11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

మధ్యతరగతి బుద్ధిజీవుల హీరో డా.బినాయక్ సేన్..



నేడు డా.బినాయక్ సేన్ మన మధ్యతరగతి బుధిజీవుల హీరో. ఆయన అరెస్ట్, యావజ్జీవ శిక్ష, రాయపూర్ కోర్ట్ ఇచ్చిన అసందర్భ తీర్పు, తప్పుడు సాక్ష్యాలతో నేటికీ బైల్ రాని పరిస్థితి. ఆయన అరెస్ట్ కు వ్యతిరేకంగా మేధావి వర్గం తీసుకున్న ప్రొటెస్ట్ బహుదా హర్షణీయం. అలాగే నలభై మంది నోబెల్ బహుమతి గ్రహీతలు కూడా ఆయనకు వేసిన శిక్షను వ్యతిరేకిస్తూ రాష్ట్రపతికి పంపిన లేఖ, మేధావుల విన్నపాలు, యూరోపియన్ యూనియన్ న్యాయవాదుల బృందం ఇలా ఎంతో మంది మేధావుల అండ ఈ తీర్పుకు వ్యతిరేకంగా రావడం ఆహ్వానించదగ్గదే...

కానీ ఇక్కడ ఇదే స్థాయి పోరాటాలు, ర్యాలీలు అకారణంగా అరెస్టయి ఏళ్ళ తరబడి అండర్ ట్రైల్ ఖైదీలుగా జీవితకాలం మగ్గుతున్న వేలాది గిరిజనులు, దళితులు, ముస్లిం ప్రజలు, ఉద్యమకారుల పట్ల ఎన్నడూ ఈ బుద్ధి జీవులు మాటాడడం లేదు. సేన్ భార్య, అమ్మలలానే ఎంతో మంది తల్లులు, చెల్లెలు, వారి భార్యలు తమ వాళ్ళను అకారణంగా అరెస్ట్ చేసినారని, తమపై అనేక రకాలుగా నిర్బంధం అమలుజరుగుతోందని, మానభంగాలు, తీవ్ర చిత్రహింసలు జరిగాయని గొంతెత్తి అరిచినా పట్టించుకున్న వారు లేరు.. అలాగే వారి పట్ల మాటాడే వారిపై కూడా ఇంతకంటే ఎక్కువగా దాడులు, హత్యలు జరిగాయి. డా.రామనాథం, జాపా లక్ష్మారెడ్డి, న్యాయవాదులు పురుషోత్తం, నఱా ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యాయులు కనకాచారి మొ.న వారిని దారుణంగా హత్య చేసారు. అలాగే భౌతిక దాడులు కూడా జరిగాయి. ఇలా రాజ్యం మేధావి వర్గాన్ని భయపెట్టే చర్యలు కొనసాగిస్తూ ప్రజల పట్ల మాటాడే వారిని హింసావాదులుగా, అభివృద్ధి నిరోధకులుగా చిత్రిస్తూ వారిని మౌన ప్రేక్షకులుగా మార్చడానికి తద్వారా తమ అవినీతి, బందుప్రీతి, అరాచక పరిపాలనను కొనసాగించుకోవడానికి అన్ని రాజకీయ పక్షాలు ఏకమై కలిసికట్టుగా ఉద్యమాలను భూతాలుగా చూపించే ప్రయత్నం తీవ్రతరం చేసాయి. తాము శాంతికాముకులుగా ముసుగు తగిలించుకోజూస్తున్నాయి.

