నిరసన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నిరసన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, ఏప్రిల్ 2014, గురువారం

అసహ్యం నాకు...


అసహ్యం నాకు...

వాడెప్పుడూ తన ముఖాన్ని దాచుకోలేదు

నెత్తురంటి
కంపుకొడుతున్న చేతులని దాచుకోలేదు

మెడలో వేసుకున్న బాలింతరాలి పేగులను జంధ్యంలా పేనుతున్నాడు

కంకాళాలను కాలికింద నలుపుతూ సింహాసనమెక్క వస్తున్నాడు

దేశమంతా స్మశాన నిశ్శబ్దం వాగ్ధానం చేస్తూ రంకెలేస్తూ వస్తున్నాడు

వాడొక్కడే ఈ నేలకు వారసుడుగా త్రీడీలో పోజులిస్తున్నాడు

వాడిప్పుడు అధికారంతో చేతులు కడుక్కోజూస్తున్నాడు

వాడి చుట్టూ చేరుతున్న భజనపరులను చూస్తేనే అసహ్యం నాకు

17, సెప్టెంబర్ 2011, శనివారం

మోడీ గారి దూకుడు..



భావి బిజెపి వారి ప్రధాని అభ్యర్థిగా తనను తాను ప్రకటించుకుంటూ దూకుడుగా దూసుకు వస్తున్న నరేంద్ర మోడీ ఈరోజు మన తెలుగు పత్రికలకు సైతం ఇచ్చిన భారీ ప్రకటనలు చూస్తుంటే ఈయనగారికి ప్రజల సొమ్ము పట్ల వున్న బాధ్యత అర్థమవుతోంది...తన పుట్టిన రోజును సధ్బావనా దివస్ గా జరుపుకోమని ఆర్డరేస్తూ దీక్షను చేపట్టడం ఎవరి సద్భావన కోసం...చేసిన మారణకాండ మచ్చను చెరుపుకొనే ప్రయత్నంలో భాగంగా జాతీయ నాయకునిగా అవతారమెత్త జూస్తుంటే ఈయన గారి చిలక పలుకు వింటూంటే బంగారు కడియం - ముసలి పులి కథ గుర్తుకు వస్తోంది....

మరో ఫాసిస్ట్ పాలన వైపు మరలకుండా తగు జాగ్రత్త వహించాల్సిన అవసరమెంతైనా వుంది....వేలాది మంది ప్రాణాలను బలిగొన్న వారికి ఈ దేశంలో ఏ శిక్షా పడదని, నెత్తురు మరకలను కడుగుకొనేందుకు బూటకపు ఎన్నికల మేళా తోడ్పడుతున్నంత కాలం ఈ విషాదం వెంటాడుతూనే వుంటుంది...ఈ హిట్లర్ అంశ వున్న వాళ్ళను ఎంతలా నిరోధిస్తే అంత మంచిది దేశానికి....
,

11, జులై 2011, సోమవారం

మానవ మృగాలు

లంక మారణ హోమంలో ఒక జాతి మొత్తం నాశనం చేయబడిన తీరు చూస్తుంటే మనం ఏ కాలంలో వున్నామన్న ప్రశ్న ఉదయిస్తుంది.. ఇంత దారుణం జరిగినా మాటాడని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ కు అందుకే రెండో సారి పట్టం కట్టారా అనిపిస్తోంది.. మన దేశం నుండి వలస వెళ్ళి రెండో తెగ ప్రజలుగా అనేక విధాలుగా హీనంగా చూడబడ్డ వారిపై కనీస మానవత్వం చూపలేని ఈ దేశ పాలక వర్గం ఎంతకైనా తెగిస్తుందని తెలియవస్తోంది.. రాజీవ్ గాంధీ హత్య జరగడంతో ఆ దేశంలోని తమిళులపై జరిగిన దారుణ మారణ కాండను కనీసం ప్రశ్నించలేని మౌన ప్రేక్షకులైన ఈ దేశ పాలక వర్గం ఎంత కౄరమైనదో తెలుస్తోంది. ఒక జాతి మొత్తం తుడిచిపెట్టే దారుణాన్ని ఒడిగట్టిన దేశంపై కనీస మానవహక్కుల చట్టం గురించి మాటాడని అగ్ర రాజ్యాల అవకాశ వాదం ఇంకెన్ని బలిదానాలు కోరుతుందో? ఈ మారణ హోమం చూసిన వారికి ఎవరికైనా కడుపులో పేగులు నోట్లోకి రాక మానవు....చీ ఇంత నీచమైన కాలంలో బతుకుతున్నామా?




30, నవంబర్ 2010, మంగళవారం

ప్రజల భాగస్వామ్యం లేని ప్రజాస్వామ్యం?




పార్లమెంటరీ రాజకీయాలు ఎంత భ్రష్టు పట్టాయో తాజా రాష్ట్ర పరిణామాలు ఋజువు చేస్తున్నాయి. ప్రజలు ఓట్లు వేసాక ఇంక తమ చేతిలో ఏ అధికారమూ లేక దొంగలు దొంగలు దోచినది పంచుకుంటుంటే చూస్తూ మరో టర్మ్ వచ్చేదాక వేచి చూసి మరల మరో కొత్త దొంగల ముఠాను ఎన్నుకోవడానికి తయారు కావడమే తప్ప మరో మార్గం లేని నిస్సహాయత.

