6, డిసెంబర్ 2012, గురువారం

మాయా ములాయంల దళారీ దగాకోరుతనం..

విదేశీ చిల్లర పెట్టుబడులను మన దేశీయ మార్కెట్లోకి అనుమతించే బిల్లును పార్లమెంటులో ఆమోదం పొందడానికి పరోక్షంగా సహకరించిన మాయావతి, ములాయం సింగ్ లు తమ దేశ ద్రోహత్వాన్ని కళ్ళబొల్లి కబుర్లతో కప్పిపుచ్చుకోలేరు.. 

ప్రతిసారీ కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం సంకట స్థితిలో పడ్డప్పుడూ ఇలాంటి అటూ ఇటూ కాని పార్టీలతో నెగ్గుకొస్తున్నది కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వం.  ఒక వైపు ప్రజల పట్ల ఎంతో బాధ్యత వున్నట్టు ప్రవర్తిస్తూ వీళ్ళు లోపాయకారీ ఒప్పందాలతో సామ్రాజ్యవాద దేశాల హుకుంను ఇక్కడ అమలు చేయడానికి తోడ్పడుతున్నారు. ఇటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలి. సి.బి.ఐ. బూచిని చూపుతూ రాజకీయ నాయకుల అవినీతిని తమ వ్యాపార లావా దేవీలకు అనుగుణంగా వాడుకుంటున్నారు.  అయినా ఈ పాలక పక్షాలన్నీ ఒక తానులోని గుడ్డలే కదా!!

వీళ్ళకు ప్రజల బాగోగుల పట్టవు. దేశ ఆర్థిక స్వావలంబన పట్ల నిజాయతీగా కృషి చేసే విధానాలమీ లేవు. దేశాన్ని తాకట్టు పెట్టి తమ స్వంత ఆస్తులను కూడబెట్టుకునే వ్యాపార దళారీ తత్వమే. కావున ఈ దళారీ పాలక వర్గాలను తప్పక నిలదీయాల్సిన అవసరముంది.

19, అక్టోబర్ 2012, శుక్రవారం

గేట్లన్నీ బార్లా తెరచి యింకా సరిహద్దులేల???

ఈరోజు ఓ గంట క్రితం సాక్షి టీవీలో రాజకీయ పార్టీల విరాళాలు వసూళ్ళపై చర్చలో పాల్గొంటూ ప్రొ.హరగోపాల్ ఓ మాటన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టి విదేశీ కంపెనీలకు ఈ దేశ వనరులను దోచుకొనే అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇంక పక్క దేశం వాడు వచ్చి ఏదో చేసేస్తాడని నమ్మిస్తూ సరిహద్దులను సైన్యంతో కాపలా కాయడం అవసరమా?? అని అడిగారు..

ఈ ప్రశ్న చాలా ఆలోచించదగ్గదే. విదేశీ కంపెనీలు వేదాంత తదితరమైనవి మన అడవులను, సహజ వనరులను ఎటువంటి జంకూ గొంకూ లేకుండా కొల్లగొడుతూ ఈ దేశ సంపదను ఎత్తుకెళ్ళి పోతుంటే యింకా చైనా వాడో, పాకిస్తాన్ వాడో ఈ దేశంపై దండేత్తుతాడని సైన్యాన్ని మేపుతూ సరిహద్దు రేఖలు గీచుకొని కూచోవడం అవసరమా?? ఎవడికి దొరికింది వాడు దోచుకుపోతుండడానికి చిల్లర దుఖాణాలతో పాటుగా అమ్మజూపుతున్న ప్రభుత్వాలకి ఈ దేశ సరిహద్దులంటూ ఇంత ప్రజా ధనం దుర్వినియోగం అవసరమా?? 

ఎక్కడికక్కడ ప్రజలను నిర్వాశితులును చేస్తూ ప్రశ్నించే వారిపై రక రకాల చట్టాల పేరుతో అరెస్టులు మరికొన్ని చోట్ల జనంపై కాల్పులు జరుపుతు ప్రాణాలు తీస్తున్న రాజ్యం ఈ కుహనా సరిహద్దు రేఖలను చూపి మనల్ని భ్రమలలో వుంచుతున్నాయి. విదేశీ కంపెనీలు, కార్పొరేటు సంస్థలు తమ వ్యాపార లావాదేవీలను నిరభ్యంతరంగా చేసుకోవడానికి తలుపులు బార్లా తెరిచి యిదే అభివృద్దని చెప్తున్న ప్రభుత్వ మోసకారితనాన్ని గ్రహించి నిలదీయాల్సిన సమయమిది. 

12, సెప్టెంబర్ 2012, బుధవారం

అన్నా హజారే ఎవరి ప్రతినిధి??

గత సంవత్సరమంతా దేశాన్ని ఊపు ఊపిన అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాట ఉద్యమం ఆహ్వానించదగ్గదే అనిపిస్తూనే ఈయన ఎవరికి ప్రతినిధిగా ఈ ఉద్యమం నడుపుతున్నారో ఈ వేళ నే చదివిన అరుంధతీ రాయ్ గారి వ్యాసం పెట్టుబడిదారీ విధానం - ఓ ప్రేతాత్మ కథ చాలా విషయాలు చెప్పింది.

పెట్టుబడిదారీ దోపిడీకి మానవత్వపు ముసుగు తొడిగిన ఫోర్డ్ మరియు రాక్ ఫెల్లర్ ఫౌండేషన్లు స్పాన్సర్ చేసిన రామన్ మేగసేసే అవార్డు గ్రహీతలు ముగ్గురు ఈ ఉద్యమాన్ని నడిపే వారిలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఈ సంస్థల నేపథ్యం తెలుసుకోవాలంటే ఈ వ్యాసం తప్పక చదవాలి.

అన్నాహజారే, అరవింద్ కేజ్రివాల్, కిరణ్ బేడీల వెనక వున్న మద్దతు గురించి తప్పక తెలుసుకోవాలి. అరవింద్ కేజ్రీవాల్ కి ఉన్న అనేక స్వచ్చంద సంస్థలలో ఒక దానికి ఫోర్డ్ ఫౌండేషన్ ధారాళంగా నిధులు ఇస్తుంది. కిరణ్ బేడీ నడిపే స్వచ్చంద సంస్థకి కోకా కోలా, లేమన్ బ్రదర్స్ నిధులను ఇస్తున్నాయి.

అన్నా హజారే గాంధేయవాదినని చెప్పుకుంటాడు. కానీ అతను ప్రతిపాదిస్తున్న జన్ లోక్ పాల్ బిల్లు గాంధేయ వాదానికి వ్యతిరేకమైనది, ప్రమాదకరమైనది. ఆమధ్య యూరోప్, అమెరికాలను ఒక ఊపు ఊపిన వాల్ స్ట్రీట్ ముట్టడి ఉద్యమానికి భిన్నంగా ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. ప్రైవేటీకరణ, కార్పొరేట్ శక్తుల, ఆర్థిక సంస్కరణల ప్రభావంతో అతలాకుతలమవుతున్న జనజీవనం గురించి ఒక్క మాట కూడా మాటాడని అన్నా అలాగే కార్పొరేట్ అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించి, రాజకీయ నాయకుల పట్ల ప్రజల ఆగ్రహాన్ని సాకుగా చేసుకుని ప్రభుత్వ అధికారాలు మరింత నీరు గార్చాలని, ప్రైవేటు పెట్టుబడులకు అనుగుణంగా సంస్కరణలను వేగవంతం చేయడానికి తోడ్పడేందుకు ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఇక్కడ మరో విషయం రెండువేల ఎనిమిదిలో అన్నాకు విశిష్ట ప్రజాసేవకు ప్రపంచ బ్యాంకు అవార్డు నివ్వడం యాధృచ్చికం కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమం తమ విధానానికి సరిగ్గా సరిపోయిందని వాషింగ్టన్ నుంచి ప్రపంచ బ్యాంకు ప్రకటన ఇచ్చింది.

యిలా రాజ్యం యొక్క సంక్షేమ పథకాలను నీరుగారుస్తూ ఆర్థిక సంస్కరణల పేరుతో దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న విదేశీ పెట్టుబడి సంస్థల కొమ్ము కాసేందుకు, ఆయా సంస్థలకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు రావడానికి, వున్న ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి సెజ్ లు వంటి సామంత రాజ్యాల ఏర్పాటుకు ఓ సన్నాహక, మద్ధతుకు ముందస్తు ప్రక్రియగా ప్రజల మైండ్ సెట్ ను మార్చే ఉద్యమంగా దీనిని కార్పొరేట్ మీడియా సహకారంతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల మౌలిక సమస్యల పట్ల ఏమాత్రం సానుభూతిలేని వీరి ఉద్యమం ఓ ఫార్సు. జనం కూడూ గుడ్డ, స్థానం కోల్పోయి ఎక్కడికక్కడ తమ భూమి, వున్న ఊళ్ళను విడిచి వలస బాట పట్టే విధంగా జన జీవనం అతలాకుతలం కాబడుతుంటే, దేశ సంపదను, సహజ వనరులను కొల్లగొట్టేందుకు పెద్ద ఎత్తున ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించకుండా నటిస్తూ తాము ఈ దేశానికి నిజాయితీ పరులుగా ఫోజులిస్తూ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు మద్ధతుగా దీనిని ముందుకు తెచ్చారు.

ఈ సందర్భంగా రాజకీయ అవినీతిని కూడా తప్పక ఖండించాలి. అది అవినీతికి మూల విరాట్టే, కాదనను. కానీ, ఈ దేశ సహజ సంపదను మానవ వనరులను పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న కార్పొరేట్ రంగాన్ని ప్రశ్నించి నిలువరించే ఉద్యమంగా ఇది ముందుకు రావాల్సిన అవసరముంది. అవకాశ వాద మధ్యతరగతి ప్రజల మనోభావాలను ప్రభావితం చేస్తూ అసలు అవినీతి మూల విరాట్టును వదిలేసి పైపై మెరుగులను ఆశించే ఇట్లాంటి ఉద్యమాల వలన ఏమాత్రం ఉపయోగముండదు. వ్యవస్థ సమూల మార్పునకు గురికాకుండా ఇలాంటి ఆయింట్ మెంటు ఉద్యమాల వలన జరిగే మార్పేమీ వుండదు.


30, ఆగస్టు 2012, గురువారం

మానని గాయం గుజరాత్...


http://www.gujaratplus.com/riots_gal/childbig.jpg
గోధ్రా రైలు దుర్ఘటన తరువాత రోజు నుండి వరుసగా వారం దినాలకు పైగా గుజరాత్ ముస్లింలపై జరిగిన దారుణ మాన ప్రాణ ఆస్తి హనన కాండపై ప్రత్యేక కోర్టు నిన్న వెలువరించిన తీర్పు ఆహ్వానిద్దాం. వీరికి రేపు శిక్షలు ప్రకటించే అవకాశముంది. ఇదంతా వార్తా పత్రికలలో చదివిన విషయమే. అక్కడే ఇంకో విషయముంది. ఈ మొత్తం మారణ కాండకు నేతృత్వం వహించిన అప్పుడు ఇప్పుడు వున్న సి.ఎం. ఈ మారణకాండకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని ప్రకటించడం. అంటే దీనికి తానే పూర్తి బాధ్యత వహించినట్టు భావిద్దామా? అటు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి అధికారంలో వున్న వాడిపై చర్య తీసుకునే క్రమంలో లేదన్నది స్పష్టమౌతున్నది. ఓటు బ్యాంకు రాజకీయాలు నడపడంలో రెండు పార్టీలు దొందూ దొందె. రెండు వేలమందికి పైగా ఈ దేశ ప్రజలు ఊచకోతకు గురి కాబడితే ఏళ్ళ తరబడి దర్యాప్తుల పేరుతో కాలం గడుపుతూ మానని గాయంపై కారం చల్లే ప్రక్రియ జరుగుతోంది. కడుపులో శూలాలు దించి గర్భస్థ శిశువులను బయటకు లాగిన ఉన్మాదులొక్కరూ శిక్షింపబడకపోవడం ఈ దేశ ప్రజాస్వామ్య న్యాయవ్యవస్థ యొక్క దుర్నీతిని తెలియజేస్తోంది. భయపెట్టి, ప్రలోభ పెట్టి బాధితులను సాక్షులను తారు మారు చేసి ఒక ఎం.పీ.కుటుంబం మొత్తం తగలబెట్టిన కేసునే తగలబెట్టిన న్యాయం మనది. యిలా రోజు రోజుకి దిగజారిపోతున్న అధికార న్యాయ వ్యవస్థలు బాధితులకు న్యాయం చేస్తాయన్నది మృగ తృష్ణ కాదా?

