక్ సేన్..నేడు డా.బినాయక్ సేన్ మన మధ్యతరగతి బుధిజీవుల హీరో. ఆయన అరెస్ట్, యావజ్జీవ శిక్ష, రాయపూర్ కోర్ట్ ఇచ్చిన అసందర్భ తీర్పు, తప్పుడు సాక్ష్యాలతో నేటికీ బైల్ రాని పరిస్థితి. ఆయన అరెస్ట్ కు వ్యతిరేకంగా మేధావి వర్గం తీసుకున్న ప్రొటెస్ట్ బహుదా హర్షణీయం. అలాగే నలభై మంది నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా ఆయనకు వేసిన శిక్షను వ్యతిరేకిస్తూ రాష్ట్రపతికి పంపిన లేఖ, మేధావుల విన్నపాలు, యూరోపియన్ యూనియన్ న్యాయవాదుల బృందం ఇలా ఎంతో మంది మేధావుల అండ ఈ తీర్పుకు వ్యతిరేకంగా రావడం ఆహ్వానించదగ్గదే...

కానీ ఇక్కడ ఇదే స్థాయి పోరాటాలు, ర్యాలీలు అకారణంగా అరెస్టయి ఏళ్ళ తరబడి అండర్ ట్రైల్ ఖైదీలుగా జీవితకాలం మగ్గుతున్న వేలాది గిరిజనులు, దళితులు, ముస్లిం ప్రజలు, ఉద్యమకారుల పట్ల ఎన్నడూ ఈ బుద్ధి జీవులు మాటాడడం లేదు. సేన్ భార్య, అమ్మలలానే ఎంతో మంది తల్లులు, చెల్లెలు, వారి భార్యలు తమ వాళ్ళను అకారణంగా అరెస్ట్ చేసినారని, తమపై అనేక రకాలుగా నిర్బంధం అమలుజరుగుతోందని, మానభంగాలు, తీవ్ర చిత్రహింసలు జరిగాయని గొంతెత్తి అరిచినా పట్టించుకున్న వారు లేరు.. అలాగే వారి పట్ల మాటాడే వారిపై కూడా ఇంతకంటే ఎక్కువగా దాడులు, హత్యలు జరిగాయి. డా.రామనాథం, జాపా లక్ష్మారెడ్డి, న్యాయవాదులు పురుషోత్తం, నఱా ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు కనకాచారి మొ.న వారిని దారుణంగా హత్య చేసారు. అలాగే భౌతిక దాడులు కూడా జరిగాయి. ఇలా రాజ్యం మేధావి వర్గాన్ని భయపెట్టే చర్యలు కొనసాగిస్తూ ప్రజల పట్ల మాటాడే వారిని హింసావాదులుగా, అభివృద్ధి నిరోధకులుగా చిత్రిస్తూ వారిని మౌన ప్రేక్షకులుగా మార్చడానికి తద్వారా తమ అవినీతి, బందుప్రీతి, అరాచక పరిపాలనను కొనసాగించుకోవడానికి అన్ని రాజకీయ పక్షాలు ఏకమై కలిసికట్టుగా ఉద్యమాలను భూతాలుగా చూపించే ప్రయత్నం తీవ్రతరం చేసాయి. తాము శాంతికాముకులుగా ముసుగు తగిలించుకోజూస్తున్నాయి.

మన మధ్యతరగతి బుద్ధిజీవులలో నేడు చాలామంది బినాయక్ సేన్కు మావోయిస్టులతో లింక్ లేదని చెప్తూ ఆయన విడుదలను కోరుతున్నారు. అసలు ఉద్యమాలతో సంబంధముండటం నేరమెలా అవుతుందన్న ప్రశ్న రావాలి మననుండి. రాజ్యం ఇక్కడ సక్సెస్ అవుతోంది. ప్రజలనుండి మేధావి వర్గాన్ని విడదీయడానికి ఈ కేసును రోల్ మోడల్ గా తీసుకుంటోంది. అకారణంగా ఎంతోమందిని చంపి వాళ్ళను మావోయిస్టులుగా, తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా ముద్ర వేసి తప్పించుకుంది. అలాంటి బూటకపు ఎదురుకాల్పులను ప్రశ్నించకుండా చేయడానికి, ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయడానికి రాజ్యం తన మార్గాన్ని సుళువు చేసుకునే భాగంగా సమాజంలో వేరు వేరు వర్గాలుగా, కులాలు, మతాలు, అలాగే సామాజికి స్థితిగతులుబట్టి వేరు వేరు గ్రూపులుగా విడగొట్టి మన మధ్య అనైక్యతను సృష్టిస్తూ తాము ఒకే కార్పొరేట్ వర్గంగా బలపడ జూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్ని పరిశీలిస్తే రాజ్యం మరింత బలపడేందుకు ఇలాంటి ప్రయోగాలను చేస్తున్నట్లుగా అవగతమవుతుంది. తామేదో పర్యావరణ పరిరక్షకులుగా ప్రకటించుకునేందుకు నియాంగిరీ ఆదివాసీల ఉద్యమాన్ని బలపర్చినట్లుగ ఫోజ్ కొట్టిన వాళ్ళే నేడు పోస్కో కు అనుమతులు మంజూరు చేసారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు కూడా. తూర్పునుండి, విశాఖవరకు అటు దండకారణ్యంలోని ఖనిజ సంపదను ఎత్తుకుపోయేందుకు పోలవరం ద్వారా నిర్మించతలపెట్టిన కాలువల వలన జరిగే భారీ నష్టాన్ని, వేలాది ఆదివాసీ ప్రజలను నిర్వాసితులను చేస్తూ ఉద్యమాలను అణచివేసే కుట్రలో భాగంగా దీనిని పాలక వర్గాలు బలపరుస్తున్నాయి. అటు వ్యాపార వర్గాలను మెప్పిస్తూ, ఇటు తమ అధికారాన్ని ప్రశ్నించే వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి..

వీటన్నింటిని ప్రశ్నించే మధ్యతరగతి బుద్ధిజీవులు, ప్రజాస్వామ్య వాదులకు హెచ్చరికగా డా.బినాయక్ సేన్ పై వచ్చిన తీర్పు ఇది. దీని నేపథ్యాన్ని అర్థం చేసుకొని ఒక పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్మించి అకారణంగా కొన్నేళ్ళుగా మగ్గుతున్న పేద ఆదివాసీ, దళిత, ముస్లిం ప్రజలను, ఉద్యమకారులను విడిపించేందుకు మేధావి వర్గం కృషి చేయాల్సిన అవసరముంది. ఒక్క సేన్ విడుదలే మనకు ముఖ్యం కాకూడదు..

ప్రజా ఉద్యమాలను అక్కున చేర్చుకుందాం.. దేశ సార్వభౌమాధికారాన్ని, సాధికారతను నిలబెట్టుకుందాం...