24, ఏప్రిల్ 2010, శనివారం

నైతిక మార్గదర్శి - సు.రా.




సు.రా. గా సుపరిచుతులైన సి.వి.సుబ్బారావు గారి గురించి రామచంద్ర గుహ గారి వ్యాసం ఈ దినం ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఈ సందర్భంగా సందిగ్ధ సందర్భం పేరుతో సు.రా. రచనల ప్రచురణలలో తన పరిచయాన్ని చేసిన మిత్రుల వాక్యాలు కొన్ని యిక్కడ...
సుబ్బారావుతో ఒక మేరకైనా పరిచయం ఉన్నవాళ్ళకి అతన్ని మరిచిపోవడం ఎంత కష్టమో, అతన్ని బొత్తిగా తెలియని వాళ్లకి కొత్తగా పరిచయం చెయ్యడం బహుశా అంతే కష్టం.
హేతువాదం పునాదిగా ప్రశ్నించడం ఆరంభించిన యువతీయువకులు చాలామంది నలుపునీ తెలుపునీ గుర్తించాక ఆగిపోతారు. పరస్పర విరుద్ధాల మధ్య ఉండే విశాలమైన "సరిహద్దులు దొరకని సంధ్యలలో" గ్రే ఏరియాస్ ని ప్రశ్నించి, మధించి, శోధించాడు సుబ్బారావు. అందుకే యాంత్రికమైన జవాబులు, పరిష్కారాలు అతన్ని తృప్తి పరచలేదు.
సుబ్బారావు పౌరహక్కుల ఉద్యమకారుడిగానే కాక ఆర్థిక శాస్త్రవేత్తగా, విద్యార్తులు ప్రేమించిన అధ్యాపకుడిగా గుర్తింపు పొందాడు. మావోయిస్టు చైనాలో ఆర్థికాభివృద్ధి మీద, నైజాం సంస్తానంలో పారిశ్రామికీకరణ మీద పరిశోధన చేశాడు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో జాతుల సమస్య మీద అధ్యయనం చేసి 'రగులుకునే రాశ్ఖసి బొగ్గు' పుస్తకం రాశాడు. రాజకీయార్థిక శాస్త్రాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేశాడు. విరసంలో క్రియాశీల సభ్యుడు. "సృజన" సాహితీ మితృలలో ఒకడు. 'విభాత సంధ్యలు' తెలుగు సాహిత్య విమర్శలో ఒక అపూర్వ ప్రయోగం.
అతని కిష్టమైన మాటల్లో చెప్పుకోవాలంటే - "ప్రయాణారంచాన్ని మర్చిపోతే గమ్యం శిథిలమౌతుంది".

16, ఏప్రిల్ 2010, శుక్రవారం

బాల్యం వీరికి శాపం అయ్యింది

ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా నారాయణపట్నం బ్లాకులో గత రెండు సం.లుగా ఆదివాసులపై తీవ్రస్థాయిలో జరుగుతున్న దాడులు ఎవరి కంటా పడక మూగ రోదనగా మిగులుతున్నాయి. దీనిపై తెహెల్కా పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. యిక్కడి 15 సం.లు కూడా నిండని యువతీ యువకులను నక్సల్స్ పేరుతో అరెస్టులు చేస్తూ , వారి కుటుంబాలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. వారి తల్లిదండ్రుల ప్రశ్నలకు సమాధానం చెప్పే వారే లేరు. జనాభా గణనలో కూడా సరైన ప్రాతినిధ్యం లేని ఆదిమ తెగల దయనీయ పరిస్థితిని గురించి పాలకులు ఆలోచించిన పాపాన పోలేదు. ఏమైనా అంటే కోట్లాది రూపాయల నిధులు విడుదల చెస్తున్నాం అంటారు. అవి ఎక్కడికి పోతున్నాయో ఆ పెరుమాళ్లకే ఎరుక. యివేవి తమకు అక్కర్లేదు తమ గూడెంలో తమని బతకనిస్తే చాలుననే ఈ ప్రజల వేడుకోలు వినేవారెవ్వరు?
tehelka

15, ఏప్రిల్ 2010, గురువారం

పాలక వర్గాలకు ఏకైక ప్రతిపక్షం...




