30, జూన్ 2012, శనివారం

మళ్ళీ నెత్తురోడిన చింతల్నార్ (Basaguda)



చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బాసగూడ అటవీ ప్రాంతంలో శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జరిగిన సైనికదాడిలో ఇరవై రెండు మంది ఆదివాసీలు చనిపోయారు. ఈ దాడిలో పాల్గొన్నది సైనిక విభాగమైన కోబ్రా, పారామిలటరీ, స్థానిక రిజర్వ్ విభాగాలకు చెందిన దళాలు. వీరు మావోయిస్టులతో సమావేశమైన ఆదివాసీ ప్రజలపై మూకుమ్మడిగా దాడి చేసి చంపివేసారు. చనిపోయినవారిలో మహిళలు, తొమ్మిది సంవత్సరాల బాలిక, పదకొండేళ్ళ బాలుడు కూడా వున్నారు. వీరంతా గ్రామంలోని భూసమస్యపై చర్చించుకుంటున్న సందర్భంలో మావోయిస్టులను మట్టుబెట్టేందుకు సిద్ధమైన సైనిక బలగాలు అక్కడికి చేరుకుని గ్రామస్తుల నుండి ప్రతిఘటననెదుర్కొనలేక విచక్షణారహితంగా ఆధునిక ఆయుధాలతో దాడి చేసి ఇంతమంది ఆదివాసీలను పొట్టనబెట్టుకున్నారు. దీనిని కప్పిపుచ్చుకునేందుకు వారంతా మావోయిస్టులేనని పాతపాటనే పల్లవిస్తున్నారు.

స్థానిక విలేకర్లు, ప్రజాస్వామిక వాదులు, స్వామి అగ్నివేష్ ఈ ఎదురుకాల్పులపై యిచ్చిన వివరణ ప్రకారం ఈ దాడి విచక్షణారహితంగా పాశవికంగా ఆదివాసీ ప్రజలపై జరిగిన సైనికదాడిగానే పరిగణిస్తున్నారు. దీనిపై కేంద్రం కూడా వెంటనే వివరణ ఇవ్వలేకపోయినదంటే మరణించింది ఆదివాసీ ప్రజలు కనుకనే.

ఇలాంటి సైనిక దాడులతో స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారిని వెళ్ళగొట్టి అక్కడి సహజ వనరులను ఎమ్.ఎన్.సి.లకు కట్టబెట్టే కుట్రలో భాగంగానే గుర్తించాలి. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ విజయ్. ఆపరేషన్ హాకల పేరుతో సొంత బిడ్డలపైనే సైనిక దాడులకు ఎగబడుతున్న దళారీ కార్పొరేట్ పాలక వర్గాల దమన నీతిని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలి.

కోట్లాది రూపాయలను ఈ ఆపరేషన్లకు ఖర్చు చేస్తున్న పాలక వర్గం స్థానిక ఆదివాసీ ప్రజల హక్కులను గుర్తించి వారి జీవన స్థితిగతులను మెరుగుపర్చుకునేందుకు వారికి అవకాశమిస్తూ సహజ వనరులు, భూములపై వారి హక్కులను గుర్తించి తోడ్పడాల్సిందిగా ప్రజాస్వామిక వాదులు, మేధావులు వత్తిడి తేవాల్సిన అవసరముంది. కానీ ఈ అధికార బధిరాంద లంచగొండి అవినీతి స్కాముల దళారీ కార్పొరేట్ పాలక వర్గాలకు ఇవేవీ వినిపించుకునే మనసు లేదన్నది అందరికీ తెలిసిన విషయమే..


వార్త

15, జూన్ 2012, శుక్రవారం

భూమి - దళితులు-ఆత్మగౌరవం..



