12, డిసెంబర్ 2009, శనివారం

జాతుల విముక్తి పోరాటాలను సమర్థిద్దాం


దేశ వ్యాప్తంగా ఊపందుకున్న జాతుల విముక్తి పోరాటాలను సమర్థిద్దాం. కా.స్టాలిన్ పేర్కొన్నట్లు దేశాలు స్వేచ్చను, జాతులు తమ విముక్తిని కోరుతున్నాయి. ఎవరి బతుకు వారు బతుకుతామన్న తపనను సమర్థించడం వలన ప్రత్యేకంగా కోల్పోయేదేమీ లేదు. వారి వారి అభివృద్ధిని వారి వారి ప్రణాళికలతో చేసుకునే అవకాశం కల్పించక, అఖండ భారతావని పేరుతో ఇన్నాళ్ళు వారి గొంతునే కాదు వారి వారి సహజ సంపదను కొల్లగొట్టిన పెట్టుబడిదారులు, దళారులు, కంపెనీ పాలకులే ఈ స్వేచ్చా ఆక్రందనలను అణగబట్టినారు. ఒక్కో జాతిది ఒక్కో ప్రత్యేక సంస్కృతి, సాంప్రదాయాలు కలిగి వున్నాయి. బలవంతంగా రుద్దిన సంస్కృతి వలన ఆయా జాతులు తమ ఉనికిని కోల్పోయి పరాన్నభుక్కులుగా మార్చివేయబడడంతో వారి వారసత్వాన్ని కాపాడుకునేందుకు నేడు తమ ప్రత్యేక డిమాండ్ లను ముందుకు తెస్తున్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న అసమంజస, అసమగ్ర అబివృద్ధి ఏ కొద్దిమందో టాటాలు, బిర్లాలు, మిట్టల్ లు, జిందాల్ లు, వేదాంత కంపెనీల వారికీ, మల్టీ నేషనల్ కంపెనీల వారికీ తప్ప ఈ నేలపై పుట్టి, ఈ మట్టిని నమ్ముకొని మట్టినే తిని బతుకుతున్న వారి జీవనంలో ఏ మార్పు రాలేదు. సెజ్ లపేరుతో దేశ వ్యాప్తంగా ప్రత్యేక ఆర్థిక సామంత రాజ్యాలనేర్పాటు చేస్తు సహజ సంపదను కొల్లగొట్టడానికి తుఫాను వేగంతో వస్తుంటే ప్రశ్నించే వారే కరువైనారు. కానీ ఈ దోపిడీ పాలన నుండి విముక్తి కోరుతున్న జాతుల స్వేచ్చాకాంక్షను సమైక్య వాదం పేరుతో అణగదొక్కచూస్తున్నారు. కావున జాతుల విముక్తి పోరాటాలను సమర్థించుదాం. స్వేచ్చా కాంక్షను ఎలుగెత్తి చాటుదాం.

1 కామెంట్‌:

  1. ఏ మనిషి ఇంకో మనిషిని నిజంగా పట్టి బంధించ లేరు . శరీరం బంధించినా మనసును ఆత్మను బంధించ లేరు. మనుషులు మనుషులకి ఏమి చేయలేరు అసలు అభివృద్ది ఎవరికి వారే సాధిస్తారు. ఎంతైతే అంతే. కలసి ఉంటే కలదు సుఖము అని విన్నారు కదా. ఈ మినిస్టర్లు మనకు ఒరగ బెట్టేది ఏమి లేదు. సమైక్య పోరు అన్నా వేర్పాటు అన్నా తమ రాజకీయ జీవిక నిలబెట్టు కోవడానికి వాళ్లు పడే పాట్లే. మధ్యలో నలిగి పోయేది ప్రజలు. ప్రజలు కలిసి ఉంటే ఎవరు ఏమి చేయలేరు. ప్రత్యెక రాష్ట్రం వినడానికి బాగుంది కాని ఆచరణలో బాగో లేదు.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..