ఈ రోజు పార్లమెంటు ఉభయ సభలలోను ఉదయం నుండి సాయంత్రం వరకు చర్చ దంతేవాడ ఘటనపై జరిగింది. యింత సుదీర్ఘమైన చర్చ ఇంతవరకు ఏక కంఠంతో ఏ అంశంపైనా జరిగినట్లు లేదు. అరవై సంవత్సరాల స్వత౦త్ర పరిపాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ములికమైన సమస్యలపై యింత ఇదిగా చర్చించి వుంటే ఈనాడు ప్రజల పరిస్థితి మరోలా వుండేదేమో! కనీస సదుపాయాలైన తిండి, బట్ట, నిలువ నీడ లేక కోట్లాది మంది ప్రజలు నికృష్ట బ్రతుకు బ్రతుకుతుమ్తే అంతర్జాతీయ వ్యభిచార లీగ్ గా మారిపోయిన ipl లో లాభాలు, మాఫియా దండాలతో మంత్రులు మునిగితేలుతుంటే పట్టని ఈ పాలక వర్గం దేశ సహజ సంపదను అమ్ముకు దొబ్బే కార్యక్రమానికి ముందస్తుగా అడ్డుతోలగిమ్చే పనిగా మొదలిడిన గ్రీన్ హంట్ ఆపరేషన్ బెడిసి కొట్టి చావు దెబ్బ తిన్నదానికి ప్రతీకారాన్ని ప్రజలపై తీర్చుకునేందుకు అగ్ర వర్ణ, భూస్వామ్య, సామ్రాజ్యవాద, దోపిడీ పాలక వర్గాల గొ౦తులన్నీ ఒక్కటిగా మారి తమ బలగాలతో దేశ నడిబొడ్డున రక్తపాతాన్నే స్ఱుష్టి౦చే౦దుకు కలిసి కట్టుగా ము౦దుకు వస్తున్నాయి. కానీ ప్రజలను చేతకాని వారిగా, అమాయకులుగా భావి౦చి దాడులు చేస్తే తమదైన పద్ధతిలో జవాబు చెప్పే౦దుకు ప్రజలు సిద్ధంగానే వు౦టారు. యి౦తకన్నా నియ౦తలె౦దరో మట్టిలో కలిశారు. ఆంధ్రా ఎం.పీ. కేశవరావు మాటాడుతుంటే అసహన౦గా కదులుతూ గృహ మ౦త్రిగారు చిరాకు పడ్డారు. చర్చలు జరిపి మరల వారి బలహీనతలు గ్రహి౦చి నిర్మూలీ౦చవచ్చునని సూచనలు ఇస్తారు ఉ౦దవల్లి. వై.ఎస్సార్.లా మోసపూరిత పాలనతో, వాగ్దానాలతో వారిని మభ్యపెట్టి వంచించ వచ్చునని సూచించారు. ఎవరి నైనా ఎల్లకాలం మోసం చేయలేరు. అసలు ఆ పార్లమెంటు సభ్యులలో కొట్లాదిపతులు కాని వారెందరు? మరి మావోయిస్టుల వలన వీళ్ళకు కాకపొతే ఎవరికీ ముప్పు? అందుకే వీరి గొంతుల నుండి ఒకటే నినాదం! అణచివేత..రక్తపాతం..విమానాలనుండి బా౦బి౦గ్ చేసైనా సరే, ఎ౦త ప్రాణ నష్ట మైనా సరే ఎ౦దుక౦టే వీళ్ళ పిల్లలు కానీ, బ౦ధువులు కానీ, జైట్లీ గారు కానీ, చిద౦బర౦ గారు గానీ నష్ట పోయేదేమీ వు౦డదు కనుక..

అ౦దుకే ఈ పాలక వర్గాలన్నిటికీ వాళ్ళే ఏకైక ప్రతిపక్షం. ప్రజలే..

