4, ఫిబ్రవరి 2010, గురువారం
ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ
తాను స్పాన్సర్ చేస్తున్న 20-20 టీం వలన ఇప్పటికే కోట్లాది రూపాయలు నష్టపోయిన కారణంగా, మొన్న జరిగిన క్రీడాకారుల వేలంపాటలో పాకిస్తానీ క్రీడాకారులను ఎవరూ కొనుక్కోకపోవడం గురించి మాట్లాడుతూ వారిని కూడా భాగస్వాములను చేసి వుంటే బాగుండేదన్న కారణంగా ఒక కళాకారుడిగా ఎక్కడా తన దేశభక్తిని శంకించేలా ప్రవర్తించని షారూఖ్ ఖాన్ పట్ల శివసేన తీవ్రంగా విరుచుకుపడడం చూస్తుంటే ముంబయి థాకరే దాదాల స్వభాషా, ప్రాంతీయ,మత దురభిమానం తారాస్థాయికి చేరుకొని అదొక పిచ్చివాళ్ళ రాజ్యంగా మారిందా అనిపిస్తోంది.
షారూఖ్ తండ్రివైపు తాత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవాడే. తల్లిగారి తండ్రి నేతాజీ నేతృత్వంలో అజాద్ హింద్ ఫౌజ్ లో జనరల్ గా పనిచేసిన వారు. భారత్-పాక్ విభజనకాలంలో భారత్ వలస వచ్చిన కుటుంబం యొక్క దేశభక్తిని శంకించే మూర్ఖశిఖాణులను ఏమనాలో తెలియడంలేదు. తన స్వదేశ్, చక్ దే ఇండియాల వంటి సినిమాల ద్వారా దేశభక్తిని చాటిన షారూఖ్ ఎందరో క్రీడాకారుల్లో స్ఫూర్తిని రగిలించాడు.
మొన్నటికి మొన్న మన క్రికెట్ వీరుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ నేను ముందు భారతీయుడిని, తరువాత మరాఠీనన్నందుకు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ప్రఖ్యాత చిత్రకారుడు M.F.హుస్సేన్ వేసిన బొమ్మలపై నిషేధం విధించి తనకు తాను దేశం వదిలివెళ్ళేట్లు చేసారు. తన చిత్రాలలో హిందూ దేవతలను నగ్నంగా చిత్రీకరించారని ఆరోపణ. మరి మన దేవాలయాలపై బూతుబొమ్మలు ఎవరివి?
ఇలా కళాకారులపై, వారి స్వేచ్చపై ఆంక్షలను విధిస్తూ, ఫత్వాలను జారీచేస్తూ, ఇప్పటికి గత 15 ఏళ్ళూగా అధికారానికి ప్రజలు దూరంచేసినా, తమ ప్రైవేటు సైన్యాలతో దాడులు చేస్తూ, విపరీత ధోరణితో విఱవీగే ధాకరేలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి.
తాజాగా రాహుల్ గాంధీ ముంబయి పర్యటన కూడా భయం భయంగా హెలికాప్టర్ తో చేసే దుస్థితి కల్పించినట్లు వార్తలు చెప్తున్నాయి.
తమ స్వలాభం కోసం యిలా కుల, మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టే వారికి తగిన మానసిక చికిత్స అవసరం.
9, నవంబర్ 2009, సోమవారం
మార్క్సిస్టు పార్టీగా పిలవబడడానికి అర్హత వుందా?

