30, జూన్ 2012, శనివారం

మళ్ళీ నెత్తురోడిన చింతల్నార్ (Basaguda)చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బాసగూడ అటవీ ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జరిగిన సైనికదాడిలో ఇరవై రెండు మంది ఆదివాసీలు చనిపోయారు. ఈ దాడిలో పాల్గొన్నది సైనిక విభాగమైన కోబ్రా, పారామిలటరీ, స్థానిక రిజర్వ్ విభాగాలకు చెందిన దళాలు. వీరు మావోయిస్టులతో సమావేశమైన ఆదివాసీ ప్రజలపై మూకుమ్మడిగా దాడి చేసి చంపివేసారు. చనిపోయినవారిలో మహిళలు, తొమ్మిది సంవత్సరాల బాలిక, పదకొండేళ్ళ బాలుడు కూడా వున్నారు. వీరంతా గ్రామంలోని భూసమస్యపై చర్చించుకుంటున్న సందర్భంలో మావోయిస్టులను మట్టుబెట్టేందుకు సిద్ధమైన సైనిక బలగాలు అక్కడికి చేరుకుని గ్రామస్తుల నుండి ప్రతిఘటననెదుర్కొనలేక విచక్షణారహితంగా ఆధునిక ఆయుధాలతో దాడి చేసి ఇంతమంది ఆదివాసీలను పొట్టనబెట్టుకున్నారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు వారంతా మావోయిస్టులేనని పాతపాటనే పల్లవిస్తున్నారు.

స్థానిక విలేకర్లు, ప్రజాస్వామిక వాదులు, స్వామి అగ్నివేష్ ఈ ఎదురుకాల్పులపై యిచ్చిన వివరణ ప్రకారం ఈ దాడి విచక్షణారహితంగా పాశవికంగా ఆదివాసీ ప్రజలపై జరిగిన సైనికదాడిగానే పరిగణిస్తున్నారు. దీనిపై కేంద్రం కూడా వెంటనే వివరణ ఇవ్వలేకపోయినదంటే మరణించింది ఆదివాసీ ప్రజలు కనుకనే.

ఇలాంటి సైనిక దాడులతో స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారిని వెళ్ళగొట్టి అక్కడి సహజ వనరులను ఎమ్.ఎన్.సి.లకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే గుర్తించాలి. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ విజయ్. ఆపరేషన్ హాకల పేరుతో సొంత బిడ్డలపైనే సైనిక దాడులకు ఎగబడుతున్న దళారీ కార్పొరేట్ పాలక వర్గాల దమన నీతిని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలి.

కోట్లాది రూపాయలను ఈ ఆపరేషన్లకు ఖర్చు చేస్తున్న పాలక వర్గం స్థానిక ఆదివాసీ ప్రజల హక్కులను గుర్తించి వారి జీవన స్థితిగతులను మెరుగుపర్చుకునేందుకు వారికి అవకాశమిస్తూ సహజ వనరులు, భూములపై వారి హక్కులను గుర్తించి తోడ్పడాల్సిందిగా ప్రజాస్వామిక వాదులు, మేధావులు వత్తిడి తేవాల్సిన అవసరముంది. కానీ ఈ అధికార బధిరాంద లంచగొండి అవినీతి స్కాముల దళారీ కార్పొరేట్ పాలక వర్గాలకు ఇవేవీ వినిపించుకునే మనసు లేదన్నది అందరికీ తెలిసిన విషయమే..


వార్త

2 వ్యాఖ్యలు:

  1. ఈ రొజే ఒక సినిమా చూసాను. అందులో ఇలాగే ఆదివాసులు ఉండే ఒక ప్రాంతంలో మినింగ్ చెయ్యటానికి, వారిని అక్కడ నుంచి తరిమి వెయ్యడానికి ప్రయత్నిస్తారు రాజకీయ నాయకులు. అప్పుడు అనుకున్నాను, ఇలా నిజంగా జరగదేమో, సినిమా కదా ఎదో చూపిస్తున్నారు అని. This news shocked me!!! చదువుతుంటేనే రక్తం మరిగినట్టయింది.

    ప్రత్యుత్తరంతొలగించు
    ప్రత్యుత్తరాలు
    1. వెన్నెలగారూ మీ సహానుభూతికి అభివందనాలు...సహజ వనరుల సంపదతో అలరారుతున్న మధ్య భారతంపై కన్నేసిన MNC లకు అండగా వున్న పాలక వర్గం అక్కడ అనేక దారుణాలకు ఒడిగడుతోంది. దీనిని ప్రధాన మీడియా కూడా పూర్తిగా ప్రచారం కాకుండా దోపిడీ వర్గానికే కొమ్ము కాస్తోంది. రాజ్యం యొక్క వికృత రూపం అక్కడ తాండవిస్తోంది. దానినెదుర్కొనే కమంలో అనేక నిండు ప్రాణాలు మట్టిలో కలిసిపోతున్నాయి.

      తొలగించు

ఆలోచనాత్మకంగా..