28, ఫిబ్రవరి 2010, ఆదివారం

విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమా?




ఉస్మానియా విద్యార్థులపై మావోయిస్టు ముద్ర వేయడం ద్వారా ప్రభుత్వం తన తప్పిదానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం.

దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎదురైన పరాభవానికి విద్యార్థులపై మావోయిస్టు సానుభూతిపరులంటూ పోలీసులు ఇచ్చిన రిపోర్టును యదాతధంగా సమర్పించడం ద్వారా ప్రభుత్వం తన దమననీతిని మరో మారు నిస్సిగ్గుగా బయటపెట్టుకుంది. సుప్రీం ధర్మాసనం వేసిన తీవ్రమైన ప్రశ్నలకు సమాధానం దొరకక తత్తరపడింది. సానుభూతిపరులైనంత మాత్రాన నేరస్తులుగా పరిగణిస్తారా? అని సూటిగా ప్రశ్నించింది. జరిగిన విధ్వంసంను కారణంగా చూపగా నక్సలైట్లను అణచివేసేందుకు మీరు తర్ఫీదునిచ్చిన తోడేళ్ళగుంపును యిలాగే రాజకీయపార్టీల సభలకు, ప్రచారాలప్పుడు వాడుతారా అని ముక్కుపై గుద్ది ప్రశ్నించింది.

సిగ్గు తెలీని పాలకవర్గం యింకా ఏ ముఖం పెట్టుకొని ఓట్లకోసం యీ పిల్లల తల్లిదండ్రులదగ్గరకు పోగలదు?

తెలంగాణా ప్రాంత ప్రజల భావావేశాలకు, ఉద్విగ్నతకు ప్రతిస్పందనగా, గుండెచప్పుడుగా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని, రాష్ట్ర రాజధాని నడిబొడ్డున వున్నదానిపై ఒక నక్సల్ స్థావరంగా పేర్కొనడం పాలకవర్గ కుట్రకాకపోతే మరేంటి? వారి నిఘావర్గాలు ఏ రాజకీయ నాయకులు విదిలించే ఎంగిలాకుల వెంట తిరుగుతున్నాయో? ఏదైనా విపత్తు సంభవించాక అమాయకులను వేధించడం తప్పించి అసలు నేరస్థులను యింతవరకు పట్టుకున్న దాఖలాలు లేవు. ఎంతో మంది తల్లుల ఉసురు పోసుకున్న వీళ్ళకు యిదేం పోయేకాలం?

16, ఫిబ్రవరి 2010, మంగళవారం

జయేంద్రా మీకెందుకీ గొడవ?


హాయిగా బొజ్జనిండా తిని, తోచినదేదో ఉపదేశాలిస్తూ, వచ్చిన కట్న కానుకలతో జల్సాచేస్తూ, కాలక్షేపం చేయక చైన్నై రాజకీయాలతో చేతులు కాల్చుకొని, కటకటాలు లెక్కపెట్టి, చావుతప్పి కన్నులొట్టపోయిన చందాన బయటపడిన మీరు ఇక్కడి ఉద్యమాలపై ప్రజల ఆవేశాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం ఎవరిని మెప్పించడానికి? వేసుకున్న కాషాయ వస్త్రాలపై వున్న గౌరవం మీలాంటి వారి వల్లనే మట్టిగలిసిపోయాయి. రాజకీయాలు మీకెందుకు? మీరేమైనా దివ్యదృష్టితో తెలంగాణా ప్రజల మనోభావాలను హాంఫట్ అని పట్టేసారా? తెలంగాణా భూమిలో పర్యటించి, వారితో మాటాడి అక్కడే ప్రకటించి వుంటే మేమంతా నమ్మేవారం. హాయిగా యికనైనా ఏసీ రూంలలో జపతపాలు గావించి తమ ముక్తిమార్గమేదో మీరు చూసుకుంటే మీకు ప్రశాంత స్వర్గ ప్రాప్తినొంది అక్కడకూడా సుఖాలను అనుభవించే చాన్సుకోసం ట్రై చేయండి స్వామి. పుణ్యం పురుషార్థం దక్కుతాయి. మీకెందుకీ గొడవలు?

