11, ఫిబ్రవరి 2010, గురువారం

అవిశ్రాంత విప్లవ పథికుడు కా. ఐ.వి.మాస్టారు

IV

ఐ.వి.గా, ప్రకాశ్ గా, మాస్టర్ గా ఎన్నెన్నో రంగాలలో ఎంతోమందికి ఆప్తుడైన ఐ.వి.సాంబశివరావు కవి, కథకుడు, అనువాదకుడు, సిద్ధాంత కర్త, ఉద్యమకారుడు, కార్యకర్త, విప్లవోద్యమ నాయకుడు, విశేష జీవితానుభం,లెక్కకుమించిన రంగాలలో ప్రజ్న, అతి సున్నితమైన హృదయం, పసిపిల్లవాడి మనసు, కఠినమైన క్రమశిక్షణను పాటించిన వ్యక్తిత్వం, విరసం, అఖిలభారత విప్లవ సాంస్కృతిక సమితికి సంస్థాపక సభ్యుడు, నాయకుడు, సుబ్బారావు పాణిగ్రాహి వారసత్వాన్ని అక్షరాల ఆచరించిన కవియోధుడు. యిదంతా ఆయన వ్యక్తిత్వం గురించి విరసం ప్రచురించిన ఐ.వి స్మృతులు అన్న పుస్తకం వెనక అట్టపై వున్న అక్షర సత్యాలు.

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంకు దగ్గరలోని పిరిడి గ్రామంలో 1937, ఫిబ్రవరి 11 న  జన్మించిన ఐ.వి రాజనీతి శాస్త్రంలో ఎం.ఏ పూర్తిచేసి, ఢిల్లీ, హైదరాబాదులలో రిసెర్చ్ ప్రాజెక్టులలో పనిచేస్తూ శ్రీకాకుళ ఉద్యమ స్ఫూర్తితో విరసం సంస్థాపక కృషిలో పాల్గొన్నారు. విరసంలో సభ్యుడిగా, కార్యవర్గసభ్యుడిగా క్రియాశీలంగాపనిచేస్తూ  విజయవాడ లయోలాకాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తూ పూర్తికాలం కార్యకర్తగా అజ్ణాత జీవితాన్ని ఎంచుకున్నారు.. 1997 ఫిబ్రవరి 28 న కాన్సర్ వ్యాధితో కన్నుమూసేనాటికి 23 సం.ల విప్లవోద్యమ జీవితంలో సామాన్యకార్యకర్త స్థాయి నుంచి నాయకత్వ స్థాయి వరకు ఎన్నో ఆటుపోట్లకు గురయ్యారు.అయిన స్థైర్యంగా ఆఖరివరకు నిలిచి అందరికి ఆదర్శప్రాయుడయ్యారు. కె.ఎస్.నాయకత్వం మార్పు తరువాత పొరపాటు అవగాహనతో నాయకత్వం 60 సం.ల దగ్గరలో ఆయనకు సామాన్య కార్యకర్త స్థాయికి ఒక ఏడాది పాటు డిమోట్ చేసినా మొక్కవోని విప్లవాభిమానంతో తన ఆచరణ ద్వారా నలుగురికీ ఆదర్శంగా నిలబడి తిరిగి కేంద్ర స్థాయి నాయకత్వానికి చేరుకున్న ఏకైక విప్లమూర్తి కా.ఐ.వి.

కా.ఐ.వి.ని పరిచయమున్నవారు ఆయన పాటించిన మానవ సంబంధాల విలువలను, ఆప్యాయతను మరిచిపోలేరు.అలాగే ఆయన సాహిత్య రంగంలో చేసిన అవిరళ కృషికూడా. స్వీయరచనలతో పాటు అనువాద రచనలో ఒక మంచి వరవడిని చూపెట్టిన సాహితీ కృషీవలుడు. ప్రపంచంలో మరెక్కడా ఐదు సంపుటాలు మించి లభించని మావో రచనలు మరో నాలుగు సంపుటాలుగా పాఠకులకు అందించే కృషికి దోహదం చేసారు. మారుపేర్లతో అనేక రచనలు చేసారు.రహస్యోద్యమ కార్యకర్తగా తనుచేసిన సైద్ధాంతిక కృషి యింకా వెలుగు చూడాల్సి ఉంది.

తియానన్మెన్ స్క్వేర్ లోని అమరవీరుల స్థూపంపై వున్న ఆంగ్ల గీతాన్ని ఇంద్రవెల్లి మృతవీరుల స్మారకస్థూపంపై చెక్కగా దానిని మిత్రులు క్రాంతిలో ప్రచురించాలని అనుకుని శ్రమ పడుతుండగా రెండు నిమిషాలలో కొట్టివేతకూడా లేకుండా దాన్ని అనువదించారు. అది

కొండగోగులు ఎరుపు కొండలే ఎరుపు

కొండలలోఅన్నల అమరత్వమెరుపు

అన్నలకు దండాలు అంతకంటే ఎరుపు..

మరో అనువాద కవిత:

ఈ మబ్బు వీడి వెలుగు రవ్వలు కురవాలని

ఈ వలత్ ఎంచుకు చరిత్ర బైట కురకాలని

మౌనం యీ సంకెలను చేదించుకోవాలని

తప్పెట మోతల్ రణన్నినాదం

విగ్రహాలను మేల్కొల్పాలని

నేలచ్చాయా సుందర దేవత

అందమైన అందెల సవ్వడితో ప్రత్యక్షం కావాలని

ఆకాశం ఎదురు చూస్తోంది.

మూలం – ఫైజ్ అహమ్మద్ ఫైజ్ .

(విప్లవోద్యమ శిఖరం అమరుడు కా.ఐ.వి. మాస్టారి జన్మదిన సందర్భంగా వారి స్మృతిలో)

1 కామెంట్‌:

  1. http://dedicatedtocpbrown.wordpress.com/2010/02/06/%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AF%E0%B1%81-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3/

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..