13, ఫిబ్రవరి 2013, బుధవారం

రాజ్యం - హిందూ కార్పొరేట్ ఫాసిస్ట్ ముఖం..

వరుస ఉరి శిక్షల అమలుతో రాజ్యం తామింత కాలం దాచుకున్న లౌకిక ప్రజాతంత్ర ముసుగును తొలగిస్తోంది. ఓట్ల కోసం ఎంతకైనా తెగించే ధోరణితో ముందుకు దూసుకు వస్తోంది. తన విదేశీ ముఖాన్ని కప్పిపుచ్చుకోవడానికి కుంభమేళాకు హాజరయ్యేందుకు సిద్దపడుతూంది. ఈ దేశాన్ని ఒక వైపు సామ్రాజ్యవాద అనుకూల శక్తులకు ధారపోస్తూ విదేశీ వ్యాపార సంస్థలకు పూర్తిగా తాకట్టుపెడుతూ మరోవైపు సనాతన హిందూ వేషాన్ని ముసుగుగా చూపిస్తూ తిరిగి అధికారాన్ని చేపట్టాలని చూస్తోంది. ప్రతిపక్షానికి ఏ అవకాశాన్నీ వదలకుండా ఓట్లు దండుకునేందుకు దూకుడుగా వస్తోంది. ఇంతకాలం మైనారిటీ అనుకూల వాదిగా వున్న ముద్ర తొలగిపోయినా తనకెదురులేదన్న దిశగా కదులుతోంది. 

ఒకవైపు మూడోసారి స్వరాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన హిందూ ఫాసిస్ట్ తానే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకుంటూ వస్తున్న తరుణాన దానిని ఎదుర్కొనేందుకు తద్వార తన యువరాజుకు పట్టం కట్టేందుకే ఈ హత్యాకాండ సాగిస్తోంది. అధికార దాహానికిది పరాకాష్ట. ప్రజలకు వేరే ఆప్షన్ లేకుండా చూసే ప్రయత్నంలో భాగంగానే ఇంత నీచంగా కనీస ప్రజాస్వమ్య రాజనీతిని న్యాయ పరమైన సూత్రాలను కూడా లెక్క చేయకుండా ఉగ్రవాద ముద్రతో ప్రజల నోరు నొక్కుతూ వరుస హత్యలకు పాల్పడుతోంది. దీనిని ఏదో తమ విజయంగా అమాయకంగా సంబరాలు చేసుకుంటే ప్రజలకు తమ నట్టింట్లోకి ఈ గోముఖ వ్యాఘ్రాలు ప్రవేశించి తమ కాళ్ళకింద నేలను,  ప్రాణాలను హరిస్తాయన్న ఎరుక కోల్పోకూడదు. 

ప్రజాస్వామ్య ముసుగుతో నేరుగా సైనిక పాలనే సాగుతున్నది. ముమ్మాటికీ నిజం. ఇది పోలీసు రాజ్యం.  ఒకవైపు మధ్య భారతదేశమంతా సైనిక కవాతు చేస్తూ ఆదివాసీ ప్రజలను అత్యంత కౄరంగా 
హింసిస్తూవారి తరతరాల హక్కులను స్వేచ్చా స్వాతంత్ర్యాలను హరిస్తూ ఖాళీ చేయిస్తూ సహజ వనరులను 
కొల్లగొట్టడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది.  

ప్రశ్నించే వేదిక ఏదైనా అది ఆఖరికి అంతర్జాలమైనా వారి గొంతునొక్కే కఠిన నిర్ణయాలు పాలకులు తీసుకుంటున్నారంటే ఇంక ప్రజలకు ఏ అవకాశముంది??  కావున దీనిని అతి జాగరూకతతో నివారించి మన హక్కులను కాపాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం ద్వారా ఈ దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మనందరిదీ.