27, ఫిబ్రవరి 2012, సోమవారం

యుద్ధనేత్రం కొల్విన్ కు అశృనీరాజనాలు..



తన కెమెరా కన్నుతో

యుద్ధ నేరస్తులను ప్రపంచ పీఠంపై నగ్నంగా నిలబెట్టింది..
శరణార్థ శిబిరాల గొంతు వినిపించి
నిరంకుశ పాలకుల దాష్ఠీకాన్ని బట్టబయలు చేసింది..

వార్తా సేకరణకు తన కన్ను బలిపెట్టి
కెమెరానే తన మూడో నేత్రంగా తెరిచి
యుద్ధభూమిలో సంచరిస్తూ
గాయాల గేయాలను వినిపించింది...

తన పని తాను చేసుకుపోతూ
జీవితాన్ని ఇంత నిర్లక్ష్యంగా
యుద్ధమేఘాల ధూళిలో
కలగలసి పోతూ
బాధితుల దుఃఖాన్ని బాధను
యుద్ధ భయానక దృశ్యాల్ని
సజీవంగా చిత్రీకరిస్తూ తాను
నిర్జీవంగా మారుతూ
యుద్ధ నేత్రాన్ని సజీవంగా
మనముందుంచిన కొల్విన్...

నీకు మా అశృనీరాజనాలు తెలిపే
అర్హత లేకున్నా
నీతో పాటున్నామన్న నిజం
సజీవం...

(సిరియాలో జరుగుతున్న యుద్ధంలో యదార్థ దృశ్యాలను చిత్రీకరిస్తూ అగ్రరాజ్య తొత్తులైన సేనల బాంబుదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేరీ కొల్విన్ కు జోహార్లు)

20, ఫిబ్రవరి 2012, సోమవారం

ప్రజాస్వామ్య దేశంలో తలలకు వెలలా??



నాకు ఈ ప్రశ్న చాలా రోజులుగా వెన్నాడుతోంది.. ప్రపంచ పటంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని బోరవిరుచుకుంటున్న భారత దేశంలో విప్లవకారులుగా, నక్సలైట్లుగా, మావోయిస్టులుగా పిలవబడుతూ దేశ ప్రధానిచే అంతర్గత భద్రతకు పెను ముప్పుగా పేర్కొంటూ అణచివేయజూస్తున్న ఏకైక ప్రతిపక్షమైన వారి తలలపై వెలలను పెంచుతూ ప్రకటిస్తూన్న వారికి ఈ ప్రశ్న వేయాలని...

వారిని పట్టిచ్చే వారికి, దొంగ ఎదురుకాల్పులలో హత్య చేసే వారికి ఎరగా ఈ వెలలను నిర్ణయిస్తూ వస్తున్నవి ఈ పాలక వర్గాలు. ఇది ప్రజాస్వామ్య దేశంలో న్యాయ బద్ధమైనదా? ఏ చట్టంలో ఇలా పేర్కొన్నారు? రాజ్యాంగ బద్ధమా?? పౌరుల వ్యక్తిగత స్వేచ్చకు, వారి అస్తిత్వానికి, జీవనానికి భంగకరంగా వున్న ఈ చర్య పౌరుల హక్కులకు వ్యతిరేకమైనది కాదా?? రాజ్యాంగంలో రాసుకున్నవి అమలు చేయడంలో విఫలమై ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటూ పాలిస్తున్న ఈ కార్పొరేట్ పాలక వర్గాలు పార్టీలుగా బహుముఖంగ కనిపిస్తూ అంతర్గతంగా వారి ఏక వర్గ దృక్పథంతో ప్రజల పక్షాన పోరాడుతున్న వారిని ఇలా హత్య చేయడానికి పురికొల్పేట్టు లైసెన్స్ డ్ గాంగులను రక రకాల పేర్లతో సృష్టిస్తూ (గ్రే హౌండ్స్, కోబ్రా, సల్వాజుడుం మొ.నవి) వారి స్థావరాలపై దాడులు చేయడానికి ఉసికొల్పుతూ ప్రేరేపిస్తున్నవి.

గిరిజన ప్రజానీకానికి నిలువ నీడ లేకుండా చేస్తూ, దేశ సహజ వనరులను కొల్లగొట్టే పన్నాగంలో భాగంగా సామ్రాజ్యవాదుల కొమ్ము కాస్తూ రక రకాల మారణాయుధాలను ఇజ్రాయిల్, అమెరికన్ హంతక ముఠాలను కొనుగోలు చేస్తూ ఈ దేశ ప్రజానీకం పన్నుల రూపంలో చెల్లించే అత్యంత విలువైన ప్రజా ధనాన్ని వెచ్చిస్తూ, అభివృద్ధి పేరుతో అడవులలో రోడ్లు వేస్తూ పర్యావరణాన్ని నాశనం జేస్తూ ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఆకుపచ్చ యూనిఫాం వేసుకున్న వారిని వేటాడే పేరుతో మధ్య భారతదేశంలోని సహజ వనరులను, పచ్చని అడవిని నాశనం జేయ పూనుకుంది. దీనికి అంతర్గత భద్రత పేరు తగిలించారు నేటి ప్రధానివర్యులు. వారికితోడుగా పచ్చయప్పన్ అనే హంతకుని వారసున్ని, కార్పొరేట్ కంపెనీలకు న్యాయ సలహాదారున్ని ఈ దేశ ఆంతరంగిక మంత్రిగా జేసి జనాన్ని మోసపుచ్చుతూ అత్యంత తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తున్నారు.

ఈ తలలపై వెలల ప్రకటన ఈ హంతక పాలక వర్గానికి చెందిన ఆర్థిక దోపిడీదారులు, బ్లాక్ మనీ రాజకీయ, వ్యాపార, ఉద్యోగ వర్గాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాత పాలక వర్గాలపై, రేపిస్టు రాజకీయ నాయకులపై, దొంగనోట్ల వ్యాపారులపై, అక్రమార్జన పరులపై తలా ఓ రూపాయి వేసుకొని సామాన్య ప్రజలే వీళ్ళని పట్టుకొని ప్రజాకోర్టులో నిలదీస్తే ఇస్తామని ప్రకటిస్తే ఎలా వుంటుంది..

తలలపై వెలలు ప్రకటించడం ప్రజాస్వా మ్యమా? మానవహక్కుల ఉల్లంఘన కాదా?? దేశ అత్యున్నత న్యాయస్థానం స్వంత రిపబ్లిక్ తమ పౌరులను చంపుకోవడం పట్ల నిరసన ప్రకటించినా వినిపించని అధికార బధిరాంధులకు గుణపాఠం ప్రజలే నేర్పాలి.

అయ్యా, అమ్మా, ప్రజాస్వామ్య వాదులారా, విద్యార్థి మేధావులారా, మానవ హక్కుల కార్యకర్తలారా, న్యాయ నిపుణులారా ఈ ప్రశ్న తమకు తాము వేసుకోని ప్రశ్నిద్దామా...