తెలంగాణా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలంగాణా లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, డిసెంబర్ 2011, శుక్రవారం

డిసెంబరు 9ని మోసపూరిత దినంగా పాటిద్దాం



అమ్మలకన్న అమ్మ సోనియమ్మ పుట్టిన రోజు కానుకగా తెలంగాణా ఇచ్చేస్తామని కేంద్ర గృహమంత్రివర్యులు ప్రకటించి అప్పుడే రెండేళ్ళు పూర్తికావచ్చాయి. మళ్ళి కేక్ రెడి అయిపోయింది.. వందలాది మంది విద్యార్థుల, ఉద్యమకారుల పీకలు కోసి నెత్తురంటిన చాకుతో ఈరోజు మరల అమ్మగారి పుట్టిన రోజుకు ముస్తాబవుతోంది. ఇంత పచ్చి మోసపూరిత, దగాకోరు పాలక వర్గానికి వత్తాసుగా ఉద్యమ పార్టీలమని చెప్పుకుంటూ పబ్బంగడుపుతున్న నారకత్వం, అటు అధికార ప్రతిపక్ష వర్గాలలో వున్న తెలంగాణా నపుంసక నాయకత్వం ప్రజలను మోసం జేయడంలో ఎవరికి వారే ముందుంటూ జనం బతుకులను ఆగమాగం జేయడంలో తమదే పైచేయిగా పెత్తనం జేయ జూస్తున్నారు. ఉవ్వెత్తున ఎగసిపడిన విద్యార్థి యువజన లోకాన్ని తీవ్రమైన నిర్బంధంతో అణచివేసి, ఉద్యోగ సంఘాలంతా చేపట్టిన సకలజనుల సమ్మెను విద్రోహంతో కుప్పకూల్చి పాలకవర్గ తాబేదార్లతో కుమ్మకై ఇప్పుడు అభివృద్ధి మండలి పేరుతో నిధులను దొబ్బి నొక్కేయడాన్కి ప్రయత్నిస్తున్నారు. ఇలా ఆరు దశాబ్ధాల తెలంగాణా ప్రజల ఆకాంక్షను సొమ్ము చేసుకుంటున్న మోసపూరిత రాజకీయ నాయకత్వం నుండి ప్రజా ఉద్యమాన్ని రక్షించుకొని ఉధృతం చేసే బాధ్యతను విద్యార్థి యువజన వర్గం చేపట్టాల్సిన అవసరం నేడు మరింతగా బలపడుతోంది. కావున ప్రజల ఆకాంక్షను నెరవేర్చే బాధ్యతను ప్రజాస్వామిక, మేధావి, విద్యార్థి, యువజన, కార్మిక, ఉద్యోగ, రైతు సోదరులంతా కలగల్సి చేపట్టి అమరుల స్వప్నాన్ని నెరవేర్చడానికి ప్రతిన బూనుతూ డిసెంబరు 9 మోసాన్ని ప్రపంచమంతా చాటి చెప్పాలని కోరుకుంటు..

జైతెలంగాణా...

తెలంగాణా పోరులో అమరులైన వారికి జోహార్లు...

అమరుల ఆశయాలను కొనసాగిద్దాం...

జాతుల విముక్తి పోరాటాలు వర్థిల్లాలి....

6, జనవరి 2011, గురువారం

తవ్వాలేదు ఎలుకను పట్టాలేదు..

