24, ఏప్రిల్ 2011, ఆదివారం

సంతాప దినాలు ఎవరికి??

సాయిబాబాను నెలరోజులుగా కుళ్ళబెట్టి రోజుకి సెటిల్మెంటులన్నీ పూర్తయి అంతా సర్దుకున్న తరువాత మరణించినట్లు ప్రకటించి ప్రభుత్వం 3 దినాలు సంతాపం, రెండు రోజులు సెలవు ప్రకటించింది..

భగవంతునిగా తనను తాను ప్రకటించుకొని ఆడంబరమైన జీవితం గడిపి, బడా వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు అండదండలిస్తూ సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని విద్యా వైద్య సౌకర్యాలకు వెచ్చించి మిగిలిన ఆదాయానికి లెక్కలులేని విలాసపురుషుడు మరణిస్తే సెక్యులర్ దేశంగా ప్రకటించుకున్న పాలకులు సంతాప దినాలు ప్రకటించడం సమంజసమా?

ఇప్పటికే ఉప ఎన్నికల ప్రభావంతో పాలన స్తంభించిపోయింది..
ఇంకా రక రకాల కారణాలతో సెలవులనుభవించే కార్యాలయాలకు సెలవులు ప్రకటించడం న్యాయమా?

కోట్లాది రూపాయల నల్లధనం, బంగారం ఇంతకాలం దాచుకున్న మోసగాళ్ళ నిలయం పుట్టపర్తి.. ట్రస్టు సభ్యులుగా వున్న వారంతా కారణమూ లేకపోతే ఇంత కాలం దాగుడు మూతలాడతారు?
అదేమైనా స్వతంత్రం ప్రకటించుకున్న నగరమా? రాష్ట్రప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ వున్నదంటే?

ఇన్నాళ్ళుగా దాచుకున్న బంగారం, నల్ల డబ్బు తరలిపోయాక ఇప్పుడు శవాన్ని చూపించి వార్తా చానళ్ళ నిండా లైవ్ షో లిస్తూ ప్రజలను మోసపుచ్చడం కాదా?
ఇన్నాళ్ళు ఇంత దాపరికం దేనికి?
ఇవన్నీ భేతాళ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి..

18, ఏప్రిల్ 2011, సోమవారం

విరిగిపడిన ఊచలు




కళ్ళకు గంతలున్నాయిలే

ఆమెకు ఏమీ అగుపడదని

తన మూర్ఖపు ఆలోచనతో

రాజ్యం ఓ చంటి పిల్లల

డాక్టర్ ని ఇనుప ఊచల

వెనక నెట్టి హమ్మయ్య

అని ఊపిరి పీల్చిన వేఃళ!


న్యాయం నీ గుండెలపై

సమ్మెట దెబ్బ వేస్తూ

ఇంకా ఇక్కడ వెలుగుతూనే

వుందని నిరూపించిన వేళ!!


ఆయన రాకతో ఓ పెద్ద

పర్వతాన్నే తొలిచివేసిన

ఆనందం అర్ణవమై

అంతా మోదుగుపూలు

పరచుకున్నాయీ వేళ....


(కొద్ది సేపటి క్రితం డా.బినాయక్ సేన్ రాయపూర్ జైలునుండి బైల్ పై విడుదలయ్యారన్న వార్త విని)

6, ఏప్రిల్ 2011, బుధవారం

ఈ పలాస్త్రీ సరిపోతుందా?



సామాజిక కార్యకర్త అన్నాహజారే గారు అవినీతికి వ్యతిరేకంగా ఆమరణ దీక్షకు కూచొని జన లోక్ పాల్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని గట్టిగా డిమాండ్ చేయడం ఆహ్వానిద్దాం..


అయినా చట్టాలెన్ని వున్నా అవి ఉన్నవాడి చుట్టాలుగా కాగితాలలో దుమ్ము పట్టిపోతున్న తరుణంలో, ఎన్నడూ కనీవినీ ఎరుగని లక్షల కోట్ల కుంభకోణాలతో పాలకవర్గం అలరారుతుండగా ఇలా బిల్లులు చేయించే పలాస్త్రీ వైద్యం పనికి వస్తుందా అన్న సందేహం మీముందుంచుతున్నా..


