7, జులై 2010, బుధవారం

జర్నలిస్టు పాండే సహచరి బబిత ఆవేదన..

ఈ రోజు ఆంధ్ర జ్యోతి నవ్య పేజీలో మావోయిస్టు అగ్రనేత కా.అజాద్ తో పాటు హత్య చేయబడ్డ జర్నలిస్టు హేమచంద్ర పాండే సహచరి బబిత ఆవేదనను గూర్చి రాసారు. చదవగలరుః

పోలీసు, మావోయిస్టుల వార్‌లో ఎప్పటిలాగే మూడోవాళ్లూ మూల్యం చెల్లించారు. అయితే ఈసారి ఆ గురి ఓ పాత్రికేయుడిని తగిలింది. అతను హేమచంద్రపాండే. అప్పటిదాకా కర్తవ్య నిర్వహణలో ఉన్న పాండే పోలీస్ తూటా తగలగానే చిత్రంగా మావోయిస్ట్‌గా మారిపోయాడు. ఇంతకీ అతను విప్లవకారుడా?సామాజిక కార్యకర్తా? కేవలం జర్నలిస్టేనా? మూడూ కలగలిసిన వ్యక్తా? సహచరికన్నా బాగా చెప్పగలిగిన వారు ఎవరున్నారు? అందుకే ఆయన గురించి భార్య బబిత మాటల్లోనే తెలుసుకుందాం...

హేమచంద్ర కుమావూన్ యూనివర్శిటీలో పిజి చేశాడు. నేనూ అదే యూనివర్శిటీలో డిగ్రీ చదివాను. ఆ పరిచయమే మా మధ్య ప్రేమగా మారింది. 2002 ప్రేమికుల రోజున పెద్దల ఆంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. ఆయనది చాలా సున్నితమైన మనస్తత్వం.ఎవరికి ఏ చిన్న కష్టమొచ్చినా సాయం చేయడానికి ముందుండే వాడు. ఇప్పుడు ఎన్‌జీవోలపై పిహెచ్‌డీ చేస్తున్నాడు. ఆయన్ని పాత్రికేయుడు కాదంటుంటే నవ్వొస్తుంది. మల్టీమీడియా డి ప్లొమా చేసిన నేనూ మొన్నటి దాకా జర్నలిస్ట్‌గానే పని చేశాను.

నన్నూ కాల్చేస్తే పోయేది
మేము మూడున్నరేళ్ల క్రితం ఢిల్లీ వచ్చాం. ఇక్కడ శాస్త్రీనగర్‌లో ఒక చిన్న ఇంటిలో అద్దెకుంటున్నాం. పాత్రికేయుడే కాక ఆయన ఓ సామాజిక కార్యకర్త కూడా. అల్మోరాలో జంగల్ బచావో...ఉత్తరాఖండ్ ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్‌లో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జోక్యం చేసుకునేవారు. అలాంటి మంచి మనిషిని ఇంత దారుణమైన చావు వెంటాడుతుందని కలలో కూడా ఊహించలేదు. అయన్ను చంపినట్టు నన్నూ ఒక్క బుల్లెట్‌తో కాల్చి చంపేస్తే బావుండేది.

ఆ మాటలే చివరివి
నా భర్త నాతో చివరిగా మాట్లాడింది జూన్ 30 సాయంకాలం ఐదు పదిహేనుకి. నాగ్‌పూర్‌కి వెళ్తూ ట్రైన్‌లో ఉన్నాను అని ఫోన్‌లో చెప్పారు. అవే చివరి మాటలు. బహుశా అది చెన్నై లేదా ఎపి ఎక్స్‌ప్రెస్ అయ్యుండాలి. మొత్తానికి ఏదో ఒకదాంట్లో రిజర్వేషన్ చేయించుకున్న దాఖలా కూడా ఉంది.ఆయన ఆ రోజు మధ్యాహ్నం ఒకటిన్నరకే ఇంటి నుంచి బయలుదేరారు. ఏదో ఇంటర్వ్యూ కోసం నాగపూర్‌కి వెళ్తున్నానని మూడుంపావుకి ట్రైన్ ఉందని, రెండు రోజుల్లో తిరిగి వస్తానని చెప్పారు. ఏం స్టోరీ ఏంటని నేను వివరాలు అడగలేదు. వృత్తిపరమైన విషయాల్లో జోక్యం చేసుకునే అలవాటు నాకు లేదు. కాబట్టి విషయాన్ని కాజువల్‌గానే తీసుకున్నాను.

