20, ఆగస్టు 2009, గురువారం

శోకపల్లి కంట నీరు తుడిచేదెవ్వరు


విశాఖ ఏజెన్సీలో గల జి.మాడుగుల మండలం సుర్మతి పంచాయతీ పరిధిలోని వాకపల్లి గిరిజన మహిళలు పదకొండు మందిపై ఇదే రోజు రెండువేల ఏడవ సం.లో గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారని వారు బహిరంగంగా తమ గోడు వెళ్ళబోసుకున్నా నాటి నేటి ముఖ్యమంత్రి కనీసం వారి పట్ల సానుభూతి చూపలేదు సరికదా వారిని తిరిగి పోలీసు చర్యలను అడ్డుకున్నారని అన్యాయంగా కేసులలో ఇరికించి కోర్టుల చుట్టు తిప్పుతున్నారు. ఇది గుడ్డి ప్రభుత్వం, మేము సిగ్గు విడిచి చెప్పుకున్నా మాకు న్యాయం జరగలేదని నేటికి బాధిత మహిళలు వాపోతున్నారు. ఇక బయట తిరగలేక గ్రామానికే పరిమితం కావాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆనాడు వారు అలా చెప్పుకున్నందుకు కులపెద్దలు వేసిన తప్పు ఐ.టి.డి.ఏ.ద్వారా కొంత నగదును ప్రభుత్వం చెల్లించింది. ఇది నేరాంగీకారం కాదా? గిరిజన మహిళలయినందున వారి పట్ల ఎవరికీ సానుభూతి తప్ప జరిగిన అన్యాయానికి తగిన శిక్ష పోలీసులకు పడేట్లు చేయడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి. వారి ఓటు శాతం తక్కువయినందున వారి పట్ల తగిన పరిష్కారంనకు కృషి జరుగలేదు. ఎన్నికల వాగ్ధానాలు తప్ప అమలుకు కృషి జరగలేదు. వాకపల్లి గిరిజన మహిళల శోకాన్ని ఆపేదెవరు? వారి కంట నీరు ఆగేదెన్నడు.

15, ఆగస్టు 2009, శనివారం

స్వాతంత్ర్యం వచ్చెననీ..


స్వాతంత్ర్యం వచ్చెననీ సభలేచేసి
సంబరపడగానే సరిపడదోయీ...
అన్న ఘంటసాల గానామృతం నేటికీ చెవుల్లో మారుమ్రోగుతూ తట్టిలేపుతోంది. నిజానికి మనకు వచ్చింది స్వాతంత్ర్యమేనా? అధికార మార్పిడి జరిగి తెల్లదొరలు తెరచాటుకు పోయి నల్లదొరల సామంత రాజ్యం ఏర్పడింది. నేటికీ కొనసాగుతున్న కుల మత వివక్షలు, దిన దిన ప్రవర్ధమానమవుతున్న ధనిక పేద అంతరం, సామాజిక సంక్షోభానికి మన పాలక వర్గాల స్వార్ధ పూరిత వ్యాపార రాజకీయాలు, సామాన్య జనాన్ని రోజు రోజుకు మరింత అట్టడుగు స్థాయికి నెట్టివేస్తున్న వైనం కళ్ళముందు కదలాడుతున్నాయి. భద్రమయ జీవితానికి అలవాటు పడిన మధ్యతరగతి ప్రజానీకానికి నిదుర లేకుండా చేస్తున్న ఆర్ధిక మాంద్యం, జీతాల జీవితాన్నుండి బయటకు నెట్టివేస్తున్న క్రమంలో రోడ్డునపడక తప్పడంలేదు. ఇన్నాళ్ళు మన కడుపులో చల్ల కదలకుండా వుందికదా అని సామాజిక బాధ్యత లేకుండా గడిపిన వారు నేడు తప్పక ప్రశ్నించాల్సిన స్థితి. రోజూ జరుగుతున్న రైతన్నల ఆత్మహత్యలు మన ఆహార సంక్షోభాన్నే కాదు మన జీవన దారిద్ర్యానికి కూడా గుర్తు. ఇవన్నీ పట్టని మన యువతరం పభ్ ల వెనక, మగధీర విజయానందంలో కొట్టుకు పోతుంటే మన పాలక రాజావారు తమ గనుల-మణుల వ్యాపారాలు సజావుగా చేసుకుపోతూ ఎక్కడ చిన్న ధిక్కార స్వరం వినిపించినా ఎన్ కౌ౦టర్లు చేయిస్తూ అధికారాన్ని చిరునవ్వులు చి౦దిస్తూ ఎ౦జాయి చేస్తున్నారు. మరి మనం.....?

