9, నవంబర్ 2009, సోమవారం

మార్క్సిస్టు పార్టీగా పిలవబడడానికి అర్హత వుందా?


రెండు రోజుల క్రితం ప్రకాశ్ కారత్ మార్క్సిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి హోదాలో ఒక నిజాన్ని మాటాడారు. చైనా మావో ఆలోచనా విధానాన్ని వదిలేసి చాలా రోజులయిందని, దానిని అనుసరిస్తున్న మావోయిస్టు పార్టీ సిధ్ధాంతం అవుట్ డేటెడ్ అని. ఈ మాటలు ఇంతకు ముందు విన్నట్టుంది కదూ? అదేనండి తనకు తాను ప్రపంచ బాంకు సి.ఇ.ఓగా ప్రకటించుకున్న చంద్రబాబునాయుడూ అదే అన్నాడు. ఈనాడు మరల తమ ఉనికికే ప్రశ్నార్ధకంగా మారిన బెంగాల్ లో తమకు కొరుకుడుపడకుండా వున్న బలీయమైన ప్రజా మద్దతుతో ముందుకు వస్తున్న మావోయిస్టులను చూసి ఓర్వలేక ఈ నిజాన్ని మాటాడాడు. చైనా కేపిటలిస్టు పంథాలో, డెంగ్ ఆలోచనా విధానంలో పూర్తిగా కూరుకుపోయిన వైనాన్ని ఒప్పుకున్నాడు. తామూ అదే విధానంలో కొనసాగుతూ బెంగాల్ లో ప్రజలకు దూరమై పెట్టుబడిదారీ వర్గాన్ని భుజాన మోయడానికి రెడీ అయి ఇంకా మార్క్సిస్టు పార్టీ పేరుతో చెలామణీ కావడం ఎంతవరకు సమంజసం? ఇందిరమ్మ కొంగు పట్టుకు వేలాడి కొన్నాళ్ళు, సోనియా చెంగు పట్టుకు తిరిగి కొన్నాళ్ళు ప్రజలను పార్లమెంటరీ మురికి కూపంలో ముంచడానికి తమ వంతు సహకారాన్నిస్తూ ఎర్ర ఝెందా నీడలో మోసపు బతుకు బతికే వీళ్ళు ఏమాత్రం క్షమార్హులు కారు. పాలు తాగే తల్లి రొమ్మునే గుద్దే నీచులుగా అధికారంకోసం దేనికైనావెనుకాడని వీళ్ళని ప్రజలు ఇంకెంతో కాలం అంగీకరించరు. వీళ్ళ ఝెండా, ఎజెండా అధికార భాగస్వామ్యం తప్ప వేరుకాదు. కా.లెనిం తీవ్రంగా హెచ్చరించిన ట్రేడ్ యూనియం పోరాటాల ఊబిలో జనాన్ని కూరి పబ్బం గడుపుకోజూస్తున్నారు.

ఈ రెండు పార్టీలకు నాదొకటే విజ్ఞప్తి: మీ ఝెండాల రంగు, గుర్తులు, పార్టీల పేరులు మార్చుకొని మీ నిజస్వరూపాన్ని ప్రజలముందుంచండి. వాటిని వాడుకునే హక్కు ఇంకెంతమాత్రమూ మీకు లేదు.

13 కామెంట్‌లు:

  1. అసలు మీ ఉద్దేశంలో "మార్కిజం" అంటే ఏమిటో చెప్పండి..తరువాత ప్రకాశ్ కారత్ పార్టీ మార్క్సిస్టాకాదా ఆలోచిద్దాం!

    రిప్లయితొలగించండి
  2. అవునవును, కారత్ సాయుధ పోరాటమైనా చెయ్యాలి లేదా కాంగ్రెస్‌లోనైనా చేరిపోవాలి ;)

    రిప్లయితొలగించండి
  3. గ్లోబలైజేషన్ అంటూ నయా ఉదారవాదులు అరిగిపోయిన రికార్డ్ పాడుతున్నారు కదా. పల్లెటూరివాడికి గ్లోబలైజేషన్ గురించి అడిగితే ఒక్క ముక్క కూడా చెప్పలేడు. మెజారిటీ ప్రజలకి గ్లోబలైజేషన్ వల్ల ఏమీ ఒరగదు అని ప్రకాష్ కారత్ లాంటి వాళ్ళకి తెలుసా? తెలియనట్టు నటిస్తున్నారా?