12, నవంబర్ 2010, శుక్రవారం

దొరా ప్రజలతో కలిసి పనిజేయవా?




కెసియార్ నిన్న కెకె తో సాగించిన మంతనాల అనంతరం చేసిన వ్యాఖ్యలు తెలంగాణా ఉద్యమకారుల మనసుపై కారుమబ్బులు కమ్మేట్టు చేసాయి. కాంగ్రెస్ ను బలోపేతం చేసే కొత్త ఎజెండాతో ముందుకు వస్తున్న ఈ దొరగారి ప్రణాళిక ఎప్పుడూ దొరసాని పాదాల చుట్టూ తిరుగుతూ వుండటం తీరని అవమానం. తప్పక దీనిని ఎదుర్కోవాలి. ఈ మోసకారి రాజకీయ ఊసరవెల్లిని ఉద్యమాల ఉధృతం ద్వారానే పడగొట్టాలి. అసలు ఈయన కాంగ్రెస్ ను బలోపేతం జేయడమేంటి? అదేమైనా బలహీనంగా వుందా? ఓట్లు గుంజుకునే కార్యక్రమం ద్వారా తను, తన కుటుంబాన్ని బలోపేతం జేసుకుంటున్న ఈ దళారీ దొరగాడి ఎత్తులను చిత్తు జేయకపోతే ముందు ముందు మరింత విద్రోహానికి వెనుదీయడు. ఇప్పటికే పలు వ్యాపార సంబంధాలతో, వాటిని కాపాడుకునే ఎత్తుగడలతో వున్న ఈయన జిత్తులమారితనాన్ని ఎండగట్టాల్సిన అత్యవసర పరిస్థితి ఇది. ప్రజలంతా ఏకతాటిపై నిలిచి తమ ఆకాంక్షను ప్రస్ఫుటంగా ముందుకు తెస్తున్న వేళ తెలంగాణా ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠం ముందు తాకట్టు పెట్టే యత్నానికి ఒడిగట్టడం దారుణం. తప్పక వీడి ముక్కు నేలరాయాల్సిందే...

5, నవంబర్ 2010, శుక్రవారం

ఒబామా రాకను ఎందుకు వ్యతిరేకించాలి?





బారక్ ఒబామా ఎన్నికైన రోజున అందరి మనసులలో ఏదో మార్పు పట్ల ఆశ..
మూడో ప్రపంచ దేశాల ప్రజలలో తమ భవిత పట్ల ఏదో ఊరట..
తమ వాడిలా అగుపిస్తున్న మనిషి, మాటల మనిషే కాదు చేతల పనివాడుగా కలిగించిన ఓదార్పు కొద్ది రోజులకే నిట్టూర్పుగా మారింది..

రంగు కాదు అక్కడ తెల్లగృహంలోని సింహాసనం ఎవరి చేతనైనా అదే మీట నొక్కిస్తుంది అన్నది స్పష్టమైపోయింది త్వరలోనే..
తీవ్ర నిర్బంధాన్ని, ప్రపంచ వ్యాప్తంగా తమపై జరుగుతున్న దుష్ప్రచారానికి విరామం దొరికి తమ గూడు పదిలమవుతుందని ఆశించిన ముస్లిం ప్రజానీకం, పాలస్తీనా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశస్తులకు అమెరికా ఓ భూతంగానే మిగులుతుందని తొందరలోనే గ్రహింపుకొచ్చింది.

ఇంక భారతీయులకుః అణు పరిహార బిల్లుతో కొడి దీపంగా మిగిలిన సార్వభౌమత్వమనే ఊహ అడుగంటింది. వెన్నెముక లేని స్థానిక నాయకత్వం గుడ్డిగా తల ఊపి చంకలు గుద్దుకుంది. ఏ పక్షమూ ప్రజల పక్షం కాదని నిరూపించారు.

ఇక్కడి తమ ఐ.ఎం.ఎఫ్.ఏజెంటు నాయకత్వ పాలన కొనసాగుతున్న తీరును సమీక్షించడానికి వస్తున్నందుకు వ్యతిరేకిద్దాం...

తన అండతో ఇక్కడి ఉద్యమాలపై సాగుతున్న నిర్బంధాన్ని, ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నందుకు, అవినీతికి చట్టబద్దత కల్పిస్తున్న పాలకులకు వత్తాసుగా వస్తున్నందుకు వ్యతిరేకిద్దాం...

ఔట్ సోర్సింగ్ కు నో అంటు మనకు తలుపులు మూసినందుకు తప్పక గో బాక్ ఒబామా అనాలి..

లక్షల కోట్ల రూపాయల వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొనేందుకే వస్తున్నాడని పేర్కొంటున్న మీడియా ఆ ఒప్పందాలు ఎవరికి లాభం చేకూరుస్తాయన్నది చెప్పక తమ అవకాశవాదాన్ని బయట పెట్టుకుంటున్నాయి. ఇప్పటికే సకల దరిద్ర దురదృష్ట జాతకులుగా వున్న వ్యవసాయ రంగాన్ని మరింత అడుగంటించే దానిలో భాగంగా విదేశీ వ్యవసాయ దిరుబడుల ఒప్పందాలను తిరగరాయడానికి వస్తున్న అధినేతను తప్పక వెళ్ళిపొమ్మందాం...