మీడియాలో ఓ దోషిని తీసుకు వెళ్తుండగా వాడి పిల్ల ఏడుస్తున్న ఫోటో వేసి సానుభూతి పొందే అవకాశాన్నిస్తున్నారు. అంటే కేసు పట్ల మీడియ వైఖరి కూడా తెలుస్తోంది. అటువంటి ఎంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు, అలాగే వారి తల్లి దండ్రులు వారి కళ్ళముందే ఈ దారుణ మారణకాండలో హత్య చేయబడ్డారు? దానినుండి మానసికంగా దూరం చేయడానికి జరిగే కుట్రకాదా? ఇక్కడ మీడియా కూడా హైందవ ఫాసిస్ట్ వర్గ కార్పొరేట్ చేతుల్లో వుందన్నది సుస్పష్టం.

18, జులై 2012, బుధవారం

కా.గోరు మాధవరావు అమర్ రహే...

అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధమ అధ్యక్షునిగా పనిచేసిన కా.గోరు మాధవరావు గారు రోజు సాయంత్రం తన స్వంత గ్రామం జింకిభద్రలో (సోంపేట మండలం, శ్రీకాకుళం జిల్లా) అస్వస్థతతో కన్నుమూసారు. ఆయన తన జీవిత కాలమంతా విప్లవ ప్రజా పంథానే నమ్మారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం నుండి మొదలైన ఆయన విప్లవాచరణ తరువాత కొండపల్లి సీతారామయ్య గారి నేతృత్వంలోని పీపుల్స్ వార్ పార్టీలో క్రియాశీలకంగా విప్లవాచరణలో తన సహచరిణితో పాటుగా పాల్గొన్నారు. తరువాత జరిగిన పరిణామ క్రమంలో మావోయిస్టు పార్టీ ఆద్వర్యంలో కూడా అదే తీరున ఉద్యమాలకాలంబనగా కృషి చేసారు. పార్టీ ప్రచురణలైన దిక్సూచీ ప్రచురణలకు చిరునామాగా ఆయన అడ్రసునే వుండేది.

ఎన్ని రకాలుగా నిర్బంధాలు అమలు చేసినా అకుంఠిత దీక్షతో, నిబద్ధతతో విప్లవం పట్ల దృఢ నమ్మకంతో చివరి వరకు వున్నారు. పోలీసులు ఆయనను ఆ వయసులో కూడా పిలిచి భ్రమలలో ముంచెత్తే ప్రయత్నంగా అనేక మార్లు కౌన్సిలింగ్ నిర్వహించే ప్రయత్నంచేస్తే వారికి తిరిగి విప్లవాచరణ గురించి చెప్పి వచ్చిన ఉద్యమాభిమాని కామ్రేడ్ గోరు మాధవరావు.

ఎనభై ఏళ్ళు వచ్చాయి యింకా మీరు సమావేశాలకు హాజరు కావడం, సందేశాలివ్వడం ఎలా సాధ్యమవుతుంది కామ్రేడ్ అని ఎవరైనా అంటే నాడు నాటు తుపాకులతో మొదలైన ప్రస్థానం ఆరోజుల్లో వర్షం పడితే పేలని తుపాకులతో నానా అవస్థలు పడిన కాలం నుండి నేడు అత్యంతాధునిక ఆయుధాలు కలిగిన ప్రజా గెరిల్లా సైన్యంగా రూపాంతరం చెందినాం కదా మనం యింతకంటే స్ఫూర్తి ఏం కావాలి నాకనేవారు. ఎల్లప్పుడూ ఒకే రకమైన ఆలోచనతో, భారత దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవానికి తన వంతు ఆచరణతో కృషి చేసిన కా.గోరు మాధవరావు గారి విప్లవాచరణ అందరికీ ఆదర్శప్రాయం..

12, జులై 2012, గురువారం

మన ఇంట్లో పేలినా నోర్మూసుకోవాల్సిందే!!

http://media2.intoday.in/indiatoday/images/stories/maoists-crpf_350_071212041049.jpg
మన కేంద్ర గృహ మంత్రివర్యులు ఎటువంటి సంకోచం లేకుండా అబద్ధాలాడడంలో ఆరితేరిన వారు అని మొదటి నుండీ నిరూపించుకుంటునే వున్నారు. అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అటు తెలంగాణా విషయంలో గానీ యిటు బూటకపు ఎన్ కౌంటర్ల విషయంలో గానీ నిస్సిగ్గుగా అబద్దాలాడడంలో ఆరితేరిన వారు. కళ్ళముందు తొమ్మిది మంది బాలల మృత దేహాలు వుంచుకొని కూడా అది ఎదురు కాల్పుల సంఘటన అని, ఆత్మ రక్షణార్థం చేసారని బాసగూడ సంఘటనపై నొక్కి వక్కాణిస్తూనే వున్నారు. అటుతన సహచర గిరిజన శాఖా మంత్రి తన దగ్గర అది ఎదురు కాల్పుల సంఘటన కాదని ఋజువులున్నాయని, స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా అది నిర్ద్వందంగా ఎదురు కాల్పులు కావని చెపుతున్నా ఈయన తన ధోరణిలో చెప్తూ మరింతగా ప్రజలపై సైనిక దాడులకు ముందుకు వస్తున్నారంటే ఈ కార్పొరేట్ న్యాయ సహాయకుడైన హోం మంత్రి తన పితృ వారసత్వాన్ని, భావజాల వర్గ స్వభావాన్ని ఎంతగా చూపుతున్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరముంది. దీని వెనక దాగిన మల్టీ నేషనల్ కంపెనీల కుట్ర, సామ్రాజ్య వాద తొత్తులవుతున్న మన పాలక వర్గాల తాబేదారీ తనం అర్థం చేసుకొని ప్రజాస్వామ్య మేధావి వర్గాలు యిటువంటి సైనిక చర్యలను ఖండించాల్సిన అవసరముంది. లేక పోతే అదే తుపాకీ మన ఇంట్లో పేలినా నోర్మూసుకోవాల్సిందే!!

