4, ఏప్రిల్ 2010, ఆదివారం

2013 - భావోద్వేగాల అంతం (సినిమా)– దర్శకత్వం చిదంబరం & కో

2013 భావోద్వేగాల అంతం టాగ్ లైన్ తో ప్రముఖ కార్పొరేట్ నిబద్ధత మంత్రివర్యుల దర్శక నిర్వహణలో సినిమా నిర్మింపబడుతోంది.

యిటీవల తరచు వారి నోటివెంట ఈ మాట వెలువడుతోంది. తమ అధికార బలగం, బలుపుతో ఏమైనా సాధించగలమనే అత్యుత్సాహంతో ప్రజలపై యుద్ధం ప్రకటించిన ఈ కార్పొరేట్ న్యాయవాది గారు దేశ సహజవనరులను విదేశీ పెట్టుబడిదారులకు అప్పనంగా కట్టబట్టే బృహత్తర  కార్యక్రమాన్ని తన భుజస్కంధాల పైమోస్తూ ప్రజలను సవాల్ చేస్తున్నారు. కీలకమైన బాధ్యతలను మళయాళీ, తమిళ కౄర సైనిక, పోలీసు అధికార్లను గవర్నర్లుగా, సైనికాధికార్లకు అప్పగిస్తూ వారిని దిశా నిర్దేశం చేస్తున్నాడు.

యిది నాటి అమెరికా ఖండంపై యూరోపీయం సామ్రాజ్య్ల వాదులు దాడి చేసి స్థానికంగా వున్న రెడ్ ఇండియన్ తదితర ఆదిమ తెగలను సమూలంగా నిర్మూలించి వారి అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసి వారి సహజ వనరులను ఆక్రమించుకున్నట్లుగా, ఆస్ట్రేలియా ఖండంలోని ఆదిమ తెగలను అంతమొందించినట్లుగా, ఆఫ్రికా ఖండంపై నేటికీ చేస్తున్న దాడులను గుర్తుకుతెస్తున్నాయి.

మావోయిస్టుల పేరు చెప్పి గిరిజనులను అంతమొందించే కార్యక్రమం సాగుతోంది. అలాగే రకరకాల అభయారణ్యాల పేరుతో ఆదిమ జాతులను వారి భూభాగం నుండి తరిమివేస్తున్నారు. సెజ్ పేరుతో వేలాది ఎకరాల భూభాగాన్ని పెట్టుబడిదారులకు చౌకగా కట్టబెడుతూ అడిగిన వారిని అభివృద్ధి నిరోధకులుగా లోకానికి చూపెడుతూ కౄరంగా అణచివేస్తున్నారు.

పేద మధ్యతరగతి యువకులను నిరుద్యోగ నైరాశ్యం ఆవహించిన వైనాన్ని ఉపయోగించుకుంటూ వారిని రకరకాల బలగాల పేరుతో రికౄట్ చేసుకుంటూ తమపై తామే యుద్ధం చేసుకునే సరికొత్త ఎత్తుగడలను అమలుచేస్తూ తమ కన్ను తామే  పొడుచుకున్నట్లుగా చే్స్తూ పైశాచిక ఆనందాన్నిఅనుభవిస్తున్నారు.

ఈ కార్పొరేట్ కలలు కల్లలు కాక మానదు. ప్రజల తిరుగుబాటు తత్వాన్ని, అణగి మణగి వుండలేని స్వభావాన్ని ఎవరూ అణచివేయలేరు. తుడిచి పెట్టనూలేరు. ఇది మానవ చరిత్ర చెప్పిన సత్యం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆలోచనాత్మకంగా..