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, పాలస్తీనా, ఇరాక్, ఇరాన్, టర్కీ, క్యూబా మొ.న దేశాలపై అమలవుతున్న తీవ్ర నిర్బంధం, మానవ హననం ఈయన గారి హయాంలో కూడా ఆగకుండా జరుగుతున్నందుకు...

చేతిలో అణుబాంబు మీట పెట్టుకొని ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, స్వేచ్చా స్వాతంత్ర్యాల గురించి వల్లించే ఈ దెయ్యాన్ని రావద్దందాం..

గోబాక్ ఒబామా గోబాక్..

4, అక్టోబర్ 2010, సోమవారం

కుష్టు దేహంపై తెల్ల వస్త్రం ఎంతకాలం కప్పగలవు???

కామన్ వెల్త్ క్రీడల నిర్వహణలో భాగంగా ఢిల్లీ నగరంలోని సుమారు అరవై వేలమంది బిచ్చగాళ్ళను, ఫుట్ పాత్ వ్యాపారులను దూరప్రాంతాలకు తరలించారన్న వార్త పట్ల వివిధ స్వచ్చంద సంస్థలు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాలలో కేవలం 2,2oo మందికి మాత్రమే వుండేందుకు వీలుంది. మిగిలిన వారిని బలవంతంగా రైళ్ళు ఎక్కించి పక్క పట్టణాలకు తరలించారు. దీనిపై మానవహక్కుల కార్యకర్తలు ఇలా స్పందించారు "నగర సుందరీకరణ, పట్టణ పునరుద్దఱణ కార్యక్రమాల్లో భాగంగా బిచ్చగాళ్ళను తరలించే పధకాన్ని అమలు చేశారు. అధికారులు తొలుత పేదవారిని నేరస్తులుగా చేశారు. తరువాత వారిని కనపడకుండా చేశారు.'' అని ఐజిఎస్‌ఎస్‌ఎస్‌కు చెందిన సింగ్‌ తెలిపారు. ''ఇది చాలా విచారించదగ్గ పరిణామం. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక పౌరుడు నివసిస్తున్న ప్రాంతాన్ని వదిలిపొమ్మని నీవు ఎలా వత్తిడి తెస్తావు? ఇది నగర పౌరుని ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమే.'' అని ఆయ అన్నారు".

ఈ దేశంలో ఇది కొత్త కాదు. చంద్రబాబు పాలనా కాలంలో బిల్ క్లింటన్ పర్యటన సమయంలో కూడా రోడ్లపక్కనున్న కాలువలపై కూడా తెల్లని వస్త్రాలు కప్పి తమ కుళ్ళును దాచే ప్రయత్నం చేసారు.

పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించే పనిలో విఫలమై ఇలా పై పూతల ద్వారా ఇతర దేశాలవారి ముందు గొప్పలకోసం తంటాలు పడుతున్న మన అంతర్జాతీయ స్థాయి ఆర్థిక నిపుణులైన పాలకుల వారు తమ తెల్లబారిన గెడ్డాలకు రంగువెసినంత మాత్రాన ముడుతలు పడ్డ చర్మాన్ని కప్పుకోగలరా? ఈ కుష్టు రోగాన్ని తెల్ల బట్ట మాటున ఎన్నాళ్ళు దాయగలరు? అసలు ఈ దేశ ఆర్థిక పరిస్థితి గురించిగాని, నగరాల కంపు బతుకుల గురించి విదేశీయులకు తెలియదా? ఇంత సిగ్గుపడుతూ వీటిని నిర్వహించాల్సిన అవస్రమేమొచ్చింది?

క్రీడల నిర్వహణకు తగలేసిని డబ్బుతో వీరందరికీ పునరావాసం కల్పిస్తే ఎంత సంతోషించేవారు?


వార్త ఆధారంఃhttp://www.visalaandhra.com/national/article-25928

30, సెప్టెంబర్ 2010, గురువారం

హిందూ రాజ్యం!



ఇది ముమ్మాటికీ హిందూ రాజ్యంగా నేటి తీర్పుతో ఋజువయ్యింది.

ఓ చారిత్రక కట్టడాన్ని కూల్చివేసినాక, దాని పునాదులు పరిశీలించి అక్కడ ఆనవాళ్ళున్నాయని తీర్పు చెప్పిన ఏకైక న్యాయస్థానం ఎవరికి ప్రాతినిథ్యం వహిస్తుందో చెప్పకనే చెప్పింది..

ఇంక రాజ్యాంగంలో రాసుకున్న లౌకికతత్వం చెరిపేసినట్లయ్యింది...

జరిగిన సంఘటన పట్ల ఏ దృక్పధమూ వ్యక్తం చేయకుండా వేలపేజీలలో పోసిన సిరా రాతలలో ఒక్క పదమైనా గాయపడ్డ హృదయానికి స్వాంతన చేకూర్చేది లేదు కదా? ఇది మరీ అత్యాశేమో?

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఎందుకీ శాంతి జపం?


మనమున్నదిప్పుడు రోజుకో దినాన్ని జరుపుకోవడానికిలా వుంది. లేని దానిని వూహించుకొని భ్రమలలో జీవించడానికి కాకపోతే ఇలా శాంతిదినం, ప్రజాస్వామ్య దినం అంటూ జరుపుకోవడమేమిటి. ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య వైషమ్యాలు పెంపొందింపజేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న అగ్రరాజ్యానికి వంతపాడే UNO ఆఖరుకు శాంతికోసం ఓ దినాన్ని జరుపుకోమనడం ఎంత దౌర్భాగ్యం. హాయిగా గుండెలమీద చేయి వేసి పడుకొనే మనిషి ఎక్కడా కనబడని రోజులివి. దిన దిన గండం నూరేళ్ళాయుష్షులా మనమధ్య పేరుకుపోతున్న అభద్రతా భావానికి కారకులైన వారే శాంతికోసం ప్రతినలుబూనండి, ప్రార్థనలు చేయమనడం హాస్యాస్పదం కాదా? శాంతి ఎలా లభ్యమవుతుందో తెలియదా? మన మధ్యనున్న శాంతిని దూరం చేస్తూ ఏమీ ఎరగనట్లు పాలక వర్గాలు మనలను భ్రమలలో ముంచెత్తుతున్నాయి. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కావాల్సిన సమతను దూరం చేస్తూ ఏ కొద్దిమందో కోట్లకు పడగలెత్తే కార్యాచరణకు పూనుకొని, దానిని వ్యతిరేకించి సమన్యాయం, సమవాదం, నిజమైన స్వేచ్చా స్వాతంత్ర్యాలకోసం పరితపించే వారిపై ఉక్కుపాదం మోపుతూ, అలజడులకు, ఆందోళనలకు కారకులవుతూ శాంతి జపం చేసే ఈ గోముఖ వ్యాఘ్రాలను సంఘటితంగా ఎదుర్కోకపోతే నిజమైన శాంతి ఎప్పటికీ రాదు అన్నది సత్యం కాదా?

16, ఆగస్టు 2010, సోమవారం

ప్రజల ప్రాణాలరిస్తే పతకాలు



ఇటీవల సోంపేటలో అకారణంగా ప్రజల ప్రాణాలరించిన పోలీసులకు ఉత్తమ పోలీసు అధికారులుగా అవార్డులిచ్చారంటే పాలక వర్గం ఎవరి పక్షాన వుందో అర్థం చేసుకోవచ్చు. గొడవంతా సద్దుమణిగి ప్రజలు తిరుగు ముఖం పడుతున్న సమయంలో సోంపేట ఎస్.ఐ. కాల్పులు జరిపినట్లు ప్రజలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఆయనకు, సి.ఐ.కు మరి 11 మంది అదే స్టేషన్ పోలీసులకు ఉత్తమ అధికారులుగాను, శ్రీకాకుళం జిల్లా అవార్డులలో సగం వరకు టెక్కలి డివిజన్ వాళ్ళకే ఇచ్చారంటే ఈ కాల్పులు, గొడవలకు పాలకుల వత్తాసు వున్నదని అర్థమవుతోంది. ప్రజలపై అణచివేత ఎంత కౄరంగా చేస్తే ఆ అధికారులకు పతకాలు, ప్రమోషన్లు వుంటాయని దీనిద్వారా ప్రభుత్వం స్పష్టం చేయదల్చుకుంది. కాల్పులకు పాల్పడ్డ వారిపై కనీస విచారణయినా చేపట్టకుండా ఇలా పతకాలతో సత్కరించడం మన ప్రజాస్వామ్యమా?

ఇంత పెద్ద ఎత్తున అలజడి జరిగిన సంఘటనపై న్యాయవిచారణ కనీసం ఓ న్యాయమూర్తితో జరపమన్నా సరే కలెక్టర్ కింది స్థాయి అధికారి జాయింట్ కలెక్టర్ ను నియమించారంటే దీనిని నీరుగార్చే యత్నంలో స్థానిక మంత్రి వర్యుల ప్రమేయానికి ప్రభుత్వం ఎంతలా తలవొగ్గిందో తెలుస్తోంది. ప్రజల నిరసనను న్యాయస్థానాలైనా పట్టించుకొని కొంతలో కొంత ఊరటనివ్వకపోతే ఈ దళారి పాలకులకు పట్టపగ్గాలుంటాయా? ఈ ప్రాజెక్టుకు అనుమతికోసం వేసిన ఉపసంఘం విన్నపాన్ని కేంద్రమంత్రి జైరాం రమేష్ నిర్ద్వందంగా తోసిపుచ్చడం కాస్తా ఊరటనిచ్చింది.

16, మే 2010, ఆదివారం

ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం..





ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా డప్పాలు కొట్టుకున్న మన పాలకవర్గం యొక్క అసలు ముఖం బయటపడుతోంది. గొంతులేని వారి తరపున పోరాడుతున్న ప్రజాస్వామిక హక్కుల సంఘాలన్నింటిపై మావోయిస్టు మద్ధతుదారులుగ ముద్ర వేసి అణచివేయజూస్తున్న వైనం బయటపడింది. ఇది చాపకిందనీరులా సమాజంలో కాస్త అడిగే దమ్ము వున్న మేధావి వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు PUCL, APDR, PUDR, RDF వంటి సంస్థలతో పాటు మహాశ్వేతాదేవి నేతృత్వంలోని బందీముక్తి మోర్చా తో పాటు 57 ప్రజా సంఘాలను ఇంటలిజెన్స్ బ్యూరో రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ జారీ చేసిన లేఖలో వీటిని మావోయిస్టు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ గా పేర్కొటూ వీటిపై నిఘావేయాలని ఆదేశాలిచ్చాయి. ఓ పక్క మావోయిస్టు పార్టీతో చర్చలకు మేధావులు కృషి చేయాలని కోరుతూ వారి మెడపై తన డ్రాక్యులా పంటితో గాయం చేయ బూనడం వీరి నియంతృత్వ స్వభావాన్ని, దళారీ బూర్జువా తత్వాన్ని, ప్రశ్నించడాన్ని సహించలేని తనాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఈ దేశాన్ని MNC లకు, దళారీ బూర్జువాలకు తాకట్టు పెట్టి తద్వారా తమ ఆస్తులను కూడపెట్టుకోజూస్తున్న వీరే నిజమైన అంతర్గత శతృవులు. ప్రజల కాలికింద భూమిని ఆక్రమించి, స్వదేశంలో కాందిశీకులుగా మారుస్తూన్న వీరు వల్లించే ప్రజాస్వామిక సూత్రాల నిజాన్ని గ్రహించి ప్రజాస్వామిక వాదులంతా మేల్కొనకపోతే దాని వికృత పోకడ మరించ ప్రమాదకరంగా మారి దేశ సార్వభౌమత్వం(?) కోల్పోయే ప్రమాదం వుంది.

దీనిపై విపులంగా వివరణ ఇక్కడ చదవొచ్చు..http://www.tehelka.com/story_main44.asp?filename=Ne220510the_crimson.asp

15, ఏప్రిల్ 2010, గురువారం

పాలక వర్గాలకు ఏకైక ప్రతిపక్షం...




ఈ రోజు పార్లమెంటు ఉభయ సభలలోను ఉదయం నుండి సాయంత్రం వరకు చర్చ దంతేవాడ ఘటనపై జరిగింది. యింత సుదీర్ఘమైన చర్చ ఇంతవరకు ఏక కంఠంతో ఏ అంశంపైనా జరిగినట్లు లేదు. అరవై సంవత్సరాల స్వత౦త్ర పరిపాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ములికమైన సమస్యలపై యింత ఇదిగా చర్చించి వుంటే ఈనాడు ప్రజల పరిస్థితి మరోలా వుండేదేమో! కనీస సదుపాయాలైన తిండి, బట్ట, నిలువ నీడ లేక కోట్లాది మంది ప్రజలు నికృష్ట బ్రతుకు బ్రతుకుతుమ్తే అంతర్జాతీయ వ్యభిచార లీగ్ గా మారిపోయిన ipl లో లాభాలు, మాఫియా దండాలతో మంత్రులు మునిగితేలుతుంటే పట్టని ఈ పాలక వర్గం దేశ సహజ సంపదను అమ్ముకు దొబ్బే కార్యక్రమానికి ముందస్తుగా అడ్డుతోలగిమ్చే పనిగా మొదలిడిన గ్రీన్ హంట్ ఆపరేషన్ బెడిసి కొట్టి చావు దెబ్బ తిన్నదానికి ప్రతీకారాన్ని ప్రజలపై తీర్చుకునేందుకు అగ్ర వర్ణ, భూస్వామ్య, సామ్రాజ్యవాద, దోపిడీ పాలక వర్గాల గొ౦తులన్నీ ఒక్కటిగా మారి తమ బలగాలతో దేశ నడిబొడ్డున రక్తపాతాన్నే స్ఱుష్టి౦చే౦దుకు కలిసి కట్టుగా ము౦దుకు వస్తున్నాయి. కానీ ప్రజలను చేతకాని వారిగా, అమాయకులుగా భావి౦చి దాడులు చేస్తే తమదైన పద్ధతిలో జవాబు చెప్పే౦దుకు ప్రజలు సిద్ధంగానే వు౦టారు. యి౦తకన్నా నియ౦తలె౦దరో మట్టిలో కలిశారు. ఆంధ్రా ఎం.పీ. కేశవరావు మాటాడుతుంటే అసహన౦గా కదులుతూ గృహ మ౦త్రిగారు చిరాకు పడ్డారు. చర్చలు జరిపి మరల వారి బలహీనతలు గ్రహి౦చి నిర్మూలీ౦చవచ్చునని సూచనలు ఇస్తారు ఉ౦దవల్లి. వై.ఎస్సార్.లా మోసపూరిత పాలనతో, వాగ్దానాలతో వారిని మభ్యపెట్టి వంచించ వచ్చునని సూచించారు. ఎవరి నైనా ఎల్లకాలం మోసం చేయలేరు. అసలు ఆ పార్లమెంటు సభ్యులలో కొట్లాదిపతులు కాని వారెందరు? మరి మావోయిస్టుల వలన వీళ్ళకు కాకపొతే ఎవరికీ ముప్పు? అందుకే వీరి గొంతుల నుండి ఒకటే నినాదం! అణచివేత..రక్తపాతం..విమానాలనుండి బా౦బి౦గ్ చేసైనా సరే, ఎ౦త ప్రాణ నష్ట మైనా సరే ఎ౦దుక౦టే వీళ్ళ పిల్లలు కానీ, బ౦ధువులు కానీ, జైట్లీ గారు కానీ, చిద౦బర౦ గారు గానీ నష్ట పోయేదేమీ వు౦డదు కనుక..

