10, జులై 2009, శుక్రవారం

'ఈ లైఫ్ నాకు నచ్చలేదు '


హైదరాబాద్ లో బి.టెక్ విద్యార్ధిని తనకు జీవితం నచ్చలేదని లేఖ రాసి, భవనం పై నుంచి దూకింది. చెప్పులు కొనివ్వలేదని తల్లి మీద అలిగి ఇంటర్ విద్యార్ధిని రైలు కింద పడింది. కృష్ణా జిల్లా విజయవాడలో బి.టెక్ చదువుతున్న కడప విద్యార్ధి హాస్టల్ లో ఉరి వేసుకొని చనిపోయాడు. కులాలు వేరని పెద్దలు పెళ్ళికి ఒప్పుకోలేదని ప్రేమ జంట మహబూబ్ నగర్ జిల్లాలో పురుగుల మందు తాగింది. అప్పులవాళ్ళ ఒత్తిడితో పాటు భర్తా కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో కొడుకు, కూతురులకు టీలో ఎలుకల మందు కలిపి తానూ తాగింది కరీంనగర్ జిల్లాలో తల్లి. నాకు లైఫ్ నచ్చలేదని సూసైడ్ నాట్ రాసిన తెజస్వని తనకు నచ్చిన యునివర్సిటిలో చేరేందుకు తల్లి దండ్రులు ఒప్పుకోలేదని ఇలా రాసి చనిపోయింది. టి వి లలో నాట్ రాత ప్రతిని చూపించారు. ఒకే ఒక్క వాక్యం రాసి ఉంది. ఇలా ఆత్మా హత్యల ద్వారా తమ నిరసన తెలియజేయడం వలన తామూ అనుకున్నది సాధి౦చగలరా అని మనమంతా ప్రశ్నిస్తాం. కాని వాళ్లు బ్రతికే అవకాశాన్ని మనమే లేకుండా చేస్తున్నామని ఎన్నడు ఎవరూ గ్రహించరు. అసలు ఆత్మహత్యను పిరికివాళ్ళ చర్యగా పరిగణిస్తాం. నిజమేనా అది. రోజు కుళ్ళి కృశించి నశించే నమ్మక ద్రోహపు బ్రతుకు కంటే అదే న్యాయమినదేమో అనిపిస్తుంటుంది. నిజానికి మన సమాజంలో తలెత్తుకు జీవించే పరిస్థితులు కోల్పోతున్న కారణంగానే ఇంతమంది ఇలా తమ నిరసనను తెలియజేస్తున్నట్లుగా గుర్తించే ధైర్యం మనకు౦దా? ఆత్మహత్యను తన చిట్టచివరి ఆయుధంగా మాత్రమే మనిషి ఎ౦చుకు౦టున్నాడు. ఎవరికి మాత్రం వుండదు జీవించాలని. కానీ పర్తితులను సమాజం కల్పించ లేకపోవడంతో మరో గత్యంతరం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తీవ్రమైన అనారోగ్యంతో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పిల్లలను బందెల దొడ్ల లాంటి కార్పోరేట్ కళాశాలల్లో విసిరేసి ర్యాంకుల జూదం ఆడుతున్న తల్లిదండ్రులది పాపం కాదా? యౌవ్వన ప్రాయంలో మనసు పరిపూర్ణ వికాసం చె౦దాల్సిన సమయంలో వాళ్లకు సరైన దృక్పధాన్ని అందించాల్సిన బాధ్యతనుండి పేరెంట్స్ తప్పుకోవడంతో తీవ్రమైన మానసిక వత్తిడికి లోనయి దానినుండి బయటపడే మార్గం తెలియక పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుని వలే ఎటూ పాలుపోక చివరికి మార్గాన్ని ఎంచుకునే యువతీ యువకుల ఉసురు తీసిన వాళ్ళం మనం కాదా? జీవన ప్రమాణాలు కోల్పోయి ఆర్ధిక ఇబ్బందులతో కుహనా విలువలకు లోబడి మనసు చంపుకోలేక తన్ను తాను చ౦పుకు౦టున్నారు. సమాజ చట్రంలో ఇరుక్కొని ఊపిరాడక ఉసురు తేసుకు౦టున్న అభాగ్యులె౦దరో. నేరం సమాజ౦లోని మన అ౦దరిదీనూ కాదా? మౌనాన్ని వీడాల్సిన సమయం ఇదే. లేనిచో అందరం ఆప్తులను కోల్పోయి ఒ౦టరి వాళ్ళం అవడం ఖాయం...

1 కామెంట్‌:

ఆలోచనాత్మకంగా..