భూమి - దళితులు-ఆత్మగౌరవం

శ్రీకాకుళం మళ్ళీ నెత్తుటి గుడ్డు అయ్యింది. కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, వేంపెంట సంఘటనల తరువాత నేడు లక్ష్మిపేటలో దళితులపై జరిగిన అమానుష దాడి నాలుగు నిండు ప్రాణాలును బలిగొంటూ మనముందు అనేక ప్రశ్నలను వుంచింది. హత్యల వెనక కులం, రాజకీయ, ఆర్థిక కారణాలతో పాటుగా ప్రధానంగా దేశ అస్తిత్వ సమస్య అయిన భూమి వుంది.

సెంటు భూమిలేని దళితుల అస్తిత్వ పోరాటానికి సాక్ష్యం ఇది.

ప్రాంతంలోని సువర్ణముఖి, వేగావతి నదీ సంగమ ప్రాంతం మడ్డువలస దగ్గర నిర్మించిన ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల పంట భూములు, గ్రామాలు నష్టపోయి అప్పటి అర కొర ప్యాకేజీలతో పొట్ట చేత పట్టుకొని చెట్టుకొకరు పుట్టకొకరైన వారే ఎక్కువగా వున్న ప్రాంతంలో ప్రభుత్వం యిచ్చిన నిర్వాసిత స్థలంలో ఇల్లు నిర్మించుకొని వున్న వాళ్ళలో కొట్టిశ, లక్ష్మిపేట గ్రామాల ప్రజలు వున్నారు. రెండు గ్రామాలు వంగర మండల పరిథిలో వున్నాయి. ఇందులో లక్ష్మిపేట గ్రామంలో 60 ఇల్లు దళితులలోని మాల వర్గానికి చెందినవి. మిగిలిన 80 ఇల్లు బి.సి. కాపు కులానికి చెందినవి. వీరంతా తమ పాత గ్రామం విడిచిపెట్టి వచ్చి ఇక్కడ కొత్తగా చేరినవారే. గ్రామం చుట్టు పరచుకొని వున్న 240ఎకరాల వ్యవసాయ భూమి బి.సి.వాళ్ళది. దీనికి ప్రభుత్వం కాంపన్సేషన్ చెల్లించి వేసింది. అయినా ఇది ముంపు పరిథి దాటి వుండడంతో ఇందులో 180 ఎకరాలు బి.సి.లు 60 ఎకరాలు మాలకులస్తులు సాగు చేసుకుంటూ వస్తున్నారు. భూమి తమదే కాబట్టి అరవై ఎకరాలు కూడా తమకే చెందాలని కాపువర్గం దళితులపై వత్తిడి తేవడంతో వారంతా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. మొత్తం భూమికి గవర్నమెంటు నష్టపరిహారం చెల్లించివున్నందున అది ప్రభుత్వ స్వాధీనంలో వున్నట్టే. దీనిపై ఎవరికీ హక్కులుండవు కాబట్టి దీనిని సరిఅయిన రీతిలో ఇరు వర్గాలను కూచోబెట్టి పంపిణీ చేసి వుంటే అసలు ఈరోజు ఇంత దారుణం జరిగి వుండేది కాదు.