అ౦దుకే ఈ పాలక వర్గాలన్నిటికీ వాళ్ళే ఏకైక ప్రతిపక్షం. ప్రజలే..

10, ఏప్రిల్ 2010, శనివారం

గిరిజన గోవిందమూ గ్రీన్ హంట్ లో భాగమే...



కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు యిప్పుడున్నది ఒకటే ధ్యేయం. ఆదివాసీలను అడవులనుండి ఖాళీచేసి అక్కడి సంపదను బహుళజాతి సంస్థలకు అప్పగించడం. యిక్కడ సంపదే కాదు ఆ నేలపై హక్కును కూడా మనం కోల్పోతామన్న విషయం దాస్తున్నారు. కొత్త కంపెనచట్టం సెజ్ వలన ఆ ప్రాంతంపై అన్ని రకాల హక్కులను కోల్పోతాం.

ఆదివాసీలది స్వేచ్చాయుత జీవన విధానం. వారి సంస్కృతి, సాంప్రదాయాలు వేరు. వారి పూజా విధానాలే వేరు. వారి భాష కూడా మనకేమాత్రం దగ్గరిది కాదు. వారి దేవుళ్ళు ఏవీ కంటికి కనబడే విగ్రహ రూపాలు కావు. సినిమాలలో చూపించే పెద్ద నాలుక బయట పెట్టే కడుపు దేవతలు కావు. చిన్న చిన్న రాళ్ళ రూపంలోనూ, చెట్ల రూపంలోనూ వారు కొలుస్తుంటారు. వారి మంత్రాలు కూడా మన సంస్కృత మంత్రాల వంటివి కావు. వారి పూజారి జన్నోడు వారిని మభ్య పెట్టడంలో వీళ్ళకేమీ తీసిపోడు కానీ గొడవలు పెట్టే రకం కాదు. చిన్న చిన్న బలులు, కానుకలతో సరిపెట్టేస్తుంటారు. యిలా వీరిది ఓ ప్రత్యేక ఆచార వ్యవహారమయితే మధ్యలో ఈ గిరిజన గోవిందం పేరుతో గిరిజన గూడల్లో గోవిందుడికి వివాహం పేరుతో ఊరేగిస్తున్నారు మన డాలర్ శేషాద్రి గారు. యిది వాళ్ళ సంస్కృతి నుండి వాళ్ళను వేరు చేయడమే. వాళ్ళ ఉనికిని యిప్పటికే ప్రశ్నార్థకం చెస్తున్న మనం వారి నమ్మకాల విషయాలలో కూడా దూరి ఈ కృత్రిమ సంస్కృతిని అంటగట్టడం దేనికి. యిప్పటికే క్రిస్టియన్ మత ప్రచారకులు చేరి వాళ్ళ బుఱలు పాడుచేస్తున్నారు. మరల హిందూ మతం వాళ్ళని యిటు వైపు యిప్పుడు మళ్ళించడం కూడా గ్రీన్ హంట్ లో భాగమే. అది కూడా తూ. గోదావరి జిల్లా నుండి మొదలు కావడమన్నది అక్కడ బాక్సైట్ వ్యతిరేక పోరాటం తీవ్ర స్థాయిలో జరుగుతుండటమే కారణం. మావోయిస్టుల ఏరివేత పేరుతో ఆదివాసీ ప్రాంతాలనుండి వారిని ఖాళీ చేయించి నాగరికత, జన జీవన స్రవంతిలో కలిపే కార్యక్రమాలలో భాగంగా వాళ్ళ మనసులపి దాడి చేయడానికి డిష్ టీవీలు, డివీడీ ప్లేయర్లు యిచ్చి బూతు సేడీలు కూడా సప్లై చేస్తున్నారు. పాలక వర్గాల అభివృద్ధి నమూనా రోడ్లు వేయడమే. యివి వారిపై ప్రేమతో కాదు, వారి నేల, నీరు, సంపదపై దురాశతో. కావున గిరిజన గోవిందమూ ఆపరేషన్ గ్రీన్ హంట్ లో భాగంగానే భావించాల్సి వస్తోంది....

28, ఫిబ్రవరి 2010, ఆదివారం

విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమా?




ఉస్మానియా విద్యార్థులపై మావోయిస్టు ముద్ర వేయడం ద్వారా ప్రభుత్వం తన తప్పిదానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం.

దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎదురైన పరాభవానికి విద్యార్థులపై మావోయిస్టు సానుభూతిపరులంటూ పోలీసులు ఇచ్చిన రిపోర్టును యదాతధంగా సమర్పించడం ద్వారా ప్రభుత్వం తన దమననీతిని మరో మారు నిస్సిగ్గుగా బయటపెట్టుకుంది. సుప్రీం ధర్మాసనం వేసిన తీవ్రమైన ప్రశ్నలకు సమాధానం దొరకక తత్తరపడింది. సానుభూతిపరులైనంత మాత్రాన నేరస్తులుగా పరిగణిస్తారా? అని సూటిగా ప్రశ్నించింది. జరిగిన విధ్వంసంను కారణంగా చూపగా నక్సలైట్లను అణచివేసేందుకు మీరు తర్ఫీదునిచ్చిన తోడేళ్ళగుంపును యిలాగే రాజకీయపార్టీల సభలకు, ప్రచారాలప్పుడు వాడుతారా అని ముక్కుపై గుద్ది ప్రశ్నించింది.

సిగ్గు తెలీని పాలకవర్గం యింకా ఏ ముఖం పెట్టుకొని ఓట్లకోసం యీ పిల్లల తల్లిదండ్రులదగ్గరకు పోగలదు?

తెలంగాణా ప్రాంత ప్రజల భావావేశాలకు, ఉద్విగ్నతకు ప్రతిస్పందనగా, గుండెచప్పుడుగా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని, రాష్ట్ర రాజధాని నడిబొడ్డున వున్నదానిపై ఒక నక్సల్ స్థావరంగా పేర్కొనడం పాలకవర్గ కుట్రకాకపోతే మరేంటి? వారి నిఘావర్గాలు ఏ రాజకీయ నాయకులు విదిలించే ఎంగిలాకుల వెంట తిరుగుతున్నాయో? ఏదైనా విపత్తు సంభవించాక అమాయకులను వేధించడం తప్పించి అసలు నేరస్థులను యింతవరకు పట్టుకున్న దాఖలాలు లేవు. ఎంతో మంది తల్లుల ఉసురు పోసుకున్న వీళ్ళకు యిదేం పోయేకాలం?

28, అక్టోబర్ 2009, బుధవారం

I never speak Telugu మన విద్యా తాలిబానిజం:

కడప జిల్లా మైదుకూరులోని సైయింట్ జోసెఫ్ పాఠశాలలో పిల్లలు తెలుగులో మాట్లాడితే వారి మెడలో నేరస్థులులా ఐ నెవెర్ స్పీక్ తెలుగు అని రాసివున్న బోర్డులు వేలాడదీయడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. నిజానికి ఇది ఆ యాజమాన్యం తప్పేనా? తల్లిదండ్రులుగా మన బాధ్యత లేదా? ఆ విధంగా చేయడం ఆ టీచర్ చేసిన తప్పే అనుకుందాం. కానీ అమ్మ, నాన్న అనడమే నేరంగా వారి వీపును చీరేసే తల్లిడండ్రులు ఎంతమంది లేరు. అలా అనడాన్ని చిన్నతనంగా భావించే వారు ఎంతమంది లేరు.

హాయిగా ఆట పాటలతో చదువు నేర్చుకోవాల్సిన వయసులో వారిపై మనం మోపుతున్న కేజీల భారం నేరం ఎవరిది? ఎన్ని ఎక్కువ పుస్తకాలు కొనిపిస్తే ఆ కాన్వెంటే బాగుందనుకోని వారెవరైనావున్నారా? ఎంత తీరిక లేకుండా హోం వర్కులిస్తే వారే అత్యంత శ్రద్ధతో చెప్పినవారనుకుంటాం. ఇది పిల్లలపై వేస్తున్న మానసిక వత్తిడి గురించి ఆలోచించేమా ఎప్పుడైనా? ఏదైనా సంఘటన జరిగేటప్పుడు ప్లే కార్డులు పట్టుకొని రోడ్లపై రావడమే కాని వారిలో ఎంతమంది నిజానికి ప్రభుత్వ పాఠశాలలలో తెలుగు మీడియంలో చదివించేవారున్నారు. వార్తా చానళ్ళకునిన్న ఏ మసాలావార్తా లేకపోవడంతో ఇదో పెద్ద చర్చనీయాంశంగా మలుచుకొని కాలంగడిపేసారు.

నిజానికి పిల్లల మన:స్తత్వ శాస్త్ర నిపుణుల ప్రకారం బాల్యంలో ప్రాధమిక స్థాయిలో పాఠ్యాంశాల బోధన వారి మాతృ భాషలో జరిగితే అది వారి విజ్ఞాణ వికాశానికి సృజనాత్మకతను పెంచేందుకు  దోహద పడుతుంది. దీనిని పట్టించుకున్న వారు లేరు. నేడు మన ప్రధాన మంత్రి నుండి చాలా మంది నాయకులు, అత్యున్నత స్థానాలలోవున్న వారంతా నూటికి 90 శాతం మంది గ్రామీణ ప్రాంతంనుండి వచ్చిన వారే. నాడు ప్రభుత్వ ప్రాధమిక  పాఠశాలలో చదువుకున్న వారే? మరి వారికి ఇంగ్లీ షు భాషా ప్రావీణ్యతలేదా? అంతెందుకు ఉత్తరాంధ్రా వెనుకబడిన ప్రాంతానికి చెందిన తెలుగు సాహితీ దిగ్గజాలైన మహాకవి గురజాడ, మహాకవి శ్రీశ్రీ, రోణంకి అప్పలస్వామి, చాసో, పతంజలి మొ.న వారు ప్రాథమిక విద్యాభ్యాసం ఎక్కడ చేసారు? వారు చదవని ఆంగ్ల సాహిత్యంవుందా? భాషనేర్చుకోవాలన్న శ్రద్ధ వుంటే అది కష్టంకాదు. బలవంతంగా రుద్దుతూన్న మనం తాలిబాన్లకు తీసిపోతామా?