13, ఏప్రిల్ 2010, మంగళవారం

అరుంధతి రాయ్ పై కేసును ఖండిద్దాం



చతీస్ ఘర్ రాష్ట్రానికి చెందిన విశ్వజిత్ మిత్రా మావోయిస్టులతో మాటాడి వ్యాసం రాసినందుకు ప్రముఖ సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్ పై కేసు వేసారు. న్యాయవ్యవస్థపై ఆ వ్యాసంలో ఆమె చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తు పిటిషన్ వేసారు. కానీ, నేటి వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపడం తప్పెలా అవుతుంది. ఆ ప్రాంతమంతా యుద్ధ భూమి గా మార్చి మీడియాను సైతం అనుమతించక, ప్రవేటు సైన్యాలతో, పారామిలటరీ బలగాలతో ఆదివాసీలపై జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తేవడం నేరమెలా అవుతుంది. ఆ రాష్ట్రంలోని Special Security Act వంటి కౄర చట్టాన్ని అడ్డుపెట్టుకొని మాటాడేవారి గొంతునొక్కే ప్రయత్నం తప్ప మరోటి కాదు. ఇలాంటి మేధావి వర్గం, ప్రజాస్వామిక శక్తులపైనే యిలా దాడులకు సమాయత్తమవుతున్నారంటే యింక సామాన్యుల గతేంకాను? అందుకే దీనిని అందరం ఖండించాల్సిన అవసరం వుంది.

10, ఏప్రిల్ 2010, శనివారం

గిరిజన గోవిందమూ గ్రీన్ హంట్ లో భాగమే...



కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు యిప్పుడున్నది ఒకటే ధ్యేయం. ఆదివాసీలను అడవులనుండి ఖాళీచేసి అక్కడి సంపదను బహుళజాతి సంస్థలకు అప్పగించడం. యిక్కడ సంపదే కాదు ఆ నేలపై హక్కును కూడా మనం కోల్పోతామన్న విషయం దాస్తున్నారు. కొత్త కంపెనచట్టం సెజ్ వలన ఆ ప్రాంతంపై అన్ని రకాల హక్కులను కోల్పోతాం.

ఆదివాసీలది స్వేచ్చాయుత జీవన విధానం. వారి సంస్కృతి, సాంప్రదాయాలు వేరు. వారి పూజా విధానాలే వేరు. వారి భాష కూడా మనకేమాత్రం దగ్గరిది కాదు. వారి దేవుళ్ళు ఏవీ కంటికి కనబడే విగ్రహ రూపాలు కావు. సినిమాలలో చూపించే పెద్ద నాలుక బయట పెట్టే కడుపు దేవతలు కావు. చిన్న చిన్న రాళ్ళ రూపంలోనూ, చెట్ల రూపంలోనూ వారు కొలుస్తుంటారు. వారి మంత్రాలు కూడా మన సంస్కృత మంత్రాల వంటివి కావు. వారి పూజారి జన్నోడు వారిని మభ్య పెట్టడంలో వీళ్ళకేమీ తీసిపోడు కానీ గొడవలు పెట్టే రకం కాదు. చిన్న చిన్న బలులు, కానుకలతో సరిపెట్టేస్తుంటారు. యిలా వీరిది ఓ ప్రత్యేక ఆచార వ్యవహారమయితే మధ్యలో ఈ గిరిజన గోవిందం పేరుతో గిరిజన గూడల్లో గోవిందుడికి వివాహం పేరుతో ఊరేగిస్తున్నారు మన డాలర్ శేషాద్రి గారు. యిది వాళ్ళ సంస్కృతి నుండి వాళ్ళను వేరు చేయడమే. వాళ్ళ ఉనికిని యిప్పటికే ప్రశ్నార్థకం చెస్తున్న మనం వారి నమ్మకాల విషయాలలో కూడా దూరి ఈ కృత్రిమ సంస్కృతిని అంటగట్టడం దేనికి. యిప్పటికే క్రిస్టియన్ మత ప్రచారకులు చేరి వాళ్ళ బుఱలు పాడుచేస్తున్నారు. మరల హిందూ మతం వాళ్ళని యిటు వైపు యిప్పుడు మళ్ళించడం కూడా గ్రీన్ హంట్ లో భాగమే. అది కూడా తూ. గోదావరి జిల్లా నుండి మొదలు కావడమన్నది అక్కడ బాక్సైట్ వ్యతిరేక పోరాటం తీవ్ర స్థాయిలో జరుగుతుండటమే కారణం. మావోయిస్టుల ఏరివేత పేరుతో ఆదివాసీ ప్రాంతాలనుండి వారిని ఖాళీ చేయించి నాగరికత, జన జీవన స్రవంతిలో కలిపే కార్యక్రమాలలో భాగంగా వాళ్ళ మనసులపి దాడి చేయడానికి డిష్ టీవీలు, డివీడీ ప్లేయర్లు యిచ్చి బూతు సేడీలు కూడా సప్లై చేస్తున్నారు. పాలక వర్గాల అభివృద్ధి నమూనా రోడ్లు వేయడమే. యివి వారిపై ప్రేమతో కాదు, వారి నేల, నీరు, సంపదపై దురాశతో. కావున గిరిజన గోవిందమూ ఆపరేషన్ గ్రీన్ హంట్ లో భాగంగానే భావించాల్సి వస్తోంది....

