
పారామిలటరీ బలగాల మోహరింపు తెలంగాణా ప్రాంతానికే పరిమితం చేస్తూ తెలంగాణా ప్రజల గుండెలపై తుపాకులెక్కుపెట్టడాన్ని చూస్తుంటే డిసెంబర్ ఆఖరు తరువాత వారి ఆశలపై నీళ్ళు జల్లేందుకు సిద్ధమైన కార్యాచరణతో పాలకవర్గం వారిని భయభ్రాంతులకు గురిచేయడానికి తద్వారా వారిని తీవ్ర నిర్బంధంతో అణచబట్టడానికి ఉద్యుక్తులవుతున్నారని అర్థమవ్వని వారెవ్వరైనా వున్నారా?
ఉద్యమ క్రెడిట్ ను ఏ ఒక్కరో కొల్లగొట్టుకుపోకుండా వుండటానికి ఈ రోజు ఎన్నడూ గొంతెత్తి ఎరుగని కాంగేయులు దీక్ష చేపట్టడం హాస్యాస్పదం కాదా?
జైళ్ళలో మగ్గుతున్న విద్యార్థులను పరామర్శించని ఈ నాయకులంత నేడు వారిపై వున్న కేసులను ఎత్తివేయమని గోలచేయడం వెనక కుట్ర కానరాదా? కేసుల సంఖ్య ప్రకటిస్తూ ఎత్తివేసినవన్నీ సాధారణ కేసులే తప్ప వారిపై పెట్టిన తీవ్రమైన కుట్రకేసులగురించి మాటాడని ప్రభుత్వం ఇంతకుముందెన్నడూ లేనివిధంగా న్యాయపరమైన చిక్కులు గురించి మాటాడుతూ తప్పుదోవపట్టిస్తోంది. ప్రజలకు, వారి ఆస్తులకు కోట్ల రూపాయలలో నష్టాన్ని సాగించి, హత్యలు, లూఠీలతో తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిన రంగా హత్యానంతరం, రాజీవ్ హత్యానంతరం అధికార పార్టీ గూండాలందరిపై ఎత్తివేసినప్పుడు కానరాని ఈ న్యాయ, నైతిక అంశాలు తెలంగాణా విద్యార్థి, యువజనులపై పెట్టిన తప్పుడు కేసులప్పుడే గుర్తుకు రావడం వీళ్ళ వివక్షకు తార్కాణం కాదా?
తెలంగాణా ప్రజలేమైనా ఉగ్రవాదులా? ఇన్నిన్ని కేసులు, మిలటరీ బలగాల మోహరింపుతో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేయడం ఎంతవరకు సమంజసం?
ఈ పాలకవర్గ నాయకులంతా ముందుగా బలగాల అక్రమ తరలింపును అడ్డుకొని, వాటి ఉపసంహరణకు డిమాండ్ చేస్తూ వారి పదవులనుండి వైదొలగి కేంద్ర, రాష్ట్ర పభుత్వాలపై తీవ్రమైన వత్తిడి తేగలిగితే వీరిని నమ్మొచ్చు. అంతే కానీ దీక్షలతో మభ్య పెట్టజూడడం తెలంగాణా ప్రజలను మోసం జేయజూడడమే...
ఒకపక్క కేసీఆర్ జార్ఖండ్ ఉద్యమం పద్దెనిమిదేళ్ళు సాగింది కాబట్టి అప్పుడే తొందరొద్దు, ఉద్యమాన్ని కొనసాగిస్తూ, చందాల దందాలతో, పదవులతో బేరసారాలతో హీరోగా కొనసాగ జూస్తున్నాడు కాబట్టి ఈయనగారి బండారాన్ని తప్పక బయటపెట్టి ప్రజా ఉద్యామాన్ని నిర్మాణం చేసుకొని పాలక, ప్రతిపక్ష నాయకులను బహిష్కరించి, పూర్తిగా సహాయ నిరాకరణను కొనసాగించి, అమరుల ఆశయాన్ని ఎత్తిపట్టి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరముంది....