మల్కనగిరి జిల్లా కలెక్టర్ వినీల్ క్రిష్ణ కిడ్నాప్ నుండి నిన్నటి ఇటాలియన్ యాత్రికులు, కొరాపుట్ గిరిజన ఎం.ఎల్.ఏ హికాక తోపాటు చత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా కలెక్టర్ పాల్ కిడ్నాప్ వరకు వరుసగా జరుగుతున్న వాటి గురించి ప్రజలను చాలా అపోహలకు గురిచేస్తోంది రాజ్యం.
ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఆదివాసీ ప్రజలపైనా వారు నివసిస్తున్న ఆదివాసీ ప్రాంతంపైన రాజ్యం పూర్తి స్థాయి సైనిక దాడికి పూనుకొన్న క్రమంలో దూకుడుగా వస్తున్న యుద్ధాన్ని కొంతవరకు నియంత్రించే వ్యూహంలో భాగంగాను, అనేక ఏళ్ళుగా కనీసం ఒక్కమారైనా కోర్టులకు తీసుకురాబడకుండా ఏ నేరమూ చేయని ఆదివాసులను మావోయిస్ట్ సానుభూతిపరుల పేరుతో వందలాది మందిని జైళ్ళలో కుక్కుతూ వారికి న్యాయ సహాయం అందకుండా చేస్తున్న రాజ్య వికృత రూపాన్ని బట్ట బయలు చేసేందుకు ఇదో ప్రతిఘటనా రూపంగా విప్లవ పార్టీ ఎంచుకున్న మార్గం.
రాజ్యం అబూజ్ మఢ్ ప్రాంతంలోని వనరులను కొల్లగొట్టి విదేశీ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు అనువుగా ఆ ప్రాంతంపై దాడి చేయడానికి అత్యంత కౄరులుగా తమ కెరీర్ లో పేరు పొందిన పోలీసు సైనికాధికారులను అక్కడ నియమిస్తూ దేశ సరిహద్దులలో కావలి కాయాల్సిన సైనికులను తమ సొంత గడ్డపై తమ ప్రజలపైకి ఉసిగొల్పుతూ ఆపరేషన్ విజయ్ పేరుతో పెద్ద ఎత్తున వేసవిదాడులు చేయడానికి పూనుకొంది. ఇదే సందర్భంలో అమెరికన్ అపవిత్ర కలయికకు పుట్టిన దేశం ఇజ్రాయిల్ వారి వద్ద నుండి అత్యంతాధునిక ఆయుధాలను కొనుగోలు చేస్తూ మానవ రహిత విమానాల ద్వారా ఆదివాసీ ప్రాంతాలపై నిఘాత పాటు దాడులకు పూనుకుంటున్నది రాజ్యం. అలాగే ఆదివాసీ ప్రజలను ఉద్యోగాల పేరుతోను వారి వేలితో వారి కన్నే పొడుచుకునే విధంగా సల్వాజుడుం లాంటి పారా సైనిక బలగాలను తయారు చేస్తూ ఉసికొల్పుతోంది.
వారి హక్కుల పట్ల మాటాడినా కనీసం ఆలోచించినా సోనీ సొరీ లాంటి ఆదివాసీ టీచర్లను అత్యంత పాశవికంగా చిత్రహింసలకు గురి చేస్తూ వారిని నేరస్తులుగా పరిగణీస్తూ కోర్టుల చుట్టూ తిప్పుతూ జైళ్ళలో వేస్తోంద. ఇలా రాజ్యం బహుముఖంగా తన దాడిని విస్తరిస్తూ ఉద్యమం మనుగడను ప్రశ్నార్థకంగా మార్చ జూసే క్రమంలో కిడ్నాప్ ఎత్తుగడ మొదలైంది.