11, ఫిబ్రవరి 2010, గురువారం

అవిశ్రాంత విప్లవ పథికుడు కా. ఐ.వి.మాస్టారు

IV

ఐ.వి.గా, ప్రకాశ్ గా, మాస్టర్ గా ఎన్నెన్నో రంగాలలో ఎంతోమందికి ఆప్తుడైన ఐ.వి.సాంబశివరావు కవి, కథకుడు, అనువాదకుడు, సిద్ధాంత కర్త, ఉద్యమకారుడు, కార్యకర్త, విప్లవోద్యమ నాయకుడు, విశేష జీవితానుభం,లెక్కకుమించిన రంగాలలో ప్రజ్న, అతి సున్నితమైన హృదయం, పసిపిల్లవాడి మనసు, కఠినమైన క్రమశిక్షణను పాటించిన వ్యక్తిత్వం, విరసం, అఖిలభారత విప్లవ సాంస్కృతిక సమితికి సంస్థాపక సభ్యుడు, నాయకుడు, సుబ్బారావు పాణిగ్రాహి వారసత్వాన్ని అక్షరాల ఆచరించిన కవియోధుడు. యిదంతా ఆయన వ్యక్తిత్వం గురించి విరసం ప్రచురించిన ఐ.వి స్మృతులు అన్న పుస్తకం వెనక అట్టపై వున్న అక్షర సత్యాలు.

విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంకు దగ్గరలోని పిరిడి గ్రామంలో 1937, ఫిబ్రవరి 11 న  జన్మించిన ఐ.వి రాజనీతి శాస్త్రంలో ఎం.ఏ పూర్తిచేసి, ఢిల్లీ, హైదరాబాదులలో రిసెర్చ్ ప్రాజెక్టులలో పనిచేస్తూ శ్రీకాకుళ ఉద్యమ స్ఫూర్తితో విరసం సంస్థాపక కృషిలో పాల్గొన్నారు. విరసంలో సభ్యుడిగా, కార్యవర్గసభ్యుడిగా క్రియాశీలంగాపనిచేస్తూ  విజయవాడ లయోలాకాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తూ పూర్తికాలం కార్యకర్తగా అజ్ణాత జీవితాన్ని ఎంచుకున్నారు.. 1997 ఫిబ్రవరి 28 న కాన్సర్ వ్యాధితో కన్నుమూసేనాటికి 23 సం.ల విప్లవోద్యమ జీవితంలో సామాన్యకార్యకర్త స్థాయి నుంచి నాయకత్వ స్థాయి వరకు ఎన్నో ఆటుపోట్లకు గురయ్యారు.అయిన స్థైర్యంగా ఆఖరివరకు నిలిచి అందరికి ఆదర్శప్రాయుడయ్యారు. కె.ఎస్.నాయకత్వం మార్పు తరువాత పొరపాటు అవగాహనతో నాయకత్వం 60 సం.ల దగ్గరలో ఆయనకు సామాన్య కార్యకర్త స్థాయికి ఒక ఏడాది పాటు డిమోట్ చేసినా మొక్కవోని విప్లవాభిమానంతో తన ఆచరణ ద్వారా నలుగురికీ ఆదర్శంగా నిలబడి తిరిగి కేంద్ర స్థాయి నాయకత్వానికి చేరుకున్న ఏకైక విప్లమూర్తి కా.ఐ.వి.