30, జూన్ 2012, శనివారం

మళ్ళీ నెత్తురోడిన చింతల్నార్ (Basaguda)చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బాసగూడ అటవీ ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జరిగిన సైనికదాడిలో ఇరవై రెండు మంది ఆదివాసీలు చనిపోయారు. ఈ దాడిలో పాల్గొన్నది సైనిక విభాగమైన కోబ్రా, పారామిలటరీ, స్థానిక రిజర్వ్ విభాగాలకు చెందిన దళాలు. వీరు మావోయిస్టులతో సమావేశమైన ఆదివాసీ ప్రజలపై మూకుమ్మడిగా దాడి చేసి చంపివేసారు. చనిపోయినవారిలో మహిళలు, తొమ్మిది సంవత్సరాల బాలిక, పదకొండేళ్ళ బాలుడు కూడా వున్నారు. వీరంతా గ్రామంలోని భూసమస్యపై చర్చించుకుంటున్న సందర్భంలో మావోయిస్టులను మట్టుబెట్టేందుకు సిద్ధమైన సైనిక బలగాలు అక్కడికి చేరుకుని గ్రామస్తుల నుండి ప్రతిఘటననెదుర్కొనలేక విచక్షణారహితంగా ఆధునిక ఆయుధాలతో దాడి చేసి ఇంతమంది ఆదివాసీలను పొట్టనబెట్టుకున్నారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు వారంతా మావోయిస్టులేనని పాతపాటనే పల్లవిస్తున్నారు.

స్థానిక విలేకర్లు, ప్రజాస్వామిక వాదులు, స్వామి అగ్నివేష్ ఈ ఎదురుకాల్పులపై యిచ్చిన వివరణ ప్రకారం ఈ దాడి విచక్షణారహితంగా పాశవికంగా ఆదివాసీ ప్రజలపై జరిగిన సైనికదాడిగానే పరిగణిస్తున్నారు. దీనిపై కేంద్రం కూడా వెంటనే వివరణ ఇవ్వలేకపోయినదంటే మరణించింది ఆదివాసీ ప్రజలు కనుకనే.

ఇలాంటి సైనిక దాడులతో స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారిని వెళ్ళగొట్టి అక్కడి సహజ వనరులను ఎమ్.ఎన్.సి.లకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే గుర్తించాలి. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ విజయ్. ఆపరేషన్ హాకల పేరుతో సొంత బిడ్డలపైనే సైనిక దాడులకు ఎగబడుతున్న దళారీ కార్పొరేట్ పాలక వర్గాల దమన నీతిని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలి.

కోట్లాది రూపాయలను ఈ ఆపరేషన్లకు ఖర్చు చేస్తున్న పాలక వర్గం స్థానిక ఆదివాసీ ప్రజల హక్కులను గుర్తించి వారి జీవన స్థితిగతులను మెరుగుపర్చుకునేందుకు వారికి అవకాశమిస్తూ సహజ వనరులు, భూములపై వారి హక్కులను గుర్తించి తోడ్పడాల్సిందిగా ప్రజాస్వామిక వాదులు, మేధావులు వత్తిడి తేవాల్సిన అవసరముంది. కానీ ఈ అధికార బధిరాంద లంచగొండి అవినీతి స్కాముల దళారీ కార్పొరేట్ పాలక వర్గాలకు ఇవేవీ వినిపించుకునే మనసు లేదన్నది అందరికీ తెలిసిన విషయమే..


వార్త

15, జూన్ 2012, శుక్రవారం

భూమి - దళితులు-ఆత్మగౌరవం..భూమి - దళితులు-ఆత్మగౌరవం

శ్రీకాకుళం మళ్ళీ నెత్తుటి గుడ్డు అయ్యింది. కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, వేంపెంట సంఘటనల తరువాత నేడు లక్ష్మిపేటలో దళితులపై జరిగిన అమానుష దాడి నాలుగు నిండు ప్రాణాలును బలిగొంటూ మనముందు అనేక ప్రశ్నలను వుంచింది. హత్యల వెనక కులం, రాజకీయ, ఆర్థిక కారణాలతో పాటుగా ప్రధానంగా దేశ అస్తిత్వ సమస్య అయిన భూమి వుంది.

సెంటు భూమిలేని దళితుల అస్తిత్వ పోరాటానికి సాక్ష్యం ఇది.

ప్రాంతంలోని సువర్ణముఖి, వేగావతి నదీ సంగమ ప్రాంతం మడ్డువలస దగ్గర నిర్మించిన ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల పంట భూములు, గ్రామాలు నష్టపోయి అప్పటి అర కొర ప్యాకేజీలతో పొట్ట చేత పట్టుకొని చెట్టుకొకరు పుట్టకొకరైన వారే ఎక్కువగా వున్న ప్రాంతంలో ప్రభుత్వం యిచ్చిన నిర్వాసిత స్థలంలో ఇల్లు నిర్మించుకొని వున్న వాళ్ళలో కొట్టిశ, లక్ష్మిపేట గ్రామాల ప్రజలు వున్నారు. రెండు గ్రామాలు వంగర మండల పరిథిలో వున్నాయి. ఇందులో లక్ష్మిపేట గ్రామంలో 60 ఇల్లు దళితులలోని మాల వర్గానికి చెందినవి. మిగిలిన 80 ఇల్లు బి.సి. కాపు కులానికి చెందినవి. వీరంతా తమ పాత గ్రామం విడిచిపెట్టి వచ్చి ఇక్కడ కొత్తగా చేరినవారే. గ్రామం చుట్టు పరచుకొని వున్న 240ఎకరాల వ్యవసాయ భూమి బి.సి.వాళ్ళది. దీనికి ప్రభుత్వం కాంపన్సేషన్ చెల్లించి వేసింది. అయినా ఇది ముంపు పరిథి దాటి వుండడంతో ఇందులో 180 ఎకరాలు బి.సి.లు 60 ఎకరాలు మాలకులస్తులు సాగు చేసుకుంటూ వస్తున్నారు. భూమి తమదే కాబట్టి అరవై ఎకరాలు కూడా తమకే చెందాలని కాపువర్గం దళితులపై వత్తిడి తేవడంతో వారంతా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. మొత్తం భూమికి గవర్నమెంటు నష్టపరిహారం చెల్లించివున్నందున అది ప్రభుత్వ స్వాధీనంలో వున్నట్టే. దీనిపై ఎవరికీ హక్కులుండవు కాబట్టి దీనిని సరిఅయిన రీతిలో ఇరు వర్గాలను కూచోబెట్టి పంపిణీ చేసి వుంటే అసలు ఈరోజు ఇంత దారుణం జరిగి వుండేది కాదు.