న్యాయస్థానాన్ని ఇరువర్గాలు ఆశ్రయించడంతో మొత్తం భూమిపై స్టే ఆర్డరిస్తూ ఎవరూ సాగు చేయకుండా ఆదేశాలిచ్చింది. ఇది బి.సి.లకు పుండు మీద కారంలా మారింది. గతంలో తమ సాగులో వున్న భూమిపై హక్కు తాము దళితులు అడగడం కారణంగా కోల్పోయామని వారు భావించడం, అందుకు బి.సి వర్గానికి చెందిన మాజీ ఎం.పి.పి. బొత్స వాసుదేవ నాయుడు తమ అధికార పార్టీ అండతో ప్రభుత్వాధికారుల అవినీతి అలసత్వాలను సొమ్ము చేసుకొంటూ సమస్యను తెగనీయకుండా చేస్తూ ఇరువర్గాలను రెచ్చగొట్టి తన రాజకీయ పలుకుబడిని పెంచుకునే ఎత్తుగడలో భాగంగా సమస్యను జఠిలం చేయడంలో ప్రధాన పాత్ర వహించాడు. దీనికి వత్తాసుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, కోండ్రు మురళిలు కొమ్ము కాయడంతో ఎన్నాళ్ళుగానో రగులుతున్న తమ కక్షను, పగను తీర్చుకునేందుకు ఉప ఎన్నికల సందర్భాన్ని (12-6-12) వాడుకున్నారు బి.సి.లు. గ్రామంలో గత ఆర్నెళ్ళుగా కొనసాగుతున్న పోలీసు పికెట్లోని వారు ఎన్నికల డ్యూటీకి వెళ్ళిన వేళ దళితులంతా ఉదయం చద్దన్నం తినడానికి ఇంట్లో వున్న సమయంలో కత్తులు, బాంబులు, రాళ్ళతో కాపు వర్గానికి చెందిన ఆడా మగా పిల్లలతో సహా వారిపై దాడి చేసి ఇంట్లోంచి ముంగిటకు లాక్కొని వచ్చి వారిని అతి దారుణంగా కొట్టి చంపారు. వారి వృషణాలపై రాళ్ళతో కొట్టి చంపడం ఇక్కడ వారి పట్ల వున్న కసి పగను తెలియజేస్తోంది. దాడిలో దళితులైన బూరాడ సుందరరావు, చిట్టి అప్పడు, తండ్రీ కొడుకులైన నెవర్తి వెంకటి, నెవర్తి సంగమేసులు చనిపోయారు.

రాయలసీమ, పల్నాడు ప్రాంతంలోని బాంబుల సంస్కృతిని ఇక్కడ కూడా ప్రవేశ పెట్టిన ఘనత మంత్రి బొత్సకు దక్కిందని అంతా అంటున్నారు. ఇంత దారుణంగా దళితులపై దాడులు జరిగి హత్యచేయబడి, 20 మందికి పైగా గాయాలపాలై అందులో మరి కొంతమంది చావు బతుకుల మధ్య కొట్టుకుంటుంటే కనీసం ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించలేదు. అలాగే కంటి తుడుపు చర్యగా ముఖ్యమంత్రి ప్రకటించిన నష్టపరిహారం పై కూడా సరైన ఆదేశాలు రాకపోవడం దళితులను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీంతో రాష్ట్ర ఎం.ఆర్.పి.ఎస్.అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ మరికొంత మంది దళిత నాయకులు, రాజకీయ పార్టీల వారు చనిపోయిన మృతదేహాలను ఖననం చేయకుండా మూడురోజులుగా పోరాటం చేయడంతో కదలిన అధికార యంత్రాంగం భూమిలో దళితులకు ఎకరా చొప్పున ఇవ్వడానికి అలాగే దాడికి పాల్పడిన వారిపై చర్యలకు హామీలివ్వడంతో ఈరోజు (14-6-12) సాయంత్రం ఖననం చేసారు.

దళిత హత్యాకాండ, దాడి సంఘటనకు ప్రధానంగా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం బాధ్యత వహించాలి. అలాగే స్థానిక రాజకీయ నాయకులు తమ అగ్రకుల అధికార మదంతో దళితులను భయభ్రాంతులను చేసి వారిని ఊరినుండి తరిమి కొట్టడం ద్వారా మొత్తం ప్రభుత్వాధీనంలోకి పోయిన భూమిపై తామే హక్కును కైవసం చేసుకోవాలన్న పక్కా ప్రణాళిక వుంది. దేశంలోని కులం, వర్గం యొక్క స్వభావానికి మరో తార్కాణం లక్ష్మిపేట దళితులపై జరిగిన దాడి. దీని యొక్క సామాజిక, రాజకీయార్థిక మూలాలను అర్థం చేసుకోవాల్సి వుంది. బలహీన వర్గాలకు కులమొక్కటే ఆత్మగౌరవ సమస్యగా ఉద్యమాలు చేయడం కాకుండా వారికి ఆర్థిక పరమైన ఆసరా, హక్కును కల్పించే భూమి ప్రధాన సమస్యగా ముందుకు తీసుకు రావాల్సిన అవసరాన్ని లక్ష్మిపేట ఊచకోత తెలియజేస్తోంది.