కా.ఐ.వి.ని పరిచయమున్నవారు ఆయన పాటించిన మానవ సంబంధాల విలువలను, ఆప్యాయతను మరిచిపోలేరు.అలాగే ఆయన సాహిత్య రంగంలో చేసిన అవిరళ కృషికూడా. స్వీయరచనలతో పాటు అనువాద రచనలో ఒక మంచి వరవడిని చూపెట్టిన సాహితీ కృషీవలుడు. ప్రపంచంలో మరెక్కడా ఐదు సంపుటాలు మించి లభించని మావో రచనలు మరో నాలుగు సంపుటాలుగా పాఠకులకు అందించే కృషికి దోహదం చేసారు. మారుపేర్లతో అనేక రచనలు చేసారు.రహస్యోద్యమ కార్యకర్తగా తనుచేసిన సైద్ధాంతిక కృషి యింకా వెలుగు చూడాల్సి ఉంది.

తియానన్మెన్ స్క్వేర్ లోని అమరవీరుల స్థూపంపై వున్న ఆంగ్ల గీతాన్ని ఇంద్రవెల్లి మృతవీరుల స్మారకస్థూపంపై చెక్కగా దానిని మిత్రులు క్రాంతిలో ప్రచురించాలని అనుకుని శ్రమ పడుతుండగా రెండు నిమిషాలలో కొట్టివేతకూడా లేకుండా దాన్ని అనువదించారు. అది

కొండగోగులు ఎరుపు కొండలే ఎరుపు

కొండలలోఅన్నల అమరత్వమెరుపు

అన్నలకు దండాలు అంతకంటే ఎరుపు..

మరో అనువాద కవిత:

ఈ మబ్బు వీడి వెలుగు రవ్వలు కురవాలని

ఈ వలత్ ఎంచుకు చరిత్ర బైట కురకాలని

మౌనం యీ సంకెలను చేదించుకోవాలని

తప్పెట మోతల్ రణన్నినాదం

విగ్రహాలను మేల్కొల్పాలని

నేలచ్చాయా సుందర దేవత

అందమైన అందెల సవ్వడితో ప్రత్యక్షం కావాలని

ఆకాశం ఎదురు చూస్తోంది.

మూలం – ఫైజ్ అహమ్మద్ ఫైజ్ .

(విప్లవోద్యమ శిఖరం అమరుడు కా.ఐ.వి. మాస్టారి జన్మదిన సందర్భంగా వారి స్మృతిలో)

10, ఫిబ్రవరి 2010, బుధవారం

నిజమైన 'అవతార్' పోరాటం మాదే-ధోంగ్రియా గిరిజనులు

అవతార్ సినిమాలోని పందోరా ప్రాంత వాసులుల నాయకుడు నావ్స్ లా తాము ఒరిస్సాలోని తమ జీవనాధారమైన నియాంగిరి కొండ ప్రాంతంలో తరాల నుండి నివసిస్తూ ఈ కొండ దేవత అండతో బతుకుతున్నామని, తమ జీవనాధారమైన గిరిప్రాంతాన్ని లండన్ లోని వేదాంత కంపెని బాక్సైట్, ఉక్కు పరిశ్రమల ఏర్పాటు పేరుతొ తమ ఉనికిని నాశనం చేస్తోందని, తాము 8000 మంది ధోంగ్రియా గిరిజన తెగ వారం మీ సినిమాలోని పాత్రలవలె ఇక్కడ మా ఉనికికోసం నిజమైన పోరాటం చేస్తున్నామని, మీ సినిమా చూసామని, తమ పోరాటానికి మధ్దతునివ్వవలసినదిగా కోరుతూ Variety అనే న్యూయార్క్ సినిమా పత్రికలో ఈ వారం ఒక ప్రకటనను విడుదల చేసారు. వీరిపై డాక్యుమెంటరీ తీసిన భారతీయ సంతతికి చెందిన నటి Joanna Lumley ఈ ప్రకటనను రూపొందించారు. http://www.survivalinternational.org/news/kits/minefilm ఈ లింక్ లో దానిని చూడొచ్చు. ఈ ప్రకటనతో వేదాంత కంపెనీలోని తన £3.8 million వాటాను Church of England అమ్మివేసింది.
తమ ఉనికికోసం చేస్తున్న పోరాటానికి మద్ధతునిమ్మని కోరుతున్నారు. వీరి పోరాటానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న మావోయిస్టు ఉద్యమాన్ని అణచివేయడానికి చిదంబరంగారు ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో యుద్ధాన్ని ప్రకటించారు. ప్రస్తుతం దండకారణ్య ప్రాంతంలో సహజవనరులను దోపిడీ చేసేందుకు వేదాంత, జిందాల్, టాటాల వంటి కంపెనీలు పెద్దయెత్తున పెట్టుబడులతో ముందుకు వస్తున్న క్రమంలో అక్కడి ఆదిమ గిరిజన తెగలు తమ ఉనికిని పూర్తిగా కోల్పోయి అంతర్థానమయ్యే పరిస్తితులు నెలకొన్నాయి. ఈ పెట్టుబడుల వలన మనం కోల్పోతున్నది సహజవనరులైన్ ఖనిజ సంపద, పర్యావరణం. ఈ సంపదను మన దేశ అవసరాల నిమిత్తం వాడే విధానాలేవి లేవు పాలకవర్గాల దగ్గర. MNC లకు, బడా పారిశ్రామిక వేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రకటన ద్వారా తమ ఉనికిని ధోంగ్రియా గిరిజనులు ప్రపంచానికి తెలియజేసారు.