శ్రీక్రిష్ణ కమిటీ వేసిన రోజే నేను నా బ్లాగులో రాసాను. ఇది కాలయాపన కోసం, మోసం చేయడం కోసం తప్ప ఏమీ ఉపయోగంలేనిదని. సాధికారత లేని కమిటీ సాధించేదేమీ వుండదు. ఇది అంతా ఒక బుడబుక్కల వాడి ట్రూపులా తయారయ్యి ఇంతవరకు పనిచేసిన కమిటీలకంటే భిన్నంగా మాటి మాటికీ మీడియా ద్వారా ఏదో ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తూ, తద్వారా వచ్చే అభిప్రాయాలనే తమ రిపోర్ట్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేసారు. ఈ రిపోర్టులో ప్రజల మనోభావాలేవీ ప్రతిఫలించలేదన్నది వాస్తవం. ఇదంతా సోనియా అండ్ కో ఆడించిన ఒక తోలుబొమ్మలాట. వీళ్ళకు కోస్తా అంటే గోదావరీ, క్రిష్ణా జిల్లాలే కనపడ్డాయి. ఉత్తరాంధ్ర గురించి ఒక్కమాట మాత్రమైనా లేదు. ఇప్పటికే అత్యంత వెనకబడ్డ ప్రాంతంగా, పాలమూరు జిల్లాకంటే అత్యధికంగా వలసలు పోయే జిల్లాలుగా వుండి బతుకు భారమై పోయిన ప్రజల నెత్తిన కోస్తా కారిడార్, థర్మల్ పవర్ స్టేషన్ లు, ప్రైవేటు పోర్టుల నిర్మాణాలతో అత్యధిక కాలుష్య ప్రాంతంగా మారుతున్న తీరు, అటు మన్యంలో బాక్సైట్ తవ్వకాలు ద్వారా, గిరిజనుల హక్కులను హరించే విధంగా వారి భూములను కంపెనీలకు కట్టబెట్టడం మొ.న పరిణామాలతో తీవ్ర సంక్షోభంలో వున్న ఉత్తరాంధ్ర ఊసే లేకపోవడం ఈ కమిటీ సాధించిందేమిటి. రాష్ట్రంలో తమ పర్యటనలతో వివిధ రాజకీయ నాయకులు, బడా పెట్టుబడిదారుల విందులు వినోదాలతో కమిటీ వేసిన నాటికంటే మొన్నటి డిసెంబర్ ముప్పై నాటికి బాగా శారీరకంగా రంగు వచ్చి, నిగనిగలాడుతున్నారు తప్ప ఇంకేమీ ఒరగబెట్టింది లేదు. అందుచేత ముందుగా ఈ కమిటీ మాయలో పడొద్దన్న ఆనాటి నా అభిప్రాయాన్నే ఉద్యమకారులకు మరోమారు విన్నవిస్తూ, తెలంగాణా ప్రజల ఆకాంక్షను గౌరవించాలని పాలక వర్గాన్ని డిమాండ్ చేస్తున్నా..

ఇక్కడ కమిటీ రిపోర్టును చదవొచ్చు

27, డిసెంబర్ 2010, సోమవారం

బలగాలు తరలింపు తెలంగాణాకే ఎందుకు?



పారామిలటరీ బలగాల మోహరింపు తెలంగాణా ప్రాంతానికే పరిమితం చేస్తూ తెలంగాణా ప్రజల గుండెలపై తుపాకులెక్కుపెట్టడాన్ని చూస్తుంటే డిసెంబర్ ఆఖరు తరువాత వారి ఆశలపై నీళ్ళు జల్లేందుకు సిద్ధమైన కార్యాచరణతో పాలకవర్గం వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి తద్వారా వారిని తీవ్ర నిర్బంధంతో అణచబట్టడానికి ఉద్యుక్తులవుతున్నారని అర్థమవ్వని వారెవ్వరైనా వున్నారా?

ఉద్యమ క్రెడిట్ ను ఏ ఒక్కరో కొల్లగొట్టుకుపోకుండా వుండటానికి ఈ రోజు ఎన్నడూ గొంతెత్తి ఎరుగని కాంగేయులు దీక్ష చేపట్టడం హాస్యాస్పదం కాదా?

జైళ్ళలో మగ్గుతున్న విద్యార్థులను పరామర్శించని ఈ నాయకులంత నేడు వారిపై వున్న కేసులను ఎత్తివేయమని గోలచేయడం వెనక కుట్ర కానరాదా? కేసుల సంఖ్య ప్రకటిస్తూ ఎత్తివేసినవన్నీ సాధారణ కేసులే తప్ప వారిపై పెట్టిన తీవ్రమైన కుట్రకేసులగురించి మాటాడని ప్రభుత్వం ఇంతకుముందెన్నడూ లేనివిధంగా న్యాయపరమైన చిక్కులు గురించి మాటాడుతూ తప్పుదోవపట్టిస్తోంది. ప్రజలకు, వారి ఆస్తులకు కోట్ల రూపాయలలో నష్టాన్ని సాగించి, హత్యలు, లూఠీలతో తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన రంగా హత్యానంతరం, రాజీవ్ హత్యానంతరం అధికార పార్టీ గూండాలందరిపై ఎత్తివేసినప్పుడు కానరాని ఈ న్యాయ, నైతిక అంశాలు తెలంగాణా విద్యార్థి, యువజనులపై పెట్టిన తప్పుడు కేసులప్పుడే గుర్తుకు రావడం వీళ్ళ వివక్షకు తార్కాణం కాదా?

తెలంగాణా ప్రజలేమైనా ఉగ్రవాదులా? ఇన్నిన్ని కేసులు, మిలటరీ బలగాల మోహరింపుతో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేయడం ఎంతవరకు సమంజసం?