న్యాయస్థానాన్ని ఇరువర్గాలు ఆశ్రయించడంతో మొత్తం భూమిపై స్టే ఆర్డరిస్తూ ఎవరూ సాగు చేయకుండా ఆదేశాలిచ్చింది. ఇది బి.సి.లకు పుండు మీద కారంలా మారింది. గతంలో తమ సాగులో వున్న భూమిపై హక్కు తాము దళితులు అడగడం కారణంగా కోల్పోయామని వారు భావించడం, అందుకు బి.సి వర్గానికి చెందిన మాజీ ఎం.పి.పి. బొత్స వాసుదేవ నాయుడు తమ అధికార పార్టీ అండతో ప్రభుత్వాధికారుల అవినీతి అలసత్వాలను సొమ్ము చేసుకొంటూ సమస్యను తెగనీయకుండా చేస్తూ ఇరువర్గాలను రెచ్చగొట్టి తన రాజకీయ పలుకుబడిని పెంచుకునే ఎత్తుగడలో భాగంగా సమస్యను జఠిలం చేయడంలో ప్రధాన పాత్ర వహించాడు. దీనికి వత్తాసుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, కోండ్రు మురళిలు కొమ్ము కాయడంతో ఎన్నాళ్ళుగానో రగులుతున్న తమ కక్షను, పగను తీర్చుకునేందుకు ఉప ఎన్నికల సందర్భాన్ని (12-6-12) వాడుకున్నారు బి.సి.లు. గ్రామంలో గత ఆర్నెళ్ళుగా కొనసాగుతున్న పోలీసు పికెట్లోని వారు ఎన్నికల డ్యూటీకి వెళ్ళిన వేళ దళితులంతా ఉదయం చద్దన్నం తినడానికి ఇంట్లో వున్న సమయంలో కత్తులు, బాంబులు, రాళ్ళతో కాపు వర్గానికి చెందిన ఆడా మగా పిల్లలతో సహా వారిపై దాడి చేసి ఇంట్లోంచి ముంగిటకు లాక్కొని వచ్చి వారిని అతి దారుణంగా కొట్టి చంపారు. వారి వృషణాలపై రాళ్ళతో కొట్టి చంపడం ఇక్కడ వారి పట్ల వున్న కసి పగను తెలియజేస్తోంది. దాడిలో దళితులైన బూరాడ సుందరరావు, చిట్టి అప్పడు, తండ్రీ కొడుకులైన నెవర్తి వెంకటి, నెవర్తి సంగమేసులు చనిపోయారు.

రాయలసీమ, పల్నాడు ప్రాంతంలోని బాంబుల సంస్కృతిని ఇక్కడ కూడా ప్రవేశ పెట్టిన ఘనత మంత్రి బొత్సకు దక్కిందని అంతా అంటున్నారు. ఇంత దారుణంగా దళితులపై దాడులు జరిగి హత్యచేయబడి, 20 మందికి పైగా గాయాలపాలై అందులో మరి కొంతమంది చావు బతుకుల మధ్య కొట్టుకుంటుంటే కనీసం ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించలేదు. అలాగే కంటి తుడుపు చర్యగా ముఖ్యమంత్రి ప్రకటించిన నష్టపరిహారం పై కూడా సరైన ఆదేశాలు రాకపోవడం దళితులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీంతో రాష్ట్ర ఎం.ఆర్.పి.ఎస్.అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మరికొంత మంది దళిత నాయకులు, రాజకీయ పార్టీల వారు చనిపోయిన మృతదేహాలను ఖననం చేయకుండా మూడురోజులుగా పోరాటం చేయడంతో కదలిన అధికార యంత్రాంగం భూమిలో దళితులకు ఎకరా చొప్పున ఇవ్వడానికి అలాగే దాడికి పాల్పడిన వారిపై చర్యలకు హామీలివ్వడంతో ఈరోజు (14-6-12) సాయంత్రం ఖననం చేసారు.

దళిత హత్యాకాండ, దాడి సంఘటనకు ప్రధానంగా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం బాధ్యత వహించాలి. అలాగే స్థానిక రాజకీయ నాయకులు తమ అగ్రకుల అధికార మదంతో దళితులను భయభ్రాంతులను చేసి వారిని ఊరినుండి తరిమి కొట్టడం ద్వారా మొత్తం ప్రభుత్వాధీనంలోకి పోయిన భూమిపై తామే హక్కును కైవసం చేసుకోవాలన్న పక్కా ప్రణాళిక వుంది. దేశంలోని కులం, వర్గం యొక్క స్వభావానికి మరో తార్కాణం లక్ష్మిపేట దళితులపై జరిగిన దాడి. దీని యొక్క సామాజిక, రాజకీయార్థిక మూలాలను అర్థం చేసుకోవాల్సి వుంది. బలహీన వర్గాలకు కులమొక్కటే ఆత్మగౌరవ సమస్యగా ఉద్యమాలు చేయడం కాకుండా వారికి ఆర్థిక పరమైన ఆసరా, హక్కును కల్పించే భూమి ప్రధాన సమస్యగా ముందుకు తీసుకు రావాల్సిన అవసరాన్ని లక్ష్మిపేట ఊచకోత తెలియజేస్తోంది.

6, జూన్ 2012, బుధవారం

ఈ దేశానికి పట్టిన చీడ ఎవరు??

దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నకార్పొరేట్ రాజకీయ నాయకులు వారి అడుగులకు మడుగులొత్తుతూ జీ హుజూర్ అంటు బానిసల్లా బతుకుతూ సొంత ఇంటి లాభం చూసుకునే స్వార్థ ఐ.ఎ.ఎస్.లు, వీరిద్దరికీ కాపు కాస్తున్న దళారీ న్యాయవ్యవస్థ వీళ్ళ వలన ఈ దేశం ఎంతగా అతలాకుతలమవుతుందో అందరికీ ఎరుకే.