ఒడిసా సర్కారు ఇటాలియన్ టూరిస్టులుగా చెప్పుకొని ఆదివాసీల అర్థ నగ్న చిత్రాలనుతీసి సొమ్ము చేసుకోజూస్తున్న వారిని అడ్డుకునే క్రమంలో వారిని కిడ్నాప్ చేసి తమ డిమాండ్లను పెడితే తెలివిగా కొన్నిఆమోదించినట్లు నటిస్తూ వారి విడుదలకు కేంద్రంనుండి అంతర్జాతీయ వత్తిడి కారణంగా చొరవ చూపింది. అదే గిరిజన ఎం.ఎల్,ఏ.కిడ్నాపయి నెలరోజులకు పైగా బందీగా వున్నా కనీసం పట్టించుకోకుండా ఆయనకు ఏమీ చేయరన్న ధీమాతో స్పందించలేదు. సదరు ఎం.ఎల్,ఏ.కు తన వర్గం పట్ల రాజ్యానికి వున్న సవతి తల్లి ప్రేమ బహిర్గతం కావడంతో ఇంక తనకు తాను తన పదవికి, బూర్జువా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించాడు.
ఇందులో మీడియా వారు కూడా తమ పాత్ర తాము చాలా నాటకీయంగా ప్రదర్శిస్తున్నారు. కలెక్టరు కిడ్నాప్ జరిగిన మరుసటి రోజే ఆయన ఇలా చదివాడు, ఇలా పెరిగాడు అంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల రోదనలు, వేదనలు పేపర్లలోను టీవీలలోను ప్రచారం చేస్తారు. అదే ఓ ఆదివాసీని మావోయిస్ట్ పార్టీ సభ్యుడిగా నేరంమోపి అరెస్ట్ చేస్తేనో, ఎన్ కౌంటర్ చేస్తేనో అది వార్తకాదు. ఈ ద్వంద్వనీతీ వీరి వర్గ స్వభావాన్ని తెలియజేస్తుంది.
కావున ఇలా కిడ్నాపులను వ్యతిరేకిస్తున్న మేధావి వర్గం అదే స్థాయిలో ఆదివాసీ ప్రజలపైన వారి భూభాగంపైనా రాజ్యం చేస్తున్న పాశవిక దాడిని ఖండించేలా గొంతు కలపాలని, నిజంగా ఈ దేశం పట్ల ప్రజాస్వామ్యం పట్ల ఆలోచించే వారే ఐతే మన సార్వభౌమత్వాన్ని సామ్రాజ్యవాద దేశాలకు తాకట్టు పెడుతున్న కార్పొరేట్ దళారీ బూర్జువా పాలకుల ఎత్తుగడలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య ఉద్యమాలను నిర్మించేందుకు బలపరచడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నా.
ఓహో అడవుల్లో ఉంటూ ప్రజలు ఎన్నుకున్న నేతలని, కలెక్టర్లని కిడ్నాప్ చేయడం ప్రజాస్వామ్య ఉద్యమమా?
రిప్లయితొలగించండినాకు తెలియక అడుగుతానూ ప్రజలకి దూరంగా అడవుల్లో ఉంటూ చేసే విధ్వంసం ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?
ప్రభుత్వం చేసే హింసని వ్యతిరేకించే వీళ్ళు ప్రభుత్వం కల్పించే సదుపాయాలని కూడా కల్పించి అప్పుడు మాట్లాడితే బావుంటుందేమో. ఇది నా అభిప్రాయం మాత్రమే.
శంకర్ s m n..మీరు పెట్టిన కామెంట్సన్నీ ఇక్కడే వున్నాయి.. మీలా తీరుబడిగా బ్లాగుల్లో కూచొని వ్యాఖ్యలు వెంట వెంటనే ప్రచురించడానికి మాకు ఇదే పనికాదు కదా... ఇక్కడ ఏ కామెంటూ మిస్ కాదు... ఆలోచనల సంఘర్షణ ద్వారా ఒకరికి ఒకరు తెలియజేసుకొనేందుకే ఈ బ్లాగులో రాస్తున్నాను. మీరెంత కవ్విస్తూ రాసినా ఇక్కడ ప్రచురింపబడ్డాయి. పని వత్తిడివలన కాస్తా ఆలస్యమౌతుంది. నూరు పూలు వికసించనీ వేయి ఆలోచనలు సంఘర్షించనీ...