ఈ పాలకవర్గ నాయకులంతా ముందుగా బలగాల అక్రమ తరలింపును అడ్డుకొని, వాటి ఉపసంహరణకు డిమాండ్ చేస్తూ వారి పదవులనుండి వైదొలగి కేంద్ర, రాష్ట్ర పభుత్వాలపై తీవ్రమైన వత్తిడి తేగలిగితే వీరిని నమ్మొచ్చు. అంతే కానీ దీక్షలతో మభ్య పెట్టజూడడం తెలంగాణా ప్రజలను మోసం జేయజూడడమే...

ఒకపక్క కేసీఆర్ జార్ఖండ్ ఉద్యమం పద్దెనిమిదేళ్ళు సాగింది కాబట్టి అప్పుడే తొందరొద్దు, ఉద్యమాన్ని కొనసాగిస్తూ, చందాల దందాలతో, పదవులతో బేరసారాలతో హీరోగా కొనసాగ జూస్తున్నాడు కాబట్టి ఈయనగారి బండారాన్ని తప్పక బయటపెట్టి ప్రజా ఉద్యామాన్ని నిర్మాణం చేసుకొని పాలక, ప్రతిపక్ష నాయకులను బహిష్కరించి, పూర్తిగా సహాయ నిరాకరణను కొనసాగించి, అమరుల ఆశయాన్ని ఎత్తిపట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరముంది....

9, డిసెంబర్ 2010, గురువారం

మోసపుచ్చిన అపరాత్రి ప్రకటన..



తెలంగాణా ప్రజల ఆకాంక్షను గుర్తిస్తున్నట్లు సరిగ్గా ఏడాది క్రితం
అపరాత్రిప్రకటన చేసి, వారిలో ఆశలు రేకెత్తించిన కేంద్రం ఆ తరువాతి పరిణామాలకు, దళారీ పెట్టుబడిదారుల కుయుక్తులకు తలొగ్గి ఏభై నాలుగేళ్ళ సుదీర్ఘ స్వప్నాన్ని కన్న వారి ఆశలపై నీళ్ళు చల్లేట్టు కమిటీలు వేసి తెలంగాణా ఏర్పాటు ప్రక్రియను వాయిదా వేయడం ద్వారా అనేక మంది నవ యువతీ యువకుల ఆత్మార్పణకు దారితీసేట్టు చేసి, తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తూ వస్తూంది. రాష్ట్ర అధినాయకత్వ మార్పు ద్వారా మరింత కఠిన వైఖరి తీసుకునే విధంగా ప్రోత్సహిస్తూ తెలంగాణాను పోలీసు రాజ్యంగా మార్చివేయజూస్తోంది. ఉద్యమాలను వ్యతిరేకించే పోలీసు బాసును రాష్ట్రానికి గవర్నర్ గా పంపినప్పుడే కేంద్ర వైఖరి అవగతమైంది. వారి డిసెంబర్ తొమ్మిది ప్రకటన వట్టి మోసపూరితమైనదని, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి చేయాల్సిన దానికి అసెంబ్లీ తీర్మాణం కావాలన్న ప్రకటన వలన వారి దాటవేత ధోరణి వ్యక్తమైంది. అవకాశవాద రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకునేందుకు అందరి ముందు తెలంగాణాకు మద్ధతు ప్రకటించిన వారే ఈ ప్రకటన వెలువడ్డ తర్వాత వారి వారి ప్రాంతీయ ధోరణులు బయటపెట్టి మరింత వేదనకు గురిచేసారు. మీడియాకూడా రకరకాల వ్యాఖ్యానాలతో తమ పెట్టుబడుల మూలాలను కాపాడుకునే ప్రయత్నాలను చేస్తూ వస్తోంది. ముందుండి నడుపుతున్న నాయకత్వంలో కూడా వున్న అవకాశవాదం కారణంగా ఉద్యమం అటూ ఇటూ ఊగిసలాడుతూ యువతరాన్ని తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేస్తోంది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ముందుకు వచ్చి దళారీలను అడ్డుకొని ఉద్యమాన్ని నిలబెట్టి వుండకపోతే ఇప్పటికే ఉద్యమ నెలబాలుడిని ఈ రాజకీయ రాహువులు మింగిపారేసేవి. ఈ నాలుగు వందలమంది ఆత్మార్పణ బూడిద పాలయ్యేది.

తెలంగాణ ప్రజలను మరెంతో కాలం మోసం చేయలేరని, వారి సహనాన్ని పరీక్షించకుండా నాటి ప్రకటనకు కట్టుబడి వారి కలలను సాకారం చేయగలరని ఆశిద్ధాం. ఏమైనా ప్రజా ఉద్యమం ద్వారానే వత్తిడి పెంచగలమని గ్రహించి ఐక్య పోరాటాల ద్వారా తెలంగాణా సాధనకు కృషిచేయగలరని నాయకత్వాన్ని కోరుతూ..

