12, సెప్టెంబర్ 2012, బుధవారం

అన్నా హజారే ఎవరి ప్రతినిధి??

గత సంవత్సరమంతా దేశాన్ని ఊపు ఊపిన అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాట ఉద్యమం ఆహ్వానించదగ్గదే అనిపిస్తూనే ఈయన ఎవరికి ప్రతినిధిగా ఈ ఉద్యమం నడుపుతున్నారో ఈ వేళ నే చదివిన అరుంధతీ రాయ్ గారి వ్యాసం పెట్టుబడిదారీ విధానం - ఓ ప్రేతాత్మ కథ చాలా విషయాలు చెప్పింది.

పెట్టుబడిదారీ దోపిడీకి మానవత్వపు ముసుగు తొడిగిన ఫోర్డ్ మరియు రాక్ ఫెల్లర్ ఫౌండేషన్లు స్పాన్సర్ చేసిన రామన్ మేగసేసే అవార్డు గ్రహీతలు ముగ్గురు ఈ ఉద్యమాన్ని నడిపే వారిలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఈ సంస్థల నేపథ్యం తెలుసుకోవాలంటే ఈ వ్యాసం తప్పక చదవాలి.

అన్నాహజారే, అరవింద్ కేజ్రివాల్, కిరణ్ బేడీల వెనక వున్న మద్దతు గురించి తప్పక తెలుసుకోవాలి. అరవింద్ కేజ్రీవాల్ కి ఉన్న అనేక స్వచ్చంద సంస్థలలో ఒక దానికి ఫోర్డ్ ఫౌండేషన్ ధారాళంగా నిధులు ఇస్తుంది. కిరణ్ బేడీ నడిపే స్వచ్చంద సంస్థకి కోకా కోలా, లేమన్ బ్రదర్స్ నిధులను ఇస్తున్నాయి.

అన్నా హజారే గాంధేయవాదినని చెప్పుకుంటాడు. కానీ అతను ప్రతిపాదిస్తున్న జన్ లోక్ పాల్ బిల్లు గాంధేయ వాదానికి వ్యతిరేకమైనది, ప్రమాదకరమైనది. ఆమధ్య యూరోప్, అమెరికాలను ఒక ఊపు ఊపిన వాల్ స్ట్రీట్ ముట్టడి ఉద్యమానికి భిన్నంగా ఈ అవినీతి వ్యతిరేక ఉద్యమం నడుస్తోంది. ప్రైవేటీకరణ, కార్పొరేట్ శక్తుల, ఆర్థిక సంస్కరణల ప్రభావంతో అతలాకుతలమవుతున్న జనజీవనం గురించి ఒక్క మాట కూడా మాటాడని అన్నా అలాగే కార్పొరేట్ అవినీతి కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించి, రాజకీయ నాయకుల పట్ల ప్రజల ఆగ్రహాన్ని సాకుగా చేసుకుని ప్రభుత్వ అధికారాలు మరింత నీరు గార్చాలని, ప్రైవేటు పెట్టుబడులకు అనుగుణంగా సంస్కరణలను వేగవంతం చేయడానికి తోడ్పడేందుకు ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు. ఇక్కడ మరో విషయం రెండువేల ఎనిమిదిలో అన్నాకు విశిష్ట ప్రజాసేవకు ప్రపంచ బ్యాంకు అవార్డు నివ్వడం యాధృచ్చికం కాదు. అవినీతి వ్యతిరేక ఉద్యమం తమ విధానానికి సరిగ్గా సరిపోయిందని వాషింగ్టన్ నుంచి ప్రపంచ బ్యాంకు ప్రకటన ఇచ్చింది.

యిలా రాజ్యం యొక్క సంక్షేమ పథకాలను నీరుగారుస్తూ ఆర్థిక సంస్కరణల పేరుతో దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న విదేశీ పెట్టుబడి సంస్థల కొమ్ము కాసేందుకు, ఆయా సంస్థలకు అనుకూలంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకు రావడానికి, వున్న ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి సెజ్ లు వంటి సామంత రాజ్యాల ఏర్పాటుకు ఓ సన్నాహక, మద్ధతుకు ముందస్తు ప్రక్రియగా ప్రజల మైండ్ సెట్ ను మార్చే ఉద్యమంగా దీనిని కార్పొరేట్ మీడియా సహకారంతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల మౌలిక సమస్యల పట్ల ఏమాత్రం సానుభూతిలేని వీరి ఉద్యమం ఓ ఫార్సు. జనం కూడూ గుడ్డ, స్థానం కోల్పోయి ఎక్కడికక్కడ తమ భూమి, వున్న ఊళ్ళను విడిచి వలస బాట పట్టే విధంగా జన జీవనం అతలాకుతలం కాబడుతుంటే, దేశ సంపదను, సహజ వనరులను కొల్లగొట్టేందుకు పెద్ద ఎత్తున ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించకుండా నటిస్తూ తాము ఈ దేశానికి నిజాయితీ పరులుగా ఫోజులిస్తూ ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలకు మద్ధతుగా దీనిని ముందుకు తెచ్చారు.

ఈ సందర్భంగా రాజకీయ అవినీతిని కూడా తప్పక ఖండించాలి. అది అవినీతికి మూల విరాట్టే, కాదనను. కానీ, ఈ దేశ సహజ సంపదను మానవ వనరులను పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న కార్పొరేట్ రంగాన్ని ప్రశ్నించి నిలువరించే ఉద్యమంగా ఇది ముందుకు రావాల్సిన అవసరముంది. అవకాశ వాద మధ్యతరగతి ప్రజల మనోభావాలను ప్రభావితం చేస్తూ అసలు అవినీతి మూల విరాట్టును వదిలేసి పైపై మెరుగులను ఆశించే ఇట్లాంటి ఉద్యమాల వలన ఏమాత్రం ఉపయోగముండదు. వ్యవస్థ సమూల మార్పునకు గురికాకుండా ఇలాంటి ఆయింట్ మెంటు ఉద్యమాల వలన జరిగే మార్పేమీ వుండదు.


6 కామెంట్‌లు:

  1. ఆహాఁ , చైనా నుంచి నిధులు వీళ్ళకి అందడం లేదన్న మాట! ఎవరికి అందుతున్నాయో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చైనా కమ్యూనిస్టు దేశమన్న భ్రమలో మీరున్నారా?? వారెవరికి నిధులిస్తున్నారో అడగండి..లేక మీకేమైనా అందుతున్నాయా??

      తొలగించండి
  2. /పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్న కార్పొరేట్ రంగాన్ని ప్రశ్నించి నిలువరించే ఉద్యమంగా ఇది ముందుకు రావాల్సిన అవసరముంది./
    అన్నీ వాళ్ళే చేస్తే... వామపచ్చాలకు చేసేదేముంది?! చేస్తున్నారుగా వుజ్జమాలు, నే పుట్టకముందు నుంచీ...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. SNKR గారూ తమరు పుట్టకముందు నుండీ భూమి వుందండీ..ఇప్పుడూ మీరు దానిమీదే వున్నారు కదా??

      తొలగించండి
  3. దోపిడీ చేసేవాడు కేవలం చట్టం అనుమతించిన పద్దతులలో (అనగా లైసెన్స్‌ల కోసం ప్రభుత్వానికి లంచం ఇవ్వకుండా ఉండడం లాంటి పద్దతులలో) మాత్రమే దోచుకోవాలనుకుంటాడా? అన్నా హజారేకి దోపిడీ యొక్క స్వభావం గురించి తెలియదని దీన్ని బట్టి అర్థమైపోతుంది.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..