గట్టిగా ఓ అరగంట క్యూలో నిలబడి సినిమా టికెట్ తీసుకోవడానికి సిగ్గుపడి బ్లాక్ లో కొనే మారాజులుం మనం. ఏదో ఒకలా పిల్లవాడికి స్కూల్లో సీటో, కొలువుకోసమో ఎంతైనా చేతులు తడపడానికి రెడీ అయిపోయే మనం..ఇలా అవినీతికి వ్యతిరేకంగా జూలుదులిపి అంతు చూడగలమా? కింది స్థాయి నుండి, ఉన్నత హోదాల వరకు, రాజకీయ నాయకులనుండి న్యాయస్థానాలవరకు, ఇటీవల మన అంతరిక్ష పరిశోధనాశాలలూ మినహాయింపబడక అంతా అవినీతి చెదతో కుప్పకూలుతున్న తరుణంలో వ్యవస్థను ఉన్నదున్నట్లు వుంచి ఇలాంటి ఆయింట్ మెంట్ కార్యక్రమాలతో ఏదీ సాధించలేమని నా అభిప్రాయం...


సమాచార హక్కు చట్టం పట్టుకొని ప్రభుత్వ కార్యాలయాలపై పోరాడే కార్యకర్తలు ఇటీవల చాలా మంది హత్యకు గురికాబడుతున్నారు. వారి పోరాటంతో వారి ప్రాణాలు పోయి, కుటుంబాలు వీధిన పడడమే తప్ప కనీసం అటువంటి వారిని ఆదుకునే నాధుడే లేకపోయాడు ఈ సువిశాల ప్రజాస్వామ్య దేశంలో...

నా కనిపిస్తున్నది ఇదంతా గాదెలోని గింజలు గాదెలోనే వుండిపోవాల, పిలకాయలు పెరిగిపోవాలన్న చందంగా వ్యవస్థ లోపాలను రూపుమాపకుండా, పాలక వర్గం యొక్క అమ్ముడుపోయే స్వభావం మారకుండా, జనం తమ గురించే కాకుండా పక్కవాడి గురించి ఆలోచించే మార్పు రాకుండా, ఆర్థిక వ్యత్యాసాలు రూపుమాపకుండా, అందరికీ సమానావకాశాలు లేకుండా ఇలాంటి బిల్లులెన్ని పెట్టినా వాటి లొసుగులను వాడుకొని ముందుకుపోయే వాళ్ళున్నంతకాలం మార్పు రాదన్నది సత్యం కాదా???

3, ఏప్రిల్ 2011, ఆదివారం

ఐ.సి.యు.లో దేవుడు???

గత నాలుగు రోజులుగా దేవుడుగా కొలవబడుతున్న సత్యసాయిబాబా ఆసుపత్రిలొ వైద్యుల పర్యవేక్షణలో వున్నారని వార్తలు వస్తున్నాయి. కృత్రిమ శ్వాశను అమర్చినట్టు వార్తలు... అలాగే ఆ ప్రాంతమంతా రక్షణ వలయంలో డి.జి.పి.గారి పర్యవేక్షణలో వుందని, ఏ క్షణం ఏ వార్త భక్తులను ఏ గుణానికి దారి తీయిస్తుందో తెలియక ఆందోళన పడుతున్నారని వింటున్నాం...

ఇప్పటికైనా మనిషిని మనిషిగా చూడాలని, దేవుణ్ణి చేయడం, మహిమల ద్వారా జనాన్ని తప్పుదోవ పట్టించడం కూడదన్న సత్యాన్ని గ్రహించాలి... ఇదేదో ఎవరో చెప్తే కానీ తెలియని వాళ్ళు కాకపోయినా మూర్ఖంగా దేశాధినేతల దగ్గరనుండి అంతా మూఢ విశ్వాశాలని వ్యాప్తిచేయడంలో తమ వంతు కృషి చేసారు....విశ్వాశం పరిమితికి మించితే అది మూఢత్వానికి పరాకాష్టగా మారుతుంది....

ఇక్కడ బాబా చేయించిన సామాజిక కార్యకలాపాలను చూడాలని కొంతమంది అనవచ్చు.. అది విశ్వాశాలను శాశ్వతం చేయడంలో భాగంగా చూడాలి... అదంతా ఆయన సంపాదన కాదు... ఆయనకు భక్తులు ఒనగూర్చినది అలా వినియోగించి తన్ను తాను భగవంతుడిగా కొలిపించుకునే దానిలో భాగం కావచ్చు...ఎందుకంటే ఆయనకు హారతులిచ్చి పాదాభివందనాలు చేయడం చూస్తున్నాం... ఇది కూడనిది...

కాస్తా శాస్త్రీయంగా ఆలోచించి మతం విశ్వాశం మాత్రమేనని, మనసుకు స్వాంతన చేకూర్చేంతవరకు దానిని పరిమితం చేసుకుంటే ఎవరికీ ఇబ్బందికరంగా మారదు... అది మూఢనమ్మకమైతే మనిషిని ఎదగనీయదు....