అనూహ్యం
తర్వాత చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను. కాంటాక్ట్‌లోకి రాలేదు. నాట్ రీచబుల్ అనే రెస్పాన్స్ తప్ప ఎలాంటి స్పందనా లేదు. తర్వాతి మూడు రోజులూ మనసు మనసులో లేదు. కీడు శంకించడానికీ ఎలాంటి సూచనలూ లేవు. ఆ భరోసాతోనే ధైర్యంగానే ఉన్నా. లోలోపల మాత్రం తెలియని బెంగ...దిగులుతోనే గడిపాను. రెండో తారీఖు కల్లా తిరిగి వస్తానని చెప్పిన మనిషి పత్రికల్లో శవమై కనిపించాడు. 'తెలుగు న్యూస్ పేపర్స్‌లో ఓ ఫొటో వచ్చింది. హేమచంద్రలాగే ఉంద'ని సన్నిహితులు చెబితే అప్పుడు చూశాను...నిజమే! మా ఆయనే....కుప్పకూలిపోయాను. విషయమేంటో అర్థం కాలేదు. చివరకు ఒక హై క్యాడర్ మావోయిస్ట్ లీడర్‌తో పాటు మా ఆయన్నీ మావోయిస్ట్ అనే ముద్రవేసి ఆంధ్రప్రదేశ్ పోలీసలు ఎన్‌కౌంటర్ చేశారని తెలిసింది.

గొంతు నొక్కే ప్రయత్నమే
అయనకి దూరంగా ఒక్క రోజు కూడా ఉండలేదు. ఆయనలేని ఈ జీవితాన్ని ఎలా....(దుఃఖంతో కాసేపు మౌనం)నాకేమీ అర్థం కావడం లేదు. చేతనైన మంచి చేసుకుంటూ మా బతుకు మేము బతుకుతుంటే మా మీద మావోయిస్ట్‌లనే అనవసరమైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది అన్యాయం. అసలు ఇంత వరకు ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు. ఎప్పుడూ అరెస్ట్ అవలేదు. బాధ్యత గల ఒక జర్నలిస్ట్‌ని పట్టుకుని అజ్ఞాత నక్సలైట్ అనడం ఎంత అన్యాయం? దీన్ని ఎదుర్కోవడానికి ఏ స్థాయిలోనైనా ఉద్యమిస్తాను. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం కూడా అదే. దీనికి ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్ట్‌లు అందరూ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ హత్యను కేంద్ర మంత్రి చిదంబరం కావాలని చేయించారు. జర్నలిస్ట్‌ల గొంతు నొక్కేయడం కోసమే ఇలాంటి పని చేయిస్తున్నారని నేను భావిస్తున్నాను.

నా అన్నను అన్యాయంగా చంపారు
అన్నయ్య, నేను ఇద్దరమే. అక్కచెల్లెళ్లు లేరు మాకు. తనంటే నాకు ప్రాణం. అంతే గౌరవం కూడా. అన్యాయాన్ని వెలికితీసే మంచి జర్నలిస్ట్. అద్భుతమైన వ్యాసాలు రాసేవాడు. అలాంటి నిఖార్సయిన మనిషిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు.

- రాజీవ్ పాండే (తమ్ముడు) కుటుంబ నేపథ్యం
ఉత్తరాఖండ్ రాష్ట్రం పిథోర్‌ఘడ్ జిల్లా దేవకల్ గ్రామం హేమచంద్ర పాండే స్వస్థలం. మధ్యతరగతి కటుంబం. తల్లీతండ్రులిద్దరూ టీచర్లుగా పనిచేసి రిటైరయ్యారు. హేమచంద్ర తండ్రి దివంగతులవగా తల్లి మాత్రమే ఉన్నారు. తమ్ముడు రాజీవ్ పాండే కూడా నైనిటాల్‌లో ఆరేళ్లుగా అమర్ ఉజాల పత్రికలో పాత్రికేయవృత్తిలో కొనసాగుతున్నారు.

జూ ఎం.డి. మునీర్,
ఆన్‌లైన్, మంచిర్యాల
http://epaper.andhrajyothy.com/GalleryView.shtml

1 కామెంట్‌:

ఆలోచనాత్మకంగా..