రెండు రోజుల క్రితం ప్రకాశ్ కారత్ మార్క్సిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో ఒక నిజాన్ని మాటాడారు. చైనా మావో ఆలోచనా విధానాన్ని వదిలేసి చాలా రోజులయిందని, దానిని అనుసరిస్తున్న మావోయిస్టు పార్టీ సిధ్ధాంతం అవుట్ డేటెడ్ అని. ఈ మాటలు ఇంతకు ముందు విన్నట్టుంది కదూ? అదేనండి తనకు తాను ప్రపంచ బాంకు సి.ఇ.ఓగా ప్రకటించుకున్న చంద్రబాబునాయుడూ అదే అన్నాడు. ఈనాడు మరల తమ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారిన బెంగాల్ లో తమకు కొరుకుడుపడకుండా వున్న బలీయమైన ప్రజా మద్దతుతో ముందుకు వస్తున్న మావోయిస్టులను చూసి ఓర్వలేక ఈ నిజాన్ని మాటాడాడు. చైనా కేపిటలిస్టు పంథాలో, డెంగ్ ఆలోచనా విధానంలో పూర్తిగా కూరుకుపోయిన వైనాన్ని ఒప్పుకున్నాడు. తామూ అదే విధానంలో కొనసాగుతూ బెంగాల్ లో ప్రజలకు దూరమై పెట్టుబడిదారీ వర్గాన్ని భుజాన మోయడానికి రెడీ అయి ఇంకా మార్క్సిస్టు పార్టీ పేరుతో చెలామణీ కావడం ఎంతవరకు సమంజసం? ఇందిరమ్మ కొంగు పట్టుకు వేలాడి కొన్నాళ్ళు, సోనియా చెంగు పట్టుకు తిరిగి కొన్నాళ్ళు ప్రజలను పార్లమెంటరీ మురికి కూపంలో ముంచడానికి తమ వంతు సహకారాన్నిస్తూ ఎర్ర ఝెందా నీడలో మోసపు బతుకు బతికే వీళ్ళు ఏమాత్రం క్షమార్హులు కారు. పాలు తాగే తల్లి రొమ్మునే గుద్దే నీచులుగా అధికారంకోసం దేనికైనావెనుకాడని వీళ్ళని ప్రజలు ఇంకెంతో కాలం అంగీకరించరు. వీళ్ళ ఝెండా, ఎజెండా అధికార భాగస్వామ్యం తప్ప వేరుకాదు. కా.లెనిం తీవ్రంగా హెచ్చరించిన ట్రేడ్ యూనియం పోరాటాల ఊబిలో జనాన్ని కూరి పబ్బం గడుపుకోజూస్తున్నారు.
ఈ రెండు పార్టీలకు నాదొకటే విజ్ఞప్తి: మీ ఝెండాల రంగు, గుర్తులు, పార్టీల పేరులు మార్చుకొని మీ నిజస్వరూపాన్ని ప్రజలముందుంచండి. వాటిని వాడుకునే హక్కు ఇంకెంతమాత్రమూ మీకు లేదు.
21, అక్టోబర్ 2009, బుధవారం
ఆపరేషన్ గ్రీన్ హంట్ వెనక చిదంబర రహస్యం
అయితే వీరి కార్యక్రమం వలన వేలాది గిరిజన ప్రజానీకం నిర్వాసితులవుతున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో అనేక మంది వూచకోతకు గురయ్యారు. దీనిని ఆపేందుకు సిటిజన్స్ ఇనిశియీతివ్ ఫర్ పీస్ పేరిట నిన్నను ఢిల్లీలోజరిగిన ఒక సమావేశంలో దీశావ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన మేధావులు, మాజీ న్యాయమూర్తులు, పౌరహక్కుల సంఘాల నేతలు దేశంలో అంతర్గత యుద్ధం తగదని ప్రభుత్వానికి హితవు చెప్పారు. దీనికి సమాధానంగా చిదంబరం మావోలు హింసను విడనాడితే మేము చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కాని ఆయన ప్రకటనను నమ్మేందుకు ఆయన గురించి తెలిసిన వాళ్ళెవరు నమ్మలెరని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ వ్యాఖ్యానించారు. ఇటివల ఒక విదేశీ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోచిదంబరం మాటలకు చేతలకు మధ్య వున్న వైరుధ్యాన్ని ఆమె వివరించారు. చిదంబరం హార్వర్డ్ లో శిక్షణ పొందిన న్యాయవాది. దేశ చరిత్రలో మొదటిసారి అతిపెద్ద కార్పోరేట్ కుంభకోణం జరిపిన ఎన్రాన్ సంస్థకు ఆయన న్యాయవాదిగా వ్యవహరించారు. సెక్యూరిటీకుంభకోణం లో పాలుపంచుకున్న ఫైయిర్ గ్రోత్ కంపెనీలో వాటాలు కొన్నందుకు పీవీ హయాంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఒరిస్సాలో మైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద మైనింగ్ కార్పోరేట్ సంస్థ వేదాంత గవర్నర్ల బోర్డ్ లో చిదంబరం వున్నారు. ఆర్దిక మంత్రి అయిన మొదటి రోజే ఈ బోర్డ్ కు రాజీనామా చేసారు. ఆయన ఎన్నో పెద్ద పెద్ద కంపెనీల తరపున న్యాయవాదిగా వ్యవహరించి ఆర్ధిక మంత్రి అయిన తర్వాత వాటినుండి వైదొలిగారు. అయితే చిదంబరం స్థానంలో ఆయన సతీమణి నలిని ఆ కేసులను వాదించడం యాదృచ్చిక మాత్రం కాదు.