ఈ సమాచారం ముందుగా నేను మీ కోసం బ్లాగులో చూసానుః http://meeandarikosam.blogspot.com/2010/02/blog-post_09.html?showComment=1265758538034_AIe9_BHi-dM5PuC8fpmajovNJsdBv_Woc7Tfzvrsli3LVaK9WIMuuRSVxHmEUysTrpG9J8TD1PPCF6youTXu-tUnHw7yB-_fj_VIpJv44mdWY68UoAqF9k2J_vrEGvPiXNQTfTATk5i4xASNl_9KRSdOy6fTd1dKSxh6g1QPEJwu1UmAqb8p0C5tSepmDEsiRRni9Ph_Ub7XNRt1K6W0dNl5jH3EOHsCxgWdAY2-9TARrzXVYNs0wgY#c3562993154179646551.

ఆ తరువాత గూగుల్ లో సెర్చ్ చేస్తే ఈ లింక్ దొరికింది. చూడండిఃhttp://orissakhabar.in/

యూట్యూబ్ లో చూడండిఃhttp://www.youtube.com/watch?v=R4tuTFZ3wXQ&feature=player_embedded#

4, ఫిబ్రవరి 2010, గురువారం

ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ

ఈ దేశంలో పుట్టి పెరిగినవారు ఒక ప్రాంతంనుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళడానికి భయపడేట్లు, వారి ఉనికినే ప్రశ్నార్థకం చేయడం భావ్యమా? మనమున్నది ప్రజాస్వామ్య గణతంత్ర ఫెడరల్ దేశంలోనా, లేక మత, ప్రాంతీయ, భాషాపరంగా విడగొట్టబడిన నేలమీదా?

తాను స్పాన్సర్ చేస్తున్న 20-20 టీం వలన ఇప్పటికే కోట్లాది రూపాయలు నష్టపోయిన కారణంగా, మొన్న జరిగిన క్రీడాకారుల వేలంపాటలో పాకిస్తానీ క్రీడాకారులను ఎవరూ కొనుక్కోకపోవడం గురించి మాట్లాడుతూ వారిని కూడా భాగస్వాములను చేసి వుంటే బాగుండేదన్న కారణంగా ఒక కళాకారుడిగా ఎక్కడా తన దేశభక్తిని శంకించేలా ప్రవర్తించని షారూఖ్ ఖాన్ పట్ల శివసేన తీవ్రంగా విరుచుకుపడడం చూస్తుంటే ముంబయి థాకరే దాదాల స్వభాషా, ప్రాంతీయ,మత దురభిమానం తారాస్థాయికి చేరుకొని అదొక పిచ్చివాళ్ళ రాజ్యంగా మారిందా అనిపిస్తోంది.

