

బారక్ ఒబామా ఎన్నికైన రోజున అందరి మనసులలో ఏదో మార్పు పట్ల ఆశ..
మూడో ప్రపంచ దేశాల ప్రజలలో తమ భవిత పట్ల ఏదో ఊరట..
తమ వాడిలా అగుపిస్తున్న మనిషి, మాటల మనిషే కాదు చేతల పనివాడుగా కలిగించిన ఓదార్పు కొద్ది రోజులకే నిట్టూర్పుగా మారింది..
రంగు కాదు అక్కడ తెల్లగృహంలోని సింహాసనం ఎవరి చేతనైనా అదే మీట నొక్కిస్తుంది అన్నది స్పష్టమైపోయింది త్వరలోనే..
తీవ్ర నిర్బంధాన్ని, ప్రపంచ వ్యాప్తంగా తమపై జరుగుతున్న దుష్ప్రచారానికి విరామం దొరికి తమ గూడు పదిలమవుతుందని ఆశించిన ముస్లిం ప్రజానీకం, పాలస్తీనా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశస్తులకు అమెరికా ఓ భూతంగానే మిగులుతుందని తొందరలోనే గ్రహింపుకొచ్చింది.
ఇంక భారతీయులకుః అణు పరిహార బిల్లుతో కొడి దీపంగా మిగిలిన సార్వభౌమత్వమనే ఊహ అడుగంటింది. వెన్నెముక లేని స్థానిక నాయకత్వం గుడ్డిగా తల ఊపి చంకలు గుద్దుకుంది. ఏ పక్షమూ ప్రజల పక్షం కాదని నిరూపించారు.
ఇక్కడి తమ ఐ.ఎం.ఎఫ్.ఏజెంటు నాయకత్వ పాలన కొనసాగుతున్న తీరును సమీక్షించడానికి వస్తున్నందుకు వ్యతిరేకిద్దాం...
తన అండతో ఇక్కడి ఉద్యమాలపై సాగుతున్న నిర్బంధాన్ని, ప్రజల జీవితాలు అతలాకుతలమవుతున్నందుకు, అవినీతికి చట్టబద్దత కల్పిస్తున్న పాలకులకు వత్తాసుగా వస్తున్నందుకు వ్యతిరేకిద్దాం...
ఔట్ సోర్సింగ్ కు నో అంటు మనకు తలుపులు మూసినందుకు తప్పక గో బాక్ ఒబామా అనాలి..
లక్షల కోట్ల రూపాయల వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకొనేందుకే వస్తున్నాడని పేర్కొంటున్న మీడియా ఆ ఒప్పందాలు ఎవరికి లాభం చేకూరుస్తాయన్నది చెప్పక తమ అవకాశవాదాన్ని బయట పెట్టుకుంటున్నాయి. ఇప్పటికే సకల దరిద్ర దురదృష్ట జాతకులుగా వున్న వ్యవసాయ రంగాన్ని మరింత అడుగంటించే దానిలో భాగంగా విదేశీ వ్యవసాయ దిరుబడుల ఒప్పందాలను తిరగరాయడానికి వస్తున్న అధినేతను తప్పక వెళ్ళిపొమ్మందాం...
ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, పాలస్తీనా, ఇరాక్, ఇరాన్, టర్కీ, క్యూబా మొ.న దేశాలపై అమలవుతున్న తీవ్ర నిర్బంధం, మానవ హననం ఈయన గారి హయాంలో కూడా ఆగకుండా జరుగుతున్నందుకు...
చేతిలో అణుబాంబు మీట పెట్టుకొని ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, స్వేచ్చా స్వాతంత్ర్యాల గురించి వల్లించే ఈ దెయ్యాన్ని రావద్దందాం..
గోబాక్ ఒబామా గోబాక్..