ఈ దేశంలో ఎనభై ఐదు శాతం మంది ప్రజలు నగరాల్లో జీవిస్తే దేశం బాగుపడుతుందని ఆయన ఒకసారి ప్రకటించారు, అంటే దాదాపు డబ్భై కోట్ల మంది దాకా పల్లెలు ఖాళీ చేసి పట్టణాలలో పడాలన్నమాట. దీనిని సాధించేందుకు లక్షలాది మంది సైన్యాన్ని గ్రామాలకు తరలించి ఖాళీ చేయిస్తున్నారు. అత్యంత ఆధునిక ఆయుధాలతోను, ఉపగ్రహ సహకారంతోను మావోయిస్టులను అణచివేసేందుకు లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారు. నిజానికి ఇదే చైతన్యంతో మారుమూల గ్రామాలకు కనీస సౌకర్యాల కల్పనకు ఈ దేశంలో గత అరవై రెండు సం.లుగా ఏలిన ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు., ఆదివాసీ ప్రాంతాలపై ప్రభుత్వ దృష్టి మళ్లడం వెనుక ఆ ప్రాంతంలోని ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు విదేశీ కంపెనీలకు అవకాశంకల్పించేందుకు మాత్రమేనన్నది చిదంబర రహస్యమేమీ కాదు. విదేశి కంపెనీలు ఈ దేశంలో స్వేచ్చగా అడుగు పెట్టేందుకు చిదంబరం వంటి ఆర్ధిక మంత్రి కావలసి వచ్చాడు మన్మోహన్ సింగ్ కు. అలాగే ఇప్పుడు వారి కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అడ్డుపడుతున్న మావోయిస్టులను అణచివేసేందుకు హోం మంత్రి రూపంలో చిదంబరం అవసరమయ్యాడు. చర్చలు జరిపినా, అందుకు మావోయిస్టులు అంగీకరించినా చిదంబరం ఆదివాసీలను తమ ప్రాంతంలో తామూ నివసించేందుకు అనుమతిస్తారా? అంతర్గత యుద్ధం చేయడానికి ఇంతగా ముందుకు వచ్చిన తరువాత చర్చలు అన్నవి ఒక ముసుగు మాత్రమె. తెల్లపంచే, దోవతిలతో, చెరగని చిరునవ్వుతో అడ్డు నామంతో దర్సనమిచ్చే ఈ గోముఖ వ్యాఘ్రం వెనక వున్న శక్తి సామ్రాజ్య వాదమని వారి పెట్టుబడితో, ఆయుధ, సాంకేతిక సహకారాలతో విరుచుకు పడుతున్నది కార్పోరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థని అర్థం కాని ముర్ఖులేవరున్నారు.
ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట దళారి బూర్జువాలు, అమెరికన్ సామ్రాజ్యవాదులు ఈ దేశ వనరులను కొల్లగొట్టేందుకు వీలుగా వత్తిళ్ళు చేయడమే వీరి ఉద్దేశ్యం. టాటాలు, మిట్టల్స్, రుయాలు, జిందాల్స్, బిర్లాలు, వేదాంత, పోస్కో కంపెనీలు యుపియే నేతలకు ఎన్నికల నిధులు సమకూర్చాయి. వారి దోపిడీని అడ్డుకునే ప్రథాన శత్రువు దేశంలో మావోయిస్టు పార్టీ మాత్రమే. అందుకే వారి అడ్డును పూర్తిగా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టే పేరుతొ ఆదివాసీ ప్రాంతాలను అప్రకటిత యుద్ధానికి సిద్ధమయింది. ఈ వినాశకర యుద్ధాన్ని ఆపేందుకు మేధావులు, ప్రజాస్వామిక వాదులు కృషి చేయాలి. నిజానికిది నక్సలిజం పై యుద్ధం పేరుతొ సహజ సంపదను బడా కంపెనీలకు ధారాదత్తం చేసే కుట్రగానే గుర్తించాలి.
2, అక్టోబర్ 2009, శుక్రవారం
గాంధీ - దాగిన మరో కోణం

మోహం దాస్ కరం చంద్ గాంధీ, జాతిపితగా, మహాత్మాగా మనకందరికీ తెలిసిన కోణం. కానీ అందరికీ సుపరిచితమైన ఆ ఆహార్యం వెనుక దాగిన నగ్న సత్యాలు అనేకం.
