14, నవంబర్ 2009, శనివారం

ఏ బాలల దినోత్సవం?


ఈరోజు బాలల దినోత్సవంగా దేశవ్యాప్తంగా నెహ్రూ గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఆయనకు బాలల పట్ల వున్న ప్రేమను ఇలా మనం జరుపుకోవడంలొ అభ్యంతరం వుండదెవరికీ. ఆయన జేబులో తురుముకున్న ఎర్ర గులాబీ, ఆయన చుట్టూ చేరిన బాలల ఫోటోలతో మనకు ఒక స్వచ్చమైన రూపం కనులముందు కదలాడి ఆయనకు పిల్లల పట్ల వున్న ప్రేమను గుర్తింప చేస్తాయి. కానీ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళు గడిచినా నేటికీ మనం బాలల హక్కులపట్ల, వారి భవిష్యత్ పట్ల సరైన ప్రణాళికలు రూపొది౦చుకోలేకపోయా౦.

లక్షల మంది శిశువులు లింగ వివక్షకారణంగా పిండం రూపంలోనో, లేక పుట్టిన తరువాతనో హత్యకావించబడుతున్నారు. దీనికి పరోక్షంగా మన సమాజంలోని వరకట్న దురాచారం, ఆడవారిపట్ల వున్న చిన్న చూపే కారణం.

అలాగే ప్రాథమిక విద్యను హక్కుగా ప్రకటించినప్పటికీ ఎంతో మంది బాలలు బడిమొహం చూడకుండానే వుండిపోతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే వీరి సంఖ్య డబ్భై లక్షల వరకు వుంది. వీరిలో వికలాంగులు, వలస కార్మికుల పిల్లలు, వీధి బాలలు, బాల కార్మికులు వంటి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన బాలలే అధికం.

కోటీ ముప్ఫై లక్షలమంది బాల కార్మికులుగా జీవనం సాగిస్తున్నట్లు ప్రభుత్వమే లెక్కలు చెబుతోంది. ఈ సంఖ్య ఆరు కోట్లవరకు వుంటుందని ఎన్.జీ.వో సంస్థలు అంటున్నాయి. ప్రతి పది మందిలో ఇద్దరు బాల కార్మికులుంటున్నారని సేవ్ ద చిల్డ్రన్ అనే స్వచ్చంద సంస్థ పేర్కొంటోంది. ఇంకా మూడేళ్ళ లోపు వయసు వారిలో నలబై ఆరు శాతం మంది బరువు తక్కువుగా వుంటున్నారు. మొత్తం పిల్లలలో డబ్బై శాతం మంది రక్త హీనతతో బాధపడుతున్నారు. ఐదేళ్ళలోపు పిల్లలలో ఏటా ఇరవై లక్షలమంది నివారించదగ్గ, చికిత్సకు లొంగే చిన్న, చిన్న జబ్బులతో మరణిస్తున్నారు. ఏటా నాలుగు లక్షలమంది శిశువులు పుట్టిన ఇరవై నాలుగు గంటలలోనే కన్నుమూస్తున్నారు. శిశుమరణాల రేట్లో భారతదేశ పరిస్థితి బంగ్లాదేశ్ కంటే ఘోరంగా వుంది. ప్రతి వెయ్యి జననాలకు డబ్బై రెండు మంది మరణిస్తున్నారు. శిశు మరణాలలొ భారతదేశం నూటడబ్బై ఒకటో స్థానంలో వుంది.

ఇవి మన సర్కారు గణాంకాలాధారంగా తెలియజేస్తున్నవే, ఇంకా ఎవరూ నమోదుచేయని గిరిజన ప్రాంతాల పరిస్థితి కలుపుకుంటే ఇంకా ఘోర పరిస్తితి తెలియవస్తుంది. ఎంతోమంది గిరిజన ప్రాంత శిశువులు సరైన రహదారి సౌకర్యం లేక, ప్రాంతాల పట్ల సర్కారు నిర్లక్ష్య వైఖరి కారణంగా రక్త హీనత, పౌష్టికాహార లోపంతో మూడేళ్ళలోపునే మరణిస్తున్నారు.

మన కనులముందే కుటుంబ ఆర్థిక పరిస్తితులు, సామాజిక వివక్ష కారణంగా ఎంతో మంది బాలలు వీధి బాలలుగా, బాల కార్మికులుగా అత్యంత దయనీయ పరిస్తితులలో జీవనం సాగిస్తున్నారు. ప్రతియేటా బాలల దినోత్సవం నాడు ఉపన్యాసాలతో ఊదరగొట్టి వారి పట్ల ప్రేమను ఒలకబోసే పాలక వర్గాలు ఏనాడూ సరైన కార్యాచరణ ప్రణాళికను చిత్తశుద్ధితో అమలు చేసిన పాపాన పోలేదు. మన రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రుల వర్యులకు పుష్పగుచ్చాలు అందించి ఫోటోలకు ఫోజులిచ్చి, నవ్వులు చిందించే బాలలలో ఎవరైనా అనాధ బాలలుంటారా? పుట్టుకతోనే బంగారుచెంచాతో వచ్చిన వారు తప్ప. వారి పండగనే దేశంలోని అందరు బాలల పండగగా ప్రచారం చేసి పబ్బం గడుపుతున్నారు.

మన విద్యారంగంలో నేడు అమలౌతున్న సంస్కరణలు కూడా బాలల హక్కులను హరించేవిగానే వుంటున్నాయి.

అలాగే ఎంతోమంది ఆడపిల్లలు బాల్యంలోనే వేశ్యావాటికలకు అమ్మివేయబడి నరక కూపాలలో మగ్గిపోతున్నారు. చైల్డ్ పోర్నోగ్రఫీ పట్ల వున్న కౄర వ్యామోహం దీనికి కారణం. ఇది మన పాలక, రక్షకభటులకు తెలిసే జరుగుతోంది. కలకత్తాలోని సోనాపురీ, బొంబాయి, ఢిల్లీ వంటి మహా నగరాలలోని రెడ్ లైట్ ఏరియాలలో ఇది ఒక మాఫియాగా నడుపబడుతోంది. (నొయిడాలో ఒక పెద్దమనిషి ఎంతో మంది పిల్లలను లైంగికంగా హింసించి, చంపి పాతరేస్తే సరైన సాక్ష్యాలు లేవనీ మన గుడ్డి న్యాయస్థానం వదిలిపెట్టింది).

వీటన్నింటిపట్ల ఒక సమగ్రమైన ప్రణాళికను రూపొందించి, చిత్తశుధ్ధితో అమలు చేసిన నాడే మనం బాలల దినోత్సవాన్ని జరుపుకునే నైతిక హక్కును పొందుతాం.

1 కామెంట్‌:

  1. బాగా చెప్పారు. హైదరాబాదు లొ ఏ జంక్షన్ చూసినా అక్కడొక వీధి బాలల గుంపు కనిపిస్తుంది. హై టెక్ సిటీ, జూబిలీ హిల్స్ వీధి బాలల గ్రూపులు అన్నింతికంటె పెద్దవి. ఎదైనా కారు రాగానే వీల్లంతా వచ్చి కారు తుడిచి దబ్బులు అడుక్కుంటారు.

    అంత పెద్ద నగరం లో, అంత బుజీ సెంటర్ లలొ అలా వుంటె, మారు మూల ప్రాంతాల్లో పరిస్తితి ఎల ఉంటుంది? ఎందుకు ప్రభుత్వం వీలని అనాధ శరనాలయాల్లో చేర్చరు?

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..