మన మధ్యతరగతి బుద్ధిజీవులలో నేడు చాలామంది బినాయక్ సేన్కు మావోయిస్టులతో లింక్ లేదని చెప్తూ ఆయన విడుదలను కోరుతున్నారు. అసలు ఉద్యమాలతో సంబంధముండటం నేరమెలా అవుతుందన్న ప్రశ్న రావాలి మననుండి. రాజ్యం ఇక్కడ సక్సెస్ అవుతోంది. ప్రజలనుండి మేధావి వర్గాన్ని విడదీయడానికి ఈ కేసును రోల్ మోడల్ గా తీసుకుంటోంది. అకారణంగా ఎంతోమందిని చంపి వాళ్ళను మావోయిస్టులుగా, తీవ్రవాదులుగా, ఉగ్రవాదులుగా ముద్ర వేసి తప్పించుకుంది. అలాంటి బూటకపు ఎదురుకాల్పులను ప్రశ్నించకుండా చేయడానికి, ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేయడానికి రాజ్యం తన మార్గాన్ని సుళువు చేసుకునే భాగంగా సమాజంలో వేరు వేరు వర్గాలుగా, కులాలు, మతాలు, అలాగే సామాజికి స్థితిగతులుబట్టి వేరు వేరు గ్రూపులుగా విడగొట్టి మన మధ్య అనైక్యతను సృష్టిస్తూ తాము ఒకే కార్పొరేట్ వర్గంగా బలపడ జూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్ని పరిశీలిస్తే రాజ్యం మరింత బలపడేందుకు ఇలాంటి ప్రయోగాలను చేస్తున్నట్లుగా అవగతమవుతుంది. తామేదో పర్యావరణ పరిరక్షకులుగా ప్రకటించుకునేందుకు నియాంగిరీ ఆదివాసీల ఉద్యమాన్ని బలపర్చినట్లుగ ఫోజ్ కొట్టిన వాళ్ళే నేడు పోస్కో కు అనుమతులు మంజూరు చేసారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు కూడా. తూర్పునుండి, విశాఖవరకు అటు దండకారణ్యంలోని ఖనిజ సంపదను ఎత్తుకుపోయేందుకు పోలవరం ద్వారా నిర్మించతలపెట్టిన కాలువల వలన జరిగే భారీ నష్టాన్ని, వేలాది ఆదివాసీ ప్రజలను నిర్వాసితులను చేస్తూ ఉద్యమాలను అణచివేసే కుట్రలో భాగంగా దీనిని పాలక వర్గాలు బలపరుస్తున్నాయి. అటు వ్యాపార వర్గాలను మెప్పిస్తూ, ఇటు తమ అధికారాన్ని ప్రశ్నించే వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి..

వీటన్నింటిని ప్రశ్నించే మధ్యతరగతి బుద్ధిజీవులు, ప్రజాస్వామ్య వాదులకు హెచ్చరికగా డా.బినాయక్ సేన్ పై వచ్చిన తీర్పు ఇది. దీని నేపథ్యాన్ని అర్థం చేసుకొని ఒక పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్మించి అకారణంగా కొన్నేళ్ళుగా మగ్గుతున్న పేద ఆదివాసీ, దళిత, ముస్లిం ప్రజలను, ఉద్యమకారులను విడిపించేందుకు మేధావి వర్గం కృషి చేయాల్సిన అవసరముంది. ఒక్క సేన్ విడుదలే మనకు ముఖ్యం కాకూడదు..

ప్రజా ఉద్యమాలను అక్కున చేర్చుకుందాం.. దేశ సార్వభౌమాధికారాన్ని, సాధికారతను నిలబెట్టుకుందాం...

3 కామెంట్‌లు:

  1. ప్రజా ఉద్యమాలను అక్కున చేర్చుకుందాం.. దేశ సార్వభౌమాధికారాన్ని, సాధికారతను నిలబెట్టుకుందాం...
    First of all…let me appreciate you for this post sir. There is a dying need for such posts and same respective need to take this issue to the layman too so that the process of going against such person’s arrests and trails come into everyone’s notice to bring forth every man’s protest. Hope most people read this blog.
    i liked these lines most...

    మన మధ్యతరగతి బుద్ధిజీవులలో నేడు చాలామంది బినాయక్ సేన్కు మావోయిస్టులతో లింక్ లేదని చెప్తూ ఆయన విడుదలను కోరుతున్నారు. అసలు ఉద్యమాలతో సంబంధముండటం నేరమెలా అవుతుందన్న ప్రశ్న రావాలి మననుండి.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..