6, ఏప్రిల్ 2011, బుధవారం

ఈ పలాస్త్రీ సరిపోతుందా?



సామాజిక కార్యకర్త అన్నాహజారే గారు అవినీతికి వ్యతిరేకంగా ఆమరణ దీక్షకు కూచొని జన లోక్ పాల్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని గట్టిగా డిమాండ్ చేయడం ఆహ్వానిద్దాం..


అయినా చట్టాలెన్ని వున్నా అవి ఉన్నవాడి చుట్టాలుగా కాగితాలలో దుమ్ము పట్టిపోతున్న తరుణంలో, ఎన్నడూ కనీవినీ ఎరుగని లక్షల కోట్ల కుంభకోణాలతో పాలకవర్గం అలరారుతుండగా ఇలా బిల్లులు చేయించే పలాస్త్రీ వైద్యం పనికి వస్తుందా అన్న సందేహం మీముందుంచుతున్నా..


గట్టిగా ఓ అరగంట క్యూలో నిలబడి సినిమా టికెట్ తీసుకోవడానికి సిగ్గుపడి బ్లాక్ లో కొనే మారాజులుం మనం. ఏదో ఒకలా పిల్లవాడికి స్కూల్లో సీటో, కొలువుకోసమో ఎంతైనా చేతులు తడపడానికి రెడీ అయిపోయే మనం..ఇలా అవినీతికి వ్యతిరేకంగా జూలుదులిపి అంతు చూడగలమా? కింది స్థాయి నుండి, ఉన్నత హోదాల వరకు, రాజకీయ నాయకులనుండి న్యాయస్థానాలవరకు, ఇటీవల మన అంతరిక్ష పరిశోధనాశాలలూ మినహాయింపబడక అంతా అవినీతి చెదతో కుప్పకూలుతున్న తరుణంలో వ్యవస్థను ఉన్నదున్నట్లు వుంచి ఇలాంటి ఆయింట్ మెంట్ కార్యక్రమాలతో ఏదీ సాధించలేమని నా అభిప్రాయం...


సమాచార హక్కు చట్టం పట్టుకొని ప్రభుత్వ కార్యాలయాలపై పోరాడే కార్యకర్తలు ఇటీవల చాలా మంది హత్యకు గురికాబడుతున్నారు. వారి పోరాటంతో వారి ప్రాణాలు పోయి, కుటుంబాలు వీధిన పడడమే తప్ప కనీసం అటువంటి వారిని ఆదుకునే నాధుడే లేకపోయాడు ఈ సువిశాల ప్రజాస్వామ్య దేశంలో...

నా కనిపిస్తున్నది ఇదంతా గాదెలోని గింజలు గాదెలోనే వుండిపోవాల, పిలకాయలు పెరిగిపోవాలన్న చందంగా వ్యవస్థ లోపాలను రూపుమాపకుండా, పాలక వర్గం యొక్క అమ్ముడుపోయే స్వభావం మారకుండా, జనం తమ గురించే కాకుండా పక్కవాడి గురించి ఆలోచించే మార్పు రాకుండా, ఆర్థిక వ్యత్యాసాలు రూపుమాపకుండా, అందరికీ సమానావకాశాలు లేకుండా ఇలాంటి బిల్లులెన్ని పెట్టినా వాటి లొసుగులను వాడుకొని ముందుకుపోయే వాళ్ళున్నంతకాలం మార్పు రాదన్నది సత్యం కాదా???

2 కామెంట్‌లు:

ఆలోచనాత్మకంగా..