పోటీ ప్రపంచం పేరుతో మన ఆత్మన్యూనతా భావాన్ని కప్పిపుచ్చుకునేందుకు పిల్లలపై అధిక భారంతో పాటు మానసిక వత్తిడిని పెంచి వారిని డబ్బు సంపాదించే యంత్రాలుగా మార్చుతున్న మనదే ఈ నేరం. దీనికి తోడు కొత్తగా సక్సెస్ స్కూళ్ళ పేరుతో ఒకటో తరగతినుండే్ ఆంగ్ల మాధ్యమంలో బోధించమని శాసనాలు చేస్తున్న ప్రభుత్వానికి భాగస్వామ్యంలేదా? కార్పొరేట్ విద్యా వ్యాపారులకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తెస్తున్న నాయకమ్మన్యులదే ఈ నేరం కాదా? పాపం పసివాళ్ళు.

11, అక్టోబర్ 2009, ఆదివారం

మరణం - నిస్సహాయతా? - నిరసన ?

నా సాహితీ మిత్రుడు నిత్య అధ్యయనశీలి, విమర్శకుడు, కవి, కథారచయిత అయిన శ్రీ పడాల జోగారావుగారు శ్రీకాకుళం లోని కథానిలయం చెంతనే వున్న తన స్వగృహంలో నిన్న సాయంత్రం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గత కొ౦త కాల౦గా ఆయన కుటుంబ౦లోని నమ్మక ద్రోహానికి వ్యతిరేక౦గా తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తూ౦డేవారు. దానికి తోడు నిత్యము అరకొర జీత౦తో ఆర్ధిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు. దగ్గర్లోని కాళీపట్న౦ రామారావు మాస్టారు, శ్రీకాకుళ సాహితీ అధ్యక్షులు శ్రీ బి.వి.ఏ.రామారావునాయుడు మాస్టారుగారు, మిస్క క్రిష్నయ్య మాస్టారు ఆయనకు చేదోడు వాదోడుగా వుంది సహకరి౦చేవారు. కానీ తాను నమ్మిన విలువలను తూచా తప్పక పాటి౦చే మనిషి కావడ౦తో తాను గురిఅయిన నమ్మక ద్రోహాన్ని మరిచిపోలేని తన౦తో నిత్యము స౦ఘర్శణకు లోనయి నిన్నటికి మరి ఏ విషాదకర మాటల ఈటె తగిలి౦దో గాని బద్దలైన తన గు౦డె గాయానికి పురుగులమ౦దుతో ఆర్పాలనుకోవడ౦ విషాదకర నిర్ణయ౦. మిత్రులందరికి తాను అన్ని రకాల స౦దేహ సమయాలలో తోడుగా వు౦డి గైడ్ చేసిన మనిషి ఇ౦త బాధాకర నిర్ణయంతో మమ్మల్ని ఒంటరి వాళ్ళను చేసిపోయారు.

తాను కథలు రాసినవి తక్కువే అయినా జీవితానుభవాలతో నలుగురికి ఆలోచనాత్మక౦గా వుండేవి, కవితలలో కూడా తాను జీవిత స౦ఘర్శణనే ఆవిష్కరించే వారు. ముఖ్యంగా తన మిత్రులతో పాటు తనను వ్యతిరేకి౦చే వారికైనా విశ్లేషణాత్మక౦గా మ౦చి వివరణలతో సుదీర్ఘమైన వుత్తరాలు రాసి గైడ్ చేసేవారు. తొలినాళ్ళలో ర౦గనాయకమ్మ గారితో కూడా ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా చర్చలు చేసే వారు. అలాగే చేరా గారితోనూ. కథానిలయ౦ కార్యక్రమాలలో అన్నీ పాలుప౦చుకొని తన విలువైన భాగస్వామ్య౦తో ఎ౦తో సహకరి౦చారు. శ్రీకాకుళం లో జరిగే ప్రతి సాహితీ కార్యక్రమాలలో ము౦దు౦డేవారు. అటువ౦టి సాహితీ మిత్రుడిని కోల్పోవడ౦ ఒక్క శ్రీకాకుళ మిత్రులకే కాదు సాహితీ ర౦గానికి కూడా తీరని నష్టమే.

ఆత్మ హత్య ద్వారా తాను తెలియచేసిన నిరసనకు నా స౦ఘీభావాన్ని తెలియచేస్తూనే అది వ్యవస్థ చేసిన మరో క్రూరమైన హత్యగానే భావిస్తున్నాను.