షారూఖ్ తండ్రివైపు తాత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవాడే. తల్లిగారి తండ్రి నేతాజీ నేతృత్వంలో అజాద్ హింద్ ఫౌజ్ లో జనరల్ గా పనిచేసిన వారు. భారత్-పాక్ విభజనకాలంలో భారత్ వలస వచ్చిన కుటుంబం యొక్క దేశభక్తిని శంకించే మూర్ఖశిఖాణులను ఏమనాలో తెలియడంలేదు. తన స్వదేశ్, చక్ దే ఇండియాల వంటి సినిమాల ద్వారా దేశభక్తిని చాటిన షారూఖ్ ఎందరో క్రీడాకారుల్లో స్ఫూర్తిని రగిలించాడు.

మొన్నటికి మొన్న మన క్రికెట్ వీరుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ నేను ముందు భారతీయుడిని, తరువాత మరాఠీనన్నందుకు తీవ్రంగా విరుచుకుపడ్డారు.

ప్రఖ్యాత చిత్రకారుడు M.F.హుస్సేన్ వేసిన బొమ్మలపై నిషేధం విధించి తనకు తాను దేశం వదిలివెళ్ళేట్లు చేసారు. తన చిత్రాలలో హిందూ దేవతలను నగ్నంగా చిత్రీకరించారని ఆరోపణ. మరి మన దేవాలయాలపై బూతుబొమ్మలు ఎవరివి?

ఇలా కళాకారులపై, వారి స్వేచ్చపై ఆంక్షలను విధిస్తూ, ఫత్వాలను జారీచేస్తూ, ఇప్పటికి గత 15 ఏళ్ళూగా అధికారానికి ప్రజలు దూరంచేసినా, తమ ప్రైవేటు సైన్యాలతో దాడులు చేస్తూ, విపరీత ధోరణితో విఱవీగే ధాకరేలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి.

తాజాగా రాహుల్ గాంధీ ముంబయి పర్యటన కూడా భయం భయంగా హెలికాప్టర్ తో చేసే దుస్థితి కల్పించినట్లు వార్తలు చెప్తున్నాయి.

తమ స్వలాభం కోసం యిలా కుల, మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టే వారికి తగిన మానసిక చికిత్స అవసరం.

2, ఫిబ్రవరి 2010, మంగళవారం

రెహమాన్ అవార్డుల వెనక

ఇటీవల ఏ సంగీత పోటీలలో చూసినా రెహమాన్ కంపోజ్ చేసిన పాటలకు అవార్డుల పంట పండుతోంది. ఆస్కార్ దగ్గరనుండి గ్రామీ అవార్డులవరకు ఆయన కంపోజ్ చేసిన 'జయహో' కు అవార్డులమీద అవార్డులు వచ్చేస్తున్నాయి. రెహమాన్ జయహో అంటున్నది సామ్రాజ్యవాద శక్తులకు కనుకే ఈ అవార్డుల పంట పండుతున్నది. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ నుండి తిరిగి వచ్చాక మన వాళ్ళపై జరుగుతున్న దాడులగురించి మాట్లాడుతూ అవి జాత్యాహంకార దాడులు కావని వాళ్ళకు వత్తాసు పలికాడు. పెట్టుబడిదారీ శక్తులకు అనుకూలంగా తీసిన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు అవార్డులు పండాయి. అలాగే వారికి జయహో అన్నందుకు ఈయనకు అవార్డులు కురుస్తున్నాయి. అందాల పోటీలలో మన అమ్మాయిలకు మిస్ యూనివర్శ్ లు, మిస్ వరల్డ్ లు ఇచ్చి తమ సౌందర్య సాధనాలకు 3 వ ప్రపంచ దేశాలలో గిరాకీ పెంచుకున్న పశ్చిమ దేశాల వ్యాపారుల కుట్ర దాగివున్నట్లే దీనివెనక కూడా వారి ప్రమేయం వుంది. 'జయహో' వీడియో ఆల్బం లో డాన్సులు చేసే అర్థనగ్న సుందరీమణులు ఎవరికి జయహో అంటున్నారు?