ఏదో గొప్ప నీతిమంతుడి ఫోజుతో మధ్యతరగతి అవకాశవాద మనఃస్తత్వాన్ని సొమ్ము చేసుకొని అధికారంలోకొచ్చేద్దామని కలలు కంటూ రాజకీయాల్లోకొచ్చిన పాత చెదపురుగు లోక్ సత్తా పేరుతో పార్టీ పెట్టిన జయప్రకాష్ నారాయణ నిన్న గనులు దోచినోల్లు నక్సలైట్ల కంటే ప్రమాదకారులని స్టేట్మెంటు ఇవ్వడం చూస్తుంటే ఈయన గారి సామాజిక రాజకీయ ఆర్థిక అవగాహన ఏపాటిదో తెలుస్తోంది.
ఈ దేశానికి నక్సలైట్ల వలన ప్రమాదమా ఇలా దోపిడీ దారుల కొమ్ము కాసే ప్రభుత్వాధికారులవలన ప్రమాదమో ప్లెబిసైట్ నిర్వహిస్తే తెలుస్తుంది జనవాణి. వీళ్ళేదో దేశంలో తెలివైన వారిగా ఫోజు కొడుతూ విపరీతంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, కుల పొగరు చూపుతూ , అధికారంలో వున్నన్నాళ్ళు రాజభోగాలనుభవిస్తూ, ప్రజల సొమ్ము అప్పనంగా దోచుకుపోయే వర్గం. వీరి వత్తాసు లేకుండా ఏ రాజకీయ నాయకుడూ దోచుకుపోలేడు. అధికారంలో వున్నవాడి కొమ్ము కాస్తూ తమకేదీ జరగదన్న ధీమాతో తామేదో దైవపుత్రులులా మిగిలిన వారిని హీనంగా చూసే ఈ దేశ ప్రధాన పాలక అధికార గణం ఏపాటి నీతి మంతమయినదో అందరికీ తెలిసినదే.
అవినీతిని రూపుమాపే పేరుతో ఈయన ఇంతవరకూ చేసిన ఉద్యమాలేపాటివో, గోడ మీది పిల్లివాటంలా వుంటూ తన పబ్బం గడుపుతున్న మాజీ గారు ఏదో పేపర్లలో కనబడ్డం కోసం ప్రకటనలివ్వడం తప్ప ఈయన చేస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమం ఏమీ లేదింతవరకు..
ఈ దేశ సహజవనరులను కాపాడేందుకు ప్రాణాలొడ్డి పోరుతూ బానిస వ్యవస్థను రూపుమాపుతూ సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా అహర్నిశలూ పోరాడుతున్న నిజమైన దేశభక్తులైన నక్సలైట్ల పట్ల ఈయన వైఖరిని ఖండిస్తున్నా..

27, ఏప్రిల్ 2012, శుక్రవారం

తప్పనిసరైన కిడ్నాపులు - రాజ్య స్వభావం..మల్కనగిరి జిల్లా కలెక్టర్ వినీల్ క్రిష్ణ కిడ్నాప్ నుండి నిన్నటి ఇటాలియన్ యాత్రికులు, కొరాపుట్ గిరిజన ఎం.ఎల్.ఏ హికాక తోపాటు చత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా కలెక్టర్ పాల్ కిడ్నాప్ వరకు వరుసగా జరుగుతున్న వాటి గురించి ప్రజలను చాలా అపోహలకు గురిచేస్తోంది రాజ్యం. 

ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఆదివాసీ ప్రజలపైనా వారు నివసిస్తున్న ఆదివాసీ ప్రాంతంపైన రాజ్యం పూర్తి స్థాయి సైనిక దాడికి పూనుకొన్న క్రమంలో దూకుడుగా వస్తున్న యుద్ధాన్ని కొంతవరకు నియంత్రించే వ్యూహంలో భాగంగాను, అనేక ఏళ్ళుగా కనీసం ఒక్కమారైనా కోర్టులకు తీసుకురాబడకుండా ఏ నేరమూ చేయని ఆదివాసులను మావోయిస్ట్ సానుభూతిపరుల పేరుతో వందలాది మందిని జైళ్ళలో కుక్కుతూ వారికి న్యాయ సహాయం అందకుండా చేస్తున్న రాజ్య వికృత రూపాన్ని బట్ట బయలు చేసేందుకు ఇదో ప్రతిఘటనా రూపంగా విప్లవ పార్టీ ఎంచుకున్న మార్గం. 

రాజ్యం అబూజ్ మఢ్ ప్రాంతంలోని వనరులను కొల్లగొట్టి విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు అనువుగా ఆ ప్రాంతంపై దాడి చేయడానికి అత్యంత కౄరులుగా తమ కెరీర్ లో పేరు పొందిన పోలీసు సైనికాధికారులను అక్కడ నియమిస్తూ దేశ సరిహద్దులలో కావలి కాయాల్సిన సైనికులను తమ సొంత గడ్డపై తమ ప్రజలపైకి ఉసిగొల్పుతూ ఆపరేషన్ విజయ్ పేరుతో పెద్ద ఎత్తున వేసవిదాడులు చేయడానికి పూనుకొంది. ఇదే సందర్భంలో అమెరికన్ అపవిత్ర కలయికకు పుట్టిన దేశం ఇజ్రాయిల్ వారి వద్ద నుండి అత్యంతాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తూ మానవ రహిత విమానాల ద్వారా ఆదివాసీ ప్రాంతాలపై నిఘాత పాటు దాడులకు పూనుకుంటున్నది రాజ్యం.  అలాగే ఆదివాసీ ప్రజలను ఉద్యోగాల పేరుతోను వారి వేలితో వారి కన్నే పొడుచుకునే విధంగా సల్వాజుడుం లాంటి పారా సైనిక బలగాలను తయారు చేస్తూ ఉసికొల్పుతోంది. 

వారి హక్కుల పట్ల మాటాడినా కనీసం ఆలోచించినా సోనీ సొరీ లాంటి ఆదివాసీ టీచర్లను అత్యంత పాశవికంగా చిత్రహింసలకు గురి చేస్తూ వారిని నేరస్తులుగా పరిగణీస్తూ కోర్టుల చుట్టూ తిప్పుతూ జైళ్ళలో వేస్తోంద. ఇలా రాజ్యం బహుముఖంగా తన దాడిని విస్తరిస్తూ ఉద్యమం మనుగడను ప్రశ్నార్థకంగా మార్చ జూసే క్రమంలో కిడ్నాప్ ఎత్తుగడ మొదలైంది. 

