అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రధమ అధ్యక్షునిగా పనిచేసిన కా.గోరు మాధవరావు గారు ఈ రోజు సాయంత్రం తన స్వంత గ్రామం జింకిభద్రలో (సోంపేట మండలం, శ్రీకాకుళం జిల్లా) అస్వస్థతతో కన్నుమూసారు. ఆయన తన జీవిత కాలమంతా విప్లవ ప్రజా పంథానే నమ్మారు. శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం నుండి మొదలైన ఆయన విప్లవాచరణ ఆ తరువాత కొండపల్లి సీతారామయ్య గారి నేతృత్వంలోని పీపుల్స్ వార్ పార్టీలో క్రియాశీలకంగా విప్లవాచరణలో తన సహచరిణితో పాటుగా పాల్గొన్నారు. ఆ తరువాత జరిగిన పరిణామ క్రమంలో మావోయిస్టు పార్టీ ఆద్వర్యంలో కూడా అదే తీరున ఉద్యమాలకాలంబనగా కృషి చేసారు. పార్టీ ప్రచురణలైన దిక్సూచీ ప్రచురణలకు చిరునామాగా ఆయన అడ్రసునే వుండేది.
ఎన్ని రకాలుగా నిర్బంధాలు అమలు చేసినా అకుంఠిత దీక్షతో, నిబద్ధతతో విప్లవం పట్ల దృఢ నమ్మకంతో చివరి వరకు వున్నారు. పోలీసులు ఆయనను ఆ వయసులో కూడా పిలిచి భ్రమలలో ముంచెత్తే ప్రయత్నంగా అనేక మార్లు కౌన్సిలింగ్ నిర్వహించే ప్రయత్నంచేస్తే వారికి తిరిగి విప్లవాచరణ గురించి చెప్పి వచ్చిన ఉద్యమాభిమాని కామ్రేడ్ గోరు మాధవరావు.
ఎనభై ఏళ్ళు వచ్చాయి యింకా మీరు సమావేశాలకు హాజరు కావడం, సందేశాలివ్వడం ఎలా సాధ్యమవుతుంది కామ్రేడ్ అని ఎవరైనా అంటే నాడు నాటు తుపాకులతో మొదలైన ప్రస్థానం ఆరోజుల్లో వర్షం పడితే పేలని తుపాకులతో నానా అవస్థలు పడిన కాలం నుండి నేడు అత్యంతాధునిక ఆయుధాలు కలిగిన ప్రజా గెరిల్లా సైన్యంగా రూపాంతరం చెందినాం కదా మనం యింతకంటే స్ఫూర్తి ఏం కావాలి నాకనేవారు. ఎల్లప్పుడూ ఒకే రకమైన ఆలోచనతో, భారత దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవానికి తన వంతు ఆచరణతో కృషి చేసిన కా.గోరు మాధవరావు గారి విప్లవాచరణ అందరికీ ఆదర్శప్రాయం..