6, జూన్ 2012, బుధవారం

ఈ దేశానికి పట్టిన చీడ ఎవరు??

దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నకార్పొరేట్ రాజకీయ నాయకులు వారి అడుగులకు మడుగులొత్తుతూ జీ హుజూర్ అంటు బానిసల్లా బతుకుతూ సొంత ఇంటి లాభం చూసుకునే స్వార్థ ఐ.ఎ.ఎస్.లు, వీరిద్దరికీ కాపు కాస్తున్న దళారీ న్యాయవ్యవస్థ వీళ్ళ వలన ఈ దేశం ఎంతగా అతలాకుతలమవుతుందో అందరికీ ఎరుకే.

ఏదో గొప్ప నీతిమంతుడి ఫోజుతో మధ్యతరగతి అవకాశవాద మనఃస్తత్వాన్ని సొమ్ము చేసుకొని అధికారంలోకొచ్చేద్దామని కలలు కంటూ రాజకీయాల్లోకొచ్చిన పాత చెదపురుగు లోక్ సత్తా పేరుతో పార్టీ పెట్టిన జయప్రకాష్ నారాయణ నిన్న గనులు దోచినోల్లు నక్సలైట్ల కంటే ప్రమాదకారులని స్టేట్మెంటు ఇవ్వడం చూస్తుంటే ఈయన గారి సామాజిక రాజకీయ ఆర్థిక అవగాహన ఏపాటిదో తెలుస్తోంది.
ఈ దేశానికి నక్సలైట్ల వలన ప్రమాదమా ఇలా దోపిడీ దారుల కొమ్ము కాసే ప్రభుత్వాధికారులవలన ప్రమాదమో ప్లెబిసైట్ నిర్వహిస్తే తెలుస్తుంది జనవాణి. వీళ్ళేదో దేశంలో తెలివైన వారిగా ఫోజు కొడుతూ విపరీతంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, కుల పొగరు చూపుతూ , అధికారంలో వున్నన్నాళ్ళు రాజభోగాలనుభవిస్తూ, ప్రజల సొమ్ము అప్పనంగా దోచుకుపోయే వర్గం. వీరి వత్తాసు లేకుండా ఏ రాజకీయ నాయకుడూ దోచుకుపోలేడు. అధికారంలో వున్నవాడి కొమ్ము కాస్తూ తమకేదీ జరగదన్న ధీమాతో తామేదో దైవపుత్రులులా మిగిలిన వారిని హీనంగా చూసే ఈ దేశ ప్రధాన పాలక అధికార గణం ఏపాటి నీతి మంతమయినదో అందరికీ తెలిసినదే.
అవినీతిని రూపుమాపే పేరుతో ఈయన ఇంతవరకూ చేసిన ఉద్యమాలేపాటివో, గోడ మీది పిల్లివాటంలా వుంటూ తన పబ్బం గడుపుతున్న మాజీ గారు ఏదో పేపర్లలో కనబడ్డం కోసం ప్రకటనలివ్వడం తప్ప ఈయన చేస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమం ఏమీ లేదింతవరకు..
ఈ దేశ సహజవనరులను కాపాడేందుకు ప్రాణాలొడ్డి పోరుతూ బానిస వ్యవస్థను రూపుమాపుతూ సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా అహర్నిశలూ పోరాడుతున్న నిజమైన దేశభక్తులైన నక్సలైట్ల పట్ల ఈయన వైఖరిని ఖండిస్తున్నా..