20, డిసెంబర్ 2009, ఆదివారం
నా తొలి యవ్వనాన్ని పునర్జీవిస్తాను
నలభై ఏళ్ళ విరసం, నూరేళ్ళ శ్రీశ్రీ మహాసభ
ఏప్రిల్ 30, మే 1, 2010, విశాఖపట్నం
శ్రీశ్రీ తెలుగు ప్రజల ఉద్వేగ శక్తి. కవిత్వమనగానే సామాన్య ప్రజలకు సైతం శ్రీశ్రీ గుర్తుకు వస్తాడు. కవి అంటే శ్రీశ్రీ మూర్తిమత్వం రూపుగడుతుంది. సమాజ సాహిత్యాల గురించి, జీవితం గురించి ఆయన చెప్పిన ప్రతి మాటా కవితా చరణంగా నిలిచిపోయింది. ప్రతి కవితా పంక్తి తెలుగువారి నుడికారంలో భాగమైపోయింది. తెలుగు ప్రజల భావోద్వేగాల్లో, అలోచనల్లో మూడు తరాలుగా శ్రీశ్రీ సంలీనమైపోయాడు. సమాజపు గడ్డు వాస్తవాన్ని చెప్పడానికి శ్రీశ్రీ కవితా చరణాలు ప్రజల నిత వ్యవహారంలో ఊంటాయి. వ్యవస్థ పట్ల ఆగ్రహాన్ని, అసమ్మతిని చెప్పడానికి శ్రీశ్రీ కవిత్వమే ఆలంబన. ధిక్కార ప్రకటనకు శ్రీశ్రీ కవిత్వమే ప్రతీక. ప్రజలు జయిస్తారనీ, నిన్నటి కంటే రేపు ఉజ్వలమైనదనీ, చరిత్రను ప్రజలు రచిస్తారనీ చెప్పడానికి ఇవ్వాల్టికీ శ్రీశ్రీని మించిన జనరంజక కవితా శక్తి రూపొందలేదు. అందుకే ప్రజా పోరాట రంగాలన్నింటిలో అర్థ సతాబ్ధంగా తెలుగు జాతి శ్రీశ్రీని పునర్ధర్శించుకుంటోంది.
శతజయంతి ఒక ఉద్వేగ సమ్దర్భంగానేగాక శ్రీశ్రీని పునర్నిర్మించే ప్రయత్నంగా కూడా సాగుతున్నది. ఇది అత్యవసరం. ఈ కాలంలో, ఇవ్వాల్టి చైతన్యంలో శ్రీశ్రీని ఎలా అర్థంచేసుకోవాలి? అనే ప్రశ్న రావడంలోనే ఆయన ప్రాసంగికత ఉన్నది. ఈ పని ఈయన వారసులు, అభిమానులు, వ్యతిరేకులు అనేక వైపుల నుండి సాగిస్తున్నారు. నిజానికి శ్రీశ్రీ తన జీవతకాలమంతా తనను తాను పునర్నిర్మించుకుంటూ వచ్చాడు. లండన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ మేనిఫెస్టోతో ప్రభావితమై బోల్షివిక్ విప్లవోత్తేజంతో కవిత్వంలో శ్రీశ్రీగా ఆవిర్భవించాడు. బోల్షివిక్ విప్లవం ఇవ్వాల్టికీ మానవ చరిత్రలో ఒక మహాద్భుత విజయం. నిజమైన మానవ చరిత్రకు ప్రారంభ బింధువు. మనిషి చేరుకోవలసిన మార్గాన్ని బోల్షివిక్ ఎలుగెత్తి చాటింది. శ్రీశ్రీ అక్కడ పుట్టాడు.. కవిత్వమయ్యాడు. రెండు ప్రపంచ యుద్ధాల సంక్షోభాన్నే గాక రష్యా, చైనా మహత్తర విప్లవాలను ఆవాహన చేసుకున్నాడు. అంతటితో ఆగిపోయిన తెలుగు మేధావులు, రచయితలు చాలా మంది వున్నారు.