    రిప్లయితొలగించండి
  4. మహేష్ గారు మార్క్సిజాన్ని వ్యాఖ్యానించేటంత తెలివైనవాడిని కాకపోయినా నేడున్న సమాజంలోని సకల రుగ్మతలను సమూలంగా రూపుమాపే సాధనంగా దానిని కార్మికవర్గం అమలుజరిపే ఆయుధంగా అర్ధంచేసుకున్నాను. కా.లెనిన్ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం రహస్య పార్టీగానే పోరాడే క్రమంలో వుండాలని చెప్పారు. ప్రజలను విముక్తి పోరాటాలవైపు నడిపే దిశలో వీళ్ళ కార్యక్రమాలు 1950 ల తరువాత లేనేలేవు. ఎన్నికల మేళాలలో పాల్గొనడమే తప్ప వీరికి మరో పోరాట రూపం లేదు. మార్క్సిజానికి కొనసాగింపుగా వచ్చిన మావో ఆలోచనా విధానాన్ని స్వీకరించే దమ్ములేదు. బెంగాల్ లో పెల్లుబికిన నక్సల్బరీ రైతాంగ పోరాటాన్ని నెత్తురుటేరుల్లో ముంచిన చరిత్ర వీరిది. మరొకమారు అదే చేయబూనారు.

    రిప్లయితొలగించండి
  5. ప్రవీణ్ గ్లోబలైజేషన్ పట్ల వీరికి వ్యతిరేకత లేదు. ప్రస్తుత చైనా మార్గాన్ని అనుసరిస్తాం అని అంటున్న వీళ్ళకు దాని పట్ల వ్యతిరేకత ఎలా వుంటుంది. పల్లెపునాదులు కదిలిపోతున్న తరుణంలో దీని ఫలితాలు వారికికూడా అవగతమవుతున్నాయి. యువత కొంత మేర కలిగివున్నారు.

    సూర్యుడు సార్ కారత్ గారు తప్పక అదే పనిలో వుండివుంటారు. మరిన్ని కేంద్రబలగాలు డిమాండ్ చేసి మావోయిస్టులను అణచివేసే పేరుతో తమ సిపిఎమ్ సాయుధ ముఠాలను తయారుచేసుకొని ఎన్నికలలో రిగ్గింగ్ చేస్తు అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నాలలో బిజీగా వున్నారు.ఎరుపుదనం ఓట్ల గారడీకోసమే.

    రిప్లయితొలగించండి
  6. స్టాలిన్ వ్రాసిన "Dialectical and Historical Materialism" పుస్తకం చదివినా మార్క్సిజం కొద్దిగా అర్థమవుతుంది. దాని లింక్ ఇది: http://marx2mao.net/Stalin/DHM38.html

    రిప్లయితొలగించండి
  7. ఒకసారి మహేషే అన్నాడు "రాష్ట్రంలో హైదరాబాద్ లో తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదు" అని. ఈ విషయం తెలిసిన అతనికి గ్రామీణ ప్రాంతాలని డెవెలప్ చెయ్యడం పాలక వర్గం వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదో తెలియదా? మా జిల్లాలో పాలవలస రాజశేఖరం అనే రాజకీయ నాయకుడు ఉన్నాడు. అతనిది వీరఘట్టం మండలం కుమ్మరిగుంట గ్రామం. అతని తండ్రి కుమ్మరిగుంట గ్రామ సర్పంచ్ గా పని చేశాడు. రాజశేఖరం MLA అయిన తరువాత కుమ్మరిగుంట గ్రామాన్ని వదిలి పాలకొండ పట్టణంలో ఇల్లు కట్టుకున్నాడు. MLA అయిన తరువాత పల్లెటూరు వదిలి పట్టణంలో స్థిరపడిన వాడు రేపు మంత్రి అయిన తరువాత పట్టణాన్ని కూడా వదిలి హైదరాబాద్ లో స్థిరపడతాడు. పి.వి.నరసింహా రావు విషయానికి వద్దాం. అతను కరీంనగర్ జిల్లా వంగర గ్రామ కరణం (పట్వారీ) కొడుకు. అతను 'లా' చదివి వరంగల్ పట్టణంలో స్థిరపడ్డాడు. అతని కుటుంబం తరువాత హైదరాబాద్ లో స్థిరపడింది. వరంగల్, ఖమ్మం లాంటి పెద్ద పట్టణాలలో ఉండలేని వాళ్ళు ఇక అంత కంటే చిన్న పట్టణాల గురించి ఎలా ఆలోచిస్తారు? విశాఖపట్నంలో ఒకడు తాను టెక్కలి నుంచి వచ్చానని చెప్పుకున్నాడు. అతన్ని పల్లెటూరివాడిని చూసినట్టు చూశారు. టెక్కలి అంత పల్లెటూరేమీ కాదు. అది రెవెన్యూ డివిజన్ కేంద్రం. మన రాష్ట్రంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో ఒకటైన వెంకటాపురం (ఖమ్మం జిల్లా) నుంచి వచ్చిన వాళ్ళు కూడా విశాఖపట్నంలో ఉన్నారు. టెక్కలి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళకి పల్లెటూరివాళ్ళులాగ కనిపిస్తే వెంకటాపురం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళకి పందులలాగ కనిపిస్తారా? మన పాలక వర్గం వాళ్ళకి కూడా పల్లెటూరివాళ్ళ పై అలాంటి అభిప్రాయాలే ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  8. Dialectical materialism (గతితార్కిక భౌతికవాదం) మార్పు మాత్రమే శాశ్వతం అంటుంది...అది తప్పదు.

