9, డిసెంబర్ 2010, గురువారం

మోసపుచ్చిన అపరాత్రి ప్రకటన..



తెలంగాణా ప్రజల ఆకాంక్షను గుర్తిస్తున్నట్లు సరిగ్గా ఏడాది క్రితం
అపరాత్రిప్రకటన చేసి, వారిలో ఆశలు రేకెత్తించిన కేంద్రం ఆ తరువాతి పరిణామాలకు, దళారీ పెట్టుబడిదారుల కుయుక్తులకు తలొగ్గి ఏభై నాలుగేళ్ళ సుదీర్ఘ స్వప్నాన్ని కన్న వారి ఆశలపై నీళ్ళు చల్లేట్టు కమిటీలు వేసి తెలంగాణా ఏర్పాటు ప్రక్రియను వాయిదా వేయడం ద్వారా అనేక మంది నవ యువతీ యువకుల ఆత్మార్పణకు దారితీసేట్టు చేసి, తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తూ వస్తూంది. రాష్ట్ర అధినాయకత్వ మార్పు ద్వారా మరింత కఠిన వైఖరి తీసుకునే విధంగా ప్రోత్సహిస్తూ తెలంగాణాను పోలీసు రాజ్యంగా మార్చివేయజూస్తోంది. ఉద్యమాలను వ్యతిరేకించే పోలీసు బాసును రాష్ట్రానికి గవర్నర్ గా పంపినప్పుడే కేంద్ర వైఖరి అవగతమైంది. వారి డిసెంబర్ తొమ్మిది ప్రకటన వట్టి మోసపూరితమైనదని, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి చేయాల్సిన దానికి అసెంబ్లీ తీర్మాణం కావాలన్న ప్రకటన వలన వారి దాటవేత ధోరణి వ్యక్తమైంది. అవకాశవాద రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకునేందుకు అందరి ముందు తెలంగాణాకు మద్ధతు ప్రకటించిన వారే ఈ ప్రకటన వెలువడ్డ తర్వాత వారి వారి ప్రాంతీయ ధోరణులు బయటపెట్టి మరింత వేదనకు గురిచేసారు. మీడియాకూడా రకరకాల వ్యాఖ్యానాలతో తమ పెట్టుబడుల మూలాలను కాపాడుకునే ప్రయత్నాలను చేస్తూ వస్తోంది. ముందుండి నడుపుతున్న నాయకత్వంలో కూడా వున్న అవకాశవాదం కారణంగా ఉద్యమం అటూ ఇటూ ఊగిసలాడుతూ యువతరాన్ని తీవ్ర నిరాశా నిస్పృహలకు గురిచేస్తోంది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ముందుకు వచ్చి దళారీలను అడ్డుకొని ఉద్యమాన్ని నిలబెట్టి వుండకపోతే ఇప్పటికే ఉద్యమ నెలబాలుడిని ఈ రాజకీయ రాహువులు మింగిపారేసేవి. ఈ నాలుగు వందలమంది ఆత్మార్పణ బూడిద పాలయ్యేది.

తెలంగాణ ప్రజలను మరెంతో కాలం మోసం చేయలేరని, వారి సహనాన్ని పరీక్షించకుండా నాటి ప్రకటనకు కట్టుబడి వారి కలలను సాకారం చేయగలరని ఆశిద్ధాం. ఏమైనా ప్రజా ఉద్యమం ద్వారానే వత్తిడి పెంచగలమని గ్రహించి ఐక్య పోరాటాల ద్వారా తెలంగాణా సాధనకు కృషిచేయగలరని నాయకత్వాన్ని కోరుతూ..

1 కామెంట్‌:

ఆలోచనాత్మకంగా..