శ్రీశ్రీ 1955 మధ్యంతర ఎన్నికల వర్గపోరాటంలో పాల్గొని ఖడ్గసృష్టికి సిద్ధమయ్యాడు. పొద్దువాలిపోతున్న తరుణంలో నవయవ్వనంతో దిగంబరకవులను ఆహ్వానించాడు. దెబ్బై ఏళ్ళ వయసులో చైనా సాంస్కృతిక విప్లవంలో తిరిగి జన్మించి నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటాల సాంస్కృతిక సేనాని అయ్యాడు. విరసం వ్యవస్థాపకుడిగా పదేళ్ళకు పైగా తన చైతన్యాన్ని విప్లవ సాహిత్యోద్యమంలో సజీవం చేసుకున్నాడు. పునర్జీవం, పునర్నిర్మాణం అనే లక్షణాల వల్ల శ్రీశ్రీ తన చివరి రోజుల దాకా సమకాలీనంగా ఉన్నాడు. యిది వ్యక్తి సుగుణంకాదు. చారిత్రక దృక్పధం, శ్రీశ్రీ ఎంతటి ఉద్వేగ కల్పనా శక్తో అంతటి ఆలోచనాపరుడు. చారిత్రక, తాత్విక దృక్పధం ఉన్న బుద్ధిజీవి. జీవితపు అన్ని దశల్లో ఆయన తేసుకున్న రాజకీయ వైఖరుల వెనుక దృక్పథ స్పష్టత ఉన్నది. భావోద్వేగ పూరితమైన నిమగ్నత ఉన్నది. అందుకే కవి బుద్ధిజీవి, ఉద్యమ జీవి కావాలనే జీవన విలువలను ఆయన నిరూపించాడు. ఇది ఆయనను ఎల్ల వేళలా స్వీయ పునర్నిర్మాణం దిశగా నడిపించింది. ఉద్యమ నిర్మాణాల్లోకి, సంఘాల్లోకి తీసికెళ్ళింది.
చరిత్ర పట్ల అచంచల విశ్వాశం వల్లనే ఆయనకు ఈ మహాప్రస్థానం, మరోప్రపంచ ప్రయాణం సాధ్యమయ్యాయి. చరిత్ర పురోగమిస్తుందని, అది దాని సహజనియమమని శ్రీశ్రీ వలె ఆ తరంలో మరో ఇద్దరు, ముగ్గురు సాహిత్యకారులే తెలుసుకున్నారు. ఆ తరాన్ని ఎన్ని మహోజ్వల చారిత్రక విజయాలు దాటుకొని వెళ్ళాయో అన్నే ఓటములూ, నైరాశ్యాలు ఆవరించాయి. కానీ మార్క్సిస్టు దృక్పధం వల్ల శ్రీశ్రీ చరిత్ర గమనానికి భిన్నంగా వెనకడుగు కూడా వేయలేదు. కాకపోతే కొన్ని సందిగ్ధ సమయాల్లో నిలిచిపోయేవాడు. బైటి నుండి కొంచెం అగ్గి తగిలినా మళ్ళీ ముందడుగే. తానే ముందుండి నడిపించేవాడు.
అయిదు దశాబ్ధాలపాటు పోరాట ప్రజల వెనువెంట సాగిన శ్రీశ్రీ కవితా జైత్రయాత్రను ఇవ్వాళ పునరంచనాలు చేయడం ద్వారా ఆయన సమకాలీనతను పరీక్షించవచ్చు. కానీ చరిత్ర వెంట నడిచి, చారిత్రక శక్తుల ప్రతి మేలుకొలుపు సన్నివేశాన్నీ కవిత్వం చేసి చరిత్రలో భాగమైపోయిన కవిని సైతం చారిత్రక దృక్పథంతోనే తూచవలసి ఉన్నది. శ్రీశ్రీ తన గురించే తానే చెప్పుకున్నట్లు ఆయనలో ఒక విదూషకుడు సైతం ఉండవచ్చుగానీ పొల్లునెల్లు వేరుచేయగల మార్క్సిస్టు దృష్టిని ఆయనే అపారంగా మనకు అందించాడు. ఆయనను అంచనా వేయడానికీ అదే సాధనంకావాలి.
ఆధునిక సాహిత్యంలోకి శ్రీశ్రీ తొలిసారిగా శ్రమను, శ్రమ రూపాలను, మానవ కర్తృత్వాన్ని తీసుకొని వచ్చాడు. సహస్ర వృత్తుల గురించి చెప్పడంలో ప్రజల సాంఘిక అస్థిత్వ స్పృహ ఆయనకున్నది. మార్క్సిజంలోని కీలకమైన శ్రమ సంబంధాలు ఆయన సాహిత్య చైతన్యానికి మార్గదర్శి.
