6, జూన్ 2011, సోమవారం

ఇప్పవనాల గాలి సూరీడు చేరింది..

మనందరికీ అజ్నాత సూరీడుగా పరిచయమైన నెమలూరి భాస్కరరావు గారు మొన్న జూన్ 1 విజయవాడ క్రిష్ణ లంకలో తన కుమారుని ఇంట గుండెపోటు కారణంగా మరణించారు. ఆయన విప్లవోద్యమంలో పనిచేసిన కాలంలో మల్లిక్ గా రాష్ట్ర నాయకుడిగా అందరికీ పరిచయం. ఉద్యమంలో కొనసాగుతున్నప్పుడు వెన్నెల పాట, ఇప్పవనాల గాలి కవితా సంకలనాలు, పాటలు, చైనా కథలు అనువాదాలు వెలువరించారు. ఉద్యమం వీడి వచ్చాక కథలు రాసారు. ఇండియాటుడే, ఆంధ్రజ్యోతి మొ. పత్రికలలో వచ్చాయి. కథలలో జీవన సంఘర్షణను కొత్తకోణంలో చూపే ప్రయత్నం చేసారు.
ఉద్యమంలో వున్న కాలంలో చివర్లో తన ఒంటెత్తు పోకడ, సైద్ధాంతిక విభేదాలు విమర్శలకు గురయ్యాయి.

అయినా ఉద్యమ జీవితానికి, బయట తను బతికినన్నాళ్ళు అదే నిబద్ధతతో జీవించి చూపిన ఆచరణకు జోహార్లర్పిస్తూ...
ఆయన కవితా పాదాలు కొన్నిః
ఉద్యమం ఇప్పుడింకెంత మాత్రం
నెలబాలుడు కాదు-
అది మైదానాన్ని - అడవినీ
ఆక్రమించి -
ఆకాశం కోసం
రెండో పాదం
దాచి వుంచిన
వామన పాదం అది!
2.
భయం నీటి పాములాంటిది
కాటేస్తే ప్రతీక్షణం చస్తాం!


బరువు తగ్గిస్తుందేడుపు కానీ-

బాధ్యత మిగిలే వుంటుంది!


ఉత్సాహం ఉప్పెనలా ఉండరాదు

ప్రవహించే ఏర్లాగుండాలి!
(ఇప్పవనాల గాలి నుంచి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆలోచనాత్మకంగా..