నిజానికి గాంధీ ఏనాడూ ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని తీసుకు వచ్చే ప్రయత్నం చేయలేదు, ప్రజల ఆగ్రహం పతాక స్థాయికి చేరి బ్రిటిష్ పాలకులు ఇరకాటంలో పడ్డ నాడు ఆ పోరాట రూపాన్ని వదులుకునేందుకు కూడా వెనకాడలేదు. ఇందుకు చౌరీ చౌరా సంఘటన జరిగినంతనే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపేసారు. అలాగే బొంబయి రేవు కార్మికులు సమ్మెకు మధ్ధతుగా మన సైనిక దళాలు కూడా సమ్మె చేసేందుకు వెనుకాడని పరిస్థితి వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుండి భద్రంగా తప్పుకునేందుకు అర్ధరాత్రి స్వాతంత్ర్య ప్రకటన చేయించాడు. ఇలా ఈ దేశం అర్ధ వలస, అర్థ భూస్వామ్య వ్యవస్థగా మారడానికి సహకరించి సామ్రాజ్యవాదుల ఏజెంటుగా నమ్మిన బంటు పాత్రను అత్యంత నమ్మకంగా పోషించాడు.
అసలు కాంగ్ర్రెసు పార్టీ ఆవిర్భావమే బ్రిటిష్ పాలకులకు అణుగుణంగా జరిగింది. కాంగ్రెసు పార్టీ వ్యవస్థాపకుడు ఎలెం ఓక్టాలియా హ్యూం ఒక బ్రిటిష్ ఉన్నతాధికారి. పార్టీ ఆవిర్భావ పరిస్థితి నాటి (1885) భయంకర కరువు పరిస్థితులు లోలోపల రగులుకొంటూ పైన నివురుగప్పిన నిప్పులావున్న భారతీయుల అసంతృప్తి, ద్వేషమూగ్రహించిన హ్యూం అప్పటి వైస్రాయి డఫరిం దగ్గరకెళ్ళి పరిస్థితిని వివరించాడు. ఆ సూచన ఇలా వుంది:
“ భారత దేశంలో బద్దలవటానికి సిద్ధంగావున్న సాయుధ విప్లవాన్ని అడ్డగించడానికి ఒకే ఒక మార్గం వుంది. ప్రజలముందు చట్టబద్దమైన ఉద్యమాన్ని ఉంచుదాం. ఆఉద్యమంలో ప్రజలు పాల్గొని చట్టబద్దంగా తమ అసంతృప్తిని ప్రకటిస్తారు. దాన్ని బట్టి ప్రజలనాడి ప్రభుత్వానికి అర్థమవుతూ వుంటుంది. ఇలాంటి ఉద్యమాన్ని ప్రారంచించడం వల్ల బ్రిటీషు ప్రభుత్వానికి సహకరించే ఉన్నతవర్గాల భారతీయులు నాయకత్వ స్థానాన్ని అలంకరించి ప్రజల్ని విప్లవ మార్గం నుంచి తప్పించి చట్టబద్ధమైన ఉద్యమంవైపు లాగుతారు. అప్పుడు ఆ ఉద్యమం పైన బ్రిటీషు ప్రభుత్వం గట్టిపట్టును కలిగివుంటుంది.’ (యశ్ పాల్ రాసిన రామరాజ్యం – పేజీ 69).
దోపిడీవర్గాలకి దురాలోచనే కాక ఎంతటి దూరాలోచనా! జాతీయోద్యమాన్ని కాంగ్రెసు పార్టీ, గాంధీ ఇలానే నడిపించారు.
అయినప్పటికీ 1905 లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం ఉవ్వెత్తునసాగటం, మధ్యతరగతి యువకులు బ్రిటీషు ముష్కరుల పైన దాడులు చేయటం జరిగింది. పత్రికలలో వ్యాసాలు రాసినదానికే బాల గంగాధర తిలక్ కు 6 సం.ల కఠిన కారాగార శిక్ష విధించిన బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా బొంబాయి కార్మికులు హర్తాళ్ళ్, బంద్ లు నిర్వహించి రాజకీయాల్లోకార్మికులు క్రియాశీలక పాత్ర నిర్వహించే కాలం వచ్చిందనే హెచ్చరిక చేసారు. ఈ అసంతృప్తిని పక్కదారి పట్టించగల సమర్ధవంతమైన నాయకత్వం, బ్రిటీషు పాలకులకి దేశీయ భూస్వామ్య దళారీ బూర్జువాలకీ అవసరమయింది.