10, అక్టోబర్ 2010, ఆదివారం

తెలంగాణా దొరల పెత్తనానికి వ్యతిరేకంగా ఫ్రంట్ ను ఆహ్వానిద్దాం..



డిసెంబరు 9 ప్రకటనతో తెలంగాణా వచ్చేసిందన్న భావం ఏర్పడి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్న ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఆంధ్రా లాబీయింగ్ కు తలొగ్గి శ్రీక్రిష్ణ కమిటీ పేరుతో చిదంబరంగారు సృష్టించిన మాయలో పడి ఉమ్ములో చిక్కుకున్న ఈగలా మారిన తెరాస వైఖరితో అనేకమంది విద్యార్థి యువజనుల ఆత్మ బలిదానాలను బలిపెట్టే విధంగా మార్చిన అన్ని రాజకీయ పక్షాల దొరతనాలకు వ్యతిరేకంగా ప్రజా యుద్ధ నౌక, తెలంగాణా పోరుబిడ్డ గద్దర్ నేతృత్వంలో ముందుకు వచ్చిన తెలంగాణా ప్రజా ఫ్రంట్ నాలుగు కోట్ల మంది ఆశలకు అణగారిన ప్రజల ఆశలకు కొత్త వూపిరిలూదగలదన్న నమ్మకాన్ని కలిగిస్తోంది.

డిసెంబరు తరువాత భూకంపాల్ని సృష్టించేస్తాం, అంతవరకు కడుపుబ్బరాన్ని అట్టిపెట్టుకోండని మాయ మాటలు చెపుతున్న కె.సి.ఆర్.నమ్మకద్రోహాన్ని ఉతికి ఆరేయాల్సిన సమయంలోనే ఫ్రంట్ ముందుకు రావడం హర్షణీయం. దీక్షను మధ్యలో వదిలేసి మోసం చేయబోతే విద్యార్థిలోకం తెగించి పోరాడడంతో వెలువడిన డిసెంబరు 9 ప్రకటనను అమలు చేయించాల్సిన తరుణంలో కాంగ్రెస్ కు ముఖ్యంగా కేంద్రంలోని నాయకత్వంనకు అడుగులకు మడుగులొత్తే విధంగా తయారై, పచ్చి సమైక్య వాది జగడపాటికి ఐ లవ్ యూ చెప్పడంవంటి వ్యాపార భాగస్వామ్య జిత్తులమారితనంతో, తన దొర దర్పం ప్రదర్శించాలనుకుంటున్న కె.సి.ఆర్.కు చెక్ పెట్టడానికి ఈ ఫ్రంట్ ఉద్యమించాలని కోరుకుందాం.

నాకు ఆంధ్రా, తెలంగాణా రెండు కళ్ళు, వ్యాపారాలకు సమైక్యాంధ్ర మూడో కన్నులాంటి ప్రకటనలతో ముందుకుపోతున్న బాబు కూటమి కుయుక్తులను అడ్డుకోవాల్సిన అవసరముంది. తెలంగాణా కోసం అమరులవుతున్న విద్యార్థి, యువజనుల పట్ల కనీస సానుభూతి లేని కాంగ్రెస్ లీడర్లు, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయించనని మొండిగా వున్న హోం మంత్రిని నిలదీయాల్సిన వారు ఇప్పుడు అమరులకు సాయమందించే పేరుతో దొంగ ఏడుపులేడుస్తున్న మూడు రంగుల పంచెగాళ్ళను మెడలు వంచాల్సిన అవసరముంది.

ఖచ్చితంగా తెలంగాణా ఎం.పీలందరిచే రాజీనామా చేయిస్తే కేంద్రం దిగివచ్చి పార్లమెంటులో బిల్లు పెట్టే అవకాశముందన్న దానిని పక్కకు పెట్టి, మొన్నటి ఉపఎన్నికలలో ప్రజల తీర్పును గుర్తించే విధంగా పాలకులపై వొత్తిడి తెచ్చే ఉద్యమాన్ని చేపట్టక నిద్దరోతున్న రాజకీయ బేరగాళ్ళను ప్రజాకోర్టుల ముందుంచాల్సిన విధంగా ఉద్యమించి తెలంగాణా ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి సమైక్యంగా ఉద్యమించి, తమలో వున్న భేదాభిప్రాయాలను చిన్నవిగా గుర్తించి ముందుకు పోవాలని ఆశిద్దాం. బహిరంగ వేదికలపై తమ అభిప్రాయ భేదాలను ప్రదర్శించకుండా కట్టడి చేయాల్సిన అవసరముందని విజ్నప్తి చేస్తున్నాం.

రండి కలసి పోరాడాడాండి..