తొలగించండినేను తీరుబడిగా ఉన్నానని నాకు తెలియని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు కెక్యూబ్ వర్మ గారూ. మీరు అంత బిజీగా ఉంటూ కూడా నా వ్యాఖ్యని ప్రచురించి, మిగిలిన బ్లాగులన్నీ తీరుబడిగా తిరిగి అక్కడ నా కామెంట్లకు స్పందనగా ఇక్కడ నా కామెంట్ ను ప్రచురించాను అని తిరిగి నాకు సమాధానం చెప్పడానికి కేటాయించిన సమయం నేను అడిగిన దానికి సమాధానం చెప్పడానికి కేటాయిస్తే బావుండేదేమో. లేక మీకు నా కామెంట్ లో ప్రశ్నలు కనబడలేదూ అంటే మరి మీ బిజీలో కనిపించకపోయి ఉండచ్చేమో లెండి. మళ్ళీ మీకు తీరుబడి వీలైనంత త్వరగా దొరకాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను.
తొలగించండి@ Shankar S - నక్సలైట్లు పుట్టింది అడవుల్లో కాదు, పల్లెల్లోనే, జనంలోనే!! 1960ల్లోనే ఆంధ్రప్రదేశ్ లోనూ, మొత్తం దేశంలోనూ నక్సలిజం విస్తరించినా, ఎమర్జెన్సీ సమయంలో గానీ, ఆ తరవాత 1992 వరకు గానీ వాళ్లున్నది జనంలోనే!! 1992లో మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో పీపుల్స్ వార్ గ్రూప్ మీద నిషేధం విధించినప్పుడు, రాజ్యహింసను తట్టుకోలేకా, ఒక్కొక్క నాయకుని మీదా ప్రభుత్వం పెడుతున్న లెక్కలేనన్ని కేసులను పరిష్కరించుకోలేకా నక్సలైట్ నాయకులూ, దళసభ్యులూ అజ్ఞాతంలోకి వెళ్లాల్సొచ్చింది!! ఒక్క సంఘటనలో పాల్గొన్నందుకే ఒక్కొక్క నక్సలైట్ నాయకుని మీదా నలభై యాభై కేసులు పెట్టిన ఉదంతాలున్నాయి. మన ప్రభుత్వం ప్రజాస్వామ్యం అంటూ మాట్లాడుతున్నది కానీ, ఫాసిజాన్నీ, దగాకోరుతనాన్నీ ఆచరిస్తున్నది.
తొలగించండిఒక్కసారి బ్లాగుల్లోంచి బయటికొచ్చి బైటున్న లోకం చూడండి. ఛత్తీస్ గడ్ అడవుల్లో మావోయిస్టులు జనతన సర్కార్ పేరుతో నడుపుతున్న సమాంతర ప్రభుత్వాన్ని పరిశీలించండి!! అక్కడ మావోయిస్టులకు మద్దతు పలుకుతున్న గిరిజనుల్ని అడిగి చూడండి. ఈ ప్రాంతాల్లో నక్సలిజం విస్తరించింది 1980ల్లో!! 1947 నుంచి 1980ల వరకూ అతిపెద్ద "ప్రజాస్వామ్య" ప్రభుత్వం ఐన భారత ప్రభుత్వం ఏనాడూ ఈ గిరిజన గూడాల వైపు తొంగి చూడలేదు. ఈ "ప్రజాస్వామిక" భారత ప్రభుత్వమే ఏడెనిమిది తరాలుగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను కేవలం పట్టాలు లేని కారణంగా ప్రభుత్వభూమిగా చూపెట్టి, ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నది. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాధినేతలు భూపందేరాల మాటున, గనుల లీజుల మాటున సంచులకు సంచులు డబ్బులు వెనకేసుకుంటున్నారు. ఇదీ మన దేశ ప్రజాస్వామ్యం!!
భారత ప్రభుత్వం ఏనాడూ చెయ్యని చాలా అభివృద్ధి పనులను నక్సలైట్లు తమకున్న పరిమితులకు లోబడి ఈ గిరిజన ప్రాంతాల్లో చేసి చూపించారు. పత్రికల్లో వచ్చేవే జరుగుతున్నట్టు, రానివి జరగనట్టూ లెక్కలేసుకునే వాళ్లు ఉష్ట్రపక్షి కన్నా మూర్ఖులు!! ఈ గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు గ్రామాలను కాపాడుతుంటే, "ప్రజాస్వామిక" భారత ప్రభుత్వం పోలీసులను పంపి పల్లెలను వల్లకాడు చేయిస్తున్నది. బ్లాగుల్లోంచి బయటకు రండి, కనిపిస్తుంది!!