    రిప్లయితొలగించండి
  9. కమ్యూనిష్టులు అనే పేరు వాళ్ళకి వాళ్లే పెట్టుకున్నారు. నా అభిప్రాయంలో కాంగ్రేసులు దోచుకుతినేవాళ్ళు, బిజేపి వాళ్ళు మతవాదులు, ఇతరులు కులవాదులు ( తెలుగు దేశం, కమ్యూనిష్టుపార్టీలు, ప్రజారాజ్యం, లోక్ సత్తా ...)
    కుమార్ చెప్పినట్లు మార్క్సిజం శాస్త్రీయ సిద్ధాంతం.
    లెనిన్ మావోలు మార్క్సిజం ఆధారంగా స్వంత స్ట్రాటజీలతో ముందుకుపోయారు.
    మార్క్సిజం అంటే పోరాటం కాదు. మానసిక పరివర్తన, ఆలోచించే పద్ధతి. నవ్యమానవతావిధానం.
    కమ్యూనిష్టు అనడానికి బాలగోపాల్ ఒక ఉదాహరణ

    రిప్లయితొలగించండి
  10. అంతర్గత వైరుధ్యాల వల్ల అభివృద్ధి, బాహ్య వైరుధ్యాల వల్ల అభివృద్ధి, వైరుధ్యానికి వైరుధ్యం ఇలా చాలా విషయాలు తెలుస్తాయి గతితార్కిక భౌతికవాదం అర్థమైతే.

    రిప్లయితొలగించండి
  11. కుమార్ గారూ కొంచెం ఓపిక పట్టండి. ఇందిరా గాంధీ చివరి రక్తపు బొట్టు లెవల్లో రాఘవులు గారు, చిట్ట చివరి కార్యకర్త పార్టీ నుంచి వీడిపోయేవరకు తమ వంతుగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా అదే కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతోంది.

    రిప్లయితొలగించండి
  12. తాత్విక, ఆర్థిక, సాంఘిక-రాజకీయ అభిప్రాయాల శాస్త్రాధారిత విధానం మార్క్సిజం-లెనినిజం. ప్రపంచం గురించిన జ్నానోపార్జన ప్రపంచపు పరివర్తనల, సమాజమూ, ప్రకృతీ, మానవుల ఆలోచనా అభివృద్ధి నియమాల, దోపిడీదారి వ్యవస్థను విప్లవాత్మకంగా కూలదోసే పద్ధతుల, కమ్యూనిజం నిర్మాణ విధాన సిద్ధాంతం. కార్మికవర్గపు, దాని అగ్రగామి దళమైన కమ్యూనిస్టు, కార్మిక పార్టీల ప్రపంచ దృక్పధం. ఈ అవగాహననుండి మన ఎఱ చొక్కా పార్టీల వారు దూరమయ్యారు.

    గతితార్కిక భౌతికవాదం మార్పు మాత్రమే శాస్వతం అన్నది సత్యమే. ప్రతి క్షణం మార్పు జరుగుతూనే వుంటుంది. అది స్పిరల్ ఆకారంలో పైపైకి జరుగుతుందన్నది మార్క్సిస్టు అవగాహన. కాదంటారా?

    రిప్లయితొలగించండి
  13. గతితార్కిక భౌతికవాదం ఆధారంగా చరిత్రని కూడా అర్థం చేసుకోవాలి. చారిత్రక భౌతికవాదం ప్రకారం సమాజం ముందు ముందు ఉన్నత స్థితిలోకి మారుతుంది. కేవలం ఒక వర్గానికి ప్రయోజనం కలిగించే గ్లోబలైజేషన్ లాంటి వాటికి చారిత్రక భౌతికవాదంతో పొంతన కుదరదు.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..