దక్షిణాఫ్రికాలో బ్రిటీషు పాలకులకి వ్యతిరేకంగాపోరాడిన ‘ జూలూ ‘ జాతి రైతుకూలీల పోరాటంలోనూ, బోయర్ యుధ్ధకాలంలోనూ, మొదటి ప్రపంచ యుద్ధం లోనూ బ్రిటీషువారికి తోడ్పడంలో ప్రాణాపాయ స్థితిని తెచ్చుకోడానికి కూడా వెనుకాడనిప్రభుభక్తిని గాంధీ ప్రదర్శించాడు.(భారదేశంలోని ఇంగ్లీషు వారందరికీ – గాంధీ బహిరంగ లేఖ అధారం). తమకు కావలసిన వాడు ఇతడే అని గుర్తించారు.
ఉదా: బీహార్ లోని చంపారం లో నీలిమందు రైతుల పోరాటాన్ని సంస్కరణవాద ఊబిలోకి లాగటం, రౌలత్ చట్టానికి, జలియన్వాలా బాగ్ దురంతాలకు వ్యతిరేకంగా సాగిన ప్రజల ఆందోళన హద్దులు దాటుతోందని నిలిపివేయటం జరిగింది.
సామ్రాజ్యవాదుల ఎడల భారత ప్రజల అసంత్రుప్తి తీవ్రత ఎంతలా వుందంటే ఏ కొద్దొ రాయితీలు పొందే ఉద్యమానికి పిలుపునిచ్చినా లక్షలాదిగా తరలి వచ్చే వారు. ప్రజా పోరాట జ్వాలను చల్లార్చటానికి ఆఉద్యమాన్ని అడ్డుకట్ట వేయడానికి గాంధీ ‘ శాంతి ‘ మంత్రం జపించి వారి పునాదులను కాపాడే వాడు. అందుకే వారికి మహాత్ముడయ్యాడు.
1931 లో గాంధీ స్వభావాన్నిగూర్చి స్టాలిన్ చెప్పిన మాటలు “ భారతదేశం, ఇండోచైనా, ఇండోనేషియా, ఆఫ్రికాఖండంలోని దేశాల్లోని విప్లవ పోరాటాలని కసాయి బూర్జువా పరిపాలకులు రక్తపుటేరుల్లోముంచారు. కౄరమైన హింసావిధానం ద్వారా అక్కడి ఉద్యమాల్ని అణచడానికి ప్రయత్నించారు. వాళ్ళ ప్రయత్నాలు రెండు రకాలుగా జరిగాయి. ఒకటి – తుపాకీ ద్వారా విప్లవోద్యమాన్ని అణచడము , రెండవది – గాంధీ లాంటి వ్యక్తి ద్వారా విప్లవోద్యమాన్ని పక్కదారి పట్టించడమూ!”
అలాగే వైస్రాయి ఇర్విన్ రైలు పేలిపోయే విధంగా విప్లవకారులు బాంబులు పెడితే అవి పేలినా వైస్రాయి క్షేమంగా బయటపడ్డందుకు చాలా సంతోషించాడు. ఈచర్యను ఖండిస్తూ కాగ్రెసు సభలలో తక్కువ మెజారిటీతో తీర్మానాలు చేయించుకుని ప్రభుభక్తిని చాటుకున్నడు.. విప్లవ కారులను నిందిస్తూ ‘ కల్ట్ ఆఫ్ ది బాంబ్ “ అనేవ్యాసం రాసాడు. దీనికి జావాబుగా వారు ‘ ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ “ రాసి అందులో గాంధీ స్వభావాన్ని ఇలా పేర్కొన్నారు:
“ కాంగ్రెసు ప్రజలలోస్వాతంత్ర్య ఇచ్చను కలిగించిందని మేమూ ఒప్పుకుంటాం. అయితే అంతటితో కాంగ్రెసు బాధ్యత తీరిపోలేదు. దేశానికి కాంగ్రెసు చేయవలసినది ఎంతో వుంది. కానీ ఆసంస్థ మీద దళారీరాజకీయాలను అభిమానించే నాయకుల ప్రాబల్యం ఎక్కువైంది. కాంగ్రెసు చెప్పే అహింస విదేశీ పాలకులతో రాజీ బేరాలకు దిగడానికి ఒక సాకుగా తయారయ్యింది.”
