12, అక్టోబర్ 2011, బుధవారం

అడవిపై అధికారం ఆదివాసీలదే

అటవీ హక్కుల చట్టం పేరుతో చేసిన చట్టం అమలుకు ఇప్పుడు ప్రభుత్వ అధికారులు, పాలక వర్గం తంటాలు పడుతోంది. నిజంగా ఈ చట్టంలో పొందుపరచిన అంశాలు అమలు జరిగితే కొడిగడుతున్న ఆదివాసీ బతుకులు కొంతమేర నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది..కానీ నిజాయితీ కొరవడిన పాలకవర్గాలు ఆచరణలో దీనిని తూట్లు పొడవడానికే చూస్తున్నాయి.. ముఖ్యంగా వలస పాలనా అవశేషంగా మిగిలిన నేటి అటవీ శాఖ ఈ చట్టం అమలుద్వారా తమ అధికారాన్ని కోల్పోతుంది.. సెజ్ లపేరుతో, అభయారణ్యాల పేరుతో, సహజవనరులను కొల్లగొట్టడానికి పారిశ్రామికీకరణ ముసుగుగా, మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను నాజీ కాన్సంట్రేషన్ కాంపులకంటే హీనంగా వున్న షెల్టర్లలోకి నెట్టివేయబడుతున్న చర్యలకు అడ్డుకట్టవేయడానికి ఈ చట్టం పోరాడే హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులకు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. కానీ చిత్తశుద్ధి లోపించిన అధికారగణం వేదాంత, జిందాల్ కంపెనీలకు, కాఫీతోటల పెంపకం పేరుతో ఆదివాసీల భూములను లీజుకు, రకరకాల పేర్లతో పరాయివాళ్ళకు అంటగట్టే ప్రయత్నాన్ని, పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల ద్వారా నిర్వాసితులవ్వడమే కాక లక్షలాది ఎకరాల భూమి ముంపు ద్వారా కోల్పోయే సహజ వనరులు, తమకు నిలువ నీడలేకుండా చేయడాన్ని ఆదివాసీలు తీవ్రంగా ఎదుర్కొనవలసి వస్తోంది. తమ ఉనికికే ప్రమాదకరంగా మారిన నేటి కార్పొరేట్ పాలకవర్గంపై పోరాడడానికి ఎంతో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ పోరాటాలను తీవ్రమైన సైనిక చర్యలద్వారా అణచివేయడానికి రాజ్యం ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఇప్పటికే తీవ్రమైన నిర్బంధాన్ని అమలు చేస్తోంది. దీనిని ప్రజా పోరాటాల ద్వారా ఎదుర్కొనే ప్రయత్నం సాగుతూనే వుంది. ప్రజాస్వామిక వాదులు, విద్యార్థి మేధావి వర్గాలు తప్పని సరిగా తమ మద్ధతు తెలపాలని కోరుకుంటూ...

2 వ్యాఖ్యలు:

  1. "జల్, జంగల్, జమీన్" అని చెప్పకున్నా కొమురం భీం మొదలు పెట్టిన అడవిపై ఆదివాసీలకే అధికారం అన్న పోరాటం ఏదో రూపంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. చట్టాలు, హక్కులు ఉన్నవాళ్ల కొమ్ము కాసేందుకే. వన్ ఆఫ్ సెవెంటీ చట్టం ఆదివాసుల భూ రక్షణ కోసం రూపొందినా, అప్పుడు చోటా వ్యాపార సర్పాల, ఇప్పుడు జిందాల్ లాంటి బడా తిమింగలాల తోకల్ జాడింపులకు నిలువలేక పోతున్నది. కేక్యూబ్ గారు! ఇందు కోసం ఆదివాసుల్లోనే చైతన్యం రావాలి. వారి బతుకులను వారే దిద్దుకోవాలి. బయటి సమాజం కేవలం ఉత్ప్రేరకంగా మాత్రమే పనిచేయాలి. ఎందుకంటే ఇంద్రవెల్లి సంఘటన, తరువాతి కాలంలో జరిగిన కరువు దాడులు ఉట్నూరు ప్రాంతంలో పనిచేస్తూ నేను గమనించినవే.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. రాకుమార గారు మీ స్పందనకు ధన్యవాదాలు...ఆదివాసీలు చైతన్యయుతంగా ముందుకు వస్తున్న క్రమంలో వారిని అంతర్గత శత్రువులుగా చూపెడుతూ ఊచకోత కోయడానికి రాజ్యం చూస్తున్నది...కావున బయటి సమాజం స్పందించాల్సిన అవసరముంది...ఈ దురాక్రమణ అడవితోనే ఆగదు అన్నది అందరి ఎరుకలోకి రావాల్సిన విషయం...

    ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..