6, ఏప్రిల్ 2010, మంగళవారం

ఎక్కడో తప్పు జరిగిందా?




ఇంత విషాదకర సమయంలోనూ ఎక్కడో తప్పు జరిగిందని గృహ మంత్రి గారు నొసలు చిట్లించడం చూస్తుంటే చరిత్రనెరగని ఆయన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా కన్పిస్తోంది. ముందుగా ఆయన వ్యూహంలోనే తప్ప వుంది. ప్రజలపై నిరంకుశ యుద్ధాన్ని ప్రకటించడంలోనే తప్పువుంది.

దాదాపు భారత తిరుగుబాటు చరిత్రలోనే యింత పెద్ద సంఘటన యింతకు ముందెన్నడూ జరగలేదు. దీనికి బాధ్యత వహించాల్సింది ఈ కార్పొరేట్ మంత్రి కాదా? యిక్కడ విజయాలు, అపజయాలు గురించి కాదు కానీ ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక శక్తి గా అవతరించిన అమెరికా వియత్నాం అనే చిన్న దేశంతో యుద్ధం చేసి చావు తప్పి కన్ను లొట్టపోయింది. మన చుట్టూ వున్న మీడియా మాయతో ప్రజల బలంలేని పోరాటంగా వర్ణిస్తున్న అవకాశవాద రాజకీయ మేథావుల వ్యాఖ్యానలతో ఊహాలోకంలో వున్న మనం ఏ ప్రజల ఆదరణ లేకపోతే ఒక కంపెనీ బలగంతో దాడి చేయగలరా? ఈ రోజు మీడియాలో కథనాలన్నీ పలానా దాడిలో యింతమంది పోలీసులని లెక్కచెప్తున్నారు తప్ప ప్రభుత్వం పెంచి పోషించిన సల్వాజుడుం, హర్యత్ సేనా, శాంతి సేనా, గ్రేహౌండ్స్ వంటి బలగాలు ఆదివాసీ ప్రజలపై పడి ఎంతో మందిని పొట్టనపెట్టుకొన్న సంఖ్యల గురించి కానీ, అత్యాచారాల గురించి కానీ ఈ రోజు ప్రస్తావించి వుంటే బాలన్స్ గా వుండేది. అలాగే గత కొద్ది నెలలుగా బస్తర్ ప్రాంతంలో మీడియాను అనుమతించక జరుగుతున్న నరమేధం గురించి చెప్పి వుంటే అర్థవంతంగా వుండేది. ఒక వైపు కథనాల ప్రసారంతో వారి వారి వర్గ స్వభావాలు బయటపడుతున్నాయి. నిజంగా యింతమంది చనిపోవడం బాధాకరం. అలాగే వారు వచ్చిన సామాజిక వర్గం, వారి వారి కుటుంబాల పరిస్థితి విశ్లేషిస్తే మరిన్ని భయంకర దృశ్యాలు ఆవిష్కారమవుతాయి. కానీ వీళ్ళు అక్కడకు వెళ్ళింది కూడా చంపడానికే అన్న సత్యం ఒప్పుకోక తప్పదు. యిది మన వేలితో మన కంటినే పొడిచే కౌటిల్యుని రాజనీతి తప్ప మరొకటి కాదు. హింసకు ప్రతిహింస జరగడం ప్రాకృతిక ధర్మం.

