
ఇటీవల CRPF జవాన్ల కాల్పులలో మరణించిన విద్యార్థికి సంఘీభావంగా మొదలైన ఉద్యమం తమ భూభాగంలో అమలవుతున్న కల్లోల చట్టం వికృత రూపానికి వ్యతిరేకంగా సాగే దిశగా మారి అది ఉత్తర కాశ్మీరం నుండి దక్షిణ కాశ్మీరం వరకు పాకుతూ కాశ్మీరాన్ని అతలాకుతలం చేస్తోంది. కీలుబొమ్మ ప్రభుత్వం చేష్టలుడిగి తిరిగి సైన్యం సహాయాన్ని అర్థించి మరింతగా కల్లోల కారకమవుతోంది. చాన్నాళ్ళుగా కాశ్మీర్ లో జరుగుతున్న బూటకపు ఎదురుకాల్పుల సంఘటనలపై న్యాయాన్ని డిమాండ్ చేస్తున్న ప్రజలపై అక్కడ అమలవుతున్న దమనకాండ బయటి ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారు. ఉగ్రవాద నిర్మూలన ముసుగులో పారామిలటరీ దళాలు, సైన్యం చేస్తున్న అకృత్యాలు, యువకుల హత్యలు కొట్టుకుపోతున్నాయి. దీనిపై కాశ్మీరీలు చాన్నాళ్ళుగా తమ అసంతృప్తిని తెలియజేస్తున్నా వారిని పట్టించుకునే వారు లేరు. పాకిస్తాన్ బూచిని చూపించి కల్లోలితప్రాంత చట్టాన్ని అమలుచేస్తుండటంతో స్థానికంగా మాటాడే వారు ఏదో ఒక రూపంలో భయభ్రాంతులకు గురవుతున్నారు. మానవహక్కుల సంఘాలు ఈ చట్టాన్ని తొలగించి, సైన్యాన్ని వెనక్కి పిలవాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ ఆందోళనలో భాగంగా CRPF వాళ్ళు పిల్లలు, ఆడవారనే విచక్షణ లేకుండా చావబాదుతూ, కాల్పులు జరుపుతున్నారు. ఇప్పటికె సుమారు 11 మందికి పైగా మరణించారు ఈ వారంలోపల. దీనిపై వెంటనే కేంద్రం స్పందించి తమ బలగాలను అదుపులో వుండేట్టు చూడాల్సిన బాధ్యత వుంది. స్థానిక పోలీసుల వైఫల్యంతో సైన్యం అక్కడ పోలీసు అధికారాలను చెలాయిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇంతవరకు ఆరోపణలకు గురైన ఎదురుకాల్పుల సంఘటనలపై న్యాయ విచారణ జరిపి బాధితులను ఆదుకొనడం ద్వారా వాళ్ళలో విశ్వాశాన్ని పెంపొందంచే కృషి జరగాలి. ఇది అత్యాశకాకూడదు.