గాంధీ-నెహ్రూల నాయకత్వం భగత్ సింగు తదితరుల ఉరిశిక్ష రద్దుకు సీరియస్ గా ప్రయత్నించనిది దళారీ రాజకీయాల కారణంగానే. కరాచీలో నెహ్రూ అధ్యక్షతన జరగనున్న కాంగ్రెసు సమావే్సానికి (మార్చి 25 1931 న) ఏ అడ్డంకీ రాకుండా వుండేందుకు భగత్ సింగు, రాజగురు, సుఖదేవ్ ల ఉరిని 23 రాత్రి 7.30 ని.లకి ( చట్టానికి వ్యతిరేకంగా రాత్రి ఉరితీయరాదు) అమలుచేయించాడు.
ఈదేశప్రజలలో మత మౌఢ్యాన్ని పెంచడానికి తాను అనుసరించిన సనాతన ధర్మం, మత మార్పిడుల పట్ల వ్యతిరేకత తోడ్పడ్డాయి.
హి వాజ్ ఏక్టెడ్ ఏజ్ ఏన్ ఇన్విజిబిల్ ప్రొటెక్టర్ టు ది బ్రిటిష్ రాజ్ ఎండ్ ఇండియన్ బూర్జువాజీ.
(ఈ వ్యాసం రాయడానికి ‘ నా నెత్తురు వృధాకాదు ‘ పుస్తకంలోని వ్యాసాలను ఆధారం చేసుకున్నాను.)
4, సెప్టెంబర్ 2009, శుక్రవారం
మరో మారు షాజహన్ మరణించాడు

అ. తండ్రి మరణిస్తే తనకు కొన్ని తరాలకు సరిపోయే సిరి సంపదలు ఇచ్చిన వాడి ఆచూకీ
కోసం వేలాదిగా తరలి వస్తే తాను ఎందుకు రాలేదు?
ఆ. మీడియా ముందుకు నిన్నటి మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులెవరూ కనబడరేం?
ఇ. శవపేటిక వద్ద స్టైలిష్ గా నిలబడి నవ్వుతూ అందరికీ చేతులుకలుపుతూ కొద్దిసేపు ఫోజులిచ్చి వెళ్ళిపోవడం తన ధీరోదాత్తతను వ్యక్తం చేయడమా?
ఉ. పిచ్చి జనం గుండె ఆగి, ఉరివేసుకొని, గొంతుకోసుకుని మరణించారు. మరి తన ఉప్పుతిన్న వాడెవడూ పోలేదే?
ఊ. అంతర్ధానమైన మరుక్షణమే ఢిల్లీలో తన అనుచరులను పంపి మంతనాలు సాగించిన వారసుడి నైజం
బయటపడలేదా?
ఋ. పార్ధీవ దేహం ఇంకా ఇంటికి రాకముందే అరువుకుక్కల మీడియా వాళ్ళ స్క్రోలింగులలో తమకు తాను తప్ప దిక్కులేదని తన అనుచర గణంతో ప్రకటనలు ఇప్పించుకోవడం చూస్తుంటె నా లాంటి అమాయక అనుమానపు జనం గుడ్లప్పగిస్తూ చూడడం తప్ప ఏమీ చేయలేని మాటాడలేని నిస్సహాయతను తిట్టుకుంటూ....
ౠ. సాయంత్రమయ్యేసరికి నూరుకుపైగా సంతకాలు రెడీ, దొంగఏడుపుగాళ్ళు ఒకపక్క ఓ మాకలల నేత పోయాడని అంటూనే, చివర్లో యువనేత తప్ప మరో దారిలేదని నిర్లజ్జగా ప్రకటనలివ్వడం జనం వెర్రిపప్పలనేగా?
ఎ. వారసత్వ రాజకీయాలను, అధికారాన్ని ఆమోదించడమేనా మన ప్రజాస్వామ్యం?
పైవన్నీ ఒక నిస్సహాయ తెలుగు వాడిగా నా అనుమానాలు మాత్రమేనయ్యా...
మనసెందుకో ఈ ఔరంగజేబును అంగీకరించలేకపోతోంది....
6, ఆగస్టు 2009, గురువారం
నాటో - మానవ హనన రాకాసి