ఈ ఆపరేషన్ గ్రీన్ హంట్ ఎవరికోసం? ఎవరి బాగుకోసం? నిజంగా యిది అంతర్గత భధ్రతా సమస్యా? ప్రజల పట్ల బాధ్యత కలిగిని ప్రభుత్వంగా నిరూపించుకోవాలంటే తక్షణమే ఈ ఆపరేషన్ ఆపివేయాలి. సమస్యల పరిష్కారం పట్ల సానుకూల దృక్పధంతో, నిజాయితీతో, చిత్తశుద్దితో పనిచేయాలి. అదే దీనికి సరైన పరిష్కారం..


4, ఏప్రిల్ 2010, ఆదివారం

2013 - భావోద్వేగాల అంతం (సినిమా)– దర్శకత్వం చిదంబరం & కో

2013 భావోద్వేగాల అంతం టాగ్ లైన్ తో ప్రముఖ కార్పొరేట్ నిబద్ధత మంత్రివర్యుల దర్శక నిర్వహణలో సినిమా నిర్మింపబడుతోంది.

యిటీవల తరచు వారి నోటివెంట ఈ మాట వెలువడుతోంది. తమ అధికార బలగం, బలుపుతో ఏమైనా సాధించగలమనే అత్యుత్సాహంతో ప్రజలపై యుద్ధం ప్రకటించిన ఈ కార్పొరేట్ న్యాయవాది గారు దేశ సహజవనరులను విదేశీ పెట్టుబడిదారులకు అప్పనంగా కట్టబట్టే బృహత్తర  కార్యక్రమాన్ని తన భుజస్కంధాల పైమోస్తూ ప్రజలను సవాల్ చేస్తున్నారు. కీలకమైన బాధ్యతలను మళయాళీ, తమిళ కౄర సైనిక, పోలీసు అధికార్లను గవర్నర్లుగా, సైనికాధికార్లకు అప్పగిస్తూ వారిని దిశా నిర్దేశం చేస్తున్నాడు.

యిది నాటి అమెరికా ఖండంపై యూరోపీయం సామ్రాజ్య్ల వాదులు దాడి చేసి స్థానికంగా వున్న రెడ్ ఇండియన్ తదితర ఆదిమ తెగలను సమూలంగా నిర్మూలించి వారి అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసి వారి సహజ వనరులను ఆక్రమించుకున్నట్లుగా, ఆస్ట్రేలియా ఖండంలోని ఆదిమ తెగలను అంతమొందించినట్లుగా, ఆఫ్రికా ఖండంపై నేటికీ చేస్తున్న దాడులను గుర్తుకుతెస్తున్నాయి.

మావోయిస్టుల పేరు చెప్పి గిరిజనులను అంతమొందించే కార్యక్రమం సాగుతోంది. అలాగే రకరకాల అభయారణ్యాల పేరుతో ఆదిమ జాతులను వారి భూభాగం నుండి తరిమివేస్తున్నారు. సెజ్ పేరుతో వేలాది ఎకరాల భూభాగాన్ని పెట్టుబడిదారులకు చౌకగా కట్టబెడుతూ అడిగిన వారిని అభివృద్ధి నిరోధకులుగా లోకానికి చూపెడుతూ కౄరంగా అణచివేస్తున్నారు.

పేద మధ్యతరగతి యువకులను నిరుద్యోగ నైరాశ్యం ఆవహించిన వైనాన్ని ఉపయోగించుకుంటూ వారిని రకరకాల బలగాల పేరుతో రికౄట్ చేసుకుంటూ తమపై తామే యుద్ధం చేసుకునే సరికొత్త ఎత్తుగడలను అమలుచేస్తూ తమ కన్ను తామే  పొడుచుకున్నట్లుగా చే్స్తూ పైశాచిక ఆనందాన్నిఅనుభవిస్తున్నారు.

ఈ కార్పొరేట్ కలలు కల్లలు కాక మానదు. ప్రజల తిరుగుబాటు తత్వాన్ని, అణగి మణగి వుండలేని స్వభావాన్ని ఎవరూ అణచివేయలేరు. తుడిచి పెట్టనూలేరు. ఇది మానవ చరిత్ర చెప్పిన సత్యం.