9, ఆగస్టు 2009, ఆదివారం

వరవరరావు గారి బ్లాగు - లింక్


వరవరరావుగారి గురించి తెలుగు వాళ్ళకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. ఎందుకంటె తెలుగు నాట విప్లవ సాహిత్యాన్ని జవ జీవాలతో బతికించేందుకు విద్యార్ధి దశ నుండి ఆయన చేస్తున్న కృషి అందరికీ ఎరుకే. పీపుల్స్ వార్ - ప్రభుత్వాల మద్య శాంతి చర్చలకు పార్టీ ప్రతినిధిగా శాంతి దూతగా కూడా వ్యవహరించి రచయితగా తన సామాజిక బాధ్యతను నిర్భయంగా ఆచరించిన వ్యక్తి. జీవితకాలంలో ఎన్ని నిర్భంధాలు ఎదురైనా మొక్కవోని దీక్షతో తన సామాజిక కర్తవ్యాన్ని అచరిస్తున్న విప్లవ కవి, దార్శనికుడు. ఆయన ఇటీవలి రచనలు తెలుగులో, కొన్ని ఇంగ్లీషులో కూడా ఆయన వ్యక్తిగత వివరాలతో ఈ బ్లాగులో వున్నాయి. ఆశక్తి గల వారు చూడగలరు. లింక్ Varavara Rao - Revolutionary Writer & Poet - Homepage

6, ఆగస్టు 2009, గురువారం

నాటో - మానవ హనన రాకాసి


ఆఫ్ఘనిస్తాన్ లో నేడు పర్యటిస్తున్న నాటో అధిపతి రామ్సుస్సేన్ దేశంలో సామాన్య జనం హతులవకుమ్డా చూస్తామని హామీ ఇచ్చాడు. అసలు వాళ్ల దేశంలో అడుగు పెట్టి వాళ్ల ప్రాణాలకు వీడు హామీ ఇవ్వడం ఏమిటి? భూమండలంలోనే స్వతంత్ర దేశం లేకుండా చేస్తున్న అమెరికా వాడికి వత్తాసుగా ఏర్పడిన దుష్ట కూటమి ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఇటివలి రాకెట్ దాడులలో ఇద్దరు చిన్న పిల్లలు, ఒక పెద్దాయన్ చనిపోయారని వారి పార్ధివ శరీరాలను బహిరంగంగా చూపించినా అలాంటిదేమీ లేదని బుకాయి౦చుతున్నారు వీళ్ళు. ముస్లిం సమాజాన్ని ఉగ్రవాదులుగా ముద్ర వేసి వారిని సమూలంగా నాశనం చేసి వారి ప్రాకృతిక హక్కైన చమురు సంపదను దోచుకునే కుట్రలో భాగంగా జరుగుతున్నా మానవ హననమిది. వాడి మోచేతి నీళ్ళకి ఆశపడి మాత్రు దేశాన్ని తాకట్టు పెట్టె పాలక వర్గాల వత్తాసుతో వాడి దౌష్ట్యాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాడు. ఇరాక్ యుద్ధం నాటినుండి పాలస్తీనా దురాక్రమణ వరకు లక్షలాది మంది అభాసుభం తెలియని పసివాల్లతో సహా హతమైన క్రూర దాడులకు గుణపాఠ౦గానే సెప్టెంబర్ దాడులు జరిగాయి. దాంతో సాకుతో మరింతగా రెచ్చిపోయి దాడులు చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని నామ రుపాల్లెకుండా బాంబింగ్ చేస్తున్నాడు. వాడి తొత్తు కర్జాయిని అధ్యక్ష స్థానంలో కూచోబెట్టి ప్రజలను ప్రేక్షకులను చేసాడు. ప్రజాస్వామ్య వాదులు అమెరికన్ దౌష్ట్యాన్ని ఖమ్దిచాల్సిన అవసరముంది. ఆఫ్ఘన్ ప్రజల పోరాటాలకు మద్దతు తెలియచేయాలని కోరుతున్నాను.