ఆదివాసీలపై రాజ్యం చేస్తున్న దాడులనే కాదు, మావోయిస్టులు చేస్తున్న దాడులను కూడా ఖండిస్తున్నాం. ఎందుకంటే, రాజ్యం కన్నా ఎక్కువ దాడులు చేసేది వారే కాబట్టి.
రిప్లయితొలగించండిఇంకోటి, కిడ్నాపులు ఎల అయితే తప్పని సరి అని మీరు భావిస్తున్నారో.. మల్లోజుల వంటి వారి ఎంకౌంటర్లు కూడా అలానే జనాలు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఈ మావోయిస్టుల ప్రభావం అలాంటిది మరి.
I saw your link in phone when Niharika posted about it in Google Plus. I uphold kidnaps of IAS officers. IAS officers work according to laws made by ruling class. They do not work according to own decisions as shown in cinemas. For proletarian revolutionaries, lives of ordinary people are more precious than lives of white collar IAS officers.
రిప్లయితొలగించండిబస్సు దహనాలు, రాజకీయనేతలు, ప్రభుత్వాధికారుల అపహరణలు వంటి పోరాట రూపాలను, ఎత్తుగడలను నిలిపివేయాలని, ప్రత్యేకించి ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్న బస్సు దహనాల చర్యలను మొత్తంగా నిలిపివేయాలని చాలా ఏళ్ల క్రితమే మావోయిస్టు పార్టీ తీర్మానించుకున్నట్లుంది. చాలాకాలం తర్వాత మళ్లీ అపహరణలు వంటి చర్యలు గత రెండేళ్ల నుంచి ప్రారంభమైనట్లున్నాయి. బయటి సమాజంలోని మెజారిటీ ప్రజల అభిప్రాయం ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, సంవత్సరాలుగా బెయిల్ దొరకని, సానుభూతి చూపినంతమాత్రానే జైళ్లపాలయిన ఆదివాసీ ఖైదీల విడుదలకోసం అనివార్యంగా ఎంచుకుంటున్న ఇలాంటి ఎత్తుగడలు నాగరిక సమాజానికి దూరంగా ఉంటున్న సమాజాల్లోని ప్రజలకు నూటికి నూరుపాళ్లు ఆమోదనీయంగానే ఉంటున్నాయి. అర్థం కానిదల్లా భద్రలోగ్ సమాజానికి మాత్రమే.
రిప్లయితొలగించండిపాలకులకు, ప్రజలకు మధ్య నిజమైన అర్థంలో జరుగుతున్న యుద్ధ ప్రాంతానికి దూరంగా ఉంటున్నాం కాబట్టే అనుకుంటాను "ప్రజలకు దూరంగా అడవుల్లో ఉంటూ చేసే విధ్వంసం ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది?", "రాజ్యం కన్నా ఎక్కువ దాడులు చేసేది వారే -మావోయిస్టులు- కాబట్టి.." అనే రకం అమాయకమైన వ్యాఖ్యలు వస్తున్నాయి. భారతదేశంలో అటవీ ప్రాంతాల్లో -లోతట్టు మరియు సెమీ అటవీప్రాంతాలు- కోట్లమంది జనం నివసిస్తున్నారు. దండకారణ్య ప్రాంతంలో ఎంతమంది జనం అడవుల్లో నివసిస్తున్నారో భారత ప్రభుత్వానికే తెలీటం లేదు. మిత్రులు పరిశోధనలు చేసి బయటపెడితే ప్రభుత్వానికి, ప్రజలకు కూడా మంచిదేమో. "రాజ్యం కన్న ఎక్కువ దాడులు చేసేది వాళ్లే" దీనిమీద కూడా పీహెచ్‌డి చేయవలసిందే.