ఒడిసా సర్కారు ఇటాలియన్ టూరిస్టులుగా చెప్పుకొని ఆదివాసీల అర్థ నగ్న చిత్రాలనుతీసి సొమ్ము చేసుకోజూస్తున్న వారిని అడ్డుకునే క్రమంలో వారిని కిడ్నాప్ చేసి తమ డిమాండ్లను పెడితే తెలివిగా కొన్నిఆమోదించినట్లు నటిస్తూ వారి విడుదలకు కేంద్రంనుండి అంతర్జాతీయ వత్తిడి కారణంగా చొరవ చూపింది. అదే గిరిజన ఎం.ఎల్,ఏ.కిడ్నాపయి నెలరోజులకు పైగా బందీగా వున్నా కనీసం పట్టించుకోకుండా ఆయనకు ఏమీ చేయరన్న ధీమాతో స్పందించలేదు. సదరు ఎం.ఎల్,ఏ.కు తన వర్గం పట్ల రాజ్యానికి వున్న సవతి తల్లి ప్రేమ బహిర్గతం కావడంతో ఇంక తనకు తాను తన పదవికి, బూర్జువా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించాడు. 

ఇందులో మీడియా వారు కూడా తమ పాత్ర తాము చాలా నాటకీయంగా ప్రదర్శిస్తున్నారు. కలెక్టరు కిడ్నాప్ జరిగిన మరుసటి రోజే ఆయన ఇలా చదివాడు, ఇలా పెరిగాడు అంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలు, వేదనలు పేపర్లలోను టీవీలలోను ప్రచారం చేస్తారు. అదే ఓ ఆదివాసీని మావోయిస్ట్ పార్టీ సభ్యుడిగా నేరంమోపి అరెస్ట్ చేస్తేనో, ఎన్ కౌంటర్ చేస్తేనో అది వార్తకాదు. ఈ ద్వంద్వనీతీ వీరి వర్గ స్వభావాన్ని తెలియజేస్తుంది. 

కావున ఇలా కిడ్నాపులను వ్యతిరేకిస్తున్న మేధావి వర్గం అదే స్థాయిలో ఆదివాసీ ప్రజలపైన వారి భూభాగంపైనా రాజ్యం చేస్తున్న పాశవిక దాడిని ఖండించేలా గొంతు కలపాలని, నిజంగా ఈ దేశం పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఆలోచించే వారే ఐతే మన సార్వభౌమత్వాన్ని సామ్రాజ్యవాద దేశాలకు తాకట్టు పెడుతున్న కార్పొరేట్ దళారీ బూర్జువా పాలకుల ఎత్తుగడలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య ఉద్యమాలను నిర్మించేందుకు బలపరచడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నా.

17, మార్చి 2012, శనివారం

'స్త్రీవాద ఉద్యమంలో తాత్విక ధోరణులు' - అనురాధా గాంధీ...
'స్త్రీవాద ఉద్యమంలో తాత్విక ధోరణులు' - అనురాధా గాంధీ...

'ఫెమినిస్టు ఉద్యమంలో వివిధ తాత్విక ధోరణుల' గురించి మార్క్సిస్ట్ దృక్పథంతో విశ్లేషించిన ఈ సైద్ధాంతిక రచన కేవలం భారత దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగానే మార్క్సిజం - ఫెమినిజంల మధ్య జరుగుతున్న సైద్ధాంతిక చర్చకు ఒక ముఖ్యమైన అత్యవసరమైన, అపురూపమైన చేర్పు.

ముఖ్యమైనదీ, అత్యవసరమైనదీ ఎందుకంటే పాశ్చాత్యదేశాలలోనూ, భారతదేశంలోనూ వచ్చిన వివిధ ఫెమినిస్టు తాత్విక ధోరణుల్ని లోతుగా పరిశీలించి, పరిశోధించి, విశ్లేషించి వాటిలోని అనుకూలాంశాలను ఎత్తిపడ్తూనే వాటిలోని అశాస్త్రీయతను, అపసవ్యతనూ కూడా ఎంతో సునిశితంగా చూపిన రచన ఇది. ఆచరణతో ముడిపడిన మార్క్సిస్ట్ విశ్లేషణను నేర్పుగా ఉపయోగిస్తూ, సిద్ధాంత అధ్యయనం కేవలం ఆదర్శాలుగానో, ఆశలుగానో మిగిలిపోగల భావవాద భావనలు ఏవి, హానికరమైనవి ఏవి అనేదాన్ని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా ఇది వివరించింది..

అపురూపమైనది ఎందుకంటే ఇది రచించినది CPI (Maoist) Central Committee Member (who died recently with ill health) Com.Anuaradha Ghandy....

- మాసే..
ఈ పుస్తకం ప్రచురణ - విరసం..
ప్రతులకుః దిశ పుస్తక కేంద్రం, చిక్కడపల్లి, హైదరాబాద్, సహచర బుక్ మార్క్, బాగ్లింగంపల్లి, హై.బా., నవోదయ బుక్ హౌస్, హై.బా.

27, ఫిబ్రవరి 2012, సోమవారం

యుద్ధనేత్రం కొల్విన్ కు అశృనీరాజనాలు..తన కెమెరా కన్నుతో

యుద్ధ నేరస్తులను ప్రపంచ పీఠంపై నగ్నంగా నిలబెట్టింది..
శరణార్థ శిబిరాల గొంతు వినిపించి
నిరంకుశ పాలకుల దాష్ఠీకాన్ని బట్టబయలు చేసింది..

వార్తా సేకరణకు తన కన్ను బలిపెట్టి
కెమెరానే తన మూడో నేత్రంగా తెరిచి
యుద్ధభూమిలో సంచరిస్తూ
గాయాల గేయాలను వినిపించింది...

తన పని తాను చేసుకుపోతూ
జీవితాన్ని ఇంత నిర్లక్ష్యంగా
యుద్ధమేఘాల ధూళిలో
కలగలసి పోతూ
బాధితుల దుఃఖాన్ని బాధను
యుద్ధ భయానక దృశ్యాల్ని
సజీవంగా చిత్రీకరిస్తూ తాను
నిర్జీవంగా మారుతూ
యుద్ధ నేత్రాన్ని సజీవంగా
మనముందుంచిన కొల్విన్...

నీకు మా అశృనీరాజనాలు తెలిపే
అర్హత లేకున్నా
నీతో పాటున్నామన్న నిజం
సజీవం...

