26, జనవరి 2010, మంగళవారం

గణతంత్ర దినోత్సవం – సవర గిరిజనుడు



మా వూరికి దగ్గరలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరిగిన గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ఈ రోజు హాజరయ్యాను. పిల్లలంతా సర్కారు వారు సప్లై చేసిన పొడుగు చేతుల బుష్ కోటు, లావు నడుము నిక్కర్లను మొల్తాడుకు బిగించి క్యూలలో నిల్చొని ఝెండా కర్రముందు వరుసలలో నిల్చున్నారు. ఇద్దరు విదార్థినులు ప్రార్థానాగీతం శుక్లాంబరధరం శ్లోకం తరువాత వందేమాతరం, తరువాత మా తెలుగు తల్లికి పాడి, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఝెండా గీతం మూడు రంగుల ఝెండా, ముచ్చటైనా ఝెండా పాడారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు ఝెండానెగరేసారు గణతంత్ర దినోత్సవం గురించి నాలుగు మాటలు చెప్పి, గ్రామపెద్దలను, మిగిలిన ఉపాధ్యాయులను మాటాడమన్నారు.

యింతలో అటువైపుగా పల్లం గ్రామంలో అమ్మకానికి వంట చెరుకుగా ఉపయోగించే కట్టెల కావడిని భుజాన మోసుకొస్తూన్న మంగన్న తన ఆయాసాన్ని తీర్చుకునేందుకు, బోరింగు దగ్గర నీళ్ళు తాగేందుకు   ఆప్రక్కగా ఆగాడు.

అది చూసిన నేను మంగన్నా యిటు రా అని పిలిచాను.

‘ఏటి బాబూ’ అని వచ్చాడు.

యిలాయీవరసలోవుండి మన జాతీయ ఝెండాకు  దండం పెట్టుకో, అలా మన  పెద్దలు చెప్పిన మాటలు విని బిస్కట్లు, బిల్లలు తీసుకో అన్నాను.

‘ఏటి బాబూ ఇసయం’ అంటూ దగ్గరగా వచ్చాడు.

యింతలో మా శంకర్రావు మాస్టారు మంగన్నా,  మన మూడు రంగుల  ఝెండా పిన్నీసుతో దోపుకోమని ఇచ్చాడు.

అది అందుకున్న మంగన్న చుట్టూ చూసాడు. తన ఒంటిపై గోచీ తప్ప ఏ ఆచ్చదనా లేదు. మేం మాత్రం చొక్కాలకు పిన్నీసులతో మూడు రంగుల ఝెండా గుచ్చుకొని దేశభక్తిని చాటుకుంటున్నాం.

అలా చుట్టూ చూసిన మంగన్న ఠక్కున మేమిచ్చిన ఝెండాను తన మొలకున్న గోచీకి తగిలించి భుజానకు కట్టెల మోపునెత్తుకొని సాగిపోయాడు.

అది చూసిన మాకు మాటరాలేదు....

4 కామెంట్‌లు:

  1. వర్మ గారూ !
    ఈ స్థితిలో ఉన్న కో్ట్లమందికి ప్రతినిథి మంగన్న. వారిని ఉపయోగించుకునే వారవరికీ వారి బాగోగులు పట్టవు. విషయం తెలియకపోయినా మీ మాటమీద గౌరవముంచిన అతని సంస్కారం ఈ నాగరికత తెలుసుననుకునే మనుష్యులకు ఉంటుందా ? గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  2. పార్వతీపురం, కొమరాడ మండలాలలో గిరిజనులు ఉన్నారు కానీ అవి పెద్ద అడవులేమీ కావే. అక్కడ వేసుకోవడానికి బట్టలు లేకపోవడం ఆశ్చర్యమే. ఒరిస్సాలోని రాయగడ పట్టణంలో కూడా ఆ పరిస్థితిలో ఉన్న గిరిజనులని చూశాను. రాయగడ జిల్లా మొత్తం కొండ ప్రాంతం. ఆ జిల్లా మొత్తంలో ఎక్కువ మంది గిరిజనులే. విజయనగరం జిల్లా మన రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటైతే రాయగడ జిల్లా దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటి.

    రిప్లయితొలగించండి
  3. @SRRao గారూ ధన్యవాదాలు. వారి పేరున ఖర్చవుతున్న వేల కోట్ల రూపాయలు వృధా అవుతున్న క్రమంలో వారి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న పాలకవర్గాల కుట్రకు ఎందరో మంగన్నలు బలవుతున్నారు.

    ప్రవీణ్ డాంబరు రోడ్లకు దగ్గరైన అడవులు నాశనమయినా, కొంతమేర మిగిలి వుంది. అలాగే సవర గూడలు నేటికీ అలానే వున్నాయి. మైదానాలకు దగ్గరవున్న వారికే కొంత మేర వేషబాషలు మారాయి. కురుపాం, గుమ్మలక్ష్మిపురం మండలాలలో యింకా అలానే వున్నారు. యిప్పటికీ టెంకపిండి అంబలి తింటున్నారు.

    రిప్లయితొలగించండి
  4. మా చిన్నప్పుడు పార్వతీపురం, కొమరాడ మండలాలలో మధ్య మెయిన్ రోడ్ పక్కన ప్రాంతం కూడా అడవిలాగ ఉండేది. ఇప్పుడు కూనేరు దగ్గర మెయిన్ రోడ్ పక్కన కూడా అడవి కనిపిస్తుంది. రైల్వే లైన్ డబ్లింగ్ కోసం కూడా కొంత అడవిని నరికారు. నేను రాయగడ వెళ్ళి వచ్చేటప్పుడు ఆ రూట్లోనే వెళ్ళి వస్తుంటాను. రైల్వే లైన్ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో కొంత అభివృద్ధి కనిపిస్తుంది కానీ రైల్వే లైన్ లేకపోతే ఈ పాటి అభివృద్ధి కూడా కనిపించదు.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..