తెలంగాణా సాయుధపోరాట కాలంలో పోలీసు చర్య పేరుతో యూనియన్ సైన్యాలు విప్లవకారులను, ప్రజలను, ముస్లింలను చంపినప్పుడు తెలంగాణాను తనలో ఆవాహన చేసుకున్న హరీంద్రనాథ్ ఇంగ్లీషులో దీర్ఘకవిత రాశాడు. మైకోవిస్కీ రాసిన లెనిన్ కవితను తనదైన శైలిలో అనువదించినట్టే హరీంద్రనాథ్ కవితను శ్రీశ్రీ మొట్టమొదట అనువదించాడు. తెలంగాణాపై ఆరుద్ర త్వమేవాహం చదివి శ్రీశ్రీ ఎంత పులకించిపోయాడంటే.. నేనిక కవిత్వమే రాయక్కర్లేదన్నాడు. ఆంధ్రమహాసభ, ఆంద్రోద్యమ కాలం నుంచి ఆలంపురంలో తెలంగాణా రచయితల సంఘంగా మారడందాకా (ఈ సభల్లోణే కాళోజీ నాగొడవను శ్రీశ్రీ ఆవిష్కరించాడు). అప్పటి తెలుగు రచయితలందరికీ ఉన్నట్టే విశాలాంధ్ర ఆకాంక్ష శ్రీశ్రీకి ఒక సెంటిమెంటుగా ఉండేది. 1972లో విరసం ప్రత్యేక తెలంగాణాను, ప్రత్యేక ఆంధ్రను బలపరుస్తూ తీర్మాణం చేసినప్పుడు తమకు ఆమోదం లేకపోయినా శ్రీశ్రీ, జ్వాలాముఖి తదితరులు కట్టుబడి ఉన్నారు. మూడు తరాలుగా తెలంగాణాలో విప్లవ, ప్రజా పోరాటాలకూ, ప్రత్యేక తెలంగాణా ఉద్యమాలకు వెనుక ఉద్వేగపూరితమైన తిరుగుబాటు తత్వంలో శ్రీశ్రీ ప్రేరణ ఉన్నది.
శతజయంతి వేడుకలు ఎంత లాంచనమో మనకు తెలుసు. శ్రీశ్రీ శతజయంతి ఒక వేడుకలా కాకుండా ప్రజల పట్ల, ఉద్యమాల పట్ల నిర్మాణాల పట్ల మన విశ్వాశాన్ని నింపుకునే సందర్భం అని గుర్తిస్తే చాలు. ఓటమిలో, పడిపోవడంలో, నైరాశ్యంలో.. యిక రేపన్నది కనిపించగానే అంధకారంలో సైతం శ్రీశ్రీ కవిత్వం మనలను వేలుపట్టి భవిష్యత్తులోకి నడిపిస్తుంది. మనిషి మారుతాడా? సమాజం మారుతుందా? అనే సందేహ జీవులకు యిప్పటికీ శ్రీశ్రీ కవిత్వమే సమాధానం. శ్రీశ్రీయే జీవించి ఉంటే కాలాన్ని, ఈ కాల స్వభావాన్ని ఏమని వివరించేవాడు? ఎంత పదునైన కవిత్వం చెప్పేవాడు. ఎంత అచంచల విశ్వాశంలో విప్లవ శక్తుల వెన్నంటి ఉండేవాడు. యుద్ధాల మధ్య పుట్టి, యుద్ధ సంక్షోభాన్ని కవిత్వం చేసి, ప్రజల అజేయ యుద్ధాన్ని గానం చేసిన ప్రజాకవి యివ్వాళ దేశంలో ప్రజలపై, ఆదివాసులపై రాజ్యం చేస్తున్న యుద్ధాన్ని మనందరికన్నా ముందుండి వ్యతిరేకించేవాడు.
శ్రీశ్రీ శతజయంతి ఆయన నూరేళ్ళ సందర్భం కాదు. మన చుట్టూ మనలను ఆవరించిన సంక్షోభాల్లో, ఉద్యమాల్లో మనలను మనం వెతుక్కునే పలు సందర్భాలుగా విస్తరించాలి. అదే శ్రీశ్రీ స్ఫూర్తి. ఆ కాగడాను అందుకోవడానికి విశాఖ సభలకు సాహిత్య ప్రేమికులను, విప్లవాభిమానులను విరసం సాదరంగా ఆహ్వానిస్తోంది.
విప్లవ రచయితల సంఘం,
ఆంధ్రప్రదేశ్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
http://tammunililalu.blogspot.com/2009/12/blog-post.html
రిప్లయితొలగించండి