యుద్ధంలో మునిగి ఉన్న వాళ్లకు, బయటనుంచి వ్యాఖ్యలు చేసే మనలాంటివాళ్లకు ఉన్న వైరుధ్యం అనేది యుద్ధం కొనసాగుతున్నంత కాలం ఉనికిలో ఉంటూనే వస్తుంది. పోరాటం - అణిచివేత - మళ్లీ పోరాటంగా సాగుతున్న ఈ క్రమం ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ విజయ్‌ల ద్వారా పరిష్కారమయ్యేది కాదు. ఆదివాసీల పోరాటమే లేకపోతే వారికి అండగా నిలిచేవారు లేకపోతే భారతదేశంలో సగం అడవులు ఇప్పటికే ప్రజలతో కాదు కాని ఫ్యాక్టరీలతో, గనులతో, సామ్రాజ్యవాద కంపెనీల పదఘట్టనలతో నిండిపోయేవి. మావోయిస్టుల న్యాయమైన పోరాటాలకు బయటనుంచి మద్దతు తెలుపుతున్న వారిని కూడా అసాంఘిక శక్తులుగా, క్రిమినల్స్‌గా ఆరోస్తున్న కాలమిది. దీనికి వ్యతిరేకంగా సాక్షాత్తూ సుప్రీంకోర్టు, హైకోర్టులు సైతం తీర్పులు చెబుతున్నా మనం మారం.
ఒకటి మాత్రం నిజం. ఇది మాటలతో తేలే పని కాదు.
కుమార్ వర్మగారూ, మీ టపా సారాంశంతో ఏకీభవిస్తున్నాను.
నెలవంకః సార్ ఇక్కడ వచ్చే వ్యాఖ్యలు వారి అవగాహనాలేమిని తెలియజేస్తున్నాయి.. అలాగే వారికి కెరీరిజం పట్ల వున్న ఆసక్తిని కూడా..అది వారి వారి చైతన్య స్థాయి.. ఉద్యమ ప్రభావం ఏమీ లేకపోతే లక్షల కోట్ల రూపాయలతో రాజ్యం వారిని అణచివేయ జూస్తుందా అన్న మౌళిక ప్రశ్న వారు వేసుకొని ఆలోచిస్తారని ఆశిద్దాం.. సరైన వ్యాఖ్యతో స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు..
తొలగించండిఈ టపా పై నా వ్యాఖ్య పెద్దగా అవుతుంటే నా బ్లాగులో టపాగా పెట్టాను.
రిప్లయితొలగించండిhttp://nenu-naa-svagatam.blogspot.in/2012/04/blog-post.html
కార్తీక్ గారూ మీ గోల అంతా మీ బ్లాగులో చూసాను..అది మీకు ఉద్యమంపై ఉద్యమకారులపై వున్న ద్వేషాన్ని తెలియజేస్తోంది.. ఆదివాసీల జీవనశైలిపై,వారి ప్రాంతాల ప్రాముఖ్యతపై మీకున్న అవగాహనా లేమిని తెలియజేస్తోంది.. ఇజ్రాయిల్ పుట్టుక గురించి కూడా మీకు సరైన అవగాహన లేదని అర్థమయ్యింది..అలా వెటకారంగా రాస్తే మీ బ్లాగు హిట్లు రావచ్చేమోకానీ అది సమాధానం కాదు.
తొలగించండిIAS officers didn't come from heaven. These so called intellectuals need not cry much for them. IAS officers work according to laws made by ruling class. They cannot make own decisions as shown in cinemas. Government is bothering about lives of IAS officers because if they fail to save the lives of their officers, then their officers wont trust them.
రిప్లయితొలగించండి/రాజ్య వికృత రూపాన్ని బట్ట బయలు చేసేందుకు ఇదో ప్రతిఘటనా రూపంగా విప్లవ పార్టీ ఎంచుకున్న మార్గం./
రిప్లయితొలగించండిదిగజారుడు సిద్ధాంతాలు, అంతకన్నా దిగజారుతున్న బేవార్సు విప్లవాలు. కలెక్టర్లను, కానిస్టేబుళ్ళను, డ్రైవర్లను, టూరిస్టులను, కిడ్నాపులు చేసి బ్లాక్మెయిల్ చేసుకునే చిద్ధాంతాలు, ఇప్లవాలు. చెప్పుకోవడానికి సిగ్గులేకపోతే సరి!
ఇలా నోరుపారేసుకోవడం కన్నా, చేవ వుంటే అధికారంలోని మంత్రులను, అవినీతిపరులను కిడ్నాపులు చేసి బేరాలకు పెట్టకుండా ముగిస్తే ఈ బేవార్సు ఎంగిలి విప్లవాలకు కొంత మద్దతు వస్తుందేమో.
