1, జులై 2009, బుధవారం

హిరణ్యాక్షుడి పాలన

సహకార వ్యవసాయం పేరుతొ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో కంపెనీ పాలన మొదలవబోతోంది. రైతన్నకు వెన్నుదన్నుగా వుంటామని చెప్పుకొని అధికారంలోకి వచ్చిన పాలకులు ప్రపంచ బ్యాంకు వారి ఆదేశాలకు లోబడి వ్యవసాయ రంగం నడ్డి విరిచే పనులు ఇంత తొందరగా మొదలు పెట్టి ఇన్నాళ్ళు తాము వేసుకున్న ముసుగును తొలగించుకున్నారు. సోషలిస్టు రాజ్యాలలోనే విఫలమైన సహకార వ్యవసాయం ఇంతవరకు ఫ్యూడల్ రూపంలోంచి పూర్తిగా బయటపడని మన ఆర్ధిక, సామాజిక వ్యవస్తలో ఇది సాద్యమా. చిన్న చిన్న కమతాలుగా కొనసాగుతున్న మన వ్యవసాయం నేడు ఎదుర్కొంటున్న ప్రధాన సంక్షోభం పెరిగిపోయిన పెట్టుబడి, గిట్టుబాటు ధర లేకపోవడం, మార్కెట్ సదుపాయాలు కొరవడడం, ఎగుమతి అవకాశాలు మృగ్యమైపోవడం వలన రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి వ్య్వవసాయం ప్రాణాపాయ౦గా మారిన పరిస్థితుల్లో రైతాంగం దాని నుండి దూరమై కూలి బతుకులవైపు నేట్టివేయబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఉపాధి హామీ పధకం వలన గ్రామీణ ప్రాంతంలో పెరిగిన కూలి రేట్లు సామాన్య రైతు నడ్డివిరిచాయి. ఈ పధకం అమలు వెనుక వున్న కుట్ర ఇప్పుడు ఈ రకంగా బయటపడుతోంది. అపరిమితంగా పెరిగిపోయిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ధరలను అదుపుచేయలేని ప్రభుత్వం (బడా విదేశి కంపెనీలకు బాసటగా వుంటూ) నేడు వుత్పత్తి తగ్గిందన్న సాకుతో రైతాంగాన్ని తమ రంగం నుండి దూరం చేసి వారి వద్దనున్న ఆస్తిని లాక్కుని బడా కంపెనీలకు ఇప్పటికే కొన్ని లక్షల ఎకరాల భూమిని ప్రాజెక్టుల పేరుతొ సెజ్ ల పేరుతొ కట్టబెట్టి౦దికాక ఈ రూపంలో కూడా వారినుండి వున్న ఆ కొద్ది మొత్తం భూమిని కూడా లాక్కునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. భారత రైతాంగం యొక్క మనఃస్థితిని సరిగా గుర్తించని పాలక వర్గం చేస్తున్న రాక్షస కృత్యం ఇది. ఎందుకంటే భూమిని తన సొంత ఆస్తిలా భావించే రైతు దాని నుండి వేరు చేయబడితే దాని పర్యవసానం ఎంత తీవ్రంగావుంటుందో? ఇప్పటికే నలుగురికీ కూడుపెట్టే రైతన్న అప్పుల వూబిలో కూరుకుపోయి ఆత్మహత్యల పాలయ్యాడు. చెంచాడు ఇచ్చి గంగాళం దొ౦గిలి౦చుకుపోయే పాలక వర్గం ఎన్నికల ముందు బ్యాంకు అప్పులు మాఫీ పధకంతో అధికారంలోకి వచ్చి వారి కాలికింద నేలనే హరించే హిరణ్యాక్షుడి రూపాన్ని నిస్సిగ్గుగా బయట పెట్టుకుంటోంది. నేడు రైతాంగం ఎదుర్కొంటున్న మరో సమస్య తమ వైపు మాటాడె వారు లేకపోవడం. వున్న రాజకీయ పక్షాలన్ని గతంలో ప్రపంచ బ్యాంకు పాలెగాల్ల దగ్గర వూడిగం చేసినవే. గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తగా ముసుగేసుకున్న స్వామినాధన్ తన సామ్రాజ్య వాద ముసుగును ఇలా తొలగించాడు. తెగించి రోడ్డెక్కలేని రైతాంగానికి అత్మహత్యలే శరణ్యం. ఖచ్చితంగా మరో స్వతంత్ర పోరాటం భూమి, భుక్తి కొరకు సాగించాల్సిన అవసరం ప్రజలందరికీ వుంది. లేకపోతే మన వునికిని కోల్పేయే ప్రమాదం మరెంతో దూరంలో లేదు. హిరణ్యాక్షుల వధ మరల జరగక పోతే భూమాతను చాపలా చుట్టిన వైనం నేడు మరలా మన తరంలోనే చూసే దుస్థితి పునరావృతమవుతోంది.

1 కామెంట్‌:

  1. మీ బ్లాగ్ గురించి మీరు పంపిన మెయిల్స్ చూసాను. స్త్రీవాద వివాదాలు గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల కొన్ని రోజులు మీ బ్లాగ్ చూడలేకపోయాను.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..