శ్రీక్రిష్ణ కమిటీ వేసిన రోజే నేను నా బ్లాగులో రాసాను. ఇది కాలయాపన కోసం, మోసం చేయడం కోసం తప్ప ఏమీ ఉపయోగంలేనిదని. సాధికారత లేని కమిటీ సాధించేదేమీ వుండదు. ఇది అంతా ఒక బుడబుక్కల వాడి ట్రూపులా తయారయ్యి ఇంతవరకు పనిచేసిన కమిటీలకంటే భిన్నంగా మాటి మాటికీ మీడియా ద్వారా ఏదో ఒక గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తూ, తద్వారా వచ్చే అభిప్రాయాలనే తమ రిపోర్ట్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేసారు. ఈ రిపోర్టులో ప్రజల మనోభావాలేవీ ప్రతిఫలించలేదన్నది వాస్తవం. ఇదంతా సోనియా అండ్ కో ఆడించిన ఒక తోలుబొమ్మలాట. వీళ్ళకు కోస్తా అంటే గోదావరీ, క్రిష్ణా జిల్లాలే కనపడ్డాయి. ఉత్తరాంధ్ర గురించి ఒక్కమాట మాత్రమైనా లేదు. ఇప్పటికే అత్యంత వెనకబడ్డ ప్రాంతంగా, పాలమూరు జిల్లాకంటే అత్యధికంగా వలసలు పోయే జిల్లాలుగా వుండి బతుకు భారమై పోయిన ప్రజల నెత్తిన కోస్తా కారిడార్, థర్మల్ పవర్ స్టేషన్ లు, ప్రైవేటు పోర్టుల నిర్మాణాలతో అత్యధిక కాలుష్య ప్రాంతంగా మారుతున్న తీరు, అటు మన్యంలో బాక్సైట్ తవ్వకాలు ద్వారా, గిరిజనుల హక్కులను హరించే విధంగా వారి భూములను కంపెనీలకు కట్టబెట్టడం మొ.న పరిణామాలతో తీవ్ర సంక్షోభంలో వున్న ఉత్తరాంధ్ర ఊసే లేకపోవడం ఈ కమిటీ సాధించిందేమిటి. రాష్ట్రంలో తమ పర్యటనలతో వివిధ రాజకీయ నాయకులు, బడా పెట్టుబడిదారుల విందులు వినోదాలతో కమిటీ వేసిన నాటికంటే మొన్నటి డిసెంబర్ ముప్పై నాటికి బాగా శారీరకంగా రంగు వచ్చి, నిగనిగలాడుతున్నారు తప్ప ఇంకేమీ ఒరగబెట్టింది లేదు. అందుచేత ముందుగా ఈ కమిటీ మాయలో పడొద్దన్న ఆనాటి నా అభిప్రాయాన్నే ఉద్యమకారులకు మరోమారు విన్నవిస్తూ, తెలంగాణా ప్రజల ఆకాంక్షను గౌరవించాలని పాలక వర్గాన్ని డిమాండ్ చేస్తున్నా..
ఇక్కడ కమిటీ రిపోర్టును చదవొచ్చు
ఇక్కడ కమిటీ రిపోర్టును చదవొచ్చు