అవినీతిపరులని కిడ్నాప్ చేసినంతమాత్రాన ప్రజలు ఆ కిడ్నాప్‌లకి మద్దతు ఇస్తారని అనుకోను. ఆ అవినీతిపరులు ప్రభుత్వ సొమ్మునే తింటున్నారు కానీ మా జేబులో చెయ్యి పెట్టి డబ్బులు లాక్కోవడం లేదు కదా అని వాదించేవాళ్ళని చూశాను. "నా ఇల్లు చక్కబెట్టుకుంటే చాలు, ఎవరిల్లు వాళ్ళు చక్కబెట్టుకుంటే దేశం బాగుపడుతుంది" అనే రకం వ్యక్తివాదం నుంచి బయటపడినా సమాజంలో అవినీతి కొంచెమైనా తగ్గుతుంది.
రిప్లయితొలగించండిరాను రానూ... పిక్ పాకెట్లు, మానభంగాలకు కూడా విప్లవం రంగు పూసుకునేస్థితికి దిగజారుతున్న దగుల్భాజీల విప్లవాలు.
రిప్లయితొలగించండివాకపల్లిలో మీ అభిమాన పాలకవర్గంవాళ్ళు పోలీసుల చేత చెయ్యించినవి అవే కదా SNKR గారు. వాకపల్లి వార్త వచ్చిన వెంటనే అప్పటి హోమ్ మంత్రి గుమ్మడికాయ దొంగలా భుజాలు తడుముకుని, కనిష్ట స్థాయి దర్యాప్తు కూడా చెయ్యకుండా వాకపల్లి వార్తని మావోయిస్ట్‌లు అల్లిన కట్టుకథ అని వాదించాడు కదా.
రిప్లయితొలగించండివర్మగారూ,
రిప్లయితొలగించండిఇవ్వాళే బిడి శర్మగారి ప్రకటనను ఇక్కడ లింకుగా ఇస్తున్నాను. చూడండి. మీకోసమే..
‘నీరు, అడవి, భూమి’ ల యజమానులు ఎవరన్నదే మావోయిస్టు సమస్య -బి.డి.శర్మ
http://teluguvartalu.com/2012/05/06/%E0%B0%A8%E0%B1%80%E0%B0%B0%E0%B1%81-%E0%B0%85%E0%B0%A1%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%AD%E0%B1%82%E0%B0%AE%E0%B0%BF-%E0%B0%B2-%E0%B0%AF%E0%B0%9C%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/
నెలవంక గారూ..థాంక్యూ..నిజానికి ఆదివాసీలను ప్రజలుగా వారూ ఈ దేశ పౌరులుగా గుర్తించలేదిక్కడి పాలకవర్గాలు, మనమూ కూడా.. ముందుగా వారి అస్తిత్వాన్ని, వారి స్వావలంబనను గుర్తించడంలో అందరి వైఫల్యమూ వుంది. వారేదో అనాగరికులుగా అమాయకులుగా అనుకోవడం మూర్ఖత్వం. ఈ దేశ సహజ వనరులతో పాటు ఈ దేశ మూలవాసులను కూడా సమానంగా గుర్తించాల్సిన అవసరముంది. మెజారిటీ దౌర్జన్యానికి బలవుతున్న క్రమంలో తమ సహజ సిద్ధమైన పోరాట వారసత్వాన్ని, ఎదిరించే తత్వాన్ని అణచివేయజూస్తూ వారిపై దాడులను చేస్తూ వారిని ఉద్ధరిస్తున్నామనుకుంటూ వారెన్నడూ అడగని అభివృద్ధి నమూనాను వారిపై రుద్దుతూ కార్పొరేట్ పాలక వర్గాలు ఈ దేశ సహజ సంపదను కొల్లగొట్టేందుకు జరుపుతున్నదే ఆపరేషన్ గ్రీన్ హంట్ ఆపరేషన్ విజయ్ లాంటి సైనిక చర్యలు. మావోయిస్ట్ అణచివేత పేరుతో అంతర్గత భద్రత ముప్పు పేరుతో స్వంత ప్రజలపైకే సైన్యాన్ని ఉసుగొల్పుతోంది ఈ దళారి పాలక వర్గం.. వారి తొత్తులుగా కుహనా ప్రజాస్వామ్య వాదులు మొసలిన్నీరు కారుస్తున్నారు...
రిప్లయితొలగించండి