(సిరియాలో జరుగుతున్న యుద్ధంలో యదార్థ దృశ్యాలను చిత్రీకరిస్తూ అగ్రరాజ్య తొత్తులైన సేనల బాంబుదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేరీ కొల్విన్ కు జోహార్లు)

20, ఫిబ్రవరి 2012, సోమవారం

ప్రజాస్వామ్య దేశంలో తలలకు వెలలా??నాకు ఈ ప్రశ్న చాలా రోజులుగా వెన్నాడుతోంది.. ప్రపంచ పటంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని బోరవిరుచుకుంటున్న భారత దేశంలో విప్లవకారులుగా, నక్సలైట్లుగా, మావోయిస్టులుగా పిలవబడుతూ దేశ ప్రధానిచే అంతర్గత భద్రతకు పెను ముప్పుగా పేర్కొంటూ అణచివేయజూస్తున్న ఏకైక ప్రతిపక్షమైన వారి తలలపై వెలలను పెంచుతూ ప్రకటిస్తూన్న వారికి ఈ ప్రశ్న వేయాలని...

వారిని పట్టిచ్చే వారికి, దొంగ ఎదురుకాల్పులలో హత్య చేసే వారికి ఎరగా ఈ వెలలను నిర్ణయిస్తూ వస్తున్నవి ఈ పాలక వర్గాలు. ఇది ప్రజాస్వామ్య దేశంలో న్యాయ బద్ధమైనదా? ఏ చట్టంలో ఇలా పేర్కొన్నారు? రాజ్యాంగ బద్ధమా?? పౌరుల వ్యక్తిగత స్వేచ్చకు, వారి అస్తిత్వానికి, జీవనానికి భంగకరంగా వున్న ఈ చర్య పౌరుల హక్కులకు వ్యతిరేకమైనది కాదా?? రాజ్యాంగంలో రాసుకున్నవి అమలు చేయడంలో విఫలమై ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటూ పాలిస్తున్న ఈ కార్పొరేట్ పాలక వర్గాలు పార్టీలుగా బహుముఖంగ కనిపిస్తూ అంతర్గతంగా వారి ఏక వర్గ దృక్పథంతో ప్రజల పక్షాన పోరాడుతున్న వారిని ఇలా హత్య చేయడానికి పురికొల్పేట్టు లైసెన్స్ డ్ గాంగులను రక రకాల పేర్లతో సృష్టిస్తూ (గ్రే హౌండ్స్, కోబ్రా, సల్వాజుడుం మొ.నవి) వారి స్థావరాలపై దాడులు చేయడానికి ఉసికొల్పుతూ ప్రేరేపిస్తున్నవి.

గిరిజన ప్రజానీకానికి నిలువ నీడ లేకుండా చేస్తూ, దేశ సహజ వనరులను కొల్లగొట్టే పన్నాగంలో భాగంగా సామ్రాజ్యవాదుల కొమ్ము కాస్తూ రక రకాల మారణాయుధాలను ఇజ్రాయిల్, అమెరికన్ హంతక ముఠాలను కొనుగోలు చేస్తూ ఈ దేశ ప్రజానీకం పన్నుల రూపంలో చెల్లించే అత్యంత విలువైన ప్రజా ధనాన్ని వెచ్చిస్తూ, అభివృద్ధి పేరుతో అడవులలో రోడ్లు వేస్తూ పర్యావరణాన్ని నాశనం జేస్తూ ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఆకుపచ్చ యూనిఫాం వేసుకున్న వారిని వేటాడే పేరుతో మధ్య భారతదేశంలోని సహజ వనరులను, పచ్చని అడవిని నాశనం జేయ పూనుకుంది. దీనికి అంతర్గత భద్రత పేరు తగిలించారు నేటి ప్రధానివర్యులు. వారికితోడుగా పచ్చయప్పన్ అనే హంతకుని వారసున్ని, కార్పొరేట్ కంపెనీలకు న్యాయ సలహాదారున్ని ఈ దేశ ఆంతరంగిక మంత్రిగా జేసి జనాన్ని మోసపుచ్చుతూ అత్యంత తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు.

ఈ తలలపై వెలల ప్రకటన ఈ హంతక పాలక వర్గానికి చెందిన ఆర్థిక దోపిడీదారులు, బ్లాక్ మనీ రాజకీయ, వ్యాపార, ఉద్యోగ వర్గాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాత పాలక వర్గాలపై, రేపిస్టు రాజకీయ నాయకులపై, దొంగనోట్ల వ్యాపారులపై, అక్రమార్జన పరులపై తలా ఓ రూపాయి వేసుకొని సామాన్య ప్రజలే వీళ్ళని పట్టుకొని ప్రజాకోర్టులో నిలదీస్తే ఇస్తామని ప్రకటిస్తే ఎలా వుంటుంది..

తలలపై వెలలు ప్రకటించడం ప్రజాస్వా మ్యమా? మానవహక్కుల ఉల్లంఘన కాదా?? దేశ అత్యున్నత న్యాయస్థానం స్వంత రిపబ్లిక్ తమ పౌరులను చంపుకోవడం పట్ల నిరసన ప్రకటించినా వినిపించని అధికార బధిరాంధులకు గుణపాఠం ప్రజలే నేర్పాలి.

అయ్యా, అమ్మా, ప్రజాస్వామ్య వాదులారా, విద్యార్థి మేధావులారా, మానవ హక్కుల కార్యకర్తలారా, న్యాయ నిపుణులారా ఈ ప్రశ్న తమకు తాము వేసుకోని ప్రశ్నిద్దామా...

25, జనవరి 2012, బుధవారం

చదవండి చదివించండి చే a primate

 
'సాహితీమిత్రులు' విజయవాడ వారు శ్రీశ్రీ విశ్వేశ్వరరావు గారు సంకలనకర్తగా చే a primate పేరుతో వేసిన ఈ పుస్తకంలో కవులు రచయితలైన అరుణ్ సాగర్, సి.ఉమామహేశ్వరరావ్, కె.శివారెడ్డి, హెచ్చార్కె, ప్రసేన్, డా.బి.ఆర్.ఎల్.ప్రసాద్, వంశీకృష్ణ, సీతారాం, మోహన్, ఎన్.అంజయ్య, లెనిన్ ధనిశెట్టి గార్ల స్పందనలు చే వ్యాసాలు, లేఖలు, అరుదైన ఫోటోలుతో చే అభిమానులను అలరించే విధంగా వుంది. ఇందులో చే భారతదేశ పర్యటనానంతరం మన దేశ స్థితిగతులపై నాయకులపై రాసిన వ్యాసం ఆలోచింపజేసేదిగా వుంది...

పుస్తకం ఖరీదు రు.45/- $ 5.
కావలసిన వారు ఈ సెల్ నెం.కు సంప్రదించవచ్చు:9490634849